పొగనారుకు తెగులు | Sakshi
Sakshi News home page

పొగనారుకు తెగులు

Published Tue, Sep 30 2014 2:36 AM

tobacco saplings  danger with pest

మాగుడు, నల్లకాడ తెగులు
 ఇది మట్టి ద్వారా పెరిగే బూజు. మాగుడు తెగులు అత్యంత ప్రమాదకరమైనది. తేమ ఎక్కువైతే నారుమడి మొత్తం వ్యాపిస్తుంది. నారు మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. తెగులు సోకిన నారుపై తెల్లబూజు ఏర్పడుతుంది. నల్లకాడ తెగులు సోకితే పొగనారు వేర్లు, కాండం నల్లగా మారి మొక్కలు చనిపోతాయి.

 నివారణ చర్యలు
  4 గ్రా. మైలుతుత్తం, 4 గ్రా. సున్నాన్ని లీటరు నీటికి కలిపితే బోర్డో మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని విత్తడానికి ముందు మడులను తడిపితే మాగుడు, నల్లకాడ తెగులు రాకుండా చేయొచ్చు.
  2 గ్రా. బ్లైటాక్స్ మందును లీటరు నీటికి కలిపి పొగ నారు మొలకెత్తిన 2 వారాల తర్వాత మడులపై చల్లితే మాగుడు, నల్లకాడ తెగులును అరికట్టవచ్చు.
  మెటలాక్సిల్, మాంకోజబ్ రసాయనాలు 2 గ్రాములను లీటరు నీటికి కలిపితే రిడోమిల్ మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని విత్తనం మొలకెత్తిన 21 రోజులకు మడులపై పిచికారీ చేయాలి.
  రిడోమిల్ గోల్డ్ 2 గ్రా. మందును లీటరు నీటికి కలిపి 20-30 రోజుల నారుమళ్లపై రెండుసార్లు పిచికారీ చేయాలి.
  సినామిడన్ 10 శాతం, మాంకోజబ్  3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి నారుమళ్లపై పిచికారీ చేసినా ఫలితం ఉంటుంది.
 అజోక్సీస్ట్రోబిన్ 1 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి నారుమళ్లపై పిచికారీ చేస్తే మాగుడు, నల్లకాడ తెగుళ్లను అరికట్టవచ్చు

 చుక్క, కప్పకన్ను తెగులు
 తెల్ల చుక్క తెగులు ఏ దశలోనైనా సోకుతుంది. ఆకులపై చిన్న చిన్న చుక్కలు, వాటి మధ్య భాగంలో గుంటల మాదిరిగా ఏర్పడి తెల్లగా అవుతాయి. కప్పకన్ను తెగులు 4-5 వారాల నారులో కనిపిస్తుంది. ఇవి తెల్ల చుక్కల కంటే పెద్దవి. అధిక వర్షాలకు ఈ తెగులు ఉధృతి పెరుగుతుంది. ఇటీవల పర్చూరు, కందుకూరు, కనిగిరి, అద్దంకి తదితర ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురిశాయి. కాబట్టి నారుమళ్ల రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఆకు చుక్క, కప్పకన్ను తెగులు నివారణకు  0.5 గ్రా బావిస్టిన్ మందును  లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.  

 పురుగులను నివారిస్తేనే పంట దక్కేది
 పొగాకు లద్దె పురుగును సమర్థంగా నివారించకపోతే నారు మొత్తం కోల్పోయే ప్రమాదముంది. లద్దె పురుగులను గుర్తిస్తే..  5 గ్రా. ఇమామెక్టిన్‌బెంజోయేట్ మందును 10 లీటర్ల నీటికి, స్పైనోసోడ్ 3 గ్రా. మందును 10 లీటర్ల నీటికి, ఫ్లూ బెంజోయేట్ 2.5 మి.లీ మందును 10 లీటర్ల నీటికి కలిపి నారుమళ్లపై చల్లితే లద్దె పురుగును అరికట్టవచ్చు.

 కాండం తొలుచు పురుగు ఉండే చోట బుడగ లాగా ఉబ్బి ఉంటుంది. పురుగు ఆశించిన మొక్క పెరుగుదల క్షీణించి వెర్రి తలలు వేస్తుంది. ఇది ముందుగా నారుమళ్లను ఆశించి, ఆ తర్వాత తోటలకు విస్తరిస్తుంది. నివారణకు ప్లూబెండయమైడ్ 0.25 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే కాండం తొలిచే పరుగును నివారించవచ్చు.

  తెల్ల దోమలు ఆకు అడుగు భాగంలో కనిపించే తెల్లని చిన్న కీటకాలు. ఆకు కదపగానే ఇవి ఎగిరిపోతాయి. ఇవి ఆకుల నుంచి రసాన్ని పీల్చి ఆకులు ముడత పడేలా చేస్తాయి. నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ మందును లీటరు నీటికి, థయోమిథాక్సమ్ మందు 0.3 గ్రా. మందును లీటరు నీటితో కలిపి నారుమళ్లపై పిచికారీ చేయాలి.

 మిడతలు ఆకులను తిని నష్టం కలి గిస్తాయి. నారు మడి స్థలాన్ని, గట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గడ్డి, కలుపు జాతి మొక్కలను నివారించాలి. ఇలా చేస్తే మిడతలను పంట నుంచి దూరం చేయొచ్చు.

Advertisement
Advertisement