దానిమ్మ దాదాకు జేజేలు! | Sakshi
Sakshi News home page

దానిమ్మ దాదాకు జేజేలు!

Published Tue, Jan 31 2017 12:22 AM

దానిమ్మ దాదాకు జేజేలు! - Sakshi

  • సేంద్రియ దానిమ్మ సాగులో ఒంటిచేతితో విప్లవం
  • పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గుజరాత్‌ దానిమ్మ రైతు
  • మూడు రాష్ట్రాల రైతులకు దానిమ్మ సాగులో స్ఫూర్తి
  • శారీరకంగా బలహీనుడినే కానీ మానసికంగా కాదని చెప్పే స్థాయి కాదు అతనిది. కారణం తన గురించి సామాన్యుడిని అని చెప్పుకోవటానికి కూడా అవకాశం ఇవ్వని అవకరం అతనిది. రెండు కాళ్లు లేకున్నా కృషితో తలరాతను మార్చుకున్నాడు. తను నడవలేకున్నా రైతు లోకాన్ని నడిపించాడు. ఫలితం దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ఆయన వద్దకే నడిచొచ్చింది.

    తను నిలబడలేకున్నా ఫరవాలేదు కానీ జీవితంలో మాత్రం పడిపోకూడదని కోరుకునే వ్యక్తిత్వం రైతు గెనాభాయ్‌ పటేల్‌ది. గుజరాత్‌ బనస్‌కాంతా జిల్లా, దీశా తాలూకాలోని సర్కారీ గోలియా ఆయన స్వగ్రామం. çపుట్టుకతోనే రెండు కాళ్లను కోల్పోయిన దివ్యాంగుడాయన. బతుకు తెరువు కష్టమని తల్లిదండ్రులు బడికి పంపినా చదువు అబ్బలేదు. ఇంటర్‌ వరకు బండి లాగించి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అన్ని దారులు మూసుకుపోయి చేసేదేం లేక ఉన్న ఊళ్లోనే సొంత వ్యవసాయం ప్రారంభించాడు. ఖర్చులు రాకున్నా సేద్యం మాత్రం వదలలేదు. కారణం అప్పటికే గెనాభాయ్‌ సాగుతో ప్రేమలో పడ్డాడు.  

    పొలంలోనే ఇంకా ఏదో చేయాలని తపన పడేవాడు. ఏదో సాధించాలని తహతహలాడేవాడు.  తను ఎలాగూ గోచీ బిగించి పొలంలోకి దిగి పంట పండించలేడు. అంతేకాదు  సౌరాష్ట్ర ప్రాంతం కరువుకు పెట్టింది పేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో తను శ్రమ పడకూడదన్నా..  నీటి కరవును అధిగమించాలన్నా ఉద్యాన పంటల సాగుకు మరలటమే ఉత్తమం అని భావించాడు. ఇంకేం ఆలోచించకుండా సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను కలిసి తన ఆలోచన లను వారితో పంచుకున్నాడు. గెనాభాయ్‌ని వారంతా వింతగా చూశారు. పిచ్చోడివన్నారు. ఆదిలోనే హంసపాదు. అయినా గెనాభాయ్‌ వెనక్కు తగ్గలే దు. తన మూడు చక్రాల స్కూటర్‌పై మళ్లీ మళ్లీ వెళ్లి వాళ్లని కలుస్తూ ఉండేవాడు. గెనాభాయ్‌ ప్రాధేయాలు, శాస్త్రవేత్తల తిరస్కారాలతో ఒక సీజను మొత్తం గడిచిపోయింది. ఆఖరుకు గెనాభాయ్‌ పట్టుదలకు శాస్త్రవేత్తలు అచ్చెరువొందారు. అక్కున చేర్చుకున్నారు.  

    దానిమ్మ దారి చూపింది...
    ఆ ప్రాంత వాతావర ణం దానిమ్మ సాగుకు అనుకూలంగా ఉంటుందని ఒక్కసారి నాటితే చాలు పాతికేళ్ల పాటు పంట పండుతుందని శాస్త్రవేత్తలు గెనాభాయ్‌కు సూచించారు. దీంతో వారి సూచనల మేరకు దానిమ్మను ఎక్కువగా సాగు చేసే మహారాష్ట్రకు వెళ్లాడు. సింధూరి రకం సాగుకు నప్పుతుందని అంచనా వేశాడు. కానీ అంతవరకు దీశా ప్రజలు దానిమ్మ మొక్కను కూడా చూసింది లేదు. గెనాభాయ్‌కి పిచ్చిపట్టిందన్నారు. తొలుత అభ్యంతరం చెప్పిన కుటుంబ సభ్యులు అతని పట్టుదలకు తలొగ్గారు. ‘అన్నీ ఉన్నోళ్లు పట్టణాలకు పోయి ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. రెండు కాళ్లు సరిగ్గా లేవు వీడికెందుకురా వ్యవసాయం’ అని తోటి గ్రామస్తులు అవహేళన చేశారు. గెనాభాయ్‌ మాత్రం పట్టుదలగా పని ప్రారంభించాడు. తన కాళ్ల మీద చూపాల్సిన శ్రద్ధను కూడా దానిమ్మ సాగు మీదే చూపాడు.

    దేవాంగుడి వనం విరగకాసింది..
    2004లో 13 ఎకరాల్లో గెనాభాయ్‌ దానిమ్మ మొక్కల్ని నాటాడు. గో ఆధారిత సేంద్రియ సేద్యాన్ని చేపట్టాడు. పొలమంతా ఆచ్ఛాదన కల్పించాడు. రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు అందిపుచ్చుకున్నాడు. బిందు సేద్యం వంటి పద్ధతులను అవలంబించి ఉన్న కొద్దిపాటి నీటితోనే పంటలను సాగు చేశాడు. స్వయంగా చిన్న ట్రాక్టర్‌ను నడిపేవాడు. మరో వైపు పంట చేతికొచ్చే దాక అంతరపంటలుగా కూరగాయలను సాగు చేశారు. నిత్యం శాస్త్రవేత్తలను సంప్రదించి సలహాలు తీసుకునేవాడు. రెండేళ్లకు దానిమ్మలో తొలిపంట చేతికొచ్చింది.  

    అతడి బాటలో.. అనార్‌గావ్‌...
    ఆ ఏడాది 54 టన్నుల నాణ్యమైన పంట దిగుబడి వచ్చింది. దేశంలోనే అధిక దిగుబడి సాధించిన రైతుగా రికార్డులకెక్కాడు. 17 దేశాలకు దానిమ్మ కాయలను ఎగుమతి చేస్తున్నారు. రూ. 4 వేలు అప్పు చేసి సాగు చేసిన తోటమీద రూ. 1.16 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటికి ఏటా రూ. 25 లక్షలకు తగ్గకుండా ఆదాయం వస్తోంది. దీంతో గెనాభాయ్‌ దానిమ్మ సాగును 27 ఎకరాలకు విస్తరించారు. కళ్లు చెదిరే అతని విజయం ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.  అవహేళన చేసిన రైతులూ అతని బాట పట్టారు. దాంతో సర్కారీ గోలియా గ్రామానికి అనార్‌గావ్‌ అనే పేరు వాడుకలోకి వచ్చింది. ఇప్పుడా ప్రాంతం 30 వేల ఎకరాల్లో దానిమ్మ సాగుతో దేశ వ్యాప్తంగా పేరుపొందింది. 2006లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి బొప్పాయికాయ పరిమాణంలో ఉన్న దానిమ్మను బహూకరించి ఆశ్చర్యపరిచారు.

    గెనాభాయ్‌ సాధించిన ఫలితాలు వ్యవసాయ శాఖకు ఊపునిచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో రైతు సదస్సులు ఏర్పాటు చేసి దానిమ్మ సాగుకు విస్తృత ప్రచారం కల్పించారు. 35 వేల మందికి పైగా రైతులు గెనాభాయ్‌ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. క్రమంగా అతని గెలుపు తాలూకు పరిమళాలు జిల్లా, రాష్ట్ర సరిహద్దులను దాటి పక్కనే ఉన్న రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ రైతులనూ ఉత్తేజపరచాయి. గెనాభాయ్‌తో పాటు గోలియా గ్రామస్తులందరి ఇళ్లలో సైకిళ్లకు బదులు కార్లు వచ్చాయి. రైతుల జీవితాలను స్వల్పకాలంలోనే అసాధారణంగా మార్చివేసిన దానిమ్మ విప్లవాన్ని సృష్టించిన గెనాభాయ్‌ను గుజరాత్, రాజస్తాన్‌ ప్రభుత్వాలు కృషి రుషి.. హల్‌ధారి శిరోమణి పురస్కారాలతో సత్కరించాయి. ప్రజలంతా ముద్దుగా దానిమ్మ దాదాగా పిలుచుకునే గెనాభాయ్‌ని తాజాగా పద్మశ్రీ పురస్కారం వరించటాన్ని యావత్‌ రైతు లోకం హర్షిస్తోంది.
    – దండేల కృష్ణ, సాగుబడి డెస్క్‌

Advertisement
Advertisement