‘డ్రాగన్‌’ పునరాలోచించాలి | Sakshi
Sakshi News home page

‘డ్రాగన్‌’ పునరాలోచించాలి

Published Wed, May 17 2017 1:16 AM

‘డ్రాగన్‌’ పునరాలోచించాలి - Sakshi

అమెరికాతోసహా ఎవరికి వారు స్వీయ మార్కెట్ల రక్షణకు మార్గాలు వెదుక్కుంటూ ప్రపంచీకరణను నీరుగారుస్తున్న తరుణంలో చైనా అందుకు భిన్నమైన ‘వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌’ (ఓబీఓఆర్‌) ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దేందుకు రెండు రోజుల సదస్సు నిర్వహించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఉమ్మడి మార్కెట్‌కు ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారాలు తెరుస్తుందని, దీనికి అనుసంధానంగా ఉండే దేశాలన్నిటినీ సంపన్నవంతం చేస్తుందని చైనా చెబుతోంది. తూర్పు, పడమరలను అనుసంధానించిన పురాతన సిల్క్‌ రోడ్‌ను తలపించే ఈ ప్రాజెక్టు అనేకవిధాల విస్తృతమైనది. ప్రపంచ జనాభాలో 64 శాతం అంటే... సుమారు 450 కోట్లమంది నివసించే వివిధ ఖండాల్లోని 65 దేశాలను నేరుగా కలిపే ఈ ప్రాజెక్టు భూత లంతోపాటు సముద్ర జలాల్లోనూ సాగుతుంది. అనేకచోట్ల భారీయెత్తున రహ దార్లు, రైలు మార్గాలు, ఓడ రేవులు నిర్మించాల్సి ఉంటుంది.

ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలన్నీ ఈ ప్రాజెక్టు సాకారమైతే అపారంగా లాభపడ తాయని, ఆర్ధిక, వాణిజ్య రంగాల్లో బలోపేతమవుతాయని ఆర్థిక నిపుణుల అంచనా.  ఈ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి మొత్తం లక్షా 70 వేల కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక పశ్చిమ యూరప్‌ దేశాల పునర్నిర్మాణం కోసం ‘మార్షల్‌ ప్లాన్‌’ కింద అమెరికా వెచ్చించిన మొత్తాన్ని ఇప్పటి మారక విలువతో పోల్చినా ఇది ఎన్నో రెట్లు అధికం. ఇంత భారీ ప్రాజెక్టుకు మన పొరుగునున్న చైనా రూపకల్పన చేయడంతోపాటు నాయకత్వం వహిస్తూ మనల్ని కూడా ఆహ్వానించింది. అయినా మన దేశం అనేక కారణాల వల్ల దూరంగా ఉండక తప్పలేదు.

గత కొన్నేళ్లుగా ప్రపంచ తయారీ రంగంలోనూ, ఎగుమతుల్లోనూ నంబర్‌ వన్‌గా ఉన్న చైనా 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అంతర్జాతీయంగా సమస్యలను ఎదుర్కొంటున్నది. ఆనాటి మాంద్యం చైనాను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు గానీ... దానిపట్ల ప్రపంచ దేశాల వైఖరిని మార్చేసింది. అగ్రరాజ్యాలు స్వీయ రక్షణ విధానాల అమలును ప్రారంభించాయి. చైనా నుంచి వచ్చే సరుకులపై భారీ యెత్తున సుంకాలు విధించడంసహా అనేక ఆంక్షలను అమలు చేయడం మొద లెట్టాయి. 2008లోనే అమెరికాకు 12.5 శాతంమేరా, యూరప్‌కు 19.4 శాతంమేరా చైనా ఎగుమతులు కోత పడ్డాయి. ఇది సహజంగానే కరెంట్‌ అకౌంట్‌ లోటుకు దారితీసింది.

మరోపక్క ద్రవ్యోల్బణం పెరిగింది. అన్నిటి ధరలూ పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడే ఛాయలు కనిపించడంతో ఆ దేశం ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. మయ న్మార్, వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా, లావోస్‌ వియత్నాంలాంటిచోట్ల  జలవిద్యుత్, థర్మల్‌ విద్యుత్, ఓడరేవులు, రహదారులు తదితర ప్రాజెక్టుల్ని చేప ట్టింది. ఇవన్నీ ఆ దేశాలతో సంబంధబాంధవ్యాలు పెంచడంతోపాటు... దాని ఆర్థిక వ్యవస్థకు అమెరికా, యూరప్‌ దేశాలనుంచి ఎదురైన సవాళ్లను అధిగమిం చడానికి కూడా తోడ్పడ్డాయి.

