ప్రకృతి ఒడిలో సాగు పాఠాలు ! | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో సాగు పాఠాలు !

Published Sun, Aug 3 2014 10:58 PM

ప్రకృతి  ఒడిలో సాగు  పాఠాలు ! - Sakshi

ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్చుకొని, ఆచరిస్తూ ప్రచారం చేస్తున్న విశ్రాంత ‘టీచర్ ఎమ్మెల్సీ’ హిమవంతరావు
30 ఎకరాల్లో తక్కువ పెట్టుబడితో ఆరోగ్యదాయకమైన దిగుబడులు
తన పొలాన్ని వ్యవసాయ పాఠశాలగా మార్చి.. రైతులకు నిరంతర శిక్షణ

 
విలక్షణ ‘ప్రకృతి వ్యవసాయోపాధ్యాయుడు’ సామినేని హిమవంతరావు. వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. దశాబ్దాల పాటు పాఠశాల ఉపాధ్యాయునిగా, తదనంతరం టీచర్ ఎమ్మెల్సీగా సేవలందించారు. వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి అవిశ్రాంత కృషి చేయాలన్న లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్చుకున్న నిత్య విద్యార్థి ఆయన. చౌడు భూమిలో పామాయిల్ సాగు చేస్తూ ఎకరానికి 9 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నారు. వరి, మొక్కజొన్న, కూరగాయల సాగు చేస్తున్నారు. తన పొలాన్ని వ్యవసాయ పాఠశాలగా మార్చి.. ఆచరణాత్మక ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని ఉద్యమ స్ఫూర్తితో రైతు లోకానికి పంచుతున్నారు!
 
 
 
సామినేని హిమవంతరావు.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే 1974 నుంచి వ్యవసాయం చేస్తున్నారు. 1978లో టీచర్ ఎమ్మెల్సీగా, తదనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఏ పదవిలో ఉన్నా వ్యవసాయంపై దృష్టిని మరల్చలేదు. తనకున్న 30 ఎకరాల్లో పామాయిల్, మామిడి, మొక్కజొన్న, కూరగాయ పంటలను వర్మీ కంపోస్టుతో సాగు చేసేవారు. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో 2008 మేలో నాగార్జునసాగర్‌లో సుభాష్ పాలేకర్ వద్ద 5 రోజులపాటు శిక్షణ పొందారు. ఈ శిక్షణ తనను తీవ్రంగా ప్రభావితం చేసిందంటారాయన. వెంటనే రెండు ఆవులు కొని ప్రకృతి వ్యవసాయం ఆచరించడం ప్రారంభించారు.

మొక్కల పోషణకు ఆవు మూత్రం, పేడతో జీవామృతం తయారు చేసుకొని వాడటం ప్రారంభించారు. జీవామృతానికి అవసరమైన ఆవు పేడ, మూత్రం సేకరించడానికి పశువుల కొట్టంలోని నేలను సిమెంట్‌తో నిర్మింపజేశారు. రెండు ఆవులతో రోజుకు 12 నుంచి 18 లీటర్ల మూత్రం, 20 కిలోల పేడ సేకరిస్తారు. తక్కువ ధరకు దొరికే నల్లబెల్లం, పప్పుల మిల్లుల వద్ద నుంచి నూకను తక్కువ ధరకు సేకరించి పిండి పట్టించి.. స్వల్ప ఖర్చుతోనే జీవామృతం తయారు చేసుకొని వాడుతున్నారు. ఎకరానికి 200 లీటర్లకు బదులు 400 లీటర్ల జీవామృతాన్ని వారానికోసారి వాడితే దిగుబడి బాగుందని, చీడపీడలు దరిచేరడం లేదంటున్నారాయన. ప్రకృతి వ్యవసాయంలో వరి, మొక్కజొన్న, చెరుకు, పామాయిల్ పంటల సాగు ఖర్చు గణనీయంగా తగ్గి, దిగుబడులు పెరిగాయంటున్నారు.   

