‘పెండింగ్’ తీరేదెలా? | Sakshi
Sakshi News home page

‘పెండింగ్’ తీరేదెలా?

Published Tue, Apr 26 2016 1:07 AM

‘పెండింగ్’ తీరేదెలా? - Sakshi

అందరికీ తెలిసిన సమస్యే అయినా దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఒక ప్రధాన అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ భావోద్వేగ ప్రసంగంతో మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశాన్ని ఆదివారం ప్రారంభిస్తూ ఆయన ఒకటికి రెండుసార్లు కంటతడి పెట్టుకున్నారు. దేశంలో జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్య లేదని, ఈ విషయంలో ఎన్నిసార్లు పాలకులకు విన్నవించుకున్నా నిరుపయోగమవుతున్నదని ఆవేదనపడ్డారు.

ఏటా ఇలాంటి సమావేశాలు జరగడం, సమస్యల గురించి చర్చించడం...పాలకులు ఏవో హామీలివ్వడం షరా మామూలే. కానీ క్రియకొచ్చేసరికి ఏమీ జరగడం లేదు. జస్టిస్ ఠాకూర్ చెప్పినట్టు పది లక్షలమంది జనాభాకు 10మంది న్యాయమూర్తులుండగా ఆ సంఖ్యను 50కి పెంచాలని 1987లో లా కమిషన్ సిఫార్సుచేసింది. మూడేళ్లక్రితం ఇలాంటి సదస్సే జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్...ప్రతి పది లక్షలమందికీ 15.5మంది జడ్జీలున్నారని లెక్కలు చెప్పారు. దీన్ని పెంచాల్సి ఉన్నదని కూడా అన్నారు. అలా అన్నాక కూడా ఈ విషయంలో ఆయన ప్రభుత్వం చేసిందేమీ లేదు.
 
చూడటానికి ఈ సమస్య ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య సాగుతున్న వివాదంగా కనిపిస్తుందిగానీ ఇందువల్ల ఇబ్బందులు పడుతున్నది అసంఖ్యాకులైన పౌరులు. న్యాయం పొందడానికి వారికి గల హక్కు అను నిత్యం ఉల్లంఘనకు గురవుతోంది. న్యాయస్థానాల్లో ఏళ్లతరబడి కేసులు అతీగతీ లేకుండా పెండింగ్ పడుతుంటే కోట్లాది కుటుంబాలు దిక్కుతోచక విలపిస్తున్నాయి. అది సివిల్ స్వభావమున్నా కేసా...క్రిమినల్ కేసా అన్న అంశంతో నిమిత్తం లేదు. ఏ కేసైనా కోర్టు గడప తొక్కితే ఏళ్ల తరబడి అనిశ్చిత స్థితి ఏర్పడుతోంది. సకాలంలో విచారణ జరిగితే పడే శిక్షాకాలానికి మించి అనేకమంది నిందితులు జైలు గోడల వెనక మగ్గుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా కేసు ఇందుకు తాజా ఉదాహరణ. ఆయనపై ఉన్న రాజద్రోహం కేసులో కనీసం రెగ్యులర్ బెయిల్ లభించడానికే రెండున్నరేళ్లు పట్టింది.

మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితులు నిర్దోషులని రుజువు కావడానికి అయిదేళ్ల సమయం పట్టింది. సల్మాన్‌ఖాన్ ప్రమేయం ఉన్న కేసులు దశాబ్దాల తరబడి సాగుతూనే ఉన్నాయి. సివిల్ కేసులు కావొచ్చు...క్రిమినల్ కేసులు కావొచ్చు ఇలాంటివి కింది కోర్టుల్లో 2.70 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టుల్లో 38 లక్షలు, సుప్రీంకోర్టులో 60,000కుపైగా కేసులు తేల్చాల్సినవి ఉన్నాయి. ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా న్యాయమూర్తులుండాలనుకుంటే తక్షణం 40,000మందిని నియమించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెబుతున్నారు. ప్రస్తుతం 16,238మంది న్యాయమూర్తులుండగా, మంజూరై భర్తీ కాకుండా ఉన్న పోస్టుల సంఖ్య 21,301. ఫలితంగా  న్యాయమూర్తులపై పనిభారం అపారంగా పెరుగుతోంది. ఉన్న కేసులు అలాగే ఉండగా రోజురోజుకూ కొత్త కేసులు వచ్చి చేరుతున్నాయి.
 
పౌరులకు త్వరితగతిన న్యాయం అందించడానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో 2000 సంవత్సరంలో 1,734 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేశారు. ఈ కోర్టులకయ్యే వ్యయభారాన్ని రాష్ట్రాలపైనే మోపాలని 2011లో కేంద్రం నిర్ణయించడంతో వాటిలో దాదాపు 60 శాతం మూతబడ్డాయి. వాస్తవానికి ఏ రాష్ట్రమైనా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల కోసం ఖర్చు చేయాల్సింది తమ బడ్జెట్ వ్యయంలో 0.01 శాతం మాత్రమే. అయినా ఈమాత్రం వ్యయాన్ని భరించడానికి అవి సిద్ధపడలేదు. 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కొన్ని మళ్లీ ఊపిరి పోసుకున్నాయి.

నిరుడు విడుదలైన లెక్కల ప్రకారం వాటి సంఖ్య 473. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల వల్ల అనుకున్న ప్రయోజనాలు పెద్దగా నెరవేరడం లేదని నిపుణులు చెబుతారు. ఢిల్లీ ఉదాహరణే తీసుకుంటే అత్యాచారాల కేసుల విచారణ కోసం అక్కడ ఏర్పాటైన 9 కోర్టుల్లో గత మూడున్నరేళ్లుగా 93 శాతం కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి! కనుక సమస్యకు సంబంధించిన మూలాలు మరెక్కడో ఉన్నాయని అర్ధమవుతుంది. కేసుల దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ సక్రమంగా లేకపోవడం...వాయిదాలివ్వడంలో ఉదారంగా వ్యవహరించడంవంటివి కూడా కేసుల పెండింగ్‌కు కారణమవుతున్నాయి.
 
అన్నిటికన్నా ప్రధానమైంది ప్రభుత్వాల నిర్లిప్తత. అత్యధిక కేసుల్లో ప్రధాన కక్షిదారుగా ప్రభుత్వమూ లేదా దాని అనుబంధ సంస్థలే ఉంటాయి. న్యాయస్థానాల్లో తాము నడిపిస్తున్న కేసుల్లో నిజంగా విచారణార్హమైనవెన్నో, కోర్టు వెలుపల సులభంగా పరిష్కరించుకోదగినవెన్నో, నిరర్ధకమైనవెన్నో సరిచూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కానీ ఆ బాధ్యత నుంచి అవి తప్పుకుంటున్నాయి. ఒక కేసు కొనసాగితే ప్రభుత్వానికి లేదా సమాజానికి ఒనగూడే ప్రయోజనమేమిటో...వెనువెంటనే పరిష్కారం చేసుకుంటే ఖజానాకు కలిగే ఆదా ఎంతో సమీక్షించేవారు లేరు. ఏళ్ల తరబడి కేసులు సాగుతూనే ఉన్నా కారణమేమిటో తెలుసుకునేవారుండరు. ఈ వైఖరి కూడా పెండింగ్ కేసుల సంఖ్యను పెంచుతోంది.
 
న్యాయవ్యవస్థ పరంగానూ లోపాలున్నాయి. కేవలం ప్రచారాన్ని ఆశించి లేదా రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించి దాఖలు చేస్తున్న కేసుల్ని స్వీకరణ దశలోనే కొట్టేయాల్సి ఉండగా ఆ పని సమర్ధవంతంగా జరగటం లేదు. ఆ పేరు మీద కొన్ని నిజమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఎగిరిపోతున్నాయి. కోర్టులకుండే సెలవుల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్లోనూ వాస్తవముంది. సుప్రీంకోర్టు వరకూ చూస్తే నెల్లాళ్లకుపైగా వేసవి సెలవులు...దసరా, దీపావళివంటి పండుగలకు ఆరేసి రోజుల సెలవులు...పది పన్నెండు రోజుల క్రిస్మస్ సెలవులు ఉంటాయి. ఇతరత్రా ప్రభుత్వ సెలవు దినాలు వీటికి అదనం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పోల్చినా ఇవి బాగా ఎక్కువ.

2009లో జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్ నేతృత్వంలోని లా కమిషనే ఈ సెలవుల సంగతి ప్రస్తావించి, తగ్గించుకోవాలని సూచించింది. ప్రధాన సమస్య అయిన న్యాయమూర్తుల నియామకంతోపాటు ఇలాంటి చిన్న చిన్న అంశాలను కూడా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. జస్టిస్ ఠాకూర్ ఈ అంశాన్ని లేవనెత్తిన తీరు చూశాకైనా సమస్యపై పాలకులు దృష్టి సారిస్తారని, దీనికొక శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించాలి.
 

Advertisement
Advertisement