పర్యవసానంగా తన కార్యక్షేత్రాన్ని మరింత విస్తరించి ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించడానికి చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. తయారీ రంగంపై ఆధారపడటం క్రమేపీ తగ్గించుకుంటూ తనకున్న పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) సామర్థ్యంతో రూపకల్పన, నవీకరణ రంగాల్లో సత్తా చాటే దిశగా దృష్టి పెట్టా లని నిర్ణయించింది. ఇదంతా నెరవేరాలంటే చైనా మరింత బలోపేతం కావాలి. దాని వార్షిక వృద్ధి రేటు 2021 వరకూ కనీసం 6.3 శాతానికి తగ్గకుండా ఉండాలి. అటు మౌలిక సదుపాయాల రంగంలో తనకున్న అపారమైన అను భవాన్ని విని యోగించుకోవడానికీ... దేశీయంగా సిమెంటు, ఉక్కు రంగాల్లో పేరు కుపోయిన నిల్వలను వదుల్చుకోవడానికీ ఈ ఓబీఓఆర్‌ ప్రాజెక్టు దానికి అక్కర కొస్తుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా 81,000 కిలోమీటర్ల హైస్పీడ్‌ రైల్వే లైన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇక రహదార్లు, పైప్‌లైన్ల ఏర్పాటు సరేసరి. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో సంబంధిత దేశాలన్నీ సమర్ధవంతంగా పాలుపంచుకో గలగాలి. ప్రాజెక్టు సాగే పలు దేశాల్లో రాజకీయ అస్థిరతలు రివాజు. ఉగ్రవాదం బెడద అధికం. చాలా దేశాలకు అప్పు తీర్చడంలో ఏమంత మంచి పేరు లేదు. దానికితోడు అవినీతి చీడ ఎక్కువ. ఆచరణలో ఇలాంటి సమస్యలెన్నో ఉంటాయి. ఇవి ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావడానికి అవరోధాలుగా నిలుస్తాయి.

ఆగ్నేయాసియా దేశాల్లో మౌలిక సదుపాయాల రంగం ప్రాజెక్టుల్లో గడించిన అనుభవాలతో వీటన్నిటినీ సునాయాసంగా ఎదుర్కొనగలనని చైనా విశ్వసిస్తోంది. ప్రాజెక్టు అనుకున్నట్టు పూర్తయితే మన దేశానికి సైతం ఎన్నో ఉపయోగాలుం టాయనడంలో సందేహం లేదు. ఆగ్నేయాసియా, యూరప్‌ దేశాలతో నేరుగా సంబంధాలు ఏర్పటానికి, మన మార్కెట్‌ విస్తరణకు సహజంగానే ఇది దోహద పడుతుంది. ప్రాజెక్టులో పాలుపంచుకుంటే మన ముంబై నుంచి ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ మీదుగా రష్యాలోని మాస్కో వరకూ వాణిజ్య బంధం ఏర్పడు తుంది. అయితే మన దేశ సార్వభౌమత్వాన్ని గుర్తించని ఏ ప్రాజెక్టులోనైనా పాలుపంచుకోవడం మనకు సాధ్యం కాదు. ఓబీఓఆర్‌లో భాగమైన చైనా పాకిస్తాన్‌ కారిడార్‌ (సీపీఈసీ) తీరూ తెన్నూ ఎలా ఉంటాయో చైనా ఇంకా చెప్పడం లేదు. అది వివాదాస్పద కారకోరం రహదారి, ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ల మీదుగా ఉంటుందన్నది అర్ధమవుతూనే ఉంది.

ఈ ప్రాజెక్టును ఆమోదించడమంటే పరోక్షంగా దురాక్రమణలకు సాధికారత కల్పించినట్టవుతుందని మన దేశం చేస్తున్న వాదన సహేతుకమైనదే. ఖండాంతరాల్లోని దేశాలను అను సంధానిస్తామంటూ ఇరుగు పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని విస్మరించడం ఎంతవరకూ సరైందో చైనాయే ఆలోచించుకోవాలి. అతి పెద్ద మార్కెట్‌ భారత్‌ను విస్మరించి నిర్మించే ఏ ప్రాజెక్టు అయినా ఆచరణలో మెరుగైన ఫలితాన్నివ్వదు. ఈ సంగతి గుర్తించి మనతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం చైనాకు తప్పనిసరి.

Advertisement
Advertisement