పాత పంటల పండుగకు 16 ఏళ్లు! | Sakshi
Sakshi News home page

పాత పంటల పండుగకు 16 ఏళ్లు!

Published Wed, Jan 14 2015 10:55 PM

పాత పంటల పండుగకు 16 ఏళ్లు! - Sakshi

మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు సంక్రాంతితోపాటు పాత పంటల పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ నెల 14న న్యాల్‌కల్ మండలం హోసెల్లి నుంచి వ్యవసాయ జీవవైవిధ్య పండుగ-2015 ప్రారంభమవుతుంది. ఈ ప్రాంత మహిళా రైతులు డీడీఎస్ ఆధ్వర్యంలో సంఘాలుగా ఏర్పడి.. అనాదిగా చిరుధాన్యాలతో ముడిపడిన తమ స్వయం సమృద్ధ ఆహార సంస్కృతిని పరిరక్షించుకుంటూ జీవనయానం సాగిస్తున్నారు. వ్యవసాయ జీవవైవిధ్యం ఉట్టిపడేలా ఒకటికి పన్నెండు చిరుధాన్య, పప్పుధాన్య, నూనెగింజల పంటలను ఒకే పొలంలో కలిపి పండించడం వీరి ప్రత్యేకత.

వాతావరణ మార్పుల్ని తట్టుకుంటూ రైతుకు జీవన భద్రతను కలిగించే తమ సేంద్రియ పంటల సాగు నమూనాను ఊరూరా ప్రచారం చేయడానికి ఈ పండుగను గత 16 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. తమ సంప్రదాయ విత్తనాల పరిరక్షణకు కొత్త ఉత్సాహంతో పునరంకితమవుతుంటారు. అంతర్జాతీయ ఖ్యాతిగడించిన ఈ బయోడైవర్సిటీ ఫెస్టివల్ ఫిబ్రవరి 13న పస్తాపూర్‌లో కన్నుల పండువగా ముగుస్తుంది. వివరాలకు 040 27764577, 27764744 నంబర్లలో సంప్రదించవచ్చు.
 

Advertisement
Advertisement