నీటి కుంటలతో దిగుబడికి భద్రత! | Sakshi
Sakshi News home page

నీటి కుంటలతో దిగుబడికి భద్రత!

Published Tue, Jul 26 2016 12:04 AM

నీటి కుంటలతో దిగుబడికి భద్రత!

- మెట్ట పొలాల్లో కురిసే వాన నీటిని పొలం దాటి పోనీయకూడదు..
- నీటి కుంటల నిర్మాణమే కీలకం అంటున్న ‘క్రీడా’ శాస్త్రవేత్త
 
 మెట్ట పొలాల్లో కురిసే వర్షాన్ని పొలం బయటకు పోనీయకుండా దాచుకొని వాడుకోవడమే తెలివైన పని. మెట్ట పొలంలో నీటి కుంటలు నిర్మించుకుంటే.. కుండపోత వర్షాలు కురిసినప్పుడు నీటిని నిల్వ చేసుకోవచ్చు. బెట్ట సమయాల్లో రక్షక తడుల ద్వారా మెట్ట పంటలను కాపాడుకోవచ్చు. నీటి కుంటలను శాస్త్రీయంగా నిర్మించుకుంటే మెట్ట సేద్యంలో దిగుబడులు తగ్గకుండా చూసుకోవచ్చని కేంద్రీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (క్రీడా  - ఐసీఏఆర్) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. శ్రీనివాసరెడ్డి రైతులకు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 80% ఎర్ర భూములు, 20% నల్ల నేలలు ఉన్నాయి. ఈ పొలాల్లో అనుసరించదగిన నీటి సంరక్షణ పద్ధతులపై ఆయన అందించిన వివరాలు.. ‘సాగుబడి’ పాఠకుల కోసం..
 
 వాతావరణ మార్పుల నేపథ్యంలో వర్షాల తీరుతెన్నులు వేగంగా మారిపోతున్నందున మెట్ట భూముల్లో దిగుబడులు తగ్గకుండా చూసుకోవడానికి వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలి. చిన్నా చితకా వర్షాల నీరు పెద్దగా పొలం దాటి పోదు. కానీ, పెద్ద వర్షాలు లేదా కుండపోత వర్షాలు కురిసినప్పుడు నీటిని బయటకు పోనీయకుండా దాచుకోవడానికి నీటి కుంటలను నిర్మించుకోవాలి. వర్షం ఎక్కువ కాలం మొహం చాటేసినప్పుడు ఈ కుంటల్లో నిల్వ చేసుకున్న నీటిని రక్షక తడులుగా అందించి పంట దిగుబడులు తగ్గిపోకుండా చూసుకోవచ్చు.

 నీటి కుంటల నిర్మాణం - కొన్ని ముఖ్యాంశాలు:
 పొలంలో వాలు దిశలను బట్టి, నీరు చేరే పల్లపు స్థలాన్ని గుర్తించి, అక్కడ నీటి కుంటను ఏర్పాటు చేసుకోవాలి. రైతుకు ఉన్న పొలం విస్తీర్ణాన్ని బట్టి, ప్రవహించే నీటి మొత్తాన్ని.. పంటకు కావలసిన నీటి పరిమాణాన్ని బట్టి, నీటి కుంటల కొలతలను నిర్ధారించుకోవాలి. ఎర్ర భూములకు నీటిని ఇంకింపజేసుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెద్ద వాన కురిసినా నీటి ప్రవాహం తక్కువగా (7-12 %) ఉంటుంది. నల్ల భూముల్లో నీటి ఇంకుడుగుణం తక్కువగా ఉండటం వల్ల, నీటి ప్రవాహం రెట్టింపు (15-30%) ఉంటుంది. నల్ల భూముల్లో తవ్వే నీటి కుంటల్లో చేపల సాగు చేసుకోవచ్చు. పంటల మార్పిడి పాటిస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు.

 పొలంలో నీటి కుంటలు తవ్వుకోవడానికి మొత్తం పొలం విస్తీర్ణంలో 4-10 శాతం భూమిని కేటాయించవచ్చు. ఒక ఎకరం విస్తీర్ణం గల మెట్ట పొలంలో 250 ఘనపు మీటర్ల పరిమాణం కలిగిన నీటి కుంటను (అంటే.. 14 మీ. (వెడల్పు) ఁ 14 మీ. (పొడవు) ఁ 3 మీ. (లోతు) గల గుంటను) తవ్వుకోవాలి.

 ఎర్ర నేలలో 2.5 ఎకరాల వరకు పొలం ఉన్న రైతులు 500 ఘ.మీ. నీటి కుంట తవ్వుకోవాలి. 2.5 - 5 ఎకరాల పొలంలో 750 ఘ.మీ., 5-10 ఎకరాల పొలంలో వెయ్యి ఘ.మీ. పరిమాణంలో నీటి కుంటలు తవ్వుకోవచ్చు. ఇవి తవ్వుకుంటే భూమి వృథా అవుతుందన్నది అపోహ మాత్రమే. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి రైతులు తప్పనిసరిగా పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. నీటి ఎద్దడిలోనూ మెట్ట వ్యవసాయంలో లాభాలు పొందడానికి నీటి కుంటలు తవ్వుకోక తప్పదు. నల్ల భూముల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎర్ర నేలల్లో కన్నా ఎక్కువ నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగిన నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి.

 నీటి కుంట నిర్మాణంలో, నిర్ధారించిన స్థలంలో జేసీబీ / వోల్వో 200 మోడల్ యంత్రం ద్వారా తవ్వించాలి. పై పొరల నుంచి వచ్చే మట్టిని పొలంలో వేసుకోవాలి. తవ్వేముందు, కొలతల ప్రకారం సున్నపు ఇసుకతో మార్కింగ్ ఇచ్చుకోవాలి. కుంటలను తవ్వేముందు, తలవాలు కనీసం 1.5 : 1 ఉండేలా చూడాలి. కుంటలోకి నీరు వచ్చే దారి, నిండిన తర్వాత బయటకు పోయే దారులు కనీసం 1ఁ1 మీ. కొలత మేరకు ఉండాలి. కుంట లోపలికి నీరు వచ్చే దారి ఎదుట 1.5 ఁ 1.5 ఁ 1 మీ. కొలతలు గల (సిల్ట్ ట్రాప్ - నీటితో కొట్టుకొచ్చే మట్టిని ఆపడానికి) గుంటను తవ్వాలి. పొలంలో నుంచి వచ్చే వాన నీటి కాలువలను ఈ గుంటకు అనుసంధానించాలి. ఈ గుంట అడుగున రాళ్లు పేర్చాలి. ప్రవేశ ద్వారం కింద 1.5 ఁ 0.2 మీ. వెడల్పు గల మెట్లను ఏర్పాటు చేస్తే నీరు సులభంగా కుంటలోకి చేరుతుంది. నీటి కుంటల లోతును 3-4 మీటర్ల వరకు ఉంచాలి.

 పొలంలో నీటి కుంటలకు లైనింగ్ చేసేదిలా..
 ఎర్ర భూముల్లో ఇసుక శాతం ఎక్కువగా (70-80%) ఉంటుంది. ఈ భూముల్లో నీటి కుంటల నుంచి నీరు ఎక్కువగా (రోజుకు 60-70 మి.మీ.) ఇంకిపోతుంది. ఈ సీపేజీని అరికట్టాలంటే ప్లాస్టిక్ లైనింగ్ ఏర్పాటు చేయాలి. 500 మైక్రాన్ల మందం గల హెచ్‌డీపీఈ జియో మెంబ్రేన్‌తో కూడిన ప్లాస్టిక్ లైనింగ్ ఫిల్మ్‌ను వాడాలి.

 లైనింగ్ ఫిల్మ్ వేసే ముందు కొంచెం నీళ్లు పిచికారీ చేసి, పొడుచుకొని ఉన్న చిన్న రాళ్లను తీసివేసి, దిమ్మెతో చదరం చేయాలి. తర్వాత నీటి కుంట చుట్టూ పై భాగాన 0.3 ఁ 0.3 మీ. గల చిన్న కాలువ తవ్వాలి. కుంట సైజుకన్నా 2 మీటర్లు అదనంగా ఫిల్మ్‌ను కొనుగోలు చేయాలి. దీని ఖరీదు మార్కెట్‌లో రూ. 100 - 200 / చ.మీ. వరకు ఉంటుంది. లైనింగ్ వేసేముందు నిపుణులను సంప్రదించాలి. లైనరు నీటిగుంటలో పరిచేటప్పుడు కింది భాగంలో గాలి లేకుండా చూడాలి. లైనింగ్ ఫిల్మ్‌ని కుంట అంచు చుట్టూతా జాగ్రత్తగా పరిచి, చివర్లను పూడ్చి మట్టితో కప్పిపెట్టాలి. దాని మీద కుంట చుట్టూతా మీటరు వెడల్పు (పైకి వచ్చేటప్పటికి అర మీటరు), మీటరు ఎత్తున మట్టి కట్ట ఏర్పాటు చేయాలి.

 నల్ల రేగడి భూముల్లో తవ్విన కుంటల్లో అట్టడుగు వరకూ నల్లమట్టి ఉంటే నీటి ఇంకుడు తక్కువగా (1-10 మి.మీ. / రోజుకు) ఉంటుంది. లైనర్ ఫిల్మ్ పరచాల్సిన అవసరం లేదు. కాబట్టి నల్ల నేలల్లో తక్కువ ఖర్చుతోనే నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు.

 నీటి యాజమాన్యం కీలకం :
 ఇంత శ్రద్ధగా సంరక్షించుకున్న వాన నీటిని పంటలకు సమర్థవంతంగా వాడాలి. బిందు సేద్యం, స్ప్రింక్లర్, రెయిన్‌గన్‌ల ద్వారా పంటలకు నీటిని అందించడం మంచిది. స్థానిక అధికారులను సంప్రదించి ఈ పరికరాలను సబ్సిడీపై పొందవచ్చు. కుంటలోకి వచ్చే ప్రవాహపు నీటిలో మట్టి శాతం ఎక్కువ ఉన్నట్లయితే స్ప్రింక్లర్లను లేదా రెయిన్‌గన్‌లు వాడాలి. ఫిల్టర్ చేసి డ్రిప్ ద్వారా పంటలకు అందించవచ్చు. రెయిన్‌గన్ నీటిపారుదల పద్ధతి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ భూమిని తడపవచ్చు. పంట మొక్కలు పెరిగే క్లిష్టమైన దశల్లో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు.. కుంటలోని నీటిని స్ప్రింక్లర్లు లేక రెయిన్ గన్‌ల ద్వారా పంటలకు అందించాలి.

 పంటల మార్పిడితో అధికాదాయం :
 మెట్ట పొలాల్లో వేరుశనగ (రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాలు), మొక్కజొన్న, కంది, పత్తి వంటి వార్షిక పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. ఖరీఫ్‌లో నల్ల నేలల్లో వార్షిక పంటలతోపాటు కనీసం 30-50 శాతం విస్తీర్ణంలో, ఎర్ర భూముల్లో 10-20% విస్తీర్ణంలో కూరగాయలు (బెండ, వంగ, టమాట..) పండించుకుంటే మంచి ఆదాయం పొందవచ్చు. నీటి కుంట రెండోసారి (ఖరీఫ్ చివరిలో) నిండితే.. ఆ నీటిని ఉపయోగించి తేలిక భూముల్లో రబీలో కూరగాయలు లేదా క్యారట్ వంటి పంటను వేసుకోవచ్చు.
 (‘కీడా’ ప్రధాన శాస్త్రవేత్త డా. కె. శ్రీనివాసరెడ్డిని 99480 71805 నం.లో సంప్రదించవచ్చు.
 ఈ మెయిల్:  ksreddy.1963@gmail.com)

Advertisement
Advertisement