గల్ఫ్ నిర్వాసితులకు ఆత్మీయ స్వాగతం | Sakshi
Sakshi News home page

గల్ఫ్ నిర్వాసితులకు ఆత్మీయ స్వాగతం

Published Sat, Sep 9 2017 2:24 PM

గల్ఫ్ నిర్వాసితులకు ఆత్మీయ స్వాగతం - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఒమన్ దేశంలో ఉద్యోగాలు కోల్పోయి తిరిగి స్వదేశానికి వచ్చిన గల్ఫ్ వలస కార్మికులకు ప్రొటోకాల్ అధికారులు, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నంగి దేవేందర్ రెడ్డి, డా. అస్మాఖాన్ లు శనివారం ఉదయం ఎయిర్‌ పోర్టులో ఆత్మీయ స్వాగతం పలికారు. ఒమన్‌ లో పెట్రాన్ గల్ఫ్ అనే కంపెనీ మూసేయడం వలన 50 మంది తెలంగాణ కార్మికులు రోడ్డున పడ్డారు. వీరిలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన బాలపెల్లి గంగారెడ్డి, కరీంనగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన బింగి రవి అనే ఇద్దరు కార్మికులున్నారు.

ఇండియన్ ఎంబసీ సహాయంతో ఉచితంగా విమాన ప్రయాణ టికెట్లు పొందిన వీరు హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరు హైదరాబాద్ నుండి స్వగ్రామాలకు చేరుకోవడానికి తెలంగాణ ఎన్నారై అధికారి చిట్టిబాబు బస్ చార్జీలు అందించారు. జీతం బకాయిలు, గ్రాట్యుటీ కలిపి ఒక్కొక్కరు రూ. 3 లక్షలు నష్టపోయి ఇంటికి చేరారని, ప్రభుత్వం వీరికి పునరావాసం కల్పించాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నంగి దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కంపెనీ యాజమాన్యం నుండి బకాయిలను రాబట్టుకోవడానికి కార్మికులు లేబర్ కోర్టులో కేసు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో న్యాయ సహాయం చేయాలని ఆయన కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement