డల్లాస్‌లో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

Published Thu, Oct 20 2016 11:33 PM

Abdul Kalam 85th birth anniversary celebrations in Dallas

డల్లాస్: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 85వ జయంతిని డాల్లాస్ లోని ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించారు. ఇర్వింగ్ లోని దేసీ ప్లాజా స్టూడియోలో కృష్ణా రెడ్డి కోడూరు, ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలాంతో కలిసి పని చేసిన శాస్త్రవేత్త కొల్లి ప్రసాద్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రావు కలాంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అబ్దుల్ కలాం సమయ పాలనకి ఎంత విలువిచ్చేవారో అలాగే పనిలో కూడా అంతే ఖచ్చితత్వంతో పనిచేసేవారనీ, ఎవరైనా తప్పు చేసినా వారిని ఆ తప్పుల నుండి నేర్చుకోమనేవారని, ముఖ్యంగా జూనియర్ శాస్త్రవేత్తలకి మరిన్ని అవకాశాలని కల్పించి వారికి అన్ని విధాలుగా ప్రోత్సహించే వారని ప్రసాద్ రావు చెప్పారు. వ్యక్తి గతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వారు కాదని అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి తన దగ్గరకు చేరదీసేవారని అన్నారు.


తప్పు చేసిన వారిని శిక్షించాలన్న ఉద్దేశం కలాంకు ఉండేది కాదని, చేసిన తప్పులను సరిదిద్దేవారన్నారు. దేశాన్ని శక్తి వంతంగా ఉంచడానికి తను నిరంతరం తపించే వారని అన్నారు. తన కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయాన్ని గడిపే వారు కాదని తన జీవితం మొత్తాన్ని దేశ సేవకే అంకితం చేసారని కొనియాడారు. పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతం చేయడంలో కలాం గారి కృషిని వివరించారు.స్వతహాగా శాఖాహారి అయిన కలాం ఆహారపు అలవాట్లను ఎంతో నిబద్దతగా పాటించేవారని చెప్పారు. అలాగే కలాం గారు ఎప్పుడూ దేశానికి యువ శాస్త్రవేత్తలను, మంచి పౌరులను తయారుచేయాలనే సంకల్పంతో పనిచేసేవారని అందులో భాగంగానే తను రాష్ట్రపతి పదవీలో ఉన్నపుడు, పదవి కాలం పూర్తయిన తర్వాత ఎక్కువ సమయాన్ని విద్యార్థుల కోసం కేటాయించేవారని చెప్పారు. కలాం జీవితం నుండి ఇప్పటి యువత ఎంతో స్పూర్తి పొంది దేశానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలని  ప్రసాద్ రావు గారు కోరారు.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేర్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు డా. బి. సోమరాజుతో కలిసి స్టెంటు ని అభివృద్ధి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాంకే దక్కిందని అన్నారు. డా. సుధా రాణి మాట్లాడుతూ దేశానికి అబ్దుల్ కలాం గారు ఎంతో సేవ చేసారని కొనియాడారు. వారి జయంతిలో పాల్గొనడం చాలా సంతోషకరమని చెప్పారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు డా.నరసింహారెడ్డి ఊరిమిండి మాట్లాడుతూ దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో అగ్ర భాగాన నిలబెట్టడంలో కలాం గారి కృషి అభినందనీయమని శ్లాఘించారు. రాజకీయాలకి సంబంధం లేకపోయినప్పటికీ కలాం రాష్రపతిగా చక్కగా రాణించారని కొనియాడారు. గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తేదీన ఎలాగైతే గుర్తుపెట్టుకొని జరుపుకుంటున్నామో అలాగే అబ్దుల్ కలాం జయంతి ని కూడా దేశమంతా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.


ప్రసాద్ గుజ్జు మాట్లాడుతూ ఒక శాస్ర్త వేత్త భారత దేశ ప్రధమ పౌరుడుగా ఎన్నిక కావడానికి రాజకీయ పార్టీలన్నీ ఏకమై ఆయనని అధ్యక్షులుగా నియమించారంటే వారు దేశానికి ఎంత సేవ చేసారో తెలుస్తుందని అన్నారు. దేశానికి ఒక ఆదర్శనీయమైన రాష్ట్రపతిగా మిగిలిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం  కార్యవర్గ సభ్యుడు ఉమా మహేష్ పార్నపల్లి , శ్రీ బసాబత్తిన, ప్రసాద్ రెడ్డి గుజ్జు, సురేష్ రెడ్డి చాడ, ప్రబంద్ తోపుదుర్తి, కృష్ణారెడ్డి మాడ, వెంకటేష్ కోరమోని, కృష్ణమోహన్ రెడ్డి కుందూరు, ప్రసాద్ రెడ్డి చొప్పా, కృష్ణా పుట్టపర్తి, మనోహర్ నిమ్మగడ్డ, ప్రతీప్ కుమార్ రెడ్డి యద్దల, సతీష్  బండారు, ప్రవీణ్ కుమార్, హరీష్ రెడ్డి, చందు, రవితేజ, బాలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement