వేసవి నువ్వులు! | Sakshi
Sakshi News home page

వేసవి నువ్వులు!

Published Thu, Mar 5 2015 12:04 AM

వేసవి నువ్వులు!

రబీ వరి కోతల తర్వాత నువ్వు సాగు
ఎకరానికి రూ. 3 వేల పెట్టుబడి.. సుమారు రూ. 50 వేల ఆదాయం

 
గుంటూరు జిల్లా రుపెంగుంట్ల గ్రామానికి చెందిన తొండపి గురవయ్య నిరంతరం కొత్తదనాన్ని కోరుకునే అన్నదాత. గతంలో వినూత్నమైన గొర్రును తయారు చేసి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ఆయన ఇప్పుడు వినూత్న పద్ధతిలో నువ్వుల సాగుకు శ్రీకారం చుట్టారు. రైతులు సాధారణంగా ఖరీఫ్ వరి కోతల తర్వాత పొలాన్ని దున్నకుండానే జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న, పెసర, మినుము, పొద్దుతిరుగుడు వంటి పంటలు వేస్తుంటారు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కలుపు ప్రధాన సమస్య. కాలువల కింద సాగయ్యే పొలాల్లో రబీ వరి తర్వాత నువ్వుల విత్తనాలు చల్లితే కలుపు సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చునని గురవయ్య భావించారు. ఎందుకంటే వేసవిలో కలుపు సమస్య పెద్దగా ఉండదు. పైగా భూమిలో తేమ కూడా ఉండదు. కలుపు, తేమ లేకుంటేనే నువ్వుల పంట తొలి దశలో బాగా ఎదుగుతుంది. రోహిణి కార్తె ప్రవేశించిన తర్వాత కురిసే వానలు ఎదుగుతున్న పంటకు ప్రాణం పోస్తాయి. పైగా ఆయన నివసించే ప్రాంతంలోని భూములకు వేసవిలో కాలువల ద్వారా నీరు అందుతుంది. ఆ నీటితో కీలక దశల్లో ఒకటి రెండు తడులు ఇవ్వవచ్చు. ఇంకేం? పంట ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

రబీ వరి కోతలకు 15 రోజుల ముందు గురవయ్య తన పొలంలో ఎకరానికి 2 కిలోల నువ్వుల విత్తనాలు చల్లారు. మాగాణి భూమిలో ఉన్న తేమతో అవి బాగా మొలకెత్తాయి. రోహిణి కార్తె సమయంలో కురిసిన జల్లులతో ఏపుగా ఎదిగాయి. 90 రోజుల వ్యవధిలో మూడు నాలుగు సార్లు వర్షాలు పడ్డాయి. జూలైలో పూత వచ్చింది. ఆగస్ట్‌లో పంట కోశారు. పంటకాలంలో ఆయన ఎకరానికి కేవలం ఒకే ఒక యూరియా బస్తా వేశారు. అది కూడా వర్షం పడినప్పుడే. చీడపీడల నివారణకు విత్తనాలు వేసిన 50-60 రోజుల తర్వాత రెండుసార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. కోత ఖర్చు తప్పించి పెద్దగా అయిన పెట్టుబడేమీ లేదు. ఎంత ఎక్కువ ఖర్చు చేసినా ఎకరానికి మూడు వేల రూపాయలకు మించి పెట్టుబడి అవసరం లేదు. వాతావరణం అనుకూలించి, అంతా బాగుంటే ఎకరానికి 7 బస్తాల (బస్తాకు 75 కిలోలు) నువ్వుల దిగుబడి వస్తుంది. ఒక్కో బస్తా రూ.7 వేలు పలుకుతోంది. అంటే రూ. 3 వేల పెట్టుబడికి రూ. 49 వేల ఆదాయమన్నమాట! తక్కువలో తక్కువ 2 బస్తాలకు తగ్గదు.

2009 నుంచే గురవయ్య ఈ ప్రయోగం చేస్తున్నారు. అయితే కాలువలకు నీరు బాగా అంది రబీలో వరి వేసిన సందర్భంలో మాత్రమే ఆయన కోతల తర్వాత నువ్వులు చల్లుతున్నారు. సకాలంలో వర్షాలు పడకపోయినా, పంటకు నీరు అందకపోయినా దిగుబడులు తగ్గుతాయి. ఇది ఏ పంటకైనా తప్పదు కదా? గురవయ్య ప్రయోగాన్ని గుంటూరు లాం శాస్త్రవేత్తలు పరిశీలించి, ఆయనపై ప్రశంసలు కురిపించారు.
 
 - పి. సంగమేశ్వరరావు, సాగుబడి డెస్క్

 
 

Advertisement
Advertisement