ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న ప్రయోగాత్మక ‘శిల్ప'o! | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న ప్రయోగాత్మక ‘శిల్ప'o!

Published Tue, Jan 10 2017 3:48 AM

ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న ప్రయోగాత్మక ‘శిల్ప'o! - Sakshi

► నాలుగేళ్లుగా చెరకుతోపాటు వరి, కూరగాయ పంటల సాగు
►భూసారంతోపాటు ఏటేటా పెరుగుతున్న పంటల దిగుబడి, నికరాదాయం..
►ఎకరానికి 2 టన్నుల సేంద్రియ బెల్లం, బెల్లం పొడి ఉత్పత్తి.. రూ. లక్ష వరకూ నికరాదాయం
►ప్రయోగాత్మకంగా బోదెలపై ఆరుతడి వరి, అంతర పంటగా మినుము సాగు..


ఆసక్తి, ఓర్పు ఉంటే ప్రకృతి సేద్యం యువ మహిళలకూ సుసాధ్యమేనని నిరూపిస్తున్నారు యువ మహిళా రైతు శిల్ప. పుస్తక పఠనం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో కలిగిన పరిచయం.. నాలుగేళ్ల అనుభవంతో పరిపుష్టమైంది. ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం, పంటల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులు ఆమెను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. ప్రయోగాత్మకంగా బోదెలపై ఆరుతడి వరి సాగుకు శ్రీకారం చుట్టారు. సేంద్రియ బెల్లం, బెల్లంపొడి తయారీపై దృష్టి పెట్టారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏటేటా భూసారంతోపాటు దిగుబడి, నికరాదాయంతోపాటు సంతోషమూ ఇనుమడిస్తోందని భరోసాగా చెబుతున్నారు శిల్ప. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగిన రైతులకు శిక్షణ ఇస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారామె.

కరవంటే అనంతపురం, అనంతపురం అంటే కరవు.. రెండూ వేరు వేరు కాదు... గుక్కెడు నీటికి కటకటలాడే చోటది. అలాంటి చోట వ్యవసాయానికి ఉపక్రమించటం ఎండమావిలో నీరు వెతకటమే. దానికి తోడు ఎలాంటి ఫలితాలిస్తాయో తెలియని కొత్త పద్ధతులను న మ్ముకోవటమంటే నేల వదిలి సాము చేయటమే. ఆ రెండు పనులను అత్యంత చాకచక్యంతో నిర్వహించి ఒంటిచేత్తో సాగు చేస్తూ... పచ్చ బంగారాన్ని తన పొత్తిళ్లలో పొదివిపట్టిన భూదేవి అనుపతి శిల్పా కాళేశ్వర్‌. అనంతపురం జిల్లా పెనుకొండ ఆమె స్వగ్రామం.

ఎంబీఏ వరకు చదువుకున్న ఆమెకు వ్యవసాయం బొత్తిగా తెలియదు. సుభాష్‌ పాలేకర్‌ పుస్తకాల పఠనంతో ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా చూసి స్ఫూర్తిని పొందారు. తొలుత పెరటి తోటను సాగు చేసి.. సత్ఫలితాలు రావడంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం విశేషం. ప్రకృతి సేద్యంలో విభిన్న పద్ధతులను అనుసరిస్తూ కరువు సీమ రైతు లోకానికి మార్గదర్శిగా నిలుస్తున్నారావిడ.

బోదెలపై ఆరుతడి వరి....
గత నాలుగేళ్లుగా శిల్ప ప్రకృతి సేద్యంలో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది బోదెలపైన వరిని సాగు చేసి అందరినీ అబ్బురపరిచారు శిల్ప. సాగు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాత్మక పద్ధతికి శ్రీకారం చుట్టారు. పాకిస్థాన్‌ బాస్మతీ, లోయా, నవారా వరి రకాలను 30 సెంట్ల పొలంలో బోదెలపై సాగు చేశారు. ముందుగా పొలాన్ని దుక్కి దున్ని 50 సెం. మీ. ఎడం ఉండేలా బోదెలు చేసుకున్నారు. 21 రోజుల వయసున్న నారును బోదెలపై నాటించారు. 50 సెం. మీ. దూరంలో పాదుకో మొక్క చొప్పున నాటారు. సాధారణంగా 20 పిలకలు వస్తే ఎక్కువ.. కానీ ఈ మొక్కలకు 40–50 వరకు పిలకలు వచ్చాయి.

ప్రతి 15 రోజులకోసారి 500 లీటర్ల జీవామృతాన్ని నీటితో కలిపి పారించేవారు. నాటిన 20 రోజులకు, పొట్ట దశలో నీమాస్త్రాన్ని.. గింజ దశలో పులిసిన మజ్జిగను పిచికారీ చేయటంతో ఎలాంటి చీడపీడలు పంటను ఆశించలేదు. అయితే, గింజ దశలో బోరు చెడిపోవడంతో దిగుబడి దెబ్బతిన్నదని, వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో బోదెలపై ఆరుతడి వరిని సాగు చేస్తామని శిల్ప తెలిపారు.
రెండు వరి మొక్కల మధ్య అదే బోదెపై మినుము (ఉద్దులు)ను సాగు చేశారు. ఎకరాకు కిలో విత్తనాలు విత్తారు. ఇది 90 రోజుల పంట కావటంతో వరితో పాటే సాగు పూర్తయింది. ఊదల సాగుకు అదనంగా రూపాయి ఖర్చు కాలేదు.

చెరకులో అంతరపంటలుగా పసుపు, కూరగాయలు..
నాలుగు ఎకరాల్లో చెరకును నాలుగేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కార్శి పంటగా చెరకుతో పాటు అంతర పంటలుగా పసుపు, ఉల్లితో పాటు వంగ, మిరప వంటి పంటలను శిల్ప సాగు చేస్తున్నారు. ఈ ఆరెకరాలకు రెయిన్‌ గన్ల ద్వారా నీటినందిస్తున్నారు.  చెరకులో ఏటా ఎకరాకు మూడు ట్రక్కుల పశువుల ఎరువు, 3 క్వింటాళ్ల వేపపిండి దుక్కిలో వేస్తారు. ప్రతి 15 రోజులకోసారి జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. సాధారణంగా కార్శి పంటగా సాగు చేసే చెరకులో మూడేళ్ల తరువాత మళ్లీ కొత్త విత్తనం నాటుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తే 30–40 ఏళ్ల వరకు చెరకును కార్శి పంటగా సాగు చేయవచ్చని చెపుతున్నారు. దీని వల్ల రైతుకు వేల రూపాయల ఖర్చు ఆదా అవుతుంది.

ముందుగా నిద్రావస్థను తొలగించేందుకు విత్తన పసుపు కొమ్మును నేలపై కుప్పగా వేస్తారు. విత్తనాన్ని వేపాకు, ఎర్ర మన్నుతో గాలి చొరబడకుండా కప్పి నెల రోజులు ఉంచుతారు. చెరకు కోత కోసిన 2–3 నెలల వ్యవధిలో చెరకు 3 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అప్పుడు చెరకు సాళ్ల మధ్యలో బోదెను ఏర్పాటు చేసి విత్తన పసుపును నాటుకుంటారు. చెరకులో అంతరపంటగా ఉల్లిని సాగు చేస్తున్నారు. బోదె పక్కన ఉలి ్ల నారును నాటుతారు. చెరకు కోతకొచ్చేసరికి అంతర పంటలు కూడా చేతికొస్తాయి. వీటికోసం ప్రత్యేకంగా యాజమాన్య చర్యలు చేపట్టటం, ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రైతుకు అదనపు ఆదాయం లభించింది. కంచె పంటగా సాగు చేసే కందితో ఎకరాకు 2 క్వింటాళ్ల కందుల దిగుబడి వస్తోంది.

