తొలిగడప | Sakshi
Sakshi News home page

తొలిగడప

Published Thu, Jan 22 2015 12:02 AM

తొలిగడప

టూకీగా ప్రపంచ చరిత్ర
 
 అప్పట్లో ఒక్క ‘డైనసార్’ జాతి జంతువులు తప్ప, మిగతావన్నీ మాంసాహారులు. ‘డైనసార్’ జాతి జంతువులు మీసోజోయిక్ యుగం ప్రత్యేక కానుక. వీటిల్లో  ‘టైరనోసారస్’ కులానికి చెందిన జంతువులు తప్ప మిగతావన్నీ శాకాహారులు.
 
మొసళ్ళ వంటి సరీసృపాలు వెచ్చదనం కోసం ఎండనే వాడుకుంటాయి; పాము, తొండవంటివి అటు ఎండనూ, ఇటు నేలలోని బిలాలనూ ఈ అవసరం కోసం వాడుకుంటాయి. ఇదంతా చెప్పుకునే అవసరం ఎందుకు కలిగిందంటే- నీటిలో జీవులు కొన్ని ఒడ్డును మరగడం, ఒడ్డునుకాదని కొన్ని నేలకు ఎగబాకడం వంటి అలవాట్లు యాదృచ్ఛికంగా జరిగినవి కాదనీ, భౌతికావసరాల ప్రోద్బలంతో జరిగిన పరిణామమనీ మనకు జ్ఞాపకం ఉండేందుకు. జీవిని నివాసం మార్చుకునేలా ప్రోత్సహించే మరో అవసరం ఆహార సంపాదన. నేలమీద అప్పటికే లెక్కలేనన్ని పురుగులు పారాడుతుండడం మూలంగా, వాటిని ఆహారంగా తీసుకునే జీవికి పొడినేల స్వర్గంగా దొరికుండొచ్చు.

‘ప్యాలియోజోయిక్’ యుగాంతంలో పలురకాల అవాంతరాల కారణంగా కొసరూ మొగ్గూ మినహా సమూలంగా అంతరించిన జీవరాసి, ‘మీసోజోయిక్’ యుగంలో మూడుపువ్వులూ ఆరుకాయలుగా విజృంభించింది. మునుపు నీటినే అంటిపెట్టుకుని బ్రతికిన చెట్టూచేమా, బురదగుంటల పొలిమేరలు అతిక్రమించి, పొడినేలకు విస్తరించి, చివరకు పర్వతాల పాదం వరకూ నెరుసుకుపోయింది. ఐతే, ఈ చెట్లన్నీ అప్పటికిగూడా పూలు పూయని ఫెర్న్ జాతులే; కాకపోతే వైవిధ్యం పెద్దగా పెరిగింది. రకాలు ఎన్ని పెరిగినా ఇప్పటి అడవుల్లాగా అవి రంగులతో శోభాయమానమైన అలంకారాలు కావు. వర్షాకాలంలో పచ్చని తివాచీ, ఎండలు పెరిగితే గోధుమరంగు పొడలు. పంచరంగుల్లో కనిపించేవి కొండలమీద రాళ్ళు మాత్రమే. ఆ చెట్లకు పండ్లూ లేవు, విత్తనాలూ లేవు. వాటిని ఆహారంగా వినియోగించుకుని వృక్షజాతులు విస్తరించేందుకు దోహదంచేసే పక్షులు గూడా అప్పట్లో లేవు. అందువల్ల, పర్వతాలూ, వాటి సాణువులూ ఆచ్ఛాదనలేని భూమాత అవయవాలుగా ఉండిపోయాయి.

ప్యాలియోజోయిక్ యుగంలోనే, చివరి శకంలో సరీసృపాలు రూపొందాయని ఇదివరకే అనుకున్నాం. ఆ దశలో వాటి కాళ్ళు ఏమంత బలమైనవిగా ఉండేవిగావు. బానలాటి కడుపును ఈడ్చుకుంటూ అవి ప్రయత్నపూర్వకంగా, నేలమీది కొచ్చిన మొసళ్ళకులాగా, నడిచేవి. ‘మీసోజోయిక్’ యుగంలో సరీసృపాలకు కాలిబలం పెరిగి, శరీరభారాన్నంతా నాలుగు కాళ్ళ మీద మోయగలిగే సమర్థత సమకూరింది. ఆ సమర్థతతో అవి తమ సామ్రాజ్యపు సరిహద్దులను అపారంగా విస్తరించడం గమనిస్తే, నేల నుండి ఐదుమైళ్ళు ఎగువకూ నీటిలో మైలుకు తక్కువైన లోతుకూ మాత్రమే పరిమితమైన మానవజీవన పొలిమేరలు ఏదోవొకనాడు అంచనాలకు దొరకనంత విశాలంగా విస్తరించగలవనే నమ్మకం ఏర్పడుతుంది.

 మీసోజోయిక్ యుగంలో నేలను ఆక్రమించిన జంతువులన్నీ బల్లులూ, తొండలూ, తాబేళ్ళ జాతికి చెందిన సరీసృపాలే. వాటిల్లో మొసలి, సముద్రపు తాబేలు వంటి కొన్ని జీవులు తిరిగి నీటిని ఆశ్రయించినా, మిగతావన్నీ నేలమీది జీవితానికే కట్టుబడ్డాయి. వీటిల్లో కొన్ని వెనకకాళ్ళూ తోకల మీద శరీరాన్ని కుదురుజేసి, ఇప్పటి ‘కంగారూ’ జంతువుల్లో మనం చూస్తున్నట్టు, ముందుకాళ్ళకు స్వేచ్ఛనిచ్చే అలవాటు చేసుకున్నాయి. అప్పట్లో ఒక్క ‘డైనసార్’ జాతి జంతువులు తప్ప, మిగతావన్నీ మాంసాహారులు. ‘డైనసార్’ జాతి జంతువులు మీసోజోయిక్ యుగం ప్రత్యేక కానుక. వీటిల్లో ‘టైరనోసారస్’ కులానికి చెందిన జంతువులు తప్ప మిగతావన్నీ శాకాహారులు.

ఈ యుగం తొలి శకంలో కనిపించిన డైనసార్లు పరిమాణంలో చెప్పుకోతగినంత పెద్దవిగావుగానీ, మధ్యశకాల్లో వాటి సైజు అబ్బురంగా పెరిగింది. చివరిశకం చేరుకునేసరికి ఇంతవరకు ఏ జంతువుకూ అబ్బనంత భారీగా వాటి శరీరాలు పెరిగిపోయాయి. వీటిల్లో ‘డిప్లొడోకస్’ అనే జంతువు సగటు కొలత, ముక్కుకొస నుండి తోక చివరికి 84 అడుగులు. ఆఫ్రికా తూర్పుతీరంలో దొరికిన మరో జీవి నూరు అడుగులకు మించిన పొడవును రికార్డు చేసి, ‘జైగ్యాంటోసారస్’గా పిలువబడింది. ఈ రాక్షసబల్లులు వెనకకాళ్ళనూ తోకనూ ఆపుజేసుకుని నిలుచున్నట్టు చూపుతుంటారుగానీ, అంతపెద్ద శరీర భారాన్ని మోయగల సత్తువ వాటి వెనకకాళ్ళకు కనిపించదు. భారీ శరీరాల మూలంగా గొడ్లలాగా కనిపిస్తాయిగానీ, లక్షణాలరీత్యా అవి నూటికి నూరుపాళ్ళూ సరీసృపాలు. అందుకే వాటికి ‘బయటిచెవి’ కనిపించదు.

 ఈ బల్లుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన రకాలు కొన్నున్నాయి. వాటిల్లో ‘ట్రైసెరాటోప్స్’ అనే జాతి జంతువుకు మూడు కొమ్ములున్న కారణంగా ఆ పేరొచ్చింది. రెండుకొమ్ములు దాని కళ్ళకు ఎగువనా, మూడవది ముక్కుకు కొసనా ఉంటాయి. పైదవడలో పళ్ళను కాదని ముందుకు పెరిగిన బొమికె చిలకముక్కును పోలి కొనదేరి ఉంటుంది.

 రెండవది అతి భయంకరమైన ‘టైరనోసారస్.’ ఇది మాంసాహారి. ముక్కునుండి తోకకు దాదాపు 40 అడుగుల పొడవుంటుంది. వెనకకాళ్ళు చాలా దృఢంగా ఉండడంతో, ఇది తన శరీరాన్ని వెనకకాళ్ళూ తోకలమీద మోపుకుని నడవగలిగినట్టు కనిపిస్తుంది. దీని నోరు నాలుగు అడుగుల సొరంగం. తెరిస్తే మూడున్నర అడుగుల సందు విప్పుకుంటుంది. కోర జంపు పన్నెండు అంగుళాలు. పలువరస ఏర్పాటు ఆహారాన్ని నమిలేందుకు అనుకూలించదు గాబట్టి చంపిన వేటను మొత్తంగా మింగేసేదైవుంటుంది.

 మూడవరకం జంతువు ‘థెరియోమార్ఫా’. అంటే ‘మృగాన్ని పోలినది’ అని. పరిమాణం పెద్దగా ఉండదుగాని, దీని ఎముకల అమరికలో ‘స్తన్యజీవు’లకు పోలిన మార్పులు కనిపిస్తాయి. అయినా, తరువాతి యుగానికి చెందిన ‘స్తన్యజీవు’లకు పూర్వీకులు ఇవేనని కచ్చితంగా చెప్పుకోలేం. మీసోజోయిక్ యుగంలో ‘‘మ్యామెల్స్’’ - అంటే ‘స్తన్యజీవులు’ లేదా పొదుగుండే జంతువులు - ఉండేవా కాదా అనేది ఇంతదాకా ఇదమిత్థంగా జవాబు దొరకని సందేహం. పొదుగును మాత్రమే కాకుండా, చర్మం మీద బొచ్చును కలిగుండడం స్తన్యజీవుల లక్షణం. ఆ లక్షణాలను కచ్చితంగా సూచించే అవశేషాలు ఈనాటికీ దొరకలేదు.

 

 రచన: ఎం.వి.రమణారెడ్డి 

 
 
 
 

Advertisement
Advertisement