కాలుష్యంపై యుద్ధం | Sakshi
Sakshi News home page

కాలుష్యంపై యుద్ధం

Published Fri, Oct 28 2016 11:56 PM

కాలుష్యంపై యుద్ధం - Sakshi

ఇతర పండుగలతో పోలిస్తే దీపావళికి ఓ ప్రత్యేకత ఉంటుంది. చీకటి ఆకాశానికి రంగుల వెలుగులు అద్ది అందరూ మురిసే పండుగది. పర్యావరణ చైతన్యం పెర గడం వల్ల కావొచ్చు... శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం వగైరాలు కలిగిస్తున్న చేటు గురించి మరింత స్పష్టత రావడంవల్ల్ల కావొచ్చు–ఈ పండుగ సమయంలోనే కాలుష్యానికి దోహదపడవద్దన్న వినతులు ఎక్కువగా వినిపిస్తాయి. ఈమధ్యే అంత రిక్షం నుంచి భూగోళాన్ని చూసిన వ్యోమగామి స్కాట్‌ కెలీ భారత్, చైనాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉన్నట్టు సాధారణ కంటికి కూడా స్పష్టంగా కనబడిందని చెప్పాడు. అతడు ఏడాదిపాటు అంతరిక్ష నౌకలో గడిపి వచ్చాడు.

నెలక్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వాయు కాలుష్యం గురించి దిగ్భ్రాంతికరమైన అంశా లను వెల్లడించింది. నిర్ధారించిన ప్రమాణాల పరిమితికి మించిన వాయు కాలు ష్యంలో ప్రతి పదిమందిలోనూ తొమ్మిదిమంది మగ్గుతున్నారని తేల్చిచెప్పింది. ప్రపంచ జనాభాలో అధిక శాతం కాలుష్య కాసారాలుగా మారిన నగరాల్లో నివ సిస్తున్నారని మనం నిత్యం పీల్చే గాలి సల్ఫేట్‌లనూ, నైట్రేట్‌లనూ, కర్బనాలనూ, కాడ్మియం, పాదరసం వంటి అత్యంత ప్రమాదకర పరణువులను మోసుకొస్తున్న దని, ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నదని వివరించింది. చైనా, భారత్‌ లతోపాటు తూర్పు యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ కాలుష్యం బెడద అధికంగా ఉన్నదని తెలిపింది.

వాయు కాలుష్యం వల్ల కలుగుతున్న ముప్పు అంతా ఇంతా కాదు. గుండె పోటు, ఊపిరితిత్తుల కేన్సర్, నవజాత మరణాలు తదితర సమస్యలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా నిరుడు మన దేశం వచ్చినప్పుడు ఢిల్లీలో ఆయన సిబ్బంది బస చేసినచోట అమర్చడానికి అమెరికా రాయబార కార్యాలయం 1,800 ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ను కొనుగోలు చేసినప్పుడు పలువురు రాజకీయ నాయకులు నొచ్చుకున్నారు. ఢిల్లీలో కాలుష్యం ఉన్నమాట నిజమేగానీ... అది బీజింగ్‌ నగరం స్థాయిలో లేదని చెప్పారు. అమెరికా రాయబార కార్యాలయం ఢిల్లీని కాలుష్య నరకంగా చిత్రీకరించడానికి ప్రయత్నించిందని విమర్శించారు. కానీ గత ఆదివారం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదిక చూస్తే గుండె చెరువ వుతుంది. వాయు నాణ్యత సూచీలో ఢిల్లీ 318 పాయింట్ల వద్ద ఉన్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఆ సూచీ ప్రకారం ఏ ప్రాంతమైనా 300 పాయింట్ల స్థాయిని దాటితే దాన్ని ‘రెడ్‌ జోన్‌’గా పరిగణిస్తారు. అంటే కాలుష్యపరంగా అది అత్యంత అధమ స్థాయిలో ఉన్నట్టు లెక్క.

ఢిల్లీ నగరంలో మనిషి ఆయుః ప్రమాణం 6.4 ఏళ్లు తగ్గిం దని శాస్త్రవేత్తల అంచనా. వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే పరమా ణువులు శ్వాసకోశ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. కాలుష్యం వల్ల కలిగే అనర్ధాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి, దాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొని నిరుడు ఢిల్లీ, హైదరాబాద్‌లతోపాటు దేశంలోని 10 నగ రాల్లో వాయు కాలుష్యాన్ని తెలిపే జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లను ఏర్పాటు చేసింది. వీటిని నెలకొల్పడంలో వెనకున్న ఉద్దేశం మంచిదే. పీల్చే గాలి ఎంత ప్రమాదకరంగా ఉన్నదో తెలిస్తే వాహనాల కాలుష్యంపైనా, కాలుష్య కారక పరిశ్రమలపైనా అందరి దృష్టీ పడుతుందని... రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిళ్లు పెరిగి కాలుష్య నియంత్రణకు సంబంధించిన కార్యాచరణ మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ దానివల్ల పెద్దగా ఫలితం ఉన్న దాఖలా కనబడదు. 

మన నేతలకు నగరాలంటే మహా మోజు. అభివృద్ధి పేరిట సాగించే కార్యకలా పాలన్నిటినీ అక్కడే కేంద్రీకరిస్తున్న కారణంగా ముప్పు ముంచుకొస్తోంది. పొగ, దుమ్ము వగైరాల్లో కేన్సర్‌ కారక కార్సినోజిన్‌లు విశేషంగా ఉంటున్నాయని అంత ర్జాతీయ కేన్సర్‌ పరిశోధనా సంస్థ ఆమధ్య ప్రకటించింది. వాహనాల రద్దీ పెరిగి, పరిశ్రమల కాలుష్యం విస్తరించి నగరాలు నరకాలవుతున్నాయి. పల్లెసీమల్లో ఉపాధి అవకాశాలు క్షీణించి, పొట్ట నింపుకోవడానికి నగరాల బాట పడుతున్న లక్షలాది మందిని ఈ కాలుష్య భూతం కాటేస్తోంది. మన దేశంలో వివిధ నగరాల్లో వాయు నాణ్యత గురించి ఆరా తీస్తే పట్నా, లుధియానా, బెంగళూరు, కాన్పూర్, లక్నో, అలహాబాద్‌ వంటిచోట్ల పౌరులు మృత్యువును ఆఘ్రాణిస్తున్నారని తేలింది.

ఇటీవలికాలంలో మన దేశంలో పెను వేగంతో అభివృద్ధి చెందిన నగరం బెంగళూరు. అభివృద్ధి కార్యకలాపాలన్నీ ఆ నగరంలోనే కేంద్రీకరించడం వల్ల పచ్చదనం హరించుకుపోవడమే కాదు...పరిశ్రమలు విడిచే కర్బన ఉద్గారాలవల్ల పర్యావరణం నాశనమైంది. జనాభా అనూహ్యంగా పెరగడం వల్ల వాహనాల రద్దీ ఎక్కువై అది మరింత క్షీణించింది. నిరుడు ఆ నగరంలో నిర్వహించిన సర్వేలో అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవన సముదాయాలు, మురికివాడల కోసం 98 శాతం సరస్సులు ఆక్ర మణలకు గురయ్యాయని తేలింది. మన హైదరాబాద్‌తోసహా ఏ నగరం చరిత్ర చూసినా ఇలాగే ఉంటుంది. ఇన్ని అనర్థాలు జరిగాయని తేలాక కూడా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మాణం కోసం మూడు పంటలు పండే సుక్షేత్రాలను నాశనం చేసే పనికి పూనుకున్నారు. 
 
కార్పొరేట్‌ సంస్థల, వాహన తయారీ పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే విధాన రూపకర్తల వల్లే సమస్యంతా ఉత్పన్నమవుతోంది. నగరాల్లో వాయు నాణ్యత సూచీలు పెట్టడం వరకూ బాగున్నా... ఆ కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎఫ్‌ఎం చానెళ్ల ద్వారా మెట్రో రైళ్లు, సిటీ బస్సులు, కార్లు వగైరాల్లో ప్రయాణిస్తున్నవారందరికీ తెలిసే ఏర్పాటు చేయాలి. ఆ సూచీ వెల్లడిస్తున్న అంశం ఏ స్థాయిలో ఆరోగ్యానికి ముప్పు కలిగించగలదో వివరించాలి. వాయు కాలుష్యం వల్ల కలిగే అనర్ధాలను గ్రహిస్తే పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రజా రవాణా వ్యవ స్థను మెరుగుపరచడం వల్ల ప్రైవేటు వాహనాల వినియోగం అదుపులోనికి వస్తుంది. పర్యవసానంగా ట్రాఫిక్‌ రద్దీ తగ్గడమే కాదు... వాయు కాలుష్యం అదుపులోకి వస్తుంది. ఈసారి శీతాకాలంలో చలిగాలుల తీవ్రత హెచ్చుగా ఉండొచ్చునని అంచనాలున్న నేప థ్యంలో కాలుష్య నియంత్రణపై పాలకులు దృష్టి సారించాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement