భూమాతకు ఎంత కష్టం..! | Sakshi
Sakshi News home page

భూమాతకు ఎంత కష్టం..!

Published Mon, Nov 28 2016 11:55 PM

How difficult it is to the land

ప్రకృతి వ్యవస్థలో అతి ముఖ్యమైనది మట్టి..మానవాళి మనుగడకు పునాది నేల తల్లి! భూమిపైన, భూమి లోపల ఉన్న సకల జీవరాశికి ఆకలి దప్పులు తీర్చే అన్నపూర్ణ!!  ఆహారోత్పత్తి యజ్ఞంలో నిమగ్నమైన అన్నదాతలకు పంట భూమంటే ప్రాణ సమానం. కేవలం దిగుబడులనిచ్చే ఒకానొక వస్తువు మాత్రమే కాదు.. మానవాళి జీవికకే ఆధారభూతమైన నేలతల్లి!

 కానీ, అన్నపూర్ణ వంటి నేల తల్లికి కష్టకాలం వచ్చింది. పంట భూమి ఉత్పాదక శక్తిని కోల్పోతోంది. అపసవ్య వ్యవసాయ పద్ధతులతోపాటు అనేక కారణాల వల్ల సాగు భూములు జీవాన్ని కోల్పోయి నాశనమవుతున్నాయి.  పంట భూముల్లో సూక్ష్మజీవుల జీవ వైవిధ్యానికి మనుషుల ఆరోగ్యానికి స్పష్టమైన సంబంధం ఉందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆహారోత్పత్తులు సూక్ష్మపోషక లోపం లేకుండా ఔషధ విలువలను సంతరించుకోవడానికి కారణం.. పంట భూమిలో సూక్ష్మజీవరాశి పుష్కలంగా పెంపొందడమే!  పంట భూములు దెబ్బతినడానికి  ప్రధానంగా రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతులే కారణం. ప్రపంచవ్యాప్తంగా సాగు భూములు 9 రకాలుగా ధ్వంసమవుతున్నాయని, ఈ తొమ్మిది కోణాల్లోనూ సాగు భూముల దుస్థితి భారతదేశంలో ఘోరంగా ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా నివారణ చర్యలను చేపట్టకపోతే ఆహార భద్రతకే పెనుముప్పు వస్తుందని ప్రపంచ పంట భూముల దినోత్సవం సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది.
 
 1 అంతరిస్తున్న సూక్ష్మజీవరాశి
 జీవజాతుల్లో మూడో వంతుకు మట్టే ఆవాసం. సూక్ష్మజీవులు, వానపాముల వంటి జీవజాతులు అంతరించిపోవడం వల్ల ప్రకృతి సేవలు కుంటుపడుతున్నాయి. సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేయడానికి, పోషకాల పునర్వినియోగానికి విఘాతం కలుగుతోంది. భూతాపం పెరుగుతోంది. భూసారాన్ని పెంపొందించాలన్నా, పంట భూముల ఉత్పాదకతను, వ్యవసాయోత్పత్తుల్లో సూక్ష్మపోషకాలను పెంపొందించాలన్నా పంట భూముల్లో జీవవైవిధ్యాన్ని పెంపొందించక తప్పదు. గ్రామీణ జీవనోపాధులు, పర్యావరణం మెరుగవ్వాలన్నా మట్టిలో సూక్ష్మజీవరాశిని పెంపొందించుకోవడం తప్పనిసరి.
 
 2 క్షీణిస్తున్న సేంద్రియ కర్బనం
 భూమికి సేంద్రియ కర్బనమే బలం. సేంద్రియ కర్బనం నిల్వ చెట్టూ పుట్టలో, వాతావరణంలో ఉన్న దాని కన్నా ఎక్కువగా భూమిలోనే ఉంది. ఇది నానాటికీ క్షీణిస్తోంది. ఫలితంగా భూసారం తగ్గుతోంది. వాతావరణ మార్పులను నియంత్రించే సామర్థ్యం నశిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మీటరు లోతు మట్టిలో 1,41,700 కోట్ల టన్నుల సేంద్రియ కర్బనం నిల్వలున్నాయని అంచనా. భూ వినియోగ మార్పిడి వల్ల ఈ కర్బనం వాతావరణంలోకి విడుదలవుతోంది. క్రీ. శ. 1850 నుంచి 6,600 టన్నుల సేంద్రియ కర్బనం గాలిలో కలిసి, భూతాపం పెరగడానికి తోడ్పడుతోంది. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి సుస్థిర భూ యాజమాన్య పద్ధతులను అనుసరించక తప్పదు.
 
 3 పోషకాల అసమతుల్యత
 పంట భూముల్లో పోషకాల సమతుల్యత లోపించింది. రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడటం వల్ల నేలలో సూక్ష్మజీవరాశి నశించి.. పంట నేలల ఉత్పాదక శక్తి తగ్గిపోతోంది. సూక్ష్మపోషకాల లోపం ఏర్పడుతోంది. పంట భూమితోపాటు భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. హరిత గృహ వాయువులు వెలువడి భూతాపం పెరుగుతోంది. అవసరం లేని రసాయనిక ఎరువులు వేయడం మానాలి. దీని వల్ల సాగు ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికీ మేలు జరుగుతుంది. ఆహారోత్పత్తి పెరుగుతుంది.
 
  4 నేలతల్లికి గుండెకోత
 సాగు భూముల్లో అతిగా దున్నడం వల్ల.. నీరు, గాలి వల్ల భూమి పైపొర  చాలా వేగంగా (ఏటా 0.9 మి.మీ.) కొట్టుకుపోతోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2 వేల నుంచి 3 వేల టన్నుల వరకు మట్టి కొట్టుకుపోతోందని అంచనా.  లోతు దుక్కుల వల్ల ఏటా 500 కోట్ల టన్నులు, ఎత్తు గాలుల వల్ల 200 కోట్ల టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఉత్పాదక శక్తి 10% తగ్గుతుంది. తగిన యాజమాన్య చర్యలతోపాటు కందకాలు తవ్వడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు.
 
 5 నేల ఆమ్లీకరణ
 అమ్మోనియం ఎరువులు అతిగా వేయడం, పంట వ్యర్థాలను పొలంలోంచి పూర్తిగా తొలగించడం, ఎడతెగని వర్షాలు, అడవుల నరికివేత.. తదితర కారణాల వల్ల నేలలో ఆమ్ల గుణం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా భూమి పైపొర, కింది పొరల్లో మట్టి పి.హెచ్. 5.5 కన్నా తక్కువగా ఉంటే ఆమ్ల స్వభావం ఏర్పడుతుంది. మట్టి పైపొర 30% వరకు, కింది పొర 75% వరకు ఆమ్లీకరణకు గురైనట్లు అంచనా. సుస్థిర భూసంరక్షణ పద్ధతుల ద్వారా, సున్నం వాడటం ద్వారా నేల పి.హెచ్.ను పెంపొందించవచ్చు.
 
 6 చుక్క ఇంకే దారేది?
 పంట భూములను శాశ్వత నిర్మాణాలు, పరిశ్రమలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించడం పెరుగుతోంది. ప్రతి నిమిషానికి 42 ఎకరాల పంట భూమిని ఇతర అవసరాలకు మళ్లించి.. కాంక్రీటు నిర్మాణాల ద్వారా నీటి చుక్క భూమిలోకి ఇంకే దారి లేకుండా సీలింగ్ చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణ సేవలకు విఘాతం కలుగుతోంది.
 
 7 చట్టుబడడం
 పంట ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి బరువైన యంత్రాలు, పశువులు తిరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 4% పంట భూమి చట్టుబండగా మారిందని అంచనా. దీని వల్ల పంట మొక్కల వేళ్లు భూమి లోపలికి చొచ్చుకెళ్లలేవు. దిగుబడి 60% వరకు తగ్గిపోతుంది. వ్యవసాయంలో చీటికి మాటికి యంత్రాలు వాడటం వల్ల 80%, పచ్చిక బయళ్లలో ఎక్కువ సంఖ్యలో పశువులను మేపడం వల్ల 16% నేల చట్టుబడిపోతున్నట్లు అంచనా. నేలను తక్కువగా దున్నటం మంచి పరిష్కారం. దుక్కి తగ్గితే ఖర్చుతోపాటు నీటి సంరక్షణ జరుగుతుంది. సేంద్రియ కర్బనంతో పాటు భూసారం పెరుగుతుంది.
 
 8 కలుషిత వ్యర్థాల కాలుష్యం
 భార ఖనిజాలు, రసాయనిక పురుగుమందులు, పారిశ్రామిక వ్యర్థాల వల్ల నేల కలుషితమైపోతోంది. భూమిలో కలిసే కలుషిత వ్యర్థ జలాల వల్ల వ్యవసాయోత్పత్తులు వినియోగ యోగ్యం కాకుండా పోతున్నాయి. పంట దిగుబడులు కూడా తగ్గుతున్నాయి.
 
 
 9 చౌడు నష్టం హెక్టారుకు రూ. 30 వేలు

 నీటిలో కరిగే రసాయనిక ఎరువుల వాడకం వల్ల (పొటాషియం, సల్ఫేట్, కార్బనేట్, బైకార్బనేట్, మెగ్నీషియం, కాల్షియం, క్లోరిన్ వంటి) లవణాలు పంట భూముల్లో పోగుపడుతున్నందున చౌడు సమస్య ఉత్పన్నమవుతోంది. పంటల పెరుగుదల దెబ్బతినడం, దిగుబడులు తగ్గడం.. భూమి ఉత్పాదకత తగ్గిపోవడం ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారింది. చౌడు బారిన పడిన ప్రతి హెక్టారు పంట భూమికి రూ. 30 వేల మేరకు నష్టం జరుగుతోందని ఎఫ్.ఎ.ఓ. అంచనా వేసింది. చౌడును తట్టుకునే వంగడాలు, సేంద్రియ / ప్రకృతి సేద్యం చేపట్టడం ద్వారా చౌడు సమస్యను అధిగమించవచ్చు.
 - ‘సాగుబడి’ డెస్క్

Advertisement
Advertisement