ఉరిపేనుతున్నది విధానాలే! | Sakshi
Sakshi News home page

ఉరిపేనుతున్నది విధానాలే!

Published Wed, Nov 19 2014 11:30 PM

ఉరిపేనుతున్నది  విధానాలే! - Sakshi

 విశ్లేషణ

తెలంగాణలో రైతుల ఆత్మహత్యల తీరు వ్యవసాయ సంక్షోభ తీవ్రతను తెలియజేస్తోంది. కరువు నేపథ్యంలో పత్తి రైతులతోపాటు కూరగాయ పంటలు పండించే రైతులూ నిస్సహాయంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. ఖర్చు తగ్గించే సాగు పద్ధతులతోపాటు.. రైతుకు భద్రతనిచ్చే దిశగా విధానాల్లో మౌలిక మార్పు తేవడం తక్షణావసరంగా పాలకులు గుర్తించాలి.
 
అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు చేజేతులా తమ ప్రాణాలనే తీసుకోవడం అనేక సంవత్సరాలుగా జరుగుతున్నవే అయినా.. గత కొద్ది నెలలుగా ఉధృతమయ్యాయి. రోజుకు ఐదు లేక ఆరుగురు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లెక్కకు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్న దానికన్నా.. ఈ దుర్భర స్థితి ఎందుకు దాపురించింది? పరిష్కారం ఏమిటన్నది చర్చించాల్సిన ప్రధానాంశం. బలవన్మరణాల నుంచి రైతులను రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చెయ్యాలన్న చర్చే ఉపయోగకరం.  
 
మహిళా రైతులు, యువ రైతులు సైతం..

గతంలో పత్తి వంటి పంటలు సాగు చేసిన రైతులే ఆత్మహత్యల పాలయ్యేవారు. కానీ, ప్రస్తుతం ఇతరత్రా పంటలు సాగు చేసే రైతులు కూడా ఆత్మహత్య చేసుకోవడం వ్యవసాయ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. తీవ్ర కరువు పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. పత్తి రైతులతోపాటు వరి, మొక్కజొన్న, చివరకు కూరగాయల రైతులు కూడా ఆత్మహత్యల పాలవుతున్నారు. వీరిలో మహిళా రైతులు, యువ రైతులు కూడా ఉండడం అత్యంత విషాదకర వాస్తవం. ఆత్మహత్యలకు సాధారణంగా కనపడే కారణాలు: పంటల సాగు ఖర్చులు పెరిగిపోవడం, ఖర్చుకు తగిన ధర మార్కెట్లో రాకపోవడం. ఖర్చు పెట్టే డబ్బు కన్నా తిరిగొచ్చే డబ్బు తగ్గిపోవడంతో అప్పులు, వాటికి వడ్డీలు తోడవుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడే దారి కనపడక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

తడిసి మోపెడవుతున్న ఖర్చు

సాగు వ్యయం పెరగడానికి అనేక కారణాలున్నాయి. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పరికరాలు, సాధనాలు స్వతహాగా రైతు దగ్గరే ఉండేవి. ఇప్పుడు అన్నిటినీ డబ్బు చెల్లించి కొనుక్కోవాల్సి వస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు రైతుకు భారమయ్యాయి.  ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడక రైతులు విత్తనాలు రెండు, మూడు సార్లు వేయాల్సి వచ్చింది. బీటీ పత్తి విత్తనాల ధర అయితే అన్నింటికంటే ఎక్కువగా పెరిగింది. నాణ్యత లేకపోయినా దుకాణంలో ఉన్న విత్తనాలనే కొనకతప్పని స్థితి నెలకొంది. విత్తనాలు మొలకెత్తకపోయినా, పూత/కాత సరిగ్గా లేకపోయినా నష్టపోయేది రైతే. ట్రాక్టర్లు, టిల్లర్లు, ఇతర యంత్ర పరికరాలు అద్దెకు తెచ్చుకోవడం, వీటికి తోడు కూలి పెరిగిపోవడం వల్ల రైతు మీద ఆర్థిక భారం పెరిగింది. మోటారు చెడిపోతే ఎంత ఖర్చయినా ఆఘమేఘాల మీద మరమ్మతులు చేయిస్తే కానీ పంటకు నీళ్లు అందవు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోతే, దాని మరమ్మతు ఖర్చు కూడా రైతులే భరించాల్సిన దుస్థితి ఉంది.

ప్రైవేటు అప్పులే దిక్కు

 బ్యాంకులు రుణాలివ్వకపోవడం, ఇచ్చినా చాలా తక్కువ ఇవ్వడం, అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల రైతులు అధిక వడ్డీకిచ్చే ప్రైవేటు అప్పుల మీద ఆధారపడుతున్నారు. రైతులు ఎక్కువగా దుకాణదారుల అప్పుల మీదే ఆధారపడతారు. కుటుంబ ఖర్చులకు, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, శుభకార్యాలు, బట్టలు.. ఇవన్నీ పంటల ద్వారా అయినా రావాలి. లేదా అప్పు తెచ్చిన డబ్బులో నుంచైనా చెల్లించాల్సిందే.

మార్కెట్ సంస్కరణలు..

1995లో వచ్చిన ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో అనేక మార్పులు వచ్చాయి. అన్ని దేశాల వ్యవసాయ మార్కెట్లలో కూడా పెనుమార్పులు వచ్చాయి. అనేక దేశాలు తమ రైతులను కాపాడుకోవడానికి అనేక విధాన మార్పులు తీసుకువచ్చాయి. భారతదేశంలో కూడా విధానాల మార్పులు, మార్కెట్ విధానాల పరంపర, విధానాల ‘సంస్కరణ’ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా, పాలక పార్టీలు మారినా ఆర్థిక, మార్కెట్ విధానాల సరళీకరణ కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ దిగుమతులతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరల మీద వ్యతిరేక ప్రభావం పెరిగింది. ఫార్వార్డ్ మార్కెట్లు, కాంట్రాక్టులు, విదేశీ కంపెనీల లాభాపేక్ష వల్ల కూడా రైతుకు గిట్టుబాటు ధర రావడంలేదు.

చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ వ్యత్యాసాల నుంచి రైతును కాపాడే ప్రయత్నాలు చేయడం లేదు. కనీస మద్దతు ధరలు నిర్ణయించేటప్పుడు వాస్తవ ఉత్పత్తి ఖర్చును పరిగణనలోకి తీసుకోలేకపోతున్నాయి. మద్దతు ధరల  అమలు అంతకన్నా శూన్యం. ప్రభుత్వం చేష్టలుడిగి చూడడం కంటే విధానాల సమీక్ష జరిపి, రైతుల క్షేమమే ధ్యేయంగా, రైతు అనుకూల విధానాలు తీసుకురావాలి.  రైతులకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో, ఆత్మహత్యల నివారణ యుద్ధప్రాతిపదికన నివారించాల్సిన సమయంలో రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలతో కాలయాపన చేయడం తగదు. నిధుల కేటాయింపు అత్యంత ఆవశ్యమైనదైనా.. విధానాల్లో మార్పు తేవాలి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విత్తనాల నియంత్రణ, పథకాల అమలు వంటి అంశాల మీద దృష్టిపెట్టి, కేంద్ర ప్రభుత్వ విధానాల మార్పునకు అందరూ కృష్టి చేయాలి. ఉత్పత్తి ఖర్చు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం, రైతు మీద భారం పెంచగా, వాతావరణంలో విపరీత మార్పులు ఉత్పత్తి మీద, దిగుబడి మీద దుష్ట్రభావం చూపుతున్నాయి. అకాల వర్షాలు, తక్కువ లేదా అధిక వర్షాలు, గాలి దుమారాలు, వడగళ్ల వానలతో రైతులు గత ఏడాది విపరీతంగా నష్టపోయారు. రైతులను ఆదుకోవడానికి ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేయాలి. వాతావరణ బీమా సౌకర్యం కల్పించాలి. త్వరగా పరిహారం అందించే ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తే, వారికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది.
 
(వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు)
డా. దొంతి నరసింహారెడ్డి
 

Advertisement

తప్పక చదవండి

Advertisement