‘దిల్‌సుఖ్‌నగర్‌’ గుణపాఠం | Sakshi
Sakshi News home page

‘దిల్‌సుఖ్‌నగర్‌’ గుణపాఠం

Published Tue, Dec 20 2016 12:35 AM

‘దిల్‌సుఖ్‌నగర్‌’ గుణపాఠం - Sakshi

భాగ్యనగరిపై ఉగ్ర పంజా విసిరి దిల్‌సుఖ్‌నగర్‌లో 16మంది అమాయకుల ప్రాణా లను బలిగొన్న అయిదుగురు ముష్కరులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం సోమవారం వెలువరించిన తీర్పు బాధిత కుటుంబాలకు సాంత్వన కలగజేస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయ స్థానం 453మంది సాక్షులను విచారించి, 152 డాక్యుమెంట్లను పరిశీలించింది. ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం)కు చెందిన నిందితులంతా మారణహోమాన్ని సృష్టించి పౌరుల్లో భయోత్పాతాన్ని కలగజేసే ఉద్దేశంతో రెండు నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసుకుని పేలుళ్లకు పాల్పడిన తీరుపై ఎన్‌ఐఏ సకల సాక్ష్యాధారాలనూ సేక రించిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

అయితే దాడి సూత్రధారి రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతను పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడంటున్నారు. అలాగే శిక్షపడినవారిలో ఒకడు పాకిస్తాన్‌ పౌరుడు. ఈ జంట పేలుళ్ల కేసులో అయిదుగురు నిందితులూ దోషులేనని ఈ నెల 13నే ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఆరు రోజుల తర్వాత ఇప్పుడు శిక్షలు ఖరారు చేసింది. ప్రత్యేక కోర్టు దోష నిర్ధారణ చేశాక తమను ఇందులో అన్యాయంగా ఇరికించారని, విచారణ ఏకపక్షంగా జరిగిం దని నిందితులు వేర్వేరుగా లేఖలు రాశారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక న్యాయ స్థానం ఇప్పుడు విధించిన ఉరిశిక్షనూ ఎటూ హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఈ అయిదుగురి వాదనలు కూడా వినే అవకాశం ఉంది.

ఎన్‌ఐఏ అధికారులు, సిబ్బంది, దర్యాప్తు బృందం సమష్టిగా పనిచేయడంవల్లే ఈ కఠిన శిక్షల విధింపు సాధ్యమైందని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేందర్‌రావు చెప్పిన మాట నిజమే కావొచ్చు. కానీ ఇందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టిం దన్న సంగతి మరువకూడదు. ఇది ఉగ్రవాద దాడి గనుక, దీని వెనక అంతర్జాతీయ ముఠాల ప్రాబల్యం ఉన్నది గనుక దీన్ని ఛేదించడం చాలా సంక్లిష్టమైన వ్యవహార మని కొందరు చేస్తున్న వాదనల్లో నిజం లేకపోలేదు. అయితే ఇలాంటి ఉగ్ర దాడుల ఉద్దేశం ప్రజానీకంలో భయోత్పాతాన్ని, అభద్రతాభావాన్ని కలగజేయడం గనుక దర్యాప్తు శరవేగంతో నడవాలని అందరూ కోరుకుంటారు. నిందితుల్ని పట్టుకోవడంలో, వారి నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించడంలో, న్యాయ స్థానం ఎదుట వాటిని రుజువు చేయడంలో విఫలమైతే పౌరుల్లో నిరాశా నిస్పృహలు, అభద్రత ఏర్పడతాయి.

ఇందుకు భిన్నంగా సత్వర దర్యాప్తు, విచారణ సాగి వెనువెంటనే శిక్షలు పడితే నేరగాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి నేరాలకు పాల్పడే దుస్సాహసం మరెవరూ చేయరు. ఉగ్రవాదం నేడో, రేపో సమసిపోయే సమస్య కాదు. అది నిరంతరం కాచుకుని ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇంటెలిజెన్స్‌ సంస్థలు మొదలుకొని సాధారణ పౌరుల వరకూ అందరికందరూ అప్రమత్తంగా ఉంటే తప్ప దాన్ని ఓడించడం సాధ్యం కాదు. ఒక్క సారి అలసత్వం ప్రదర్శించినా, నిర్లిప్త ధోరణితో ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.  భారీయెత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది.

నిజానికి ఆ కోణంలో చూస్తే దిల్‌సుఖ్‌ నగర్‌ పేలుళ్లు నివారించదగ్గవే. పేలుళ్లకు రెండు రోజుల ముందు నిఘా సంస్థల హెచ్చరికల్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ జేశామని అప్పటి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారు. అవి అందిన మాట నిజమే అయినా అలాంటివి సాధారణంగా ఎప్పుడూ వస్తూనే ఉంటాయని ఆనాటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవి చాలు... మన ప్రభుత్వాలు ఎంత అలసత్వంగా ఉన్నాయో చెప్పడానికి! వచ్చిన సమాచారాన్ని బట్వాడా చేయడమే తన ధర్మమని కేంద్రం అనుకుంటే... ఇందులో కొత్తేముందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ జంట పేలుళ్లు హైదరాబాద్‌ నగరంలో అయిదో ఉగ్ర వాద దాడి కాగా... అందులో దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాన్ని ఉగ్రవాదులు మూడు సార్లు ఎంచుకున్నారని గుర్తుంచుకుంటే ఇదెంత బాధ్యతారాహిత్యమో అర్ధమవు తుంది.

పైగా ఆ దాడులన్నీ గురువారాల్లోనే జరిగాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమ త్తంగా ఉంటే మిగిలిన ప్రాంతాల మాటెలా ఉన్నా దిల్‌సుఖ్‌నగర్‌లోనైనా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసేది. అంతక్రితం ఉగ్రవాదులు ఏ ఏ రూపాల్లో దాడి చేశారో తెలుసు గనుక అందుకు సంబంధించిన జాడలేమైనా ఉన్నాయేమో నన్న ఆరా పోలీ సులకు ఉండేది. సాధారణ పౌరులను సైతం అప్రమత్తం చేసి ఉంటే ఉగ్రవాదుల కదలికలు అంత సులభమయ్యేవి కాదు. ఈ పేలుళ్లకు ముందు ముంబై దాడి కారకుడైన కసబ్‌ను ఉరి తీయడం, పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఉరి అమలు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాద సంస్థలు హెచ్చరించాయి కూడా. అటువంట ప్పుడు కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలు ‘రొటీనే’ అను కున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంలో అర్ధం లేదు.  

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లలో చిక్కుకుని గాయాలపాలైనవారు, ఆప్తుల్ని కోల్పోయినవారు ఇప్పటికీ ఆ ఉదంతాలను తల్చుకుని వణికిపోతున్నారంటే అవి సృష్టించిన భయోత్పాతం ఏ స్థాయిలో ఉందో వెల్లడవుతుంది. నిఘా వ్యవస్థల్ని పటిష్టపరిచి, ఉగ్రవాదుల్ని మొగ్గలోనే తుంచేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసు కుంటే తప్ప ఇలాంటి స్థితి పోదు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సమన్వయం, వెనువెంటనే రంగంలోకి దిగే చురుకుదనం అవసరమవుతాయి. సీసీ కెమెరాలను పెట్టడమే కాదు... అవి ఎలా పనిచేస్తున్నాయో తరచుగా తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలి. పోలీసు విభాగాల సంసిద్ధత ఏ స్థాయిలో ఉన్నదో సమీక్షిస్తుం డాలి.  ఇవన్నీ నిరంతరం జరుగుతున్నపుడే దిల్‌సుఖ్‌ నగర్‌ ఉదంతాల వంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ జంట పేలుళ్ల కేసు ఒక కొలిక్కి రావడానికి ఇంత కాలం పట్టింది. ఈ కేసుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానాల్లో సాధ్య మైనంత త్వరగా విచారణ ప్రక్రియ పూర్తి కావాలని, నేరగాళ్లకు శిక్షలు ఖరారు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement