వైఎస్సే ఉంటే ఇలా జరిగేదా? | Sakshi
Sakshi News home page

వైఎస్సే ఉంటే ఇలా జరిగేదా?

Published Wed, Nov 16 2016 1:03 AM

వైఎస్సే ఉంటే ఇలా జరిగేదా? - Sakshi

కొమ్మినేని శ్రీనివాసరావుతో  సీనియర్‌ కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్‌
వైఎస్‌ జగన్‌ని కంట్రోల్‌ చేయాలని ఉన్నవీ లేనివీ అన్నీ అసాధారణ కేసులు పెట్టించి డీమోరలైజ్‌ చేసేస్తే మళ్లీ సరెండర్‌ అయిపోతాడని అందరూ అను కున్నారు. కానీ వైఎస్సే మొండోడు అనుకుంటే ఆయన కంటే మొండోడు జగన్‌. సరెండర్‌ కాదు కదా, ఇంకా మొండెక్కిపోయాడాయన. మొండి వాడిని జగమొండిని చేసినట్లయిపోయింది పరిస్థితి.

ఒకే ఒక వ్యక్తి (వైఎస్‌ఆర్‌) ఉన్నట్లుండి పోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రం చరిత్రే మారి పోయిందని హైదరాబాద్‌ నగర కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్‌ అంటున్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తన నావను తానే ముంచుకుందని, ఒక రాష్ట్ర భవిష్యత్తు వంటి కీలక నిర్ణయంపై అధిష్టానానికి తప్పుడు రిపోర్టు ఇస్తే ఆ నష్టాన్ని ఇప్పుడు పార్టీ మొత్తంగా అనుభవించాల్సి వస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌ విషయంలో అధిష్టానానికి విషం నూరిపోయ టంతో ఆయన పార్టీలోంచే బయటకు వెళ్లారని, ఇటు తెలంగాణలో అటు ఏపీలో తప్పుగా వ్యవహరించడమే కాంగ్రెస్‌ పార్టీకి పెను నష్టం కలిగించిందని వ్యాఖ్యానించారు. విభజన తప్పదని తేలాక ఒకటిన్నర సంవత్సరం ముందే ఏపీ, తెలంగాణలకు ఇద్దరు సీఎంలను నియమించి ఉంటే కాంగ్రెస్‌ పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్రకు తప్పుడు కలర్‌ ఇవ్వడమే కాంగ్రెస్‌ భంగపాటుకు కారణమైందంటూ దానం నాగేందర్‌ ‘‘మనసులో మాట’’లో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

కాంగ్రెస్‌ రాజకీయాలు సడన్‌గా ఇలా మారిపోయాయేమిటి?
రాజకీయాలు మారలేదండి. ఒక వ్యక్తి పోవడం వల్ల ఇంత తేడా వచ్చింది. వైఎస్‌. రాజశేఖరరెడ్డి ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఇలా అయ్యేది కాదు. ఒక్క వ్యక్తివల్లే, ఆయన లేక పోవడం వల్లే ఇంత దుస్థితి వచ్చిందనేది జనం మాట.

తెలంగాణ అంశంలో ఎవరు కరెక్ట్‌.. మీరా, అధిష్టానమా, కిరణా?
అధిష్టానానికి తెలంగాణ గురించి చెప్పేవాళ్లు తప్పు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఒకటిన్నర సంవత్సరానికి ముందు ఇచ్చి, కావలసిన ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది. రెండు రాష్ట్రాలను చేసి, వాటికి ఇద్దరిని ముఖ్యమంత్రులను చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. టీఆర్‌ఎస్‌కు కొంచెం శక్తి వచ్చినా, ఆం్ర«ధలో మేము దెబ్బతిన్నా.. పర్వాలేదు. అప్పటికే జగన్‌ వల్ల ఏపీలో కాంగ్రెస్‌కు నష్టమే. అక్కడ కాంగ్రెస్‌ రాదు. కనీసం ఇక్కడయినా పార్టీ అధికారం లోకి వస్తుందని అనుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం ముందే ఇచ్చేసి ఉంటే  ప్రచారం చేసుకునేవాళ్లం. కానీ ఆరుమాసాల ముందు ఇచ్చారు. మూడు మాసాల ముందు ప్రెసిడెంట్‌ రూల్‌ పెట్టారు. కాంగ్రెస్‌ తన నావను తానే ముంచుకుంది. మేం చేసిన తప్పుకు మేమే అనుభవించాల్సి వస్తోంది.  

జగన్‌నే సీఎంని చేయాలని 150 మంది ఎమ్మెల్యేలు లెటర్‌ ఇచ్చారు కదా?
ఆ రోజు జరిగిందేమిటంటే ‘జగన్‌ కొంచెం ఎక్సెంట్రిక్‌. మాట వినడు. ఎవరినీ కేర్‌ చేయడు. ఇప్పుడు జగన్‌ని సీఎం చేయొద్దు’ అని ఢిల్లీకి వెళ్లి విషం చిమ్మేశారు. జగనేంటి చిన్న పిల్లగాడు కదా. అప్పుడే సీఎం ఏంటి అని అడ్డుపుల్లలేశారు. కాంగ్రెస్‌కు అసలే పెద్ద చెవులు. ఎవరేది చెప్పినా దాని చెవుల్లోకి వెళ్లిపోతుంది. ఇంతమంది చెప్పగానే అమ్మో జగన్‌కి సీఎం పదవి ఇవ్వడం డేంజరా.. అనుకుని వ్యతిరేక నిర్ణయాలకు వచ్చే శారు. దాంతో తన ఉనికిని తాను కాపాడుకోవాలని జగన్‌ భావించారు. ‘ఓదార్పు యాత్రలో తప్పేముంది మేడమ్‌’ అని అడి గారు. జగన్‌ ఓదార్పు యాత్రకూ మావాళ్లు తప్పుడు భాష్యం చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement