వజ్రసమానుడు! | Sakshi
Sakshi News home page

వజ్రసమానుడు!

Published Tue, Jun 7 2016 12:13 AM

వజ్రసమానుడు! - Sakshi

నిజమైన వీరులు నిత్యం ప్రకాశిస్తూనే ఉంటారు. మరణానంతరమూ జనానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. శనివారంనాడు కన్నుమూసిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ అలాంటి వీరుల్లో అగ్రభాగాన ఉంటాడు. సర్వకాలాల్లోనూ తానే మొనగాడినని సగర్వంగా ప్రకటించుకోవడమే కాదు... బతికినన్నాళ్లూ అందుకు తగ్గట్టుగా జీవించాడు. అందులోని సందేశాన్ని అందుకోమని ప్రపంచానికి సవాల్ విసిరాడు. రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం బాక్సింగ్ రింగ్‌ను ఏలినప్పుడైనా... గత మూడున్నర దశాబ్దాలుగా దానికి దూరంగా ఉంటున్నా జనహృదయాల్లో అలీకి శాశ్వతమైన స్థానం దక్కడంలోని రహస్యం అదే. దృఢమైన దీక్ష, అంకితభావం ఉంటే...మెలకువలను గ్రహించే నేర్పు పట్టుబడితే... వాటికి సృజనాత్మకత తోడైతే అశేష ప్రజానీకాన్నీ అబ్బురపరచడం, విస్మయానికి గురిచేయడం, మోహావేశంలో ముంచెత్తడం ఏ రంగంలోని వారికైనా సాధ్యమయ్యే పనే. కానీ అలీని చిరస్థాయిగా నిలిపినవి ఇవి మాత్రమే కాదు... అంతకుమించి ఆయనలో అశేష మానవాళిపై ఉన్న ప్రేమ, అందుకోసం దేన్నయినా ఎదిరించే తెగువ, ఆ క్రమంలో పొంచి ఉండే ప్రమా దాలను లెక్కచేయని ధీరోదాత్తత అలీని విశిష్ట వ్యక్తిగా నిలిపాయి.

పన్నెండేళ్ల వయసులో తనకెంతో ఇష్టమైన సైకిల్‌ను పోగొట్టుకున్నప్పుడు కలిగిన ఆగ్రహం అప్పటికి కాసియస్ మార్సెలస్ క్లే గా ఉన్న అలీని యాదృ చ్ఛికంగా రింగ్‌లోకి నడిపిస్తే ఆ తర్వాత ప్రత్యర్థులను హడలెత్తించే గర్జనలు, కుంభవృష్టిని తలపించే ముష్టిఘాతాలు, మెరుపులా కదిలే నేర్పు బాక్సింగ్ క్రీడలో ఆయనను అంచెలంచెలుగా ఎదిగేలా చేశాయి. 22 ఏళ్ల వయసుకే ఆయనను ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిపాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూక్తిని అలీ ఏనాడూ విశ్వసించలేదు. ఆయన వ్యక్తిత్వానికది అతికే విషయం కాదు. కనుకే ‘నేను గొప్పవాడిని మాత్రమే కాదు...అంతకంటే ఎక్కువే’ అని ప్రకటించుకోగలిగాడు. ‘నన్ను ఓడించినట్టు కలగన్నా సరే... వెంటనే లేచొచ్చి నాకు క్షమాపణ చెప్పడం మంచిది’ అనగలిగాడు. అలీయే ఒదిగి ఉంటే పీడిత ప్రజానీకం ఆయనలో ఒక మానవహక్కుల చాంపియన్‌ను.. వివక్షను ప్రశ్నించే సాహసిని...తమ కోసం కడదాకా పోరాడే యోధుణ్ణి గుర్తించగలిగేది కాదు.

నిరసనకూ, తిరుగుబాటుకూ, ధిక్కారానికీ మొహమ్మద్ అలీ ప్రతీక. ప్రతి జవాబునూ ప్రశ్నించడం ఆయన తత్వం. చిన్న వయసులోనే ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ టైటిల్ గెల్చుకుని ప్రపంచమంతా తన పేరు మార్మో గుతున్న దశలోనే ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నట్టు ప్రకటించుకుని, ఇకపై తన పేరు మొహమ్మద్ అలీ అని చాటడం ఈ నైజం పర్యవసానమే.బానిసత్వాన్ని పారదోలామని చెప్పుకుంటున్నా ఆచరణలో అడుగడుగునా నల్లజాతీయులను హీనంగా చూస్తున్న అమెరికా సమాజానికి అదొక షాక్ ట్రీట్‌మెంట్. ‘బండరాతిని హత్య చేశాను. కొండను గాయపరిచాను. ఔషధానికే రోగం తెప్పించాను...’ అంటూ ఒక మ్యాచ్ గురించి చెప్పినట్టుగానే ఎంతో బలిష్టమైన రాజ్యవ్యవస్థను ఆయన ఒంటిచేత్తో ఎదుర్కొన్నాడు. దాని అధికార మదాన్ని తుత్తినియలు చేశాడు. వేల మైళ్ల దూరంలోని చిరు దేశం వియత్నాంపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్న వేళ సైన్యంలోకి రావాలని పిలుపొచ్చినప్పుడు దాన్ని తిరస్కరించడం ఒక్క అలీకే చెల్లింది. వియత్నాం పౌరులెవరూ ఏనాడూ తనను ‘నిగ్గర్’గా పిలవలేదని, అలా పిలిచే తెల్లదొరల కోసం వారిపై బాంబులెందుకు వేయాలని నిలదీశాడు. యుద్ధం సాగుతున్న సమయంలో దేశభక్తి ఉన్మాద స్థాయికి ముదురుతుందని తెలిసినా,... అది తన కెరీర్‌కు ముప్పు తేవచ్చునని, లక్షల డాలర్లు కోల్పోవాల్సి రావచ్చునని అర్ధమైనా... తిరస్కరించడం శిక్షార్హమైన నేరమవుతుందని రూఢీ అయినా అతడు వెరవలేదు. ‘ఏం చేసుకుంటారో చేసుకోండ’న్నాడు.

 

 తన తపనంతా బాక్సింగ్ క్రీడలో అమెరికాను శిఖరాగ్రాన నిలబెట్టడమేనని ప్రకటించి ఉన్న అలీని రాజ్యం వేటకుక్కలా వెంటాడింది. ఆయనకు అప్పటికే వచ్చిన ప్రపంచ టైటిల్‌ను రద్దు చేయించింది. అంతటితో ఆగక బాక్సింగ్ లెసైన్స్‌నే ఎగరగొట్టింది. సైన్యంలో చేరడానికి తిరస్కరించిన నేరానికి  జైలు శిక్ష కూడా పడింది. ఇదంతా దారుణం, దుర్మార్గమని ప్రకటించి న్యాయస్థానాల్లో అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచాడు. సుప్రీంకోర్టు 8-0 మెజారిటీ తీర్పుతో మొహమ్మద్ అలీపై తీసుకున్న చర్యలన్నీ చెల్లవని ప్రకటించింది. ఈ క్రమంలో మూడేళ్లపాటు సరైన ప్రాక్టీస్ లేకపోయినా పడి లేచిన తరంగంలా రింగ్‌లో మళ్లీ విజృంభించి తనకెదురులేదని నిరూపించుకున్నాడు అలీ. తన కెరీర్‌లో ఎదుర్కొన్న 29,000 పంచ్‌ల పర్యవసానంగా సంప్రాప్తించిన పార్కిన్సన్ వ్యాధితో అలుపెరగని పోరాటం చేస్తూనే సమకాలీన సమాజంలోని దురన్యాయాలను నిలదీశాడు. దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టాలన్న అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాడు. ఇస్లాం మౌలిక సూత్రాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ మతానికి చెడ్డపేరు తెస్తున్న ఉగ్రవాద ధోరణులపై అందరూ పోరాడాలని పిలుపునిచ్చాడు.

 

 చరిత్ర పుటలు తిరగేస్తే ప్రపంచ దేశాల్లో ప్రజల పక్షాన దృఢంగా నిలబడిన, అన్యాయాన్ని ప్రశ్నించిన, పోరాడిన మేధావులు, రచయితలు, కళాకారులు 60, 70 దశకాల్లో ఎక్కువగా తారసపడతారు. మొహమ్మద్ అలీ ఆ కోవలోని వాడు. కాలం మారింది. ఇప్పుడా వారసత్వం క్రమేపీ కొడిగడుతోంది. కాస్త పేరొస్తే ఏదో ఉత్పత్తికి ప్రచారకర్తగా మారి లక్షలు గడించాలనుకునే సెలబ్రిటీల కాలమిది. అవసరాన్నిబట్టి అభిప్రాయాలను మార్చుకోవడం, వీలైతే దాచుకోవడం అల వాటైన కాలమిది. ఇలాంటి పాడుకాలంలో అలీ వంటి ఆదర్శప్రాయుల, ధీశాలుర తలబోతలు సమాజానికి ఎంతగానో తోడ్పడతాయి.

Advertisement
Advertisement