ఎకరానికి 2 టన్నుల సేంద్రియ బెల్లం, బెల్లం పొడి..
చెరకును సొంతగా గానుగాడించి సేంద్రియ బెల్లాన్ని తయారు చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఎకరాకు చెరకు 2 టన్నుల వరకు బెల్లం లేదా బెల్లం పొడి దిగుబడి వస్తోంది.  గానుగ ఆడించేందుకు రూ. 70 వేల వ్యయంతో క్రషింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. చెరకును క్రషర్‌లో వేస్తే రసం వస్తుంది. దీన్ని బాణలిలో పోసి బాగా మరగబెడతే పాకం తయారవుతుంది. వేడిమీదున్నప్పుడే దీన్ని రకరకాల అచ్చులలో పోసి వివిధ ఆకృతుల్లో బెల్లం దిమ్మలను తయారు చేస్తారు. కిలో రూ. 60 చొప్పున విక్రయిస్తున్నారు. అంతరపంటల ద్వారా ఎకరానికి రూ. 30 నుంచి 40 వేల వరకు ఆదాయం వస్తోంది. ఎకరానికి కనీసం రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం లభిస్తోంది. బెల్లం పొడిని కూడా తయారు చేస్తూ.. కిలో రూ. 150 చొప్పున విక్రయిస్తున్నారు.

రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం, బెల్లం తయారీ ప్రక్రియలో ఎలాంటి రంగులనూ వాడటం లేదు. అందువల్ల ఈ బెల్లం మంచి రుచిగా ఉండటమే కాక ఆరోగ్యకరం కూడా. ఎక్కువ తీపి ఉండడం, ఏడాది కాలానికి Sపైగా నిల్వ ఉండటం సేంద్రియ బెల్లం ప్రత్యేకత. దీంతో ముందుగానే వ్యాపారుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. వీటిని విజయవాడ, హైదరాబాద్, బొంబాయి వంటి నగరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చెరకు ఇతర పంటల సాగు.. సేంద్రియ బెల్లం, బెల్లం పొడి తయారీలో ఆసక్తి కలిగిన రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుండడం విశేషం. మరిన్ని వివరాలకు.. తిప్పన్న 94943 67890, చంద్ర 80192 44100లను సంప్రదించవచ్చు.
– తలారి మల్లికార్జున, సాక్షి, పెనుకొండ, అనంతపురం జిల్లా

ఇనుమడిస్తున్న సంతోషం!
గతంలో వ్యవసాయం గురించి తెలియకపోయినా ప్రకృతి వ్యవసాయం నేర్చుకొని నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. మొదటి రెండేళ్లు చీడపీడలు కనిపించాయి. తర్వాత ఆ సమస్య లేదు. భూసారం ఏటేటా పెరుగుతోంది. పంట ఆరోగ్యంగా ఉంటున్నది. ఏటేటా దిగుబడితోపాటు నికరాదాయం పెరుగుతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేయడం వల్ల చోటుచేసుకుంటున్న ప్రకృతిపరమైన మార్పు మాకు బాగా తెలుస్తోంది.

వానపాములు, పక్షులు, పిచ్చుకలు, కొంగలకు మా తోట ఆలవాలంగా మారింది. బెల్లం, బెల్లంపొడి ఎకరానికి రెండు టన్నుల వరకు వస్తోంది. ఎకరానికి రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు నికరాదాయం వస్తోంది. రాయలసీమలో రైతులు బోదెల పద్ధతిలో ఆరుతడి వరి సాగు చేసుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయాన్ని ధైర్యంగా చేపడితే చక్కని దిగుబడి, ఆదాయం కూడా పొందవచ్చని రైతులు గ్రహించాలి. ఆసక్తి కలిగిన వారికి మా తోటలో శిక్షణ ఇస్తున్నాం..
– శిల్ప, ఆదర్శ యువ రైతు, పెనుకొండ, అనంతపురం జిల్లా

Advertisement
Advertisement