అన్నదాతకు బంగారు భవిత | Sakshi
Sakshi News home page

అన్నదాతకు బంగారు భవిత

Published Thu, Sep 18 2014 12:51 AM

golden future to farmers : g.ramesh kumar

వర్గల్: అన్నదాత భవితను బంగారుమయం చేస్తామని నాబార్డు ఏజీఎం జీ రమేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని కూరగాయల క్లస్టర్ రైతులకు ‘నాబార్డు’ ద్వారా తగిన సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఫార్మర్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి అధిక దిగుబడుల సాధనపై రైతులకు అవగాహన, శిక్షణ ఇచ్చేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు చేయూతగా నిలుస్తామని చెప్పారు.

మండల పరిధిలోని గౌరారం సర్పంచ్ నర్సారెడ్డి అధ్యక్షతన, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం కూరగాయల క్లస్టర్ రైతులతో ‘మన ఊరు- మన కూరగాయలు’ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సంఘటితమై సహకార సొసైటీలుగా ఏర్పడాలన్నారు. వీటిని బలోపేతం చేసేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని, నిర్వహణ పరమైన శిక్షణ  అందిస్తామని తెలిపారు. ఇందుకోసం ఓ ఎన్‌జీఓకు సంఘ పురోగతి బాధ్యత అప్పగిస్తామని, వ్యయ సంబంధ నిధులు అందజేస్తామని వివరించారు.

తద్వారా సొసైటీ, రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఆవిర్భవించి తమ కార్యకలాపాలను మరింత అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. మూడేళ్ల కాలం పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘం సాధించిన పురోగతి (బ్యాలెన్స్ షీట్) ఆధారంగా ‘నాబార్డు’ ద్వారా రుణ పరపతికి ఆ సంఘం అర్హత పొందుతుందని వివరించారు. మన ఊరు-మన కూరగాయలు కార్యక్రమం కింద కూరగాయలు పండిస్తున్న గౌరారం క్లస్టర్ పరిధిలోని రైతులకు శాశ్వత పందిరి నిర్మాణానికి బ్యాంకుల ద్వారా అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు.

 ఉద్యాన శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ అధిక దిగుబడి సాధించాలని, గౌరారంలో మంజూరైన కూరగాయల కొనుగోలు కేంద్రం ప్రారంభం వర కు ఇక్కడి రైతు సహకార సొసైటీ, రైతు ఉత్పత్తి దారుల సంఘంగా రూపొందాలని ఆకాంక్షించారు. గౌరారం గ్రామానికి నాబార్డు రైతు క్లబ్ మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి నాబార్డు తగు ఆర్థిక సహకారం అందిస్తుందని వివరించారు.  

 రైతులు సహకరించాలి...
 మన ఊరు- మన కూరగాయలు కార్యక్రమ సలహాదారు, మార్కెటింగ్ అడ్వైజర్ డాక్టర్ సెకాన్ మాట్లాడుతూ.. ఏడాది పాటు తమ సలహాలు, సూచనలకు అనుగుణంగా రైతులు కూరగాయలు సాగు చేసి సహకరించాలని, అందుకు తగిన గిట్టుబాటు ధర కల్పించి తీరుతామని భరోసా కల్పించారు. గ్రామస్థాయిలోనే ఉత్పత్తులను సేకరించి దళారుల బెడద లేకుండా కూరగాయలు అక్కడికక్కడే విక్రయించే సదుపాయం కోసం గౌరారంలో కూరగాయల సేకరణ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

 క్షేత్రస్థాయిలో సలహాలిస్తాం....
 సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. కూరగాయ పైర్లు తెగుళ్లు, చీడల బారినపడి రైతులు నష్టపోకుండా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తామని, క్షేత్రాన్ని సందర్శిస్తామని హామీ ఇచ్చారు.

 పందిరి సాగుకు సబ్సిడీ పెంపు...
 జిల్లా ఉద్యాన అధికారిణి రామలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వం శాశ్వత కూరగాయల పందిరికి ఇచ్చే సబ్సిడీని పెంచిందని, ఎకరానికి రూ. లక్ష చొప్పున గరిష్టంగా రెండున్నర ఎకరాలలో పందిరి వేసి రూ. రెండున్నర లక్షల సబ్సిడీని రైతులు పొందవచ్చన్నారు.

 అవకాశాన్ని అందిపుచ్చుకోండి...
 గజ్వేల్ ఉద్యాన అధికారి చక్రపాణి మాట్లాడుతూ ‘మన ఊరు- మన కూరగాయలు’ కార్యక్రమం ద్వారా అందివచ్చిన అవకాశాన్ని గౌరారం క్లస్టర్ రైతులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును బంగరుమయం చేసుకోవాలని కోరారు. ట్రీస్ స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కూరగాయలు సాగు చేసే గౌరారం క్లస్టర్ రైతుల పురోగతికి అవసరమైన దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. గ్రామ రైతు సహకార సొసైటి అధ్యక్షుడు పాశం నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన కూరగాయలు కార్యక్రమ లక్ష్యాలు సిద్ధింపజేసి సంఘాన్ని ఆదర్శంగా నిలబెట్టుకుంటామని అధికారులకు స్పష్టం చేశారు. రైతులు కూరగాయల సాగు, మార్కెటింగ్, గిట్టుబాటు ధర తదితర అంశాలను అధికారుల దృష్టికి తెచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement