‘రక్షణ’ దుమారం! | Sakshi
Sakshi News home page

‘రక్షణ’ దుమారం!

Published Fri, Apr 29 2016 1:25 AM

editorial on Augusta Westland helicopter scam

అధికారంలో ఉండగా వరస కుంభకోణాలతో వెలవెలబోయి సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్‌ను స్కాంలు ఇప్పట్లో వదిలేలా లేవు. అధికార పీఠం దిగి రెండేళ్లవుతుండగా అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ, ఆమె సహాయకుడు అహ్మద్ పటేల్ తదితరుల పాత్రపై కొత్తగా ఆరోపణలు ముసురుకున్నాయి. సాధారణంగా ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో కెక్కే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పెద్దల సభలో అడుగుపెట్టిన మరుసటిరోజే ఈ స్కాంలో సోనియా పేరును ప్రస్తావించారు. ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలనపై ఎన్‌డీఏ సర్కారును ఇరకాటంలో పెడుతున్న కాంగ్రెస్‌కు ఇది ఊహించని షాక్. పార్టీలో ‘75 ఏళ్లకు రిటైర్మెంట్’ విధానాన్ని అమలుచేస్తూ సీనియర్లను పక్కనబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ 76 ఏళ్ల వయసున్న స్వామికి రాజ్యసభ అవకాశం ఎందుకిచ్చారో ఇప్పుడందరికీ అర్ధమై ఉంటుంది.

వాస్తవానికి ఇదేమీ కొత్తగా బయటపడిన స్కాం కాదు. 2010లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌లాండ్‌తో ఏడబ్ల్యూ-101 హెలికాప్టర్లు డజను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదరడం కోసం మధ్యవర్తులకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు ఏడాది వ్యవధిలోనే ఇటలీలో వెల్లువెత్తాయి. రూ. 3, 546 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో మొత్తంగా రూ.360 కోట్లు చేతులు మారాయని వాటి సారాంశం. అమెరికా హెలికాప్టర్ల తయారీ సంస్థ సిరోస్కీ ఉత్పత్తి చేస్తున్న ఎస్-92 సూపర్‌హాక్‌ను అధిగమించి అగస్టావెస్ట్‌లాండ్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది.
 
రక్షణ కొనుగోళ్లు అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఏది కొన్నా టెండర్లు పిలవడం తప్పనిసరి. అందులో ఏ సంస్థను ఎంపిక చేసినా మరో సంస్థ లొసుగులు వెదకడం షరా మామూలు. కాంట్రాక్టు చేజిక్కించుకున్న సంస్థపై నిఘా మొదల వుతుంది. అంతా సవ్యంగా ఉన్న పక్షంలో కాంట్రాక్టు పొందిన సంస్థను ఎవరూ దెబ్బతీయలేరు. ఎక్కువ సందర్భాల్లో అందుకు భిన్నంగా జరుగుతుంది గనుకే వివాదాలు ముసురుకుంటాయి. బోఫోర్స్ మొదలుకొని దాదాపు అన్నిటా ఇదే తంతు. దళారుల ప్రమేయాన్ని అంగీకరించబోమని మన ప్రభుత్వాలు పైకి చెప్ప డమే తప్ప సొమ్ములు చేతులు మారుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తాయి.  

రక్షణ ఉత్పత్తుల సంస్థలు నాసిరకం పరికరాలు, ఉత్పత్తులు అంటగట్టే ప్రమాదం ఉండటమే ఇందులోని ప్రధాన సమస్య. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల వ్యవహారాన్ని గమనిస్తే ఇది అర్ధమవుతుంది. మన వైమానిక దళం ఐఏఎఫ్ వినియోగిస్తున్న సోవియెట్ తయారీ ఎంఐ-8 హెలికాప్టర్లకు కాలం చెల్లిందని, వాటి స్థానంలో మరింత సామర్థ్యంగల హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని ఎన్‌డీఏ సర్కారు అధికారంలో ఉండగా 1999లో నిర్ణయించారు. ఆ హెలికాప్టర్ల సామర్థ్యం, ప్రమాణాలు ఎలా ఉండాలో నిర్ణయించడానికి మరో నాలుగేళ్లుపట్టింది. అవి గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలిగి ఉండాలని, రాత్రిపూట ప్రయాణానికి అనువుగా ఉండాలని, ఏ వాతావరణాన్నయినా తట్టుకునేలా ఉండాలని నిర్దేశించారు. 2005లో మొదటిసారి టెండర్ పిల్చినప్పుడున్న ఈ నిబంధనలు ఏడాది వ్యవధిలోనే మారాయి. అగస్టా వెస్ట్‌లాండ్‌కు అర్హత సాధించి పెట్టేందుకే  ఈ మార్పులు చేశారన్నది ప్రధాన ఆరోపణ.

ముందనుకున్న ప్రమాణాలను ఎందుకు తగ్గించాల్సివచ్చిందో, ఆ మార్పులు చేసిందెవరో...వారినలా చేయమన్నదెవరో గుర్తిస్తే దర్యాప్తులో చాలా భాగం పూర్తయినట్టే. కానీ 2013లో యూపీఏ సర్కారు దర్యాప్తునకు ఆదేశించినా ఈ విషయంలో సీబీఐ రాబట్టిందేమీ లేదు. అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ దర్యాప్తు పరిస్థితీ ఇంతే. ఎన్‌డీఏ సర్కారు వచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.  ఇటలీ ఈ విషయంలో చాలా మెరుగు. ఈ ఒప్పందంలో అయిదు కోట్ల యూరోలు ముడుపులు తీసుకున్నాడన్న ఆరోపణపై దళారి రాల్ఫ్ హష్కేను స్విట్జర్లాండ్‌లో 2012లోనే అరెస్టు చేశారు. మరి కొన్నాళ్లకే అగస్టా వెస్ట్‌లాండ్ మాతృ సంస్థ ఫిన్‌మెకానికా చైర్మన్ ఓర్సీ, సీఈఓ స్పాగ్నోలినీలు సైతం కటకటాల వెనక్కు వెళ్లారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన ఇటలీ పోలీసు విభాగం హష్కే, మరో ముగ్గురి మధ్య చోటుచేసుకున్న సంభాషణలను సైతం రికార్డు చేయగలిగింది.

హెలికాప్టర్ల ఒప్పందం సాకారం కావడం కోసం చెల్లించిన ముడుపుల్ని మారిషస్, ట్యునీషియాల్లోని సంస్థల ద్వారా చేర్చామన్నది ఈ సంభాషణల సారాంశం. అంతేకాదు...భారత్‌లో దర్యాప్తు చేసే ‘మూర్ఖులు’ ఏళ్ల తరబడి శ్రమించినా వీటిని ఛేదించలేరని వారు జోకులేసు కున్నారు. కనీసం అలా అన్నందుకైనా సీబీఐ గట్టిగా పనిచేసి ఉండాల్సింది. కానీ జరిగిందేమీ లేదు. 2014 అక్టోబర్‌లో ఇటలీలోని కింది కోర్టు ఓర్సీ, స్పాగ్నోలినీలపై అవినీతి ఆరోపణలు కొట్టేసింది. అయితే ఇన్వాయిస్‌లు సరిగా లేవన్న ఆరోపణను అంగీకరిస్తూ స్వల్ప శిక్షతో సరిపెట్టింది. ఇటీవలే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చి ముడుపులు చేతులు మారాయని నిర్ధారించింది. నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. అంతేకాదు అప్పట్లో ఐఏఎఫ్ చీఫ్‌గా ఉన్న త్యాగికి ఆయన బంధువుల ద్వారా అవి అందాయని తేల్చింది. ఫలితంగానే ప్రస్తుత వివాదం రాజుకుంది.
 
విపక్షంలో ఉన్నవారు ఆరోపణలు చేయడం సర్వసాధారణం. అధికార పక్షం కూడా ఆ పనే చేయడం సబబనిపించుకోదు. ఉన్న అధికారాన్ని వినియోగించుకుని వచ్చిన ఆరోపణలోని వాస్తవాలేమిటో తేల్చడం ముఖ్యం. గత రెండేళ్లుగా సీబీఐ ఈ విషయంలో ఎందుకు ప్రగతి సాధించలేకపోయిందో ఆరా తీసి లోటుపాట్లను సరిదిద్దడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్ర ధారులు ఎంతటివారైనా చట్టం ముందు నిలబెట్టడం అవసరం. దీన్ని రాజకీయ కోణంలోనే చూడటంవల్లా, వాగ్యుద్ధాలకు దిగడంవల్లా దేశానికి ఒరిగేదేమీ ఉండదు.  ఇరు పక్షాలూ ఈ సంగతి గ్రహించాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement