పెళ్లి - చట్టబద్ధత | Sakshi
Sakshi News home page

పెళ్లి - చట్టబద్ధత

Published Thu, Jul 6 2017 4:36 AM

పెళ్లి - చట్టబద్ధత

ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో పడిన పెళ్లిళ్ల నమోదు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వివాహమైన నెలరోజుల్లోగా రిజిస్టర్‌ చేసుకోవడం, దాన్ని ఆధార్‌తో అను సంధానించడం తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని మంగళవారం లా కమిషన్‌ నివేదిక  సిఫార్సు సిఫార్సు చేసింది. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఆలస్యమైన పక్షంలో రోజుకు రూ. 5 చొప్పున జరిమానా వసూలు చేయాలని, గరిష్టంగా ఇది రూ. 100 ఉండాలని కూడా సూచించింది. మన సమాజంలో పెళ్లనేది ఇద్దరి జీవి తాలతోపాటు రెండు కుటుంబాలను ఏకం చేసే వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థలో మహిళలు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్నారు. దీనికి కుల, మత భేదాల్లేవు. ధనిక, బీద తారతమ్యం లేదు. చదువు, డబ్బు, ఉద్యోగం, హోదా వంటివేవీ ఆడదాన్ని ఈ వివక్ష నుంచి కాపాడలేకపోతున్నాయి.

ఇంటా, బయటా అను నిత్యం అనేక రూపాల్లో మహిళలపట్ల అమలవుతున్న వివక్షను పారదోలాలని ఐక్యరాజ్యసమితి సంకల్పించి దాదాపు నాలుగు దశాబ్దాలవుతోంది. అందుకు సంబంధించిన అంత ర్జాతీయ ఒడంబడికపై మన దేశం సంతకం చేసి ఈ నెలాఖరుకు 37 ఏళ్లు పూర్తవుతోంది. వివాహాల నమోదు తప్పనిసరి చేస్తూ ప్రతి దేశమూ చట్టం తీసు కురావాలని ఈ ఒడంబడిక చెబుతోంది. అయితే 1993లో ఆ ఒప్పందాన్ని ధ్రువీ కరించే సందర్భంగా పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తున్న ఒప్పందంలోని 16(2) అధికరణం ఆచరణ సాధ్యం కాదని మన దేశం చెప్పింది. భిన్న మతాలు, సంప్ర దాయాలు, అంతంతమాత్రంగా ఉన్న అక్షరాస్యత వగైరా కారణాల వల్ల భారత్‌ లాంటి సువిశాల దేశంలో ఇది కష్టమని వివరించింది. ఆ విషయంలో చేయ దల్చుకున్నదేమిటో మాత్రం చెప్పలేదు.

నిజానికిది తప్పించుకు తిరిగే ధోరణి. వివాహాల నమోదు లేకపోవడం సమస్యలు సృష్టిస్తున్నదా లేదా అని చూడాలి తప్ప అలా నమోదు చేయడం ఎందుకు అసాధ్యమో ఏకరువు పెట్టడం సమంజసం కాదు. నమోదు లేకపోవడం వల్ల జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు అన్యాయం జరుగుతున్నదను కుంటే.. ఎన్ని అవరోధాలనైనా అధిగమించి ఆ అన్యాయాన్ని సరిదిద్దడం ప్రభుత్వం బాధ్యత. సమాజం బాధ్యత. అదొక్కటే సమస్యకు పరిష్కారం కాదనుకుంటే దాంతోపాటు చేయాల్సినవేమిటో గుర్తించి అమలు చేయడమూ వాటి బాధ్యతే.  సకల జనామోదం పొందాకే చట్టాన్ని రూపొందిస్తామని, అంతవరకూ ఏ అన్యా యాన్నయినా చూసీచూడనట్టు వదిలేస్తామని అనడం సరైంది కాదు. హిందువుల్లో విడాకులకు వీలు కల్పించే హిందూ వివాహ చట్టం తీసుకొచ్చినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ, ఆనాటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్‌ అంబేడ్కర్‌ సంప్రదాయ వాదుల నుంచి ఎంతో ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. హిందూ సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేయదల్చుకున్నారని విమ ర్శలు వచ్చాయి. అయినా ఆ చట్టం వచ్చింది.

పెళ్లిళ్లను రిజిస్టర్‌ చేసే నిబంధన లేక పోవడం వల్ల ఆడదానికి జరుగుతున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కాదు. ఎన్నారై పెళ్లిళ్లలో ఇలాంటివి ఎక్కువుంటున్నాయి. బహుభార్యత్వం నేరమని చట్టం చెబు తున్నా అవివాహితుణ్ణని చెప్పి మోసగించి నలుగురైదుగురిని పెళ్లాడిన కేసులు అడపా దడపా బయటికొస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మనిషి చనిపోయాకే అతడికి వేరేచోట మరో కుటుంబం ఉన్నట్టు వెల్లడవుతుంటుంది. ఇలాంటపుడు పెళ్లయినట్టు సాక్ష్యం చూపలేక, భార్యగా గుర్తింపు లేక, వారసత్వ హక్కులు పొంద లేక, భరణం రాక మహిళలు రోడ్డున పడుతున్నారు.  ఒక్కోసారి పిల్లల కస్టడీ కూడా సమస్యవుతోంది. పెళ్లిళ్లపై అధికారిక రికార్డులు లేకపోవడం వల్ల మోసగాళ్లు సుల భంగా తప్పించుకుంటున్నారని 2005లో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ వెంటనే జాతీయ మహిళా కమిషన్‌ ఒక బిల్లు కూడా రూపొందించింది. మహారాష్ట్ర, గుజ రాత్, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేశాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో రాజ్యసభలో ఇందుకోసం బిల్లు పెట్టారు. అది ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో ప్రవేశపెట్టేలోగానే ఆ సభ కాస్తా రద్ద యింది. దాంతో బిల్లు మురిగిపోయింది.

దేశంలో ప్రధానమైన హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్సీ మతాలకు వేర్వేరుగా వైయక్తిక చట్టాలున్నాయి. 1872నాటి క్రైస్తవ వివాహ చట్టం, 1936నాటి పార్సీ వివాహచట్టం పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేశాయి. ముస్లిం వైయక్తిక చట్టం ప్రకారం నిఖానామాలో వివాహాన్ని కాజీ నమోదు చేస్తారు. 1955నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 8లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌ గురించి ఉన్నా మత విశ్వాసాల ప్రకారం పెళ్లి చేసుకున్నాక దాన్ని నమోదు చేయించుకోవడమా లేదా అన్నది ఆ జంటకే విడిచిపెట్టారు. ఏ మతానికీ సంబంధంలేని 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం ఉంది. అయితే హిందూ వివాహ చట్టం తప్పనిసరి చేయకపోవడం వల్ల అధిక సంఖ్యాకులు వివాహ నమోదు ప్రక్రియ జోలికే పోరు. ఈ నిబంధన ఉంటే బాల్య వివాహాల జోరు తగ్గుతుందని ఆశించేవారు కూడా ఉన్నారు. ప్రపంచ దేశాల్లో జరిగే బాల్యవివాహాల్లో 40 శాతం పైగా మన దేశంలోనే ఉన్నట్టు యునిసెఫ్‌ చెబుతోంది.

అయితే తప్పనిసరి నమోదు నిబంధన దానికదే సమస్యగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్టయితే అది మరిన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ నిబంధన సంగతి తెలియక వివాహ బంధంలో చిక్కుకున్నవారు అనంతరకాలంలో పెళ్లి చెల్లదన్న తీర్పువస్తే ఏం కావాలి? పిల్లలు, ఆస్తి, భరణం వగైరా అంశాల్లో వారికి లభించే న్యాయం ఏమిటి? పైగా ఇలా చేసే చట్టం మతాలకు అతీతంగా వర్తింపజేస్తూ రూపొందిస్తారా లేక ఇప్పటికే అలాంటి నిబంధన అమలవుతున్న మతాలను మినహాయిస్తారా? మినహాయించకపోతే అందువల్ల తలెత్తగల సమస్య లేమిటి? వీటన్నిటినీ అన్ని కోణాల్లోనూ ఆలోచించి, అందరి అభిప్రాయాలూ పరి గణనలోకి తీసుకుని పకడ్బందీగా ఈ చట్టాన్ని రూపొందించాలి. ఏం చేసినా మహి ళల శ్రేయస్సు, సంక్షేమం గీటురాయి కావాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement