బేజారెత్తిస్తున్న రైళ్లు! | Sakshi
Sakshi News home page

బేజారెత్తిస్తున్న రైళ్లు!

Published Thu, Jul 27 2017 1:57 AM

బేజారెత్తిస్తున్న రైళ్లు! - Sakshi

రైళ్లలో సరఫరా చేస్తున్న తిండి ఉత్త పనికిమాలినదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక కడిగి పడేసి అయిదారు రోజులు కాకుండానే ఒక ప్రయాణికుడికి సరఫరా చేసిన వెజ్‌ బిర్యానీలో చచ్చిన బల్లి పడి ఉన్నదంటే అది ఆ శాఖ పనితీరును వెల్లడిస్తుంది. అది తెలుసుకుని వచ్చిన రైల్వే సిబ్బంది చాలా శ్రద్ధగా ఆ బిర్యానీ ప్యాకెట్‌ను వెంటనే బయటకు విసిరేశారు. ప్రయాణికుడికి అవసరమైన వైద్యసాయం మాత్రం నాలుగు గంటల తర్వాత అందింది. జార్ఖండ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ వెళ్తున్న పూర్వ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఈ ఘటనపై యధాప్రకారం దర్యాప్తు చేస్తామన్న హామీ మాత్రం వినబడింది.

నిజానికి ఇప్పటికే కాగ్‌ లోతైన దర్యాప్తు జరిపింది. మొత్తంగా 74 స్టేషన్లలో, 80 రైళ్లలో, వివిధ కేటరింగ్‌ కేంద్రాల్లో తనిఖీ చేసి అపరిశుభ్రత, నిర్లక్ష్యం అక్కడ రాజ్యమేలుతున్నాయని తేల్చింది. పాచిపోయిన ఆహారపదార్ధాలను ఆ మర్నాడు వంటకాల్లో కలగలిపి ప్రయాణికులకు అంటగడుతున్నారని చెప్పింది. కాలం చెల్లిన బిస్కెట్‌ ప్యాకె ట్లను, ఇతర పదార్ధాలను యధేచ్ఛగా అమ్ముతున్నారని పేర్కొంది. ఇంకా దారు ణమేమంటే పాలు, పండ్ల రసాలు,టీ, కాఫీ వగైరాలన్నిటికీ కలుషిత నీటిని వాడుతున్నారని వివరించింది.

పాంట్రీ కారుల్లో, వంట గదుల్లో దేనిపైనా మూతలు లేకపోవడం వల్ల ఎలుకలు, బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయని తెలిపింది. ఇవన్నీ గమనించాక పంపిణీ చేసిన తిండిలో చచ్చిన బల్లి కనబడటం అసాధారణమేమీ కాదని అర్ధమవుతుంది. మరి రైల్వే శాఖ ఏం చేస్తున్నట్టు? ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక రైల్వే శాఖపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు ప్రక టించింది. వచ్చే అయిదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు సమీకరించి ఆ శాఖకు జవసత్వాలు కల్పించబోతున్నట్టు చెప్పింది.

ప్రయాణికుల సంఖ్యను, సరుకు రవాణాను భారీగా పెంచడం, కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, అధునాతన రైళ్లను సమకూర్చుకోవడం ఈ ప్రణాళికలో భాగం. ఇవన్నీ చేస్తే రైల్వే ఆదాయం అనేక రెట్లు పెరుగుతుందన్నది అంచనా. గత రెండున్నరేళ్లలో అందులో దాదాపు నాలుగోవంతు... అంటే రూ. 2 లక్షల కోట్ల వరకూ ఖర్చు చేశారని కూడా చెబుతున్నారు. కానీ దానివల్ల ప్రయా ణికులకు ఒరిగిందేమీ లేదు. నిరుడు రూ. 20,000 కోట్ల మేర ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోగా అది నెరవేరలేదని గణాంకాలు చెబుతున్నాయి. పెట్టు బడులు పెట్టగానే దాని ఫలితాలు కనబడకపోవచ్చు. అందుకు కొంత సమయం పట్టొచ్చు. కానీ ఆహార పదార్థాలను అందించడంలోనే, బోగీల నిర్వహణ
లోనే ఇంత ఘోరంగా విఫలమవుతుంటే ఆ శాఖ ఇంకేదో సాధిస్తుందని విశ్వ సించేదెలా?

వాస్తవానికి ఆహారపదార్ధాల విషయమై ఎన్నో విషయాలు చెప్పిన కాగ్‌ అందుకు దోహదపడుతున్న కారణాలను కూడా ప్రస్తావించింది. కేటరింగ్‌ విధానంలో నిలకడ లేకపోవడం, కేటరింగ్‌ యూనిట్ల నిర్వహణ బా«ధ్యతలను వెంటవెంటనే మారుస్తుండటం ఈ దుస్థితికి దారితీసి ఉండొచ్చునని అభిప్రాయ పడింది. రైల్వే శాఖ ఒకప్పుడు తానే కేటరింగ్‌ సేవలను నిర్వహించేది. అయితే ప్రయాణికులనుంచి వస్తున్న ఫిర్యాదుల పర్యవసానంగా దీన్ని ప్రైవేటు రంగానికి అప్పగించడం ఉత్తమమని భావించింది. కానీ అందువల్ల వీసమెత్తు ఉపయోగం కలగలేదని తాజా నివేదిక చూస్తే అర్ధమవుతుంది. ఈ విషయంలో తన వంతుగా తీసుకుంటున్న చర్యలను రైల్వే శాఖ ఏకరువు పెట్టింది. నిరుడు 16 కాంట్రాక్టు సంస్థల్ని బ్లాక్‌లిస్టులో పెట్టామని, మరికొందరిపై లక్షల రూపాయల చొప్పున జరిమానా వేశామని వివరించింది. అయితే మౌలికంగా కేటరింగ్‌ సంస్థల ఎంపిక ప్రక్రియలోనే లోపముందన్న సంగతి ఆ శాఖ తెలుసుకోవడం లేదు. ఆ విష యంలో పాటిస్తున్న గోప్యతే ఈ అస్తవ్యస్థ స్థితికి దారితీస్తోంది. ఏ సంస్థకు ఏ ప్రాతిపదికన కాంట్రాక్టు ఇస్తున్నారో, దేన్ని ఆధారంగా కొందరిని అనర్హులుగా నిర్ణయిస్తున్నారో ఎవరికీ తెలియదు.

ఇందుకోసం వారు ఏర్పరుచుకున్న నిబం ధనలన్నీ పరమ రహస్యం. ఆహార పదార్ధాల ధరల నిర్ణయం కూడా ఇలాగే ఉంటోంది. కాంట్రాక్టుల వ్యవహారం పారదర్శకంగా ఉండి, ప్రయాణికులకు అందించే పదార్ధాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే... బయటి తనిఖీలకు కూడా వీలు కల్పిస్తే ఈ పరిస్థితి కాస్తయినా చక్క బడుతుంది. ప్రయాణికులకు సమకూర్చే దుప్పట్లు, రైళ్లలో వాడే తెరలు వగై రాలన్నీ నెలల తరబడి పరిశుభ్రం చేయడం లేదని కూడా కాగ్‌ బయటపెట్టింది. ఒకసారి ఉపయోగించిన వస్త్రాన్ని ఉతికించాకే తిరిగి ఉపయోగించాలన్న నిబం ధన ఉన్నా దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల ముచ్చట కూడా అంతే. ఆ పేరు చెప్పి ప్రయాణికుల దగ్గరనుంచి అదనంగా రూ. 11.17 కోట్ల మేర వసూలు చేస్తున్నా ఆ రైళ్లు ఎప్పటి మాదిరి నత్తనడకనే తల పిస్తున్నాయి. కాగ్‌ నివేదిక వివిధ రైల్వే స్టేషన్లలో ఆ రైళ్లు బయల్దేరుతున్న సమయాన్ని, గమ్యాన్ని చేరుకుంటున్న సమయాన్ని పరిశీలించి అందులో 95 శాతం రైళ్లు పాత పద్ధతిలోనే సాగుతున్నాయని బయటపెట్టింది.

ఇక రైల్వే విద్యుదీకరణ స్థితి కూడా అలాగే ఉంటున్నది. అనేక ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడం, మొదలుపెట్టిన పనులు కూడా ఈసురోమని నడుస్తుండటం వల్ల ఇంధన వ్యయాన్ని తగ్గించుకోవాలన్న ఆ శాఖ లక్ష్యం ఇప్పట్లో నెరవేరే అవ కాశమే కనబడటం లేదు. ఇన్ని లోపాలు సరిదిద్దుకోకుండా విఫలమవుతూ పెద్ద పెద్ద ప్రణాళికలను రచించుకోవడం ఎవరిని వంచించడానికి? బాహాటంగా కనబడుతున్న లోపా లనూ సరిదిద్దుకోక, ఫిర్యాదులొచ్చినప్పుడూ పట్టించుకోలేక రైల్వే యంత్రాంగం ఒరగబెడుతున్నదేమిటి? తాజా ఉదంతంతోనైనా రైళ్ల శాఖ కళ్లు తెరవాలి. రకరకాల పేర్లు చెప్పి ప్రయాణికులను నిలువుదోపిడీ చేయడంలో చూపుతున్న ఉత్సాహాన్ని వారికి సౌకర్యాలను కల్పించడంలో, వారిని సురక్షితంగా గమ్యాన్ని చేర్చడంలో ప్రదర్శిస్తే మంచిదని తెలుసుకోవాలి.
 

Advertisement
Advertisement