వరి పైరుకు 8 సార్లు జీవామృతం

వరిలో జీవామృతం ప్రతి 15 రోజులకొకసారి పిచికారీ చేయడం వలన అకుమచ్చ తెగులు, పాముపొడ తెగులు, అగ్గి తెగులు, మొదలుకుళ్లు కనుమరుగైనట్లు హిమవంతరావు వివరించారు.  వరి పైరులో జీవామృతం 8 సార్లు ఎకరానికి త డవకు 200 లీటర్ల చొప్పున ఉపయోగిస్తే ఎకరానికి 28 బస్తాల వరకు దిగుబడి వచ్చిందన్నారు. ఇందుకు సుమారు రూ. వెయ్యి మాత్రమే ఖర్చవుతుందన్నారు.  ఇక మిరప పంటలో వచ్చే బొబ్బెర, వైరస్ నివారణకు జీవామృతం, పులిసిన మజ్జిగ, ఆవుపేడ, మూత్రం, ఇంగువ కషాయం పిచికారీ చేసి అదుపు చేయగలిగామన్నారు. కూరగాయల సాగులో ప్రకృతి సేద్య విధానం అనుసరించడం వలన కూరగాయల నాణ్యత, రుచి పెరిగింది. చెరుకులో తీపి పెరిగింది.

పశువుల ఎరువు + జీవన ఎరువు..

పాలేకర్ వద్ద శిక్షణ పొందిన తర్వాత పొన్నుస్వామి వంటి 14 మంది సృజనాత్మక రైతుల వద్దకు వెళ్లి వారి పద్ధతులను అధ్యయనం చేసిన క్రమంలో.. పశువుల ఎరువులో పోషకాలను పెంపొందించడంపై దృష్టిపెట్టారు. క్వింటా పశువుల ఎరువుతో కిలో జీవన ఎరువులను కలిపి, నీడలో పది రోజులు నిల్వ ఉంచితే మంచి పోషక విలువలతో కూడిన సేంద్రియ ఎరువు తయారవుతుంది. పశువుల ఎరువును  నీడలో ఆరబోసి జీవనఎరువులకు బదులు జీవామృతం కలిపితే.. మరింత పోషక విలువలున్న ఎరువుగా మారిందన్నారు. దీన్ని గుంటూరులోని లాబ్‌కు పంపారు. సాధారణంగా పశువుల ఎరువులో 0.4% పోషకాలుంటాయని, జీవామృతం కలిపిన పశువుల ఎరువులో 18-22% పోషకాలున్నట్లు తేలిందని హిమవంతరావు తెలిపారు. అయితే, ఎక్కువ విస్తీర్ణంలో పొలం ఉన్న రైతులు మరో పద్ధతిని అనుసరించవచ్చని ఆయన సూచిస్తున్నారు. పెంటదిబ్బను అడుగు, అడుగున్నర ఎత్తులో చదును చేసి.. మూర  దూరంలో ఘాతాలు వేసి.. ఆ కన్నాల్లో 2-3 లీటర్ల జీవామృతం పోసి, చెత్తతో కప్పేయాలి. తడి ఆరిపోకుండా తగుమాత్రంగా నీళ్లు చిలకరిస్తుంటే చాలు. 25 రోజుల్లో అధిక పోషకాలతో కూడిన మెత్తటి పశువుల ఎరువు తయారవుతుందని హిమవంతరావు తెలిపారు.

ఘన జీవామృతం

జీవామృతంతోపాటు ఎకరానికి పంటకాలంలో 2-3 క్వింటాళ్ల ‘ఘన జీవామృతం’   వాడుతున్నానని చెప్పారు. ఘన జీవామృతం తయారీ విధానం: 100 కిలోల ఆవు పేడ + 5 లీటర్ల ఆవు మూత్రం + 2 కిలోల ఏదైనా పప్పుల పిండి + 2 కిలోల బెల్లం(లేదా 4 లీటర్ల చెరకు రసం)+ అర కిలో మట్టి.. వీటిని 100 కిలోల చివికిన పశువుల ఎరువులో కలిపి.. నీడన పది రోజులు ఆరబెడితే ఘన జీవామృతం సిద్ధమవుతుంది.

చెరువు మట్టి + జీవామృతంతో ఎరువు

3 కిలోల చెరువు మట్టికి లీటరు జీవామృతం కలిపి నీడలో ఆరబెట్టి.. పదును ఆరిపోకుండా తగుమాత్రంగా నీరు చిలకరిస్తూ కలుపుతూ ఉంటే.. వారం, పది రోజుల్లో మంచి ఎరువు తయారవుతుందన్నారు. ఇలా.. పశువుల ఎరువు అందుబాటులో లేని రైతులు చెరువు మట్టితో కూడి ఎరువు తయారు చేసుకోవచ్చన్నారు. లేనిదేదో కావాలనుకోకుండా ఉన్న వనరులతోనే పోషక విలువలతో కూడిన ఎరువులు తయారు చేసుకోవడం రైతులకు ప్రయోజనకరమంటారు హిమవంతరావు.

బావి మట్టితో చౌడుకు విరుగుడు

మట్టి ఉదజని సూచిక(పీహెచ్) 8.2 కన్నా తక్కువగా ఉన్న భూములే పామాయిల్ సాగుకు పనికొస్తాయని చెబుతుంటారని, అయితే 9.5 పీహెచ్ ఉన్న తన భూమిలో పామాయిల్ పండిస్తున్నానని ఆయన తెలిపారు. చౌడుకు విరుగుడుగా అనేక ప్రయత్నాలు చేశారు. ఎకరానికి ఏటా 10 టన్నుల పశువుల ఎరువు + టన్ను చొప్పున జిప్సంను 3-4 ఏళ్ల పాటు వేశారు. అనుకున్నంత ఫలితం రాలేదు. బావిలో నుంచి తవ్విన మట్టిని 6 ఎకరాల పొలంలో అడుగు మందాన పోయించడంతో చౌడు బెడద పూర్తిగా పోయిందని ఆయన తెలిపారు. ఎకరానికి 3 టన్నులకు మించి దిగుబడి రాదన్నారని, 9 టన్నుల నాణ్యమైన గెలల దిగుబడి వస్తున్న దన్నారు. గతంలో 25-30% గింజలేని కాయలుండేవని, ఇప్పుడు అసల్లేవని, కాయల్లో ఆయిల్ శాతం పెరిగిందన్నారు.  తమ పామాయిల్ తోటకు 4 నెలలుగా జీవామృతం వేయడం మానేయడంతో గెలల బరువు తగ్గుతున్నందున అమినో యాసిడ్ వాడదామనుకుంటున్నానన్నారు. 100 లీటర్ల నీటికి 200 మిల్లీలీటర్ల అమినోయాసిడ్‌ను కలిపి లేదా 100 లీ. జీవామృతానికి 100 మిల్లీలీటర్ల అమినోయాసిడ్‌ను కలిపి వాడొచ్చన్నారు. అమినోయాసిడ్‌తో దిగుబడి పెరుగుతుందని, రసం పీల్చే పురుగుల బెడద తప్పుతుందని, దిగుబడుల నాణ్యత పెరుగుతుందన్నారు.

ప్రకృతి వ్యవసాయంలో స్వీయ అనుభవంతో గడించిన జ్ఞానాన్ని  ఇతర రైతులకు హిమవంతరావు ఉచితంగా పంచుతున్నారు. తన వద్ద శిక్షణ పొందిన రైతులు 80 గ్రామాల్లో ప్రకృతి సాగు చేస్తున్నారన్నారు. 400 మంది సేంద్రియ రైతులను కూడగట్టి పరస్పర సహకార సంఘాన్ని నెలకొల్పారు. పండించిన పంటను నేరుగా వినియోగ దారులకు విక్రయించే మార్గాలను సైతం అన్వేషిస్తున్నారు.  
 - కందిమళ్ల వీరాస్వామి, ముదిగొండ, ఖమ్మం జిల్లా
 
 
ప్రకృతి సాగును ప్రభుత్వమే వ్యాప్తిలోకి తేవాలి

స్థానిక వనరులతో తక్కువ పెట్టుబడులతో, దిగుబడులు తగ్గకుండా, ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి అవకాశాలున్నాయి. చిన్న, పెద్ద అని తేడా లేదు. ప్రకృతి వ్యవసాయం ఏ రైతుకైనా అనుకూలమే. ఎకరం లేదా అర ఎకరం లేదా  కనీసం పావు ఎకరంలోనైనా  ప్రారంభించవచ్చు. ఆహార, వాణిజ్య పంటలన్నీ సాగు చేయొచ్చు. రసాయనిక ఎరువులకు ఇచ్చే రాయితీలో 4వ వంతును ప్రోత్సాహంగా ఇస్తూ..  ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వమే వ్యాప్తిలోకి తేవాలి.

 - సామినేని హిమవంతరావు (98665 63556),
 మేడేపల్లి, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా

Advertisement

తప్పక చదవండి

Advertisement