మేడపైన 17 జాతుల పండ్ల తోట! | Sakshi
Sakshi News home page

మేడపైన 17 జాతుల పండ్ల తోట!

Published Tue, Jun 16 2015 4:52 AM

మేడపైన 17 జాతుల పండ్ల తోట!

ఏడాది పొడవునా లేదా కొద్ది నెలల పాటు ఇంటిపట్టున సేంద్రియ కూరగాయలు, ఆకు కూరలు పండించుకుంటున్న వారి సంఖ్య నగరాలు, పట్టణాలతోపాటు గ్రామా ల్లోనూ పెరుగుతూ ఉంది. అయితే, మేడపైన కుండీలు, ప్లాస్టిక్ కంటెయినర్లలో పండ్ల చెట్లను తెంపు లేకుండా ఏళ్ల తరబడి సాగు చేయడం.. నలుగురు కుటుంబానికి సరిపడా రకరకాల పండ్లు పండించుకోవడం మాత్రం నిస్సందేహంగా కత్తి మీద సామే! మేడపైన పండ్ల తోటను మండే ఎండల్లోనూ కంటికి రెప్పలా కాపాడుకోవడమూ అంత సులభమేమీ కాదు. ఈ అసాధ్యాన్ని హైదరాబాద్‌లోని మెహదీపట్నానికి చెందిన వనమామళి నళిని మొక్కలపై తనకున్న ప్రేమతో, ప్రకృతి సేద్య పద్ధతులతో సుసాధ్యం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఇంటిపైనే ఆమె 17 జాతుల పండ్ల మొక్కలను 30కు పైగా కుండీల్లో పెంచుతున్నారు.

మూడేళ్లు దాటిన మొక్కలన్నీ ప్రతి కాపులోనూ 20 నుంచి 30 వరకూ పండ్లనిస్తున్నాయి. ప్రతి జాతిలోనూ రెండు, మూడు వేర్వేరు రకాల(ఉదా: జామలో 3 రకాలు, మామిడిలో ఏటా రెండు సార్లు కాపునిచ్చే పునాస మామిడి, మూడు సార్లు కాపునిచ్చే థాయ్ మ్యాంగో..) పండ్ల మొక్కలను ప్రణాళి కాబద్ధంగా ఎంపికచేసుకొని పెంచుతున్నారు. ఒక మొక్క కాపు పూర్తయ్యే సరికి మరో మొక్క కాయలు పక్వానికి వస్తున్నాయని, ఏడాది పొడవునా ఈ పండ్లే తింటున్నామని నళిని (nalini.vmw@gmail.com) తెలిపారు. ఇంటిపంటల్లోనూ పండ్ల మొక్కలు నాటుకోవడానికి ఇది మంచి తరుణం.
 - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్

Advertisement
Advertisement