3 రోజుల్లో టీ బిల్లు ఖరారు | Sakshi
Sakshi News home page

3 రోజుల్లో టీ బిల్లు ఖరారు

Published Tue, Nov 19 2013 1:16 AM

3 రోజుల్లో టీ బిల్లు ఖరారు - Sakshi

  • ముగిసిన జీవోఎం చర్చలు 
  • 3 రోజుల్లో టీ బిల్లు ఖరారు
  • తెలంగాణ, సీమాంధ్ర కేంద్రమంత్రులు, సీఎంతో జీవోఎం భేటీలు
  • రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తామని సీమాంధ్ర కేంద్రమంత్రుల హామీ
  • హైదరాబాద్ యూటీ చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని వినతి
  • హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇవ్వాలన్న టీ కేంద్రమంత్రులు 
  • లేకుంటే బిల్లుకు బీజేపీ మద్దతివ్వదని, కాంగ్రెస్‌కు తీవ్ర నష్టమని నివేదన
  • విభజిస్తే నక్సలిజం, ఉగ్రవాదం, మతకలహాలు చెలరేగుతాయన్న ముఖ్యమంత్రి
  • {పహసనంగా జీవోఎం భేటీలు.. ముగ్గురు సభ్యుల గైర్హాజరే నిదర్శనం
  • సంప్రదింపులు ముగిశాయి.. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు: షిండే, దిగ్విజయ్
  • న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 
     
    రాష్ట్ర విభజనకు సంబంధించి తుది విడత చర్చల ప్రక్రియ ముగిసిపోయింది. విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం సోమవారం ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో వేర్వేరుగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలనూ వినటంతో.. చర్చల ప్రక్రియను పూర్తిచేసినట్లయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ముసాయిదా బిల్లుకు తుది రూపం ఇవ్వటమే మిగిలింది. ఈ పనిలో నిమగ్నమైన జీవోఎం మరో మూడు రోజుల్లో దానిని కూడా పూర్తిచేయనుంది. 
     
     ఈ నెల 20, 21 తేదీల్లో (బుధ, గురువారాల్లో) జీవోఎం సమావేశమై బిల్లును ఖరారు చేయనుంది. ఆ బిల్లును 21వ తేదీ సాయంత్రం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రవేశపెట్టేందుకు సంసిద్ధమవుతోంది. బిల్లును కేబినెట్ ఆమోదించిన వెంటనే రాష్ట్రపతికి పంపించేందుకు, అటునుంచి రాష్ట్ర శాసనసభకు పంపేందుకు కూడా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజనకు సంబంధించి సంప్రదింపులు పూర్తయ్యాయని జీవోఎం సారథి, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో పాటు, జీవోఎం సభ్యుడు, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌లు కూడా ప్రకటించారు. జీవోఎం తన నివేదికను సాధ్యమైనంత త్వరలో కేబినెట్‌కు పంపుతుందని.. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు టీ బిల్లు వెళ్తుందని వారు ఉద్ఘాటించారు. 
     
     మూడు భేటీలతో మమ...
     నిన్నటివరకు సమైక్య రాష్ట్రమే తమ ఏకైక ఎజెండా అని పదేపదే ప్రకటించిన సీమాంధ్ర కేంద్రమంత్రులు.. రాష్ట్ర విభజన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జీవోఎంకు స్పష్టంచేశారు. విభజన ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తామని భరోసా కూడా ఇచ్చారు. అయితే.. హెచ్‌ఎండీఏ పరిధిలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే అంశాన్ని విభజన బిల్లులో పొందుపరిస్తే సీమాంధ్రలోని 80 శాతం ప్రజలు సంతృప్తి చెందుతారని సలహా ఇచ్చారు. దీంతోపాటు కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన మేరకు ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. కొత్త రాజధాని ఎక్కడనే దానిపై తమలోనే బేధాభిప్రాయాలున్న నేపథ్యంలో నిపుణుల కమిటీని వేసి ఎంపిక చేయాలని కోరారు. కిషోర్ చంద్రదేవ్ మినహా సీమాంధ్ర కేంద్రమంత్రులంతా ముక్తకంఠంతో జీవోఎంకు ఇదే విషయాన్ని చెప్పారు. కిషోర్ మాత్రం విభజన జరిగితే ఉమ్మడి రాజధాని అవసరం లేదని, విశాఖలో కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అదే సమయంలో రాయలసీమను సైతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, సాధ్యంకాని పక్షంలో తెలంగాణలోనే కలపాలే తప్ప సీమను విభజించటం ఏమాత్రం సహేతుకం కాదని సూచించారు. 
     
     తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు మాత్రం.. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన పరిపూర్ణ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జీవోఎంకు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతిచ్చే అవకాశం లేదని.. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం టీ-నేతలు మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఖాయమనే ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్ నుంచి రెండు బ్యాగ్‌ల నిండా ఫైళ్లతో జీవోఎం ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. గంటన్నర పాటు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలిజం, టైజంతో పాటు మతక లహాలు పెచ్చరిల్లే ప్రమాదముందని జీవోఎంకు స్పష్టం చేశానని ఆ తర్వాత మీడియాతో పేర్కొన్నారు. 
     
     రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి సాగునీరు, విద్య వంటి రంగాల అభివృద్ధికి తగిన ఆర్థిక సాయం చేయాలని కూడా సూచించినట్లు తెలిపారు. ఇక విభజన జరుగుతుందో లేదో వేచి చూడాలని ముక్తాయించారు. జీవోఎం మాత్రం ఈ సంప్రదింపుల ప్రక్రియనంతా తూతూ మంత్రంగా ముగించింది. చివరకు సొంత పార్టీ నాయకులు, రెండు ప్రాంతాల కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో జరిగిన భేటీని సైతం తేలికగా తీసుకుంది. సోమవారం జరిగిన కీలక సమావేశాలకు సీనియర్ మంత్రులైన ఎ.కె.ఆంటోని, చిదంబరం, గులాంనబీఆజాద్‌లు గైర్హాజరవటమే ఇందుకు నిదర్శనం. హాజరైన నలుగురు సభ్యుల్లోనూ వీరప్పమొయిలీ తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రుల భేటీకి రాలేదు. 
     
     ఇక బిల్లుకు తుది రూపంపై కసరత్తు...
     అందరి అభిప్రాయాలు వినడానికే పరిమితమైన జీవోఎం సభ్యులు సమావేశాల తర్వాత సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని ప్రకటించారు. తెలంగాణ బిల్లుకు తుదిరూపు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అందుకోసం ఈ నెల 20, 21 తేదీల్లో ఉదయం 10.30 గంటలకు మరోసారి సమావేశమై తెలంగాణ బిల్లును ఖరారు చేసి, 21న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరులో విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపటంతో పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని షిండే పునరుద్ఘాటించారు. విభజనను వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్ చేసిన వాదనను దిగ్విజయ్ తోసిపుచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ నిర్ణయమే ఫైనల్ అని, సీఎం సహా ఎవరైనా శిరసావహించాల్సిందేనని స్పష్టంచేశారు. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వెళ్తుందంటూ.. తెలంగాణ ప్రజలకు, యూపీఏ సర్కారుకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. 
     
     ఇక జీవోఎం నివేదికను ఖరారు చేస్తాం
     ‘‘ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ఇతరులతో చర్చల ప్రక్రియను మేం పూర్తిచేశాం. ఇప్పుడు జీవోఎం సభ్యులు సమావేశమై కేబినెట్‌కు సమర్పించాల్సిన నివేదికను ఖరారు చేయటంపై చర్చిస్తారు. సాధ్యమైనంత త్వరగా ఈ నివేదికను సమర్పిస్తాం. తెలంగాణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడతాం.’’ 
     - సుశీల్‌కుమార్‌షిండే, కేంద్ర హోంమంత్రి, జీవోఎం సారథి 
     
     సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇస్తాం 
     ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. జీవోఎం సంప్రదింపులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలకూ జీవోఎం పరిష్కారం చూపుతుంది. సీమాంధ్ర అభివృద్ధిపై ఆ ప్రాంతం నేతల డిమాండ్లు సరైనవే. సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇస్తాం. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వెళ్తుంది. తెంగాణ ప్రజలకు, యూపీఏకు శుభాకాంక్షలు.’’
     - దిగ్విజయ్‌సింగ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్
     
     అన్ని ప్రాంతాల అభిప్రాయాలూ పరిగణనలోకి... 
     ‘‘రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా ఈ నెల 21న జీవోఎం మరోసారి భేటీ అవుతుంది. జీవోఎం తుది నివేదిక ఈ నెలాఖరులోగా పూర్తవుతుంది. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. విభజన అంశాన్ని పెండింగ్‌లో పెట్టబోం. సీఎం కిరణ్ తన వాదనను వినిపించారు.’’ 
     - వీరప్పమొయిలీ, కేంద్ర పెట్రోలియం మంత్రి, జీవోఎం సభ్యుడు
     
     జరగనున్న క్రమమిదీ...
    •   ఈ నెల 20, 21 తేదీల్లో జీవోఎం చివరిసారిగా సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లుకు తుదిరూపం కల్పిస్తుంది.
    •  
    •   21వ తేదీన జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశం ముందుకు ఆ ముసాయిదా బిల్లు వచ్చే అవకాశముంది.
    •  
    •   కేంద్ర మంత్రిమండలి దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తుంది.
    •  
    •   దానిపై రాష్ట్రపతి రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరతారు. దీనికి ఇంత సమయంలో జరగాలని కాలపరిమితి అంటూ లేదు.
    •   డిసెంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉన్నాయి. ఆ లోగానే రాష్ట్రపతి తెలంగాణ బిల్లుపై అభిప్రాయం చెప్పాలని అసెంబ్లీకి నిర్దేశించవచ్చు. 
    •  
    •   రాష్ట్రపతి అలా కోరిన పక్షంలో మూడు రోజుల్లో రాష్ట్ర శాసనసభను సమావేశపరచడానికి అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ప్రోరోగ్ కానందున మూడు రోజుల కాలపరిమితిలో సమావేశాలను పెట్టడానికి వీలుంది.
    •  
    •   ఆ లెక్కన నెలాఖరులోగా అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవడానికి వీలు ఉంది. అది రాష్ట్రపతి బిల్లును అసెంబ్లీకి పంపే గడువును బట్టి ఆధారపడి ఉంది.
    •  
    •   అసెంబ్లీ అభిప్రాయం తీసుకున్న తర్వాత బిల్లును రాష్ట్రపతి మరోసారి పరిశీలించి పార్లమెంటుకు పంపిస్తారు. 
    •  
    •   శీతాకాల సమావేశాల్లో బిల్లును పార్లమెంటు ముందు పెట్టే అవకాశముంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement