అది గతం చేసిన గాయమే! | Sakshi
Sakshi News home page

అది గతం చేసిన గాయమే!

Published Thu, Jul 6 2017 4:42 AM

అది గతం చేసిన గాయమే! - Sakshi

కొత్త కోణం
మిగిలిన దళితేతరులు కూడా దళితులకు వ్యతిరేకంగా నిలబడి స్వభావాన్ని చాటుకున్నారు. ఇందులో ఎక్కువ కులాలకు భూమి లేకపోయినప్పటికీ, పేదరికంలో మగ్గుతున్నప్పటికీ దళితులను సమర్థించలేకపోయారు. కారంచేడు, చుండూరులలో జరిగింది కూడా ఇదే. దాడులకు ఆధిపత్య కులాలు నాయకత్వం వహించినప్పటికీ అన్ని కులాలు అందులో పాల్గొన్నాయనేది వాస్తవం. ఇది కుల వ్యవస్థ ముఖ్య లక్షణం. ఇది అంతం కాదు కూడా. కారణం –అంటరానితనం హిందూ సమాజం విద్వేషంతో విధించిన అమానుషమైన శిక్ష.

దేశం సగర్వంగా ప్రకటించుకునే భిన్నత్వంలోని ఏకత్వాన్ని కాపాడాలని భావించి ఉండకపోతే, దేశ సమగ్రతే అన్నింటికంటే ముఖ్యమని తలచి ఉండకపోతే, సర్వమానవ సమానత్వమే ఈ దేశానికి రక్ష అని భావించి ఉండనట్టయితే, దేశ ప్రజలను కాపాడగలిగేది యుద్ధం కాదు శాంతి మాత్రమేనని నమ్మి ఉండకపోతే డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ బౌద్ధాన్ని స్వీకరించి ఉండేవారు కాదు. ఇస్లాంలోనికో, క్రైస్తవ మతంలోనికో మారమని ఆయా మతాల పెద్దలు ఆహ్వానించారు. పదవులను కట్టబెడతామని ప్రతిపాదిం చారు. ఆయన తిరస్కరించారు. ఈ దేశానికున్న భిన్నత్వంలోని ఏకత్వాన్ని కాపాడుతూనే, 2,600 ఏళ్లనాడే సమానత్వ నినాదాన్నిచ్చిన బౌద్ధ తత్వాన్ని గుండెలకు హత్తుకున్నారు. ఈ దేశంలోని దళితులను కాపాడగలిగే బౌద్ధాన్ని ఒక మతంగా కాక, సమానత్వ భావనగా స్వీకరించారు. అందుకే ‘పుట్టుక నాకు సంబంధం లేనిది, హిందువుగా పుట్టినా హిందువుగా మరణించనని’ చెప్పారు. బుద్ధుడి మార్గాన్ని అనుసరించమని ఈ దేశంలో అస్పృశ్యులుగా, తరాలుగా వెలివేతకు గురై, దారిద్య్రంలో కూరుకుపోయిన దళితజనావళికి ప్రబోధించారు.

ఈ దృష్టితో అంబేడ్కర్‌ భావజాలాన్ని అర్థం చేసుకుంటే ఆయన కేవలం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల కోసం, కొన్ని సంస్కరణల కోసం మాత్రమే కృషి చేశాడనే సంకుచితత్వం నుంచి బయటపడతాం. మనం గౌరవించే జాతీయనాయకులందరికన్నా కూడా దేశం కోసం అంబేడ్కర్‌ చేసిన కృషి ఎన్నో రెట్లు ఎక్కువ. అటువంటి మహనీయుడి విగ్రహ ప్రతిష్టను అడ్డుకొని, దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం కుల దురహంకారానికి పరాకాష్ట. అడుగంటిన ప్రజాస్వామ్య భావజాలానికి నిదర్శనం.

విగ్రహానికీ అంటరానితనమేనా!
అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమని చెప్పుకుంటున్న మన దేశంలో, మన తెలుగు రాష్ట్రంలో ఒక ఊరు ఊరునే వెలివేసి, వెలివాడను చేసిన దారుణం నెల తరువాతగాని వెలుగులోనికి రాలేదు. నెలరోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ అకృత్యాన్ని పెద్దగా పట్టించుకున్నదీలేదు. నిజానికి మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ వెలివేతలు కొత్తకాదు. అది మాట్లాడుకునే ముందు అక్కడసలేం జరిగిందో పరిశీలిద్దాం! పాలకోడేరు మండలం గరగపర్రులో మాలపేటకు చెందినవాడు ఎరిచెర్ల రాజేశ్‌ (31). ఈ దళిత యువకుడు ఆ ఊరు భూస్వామి ముదునూరి నాగరాజు దగ్గర రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. తండ్రి పెంటయ్య, సుబ్బన్న ఇదే భూమిలో కౌలు చేశారు. రెండు పంటలకు దాదాపు 90 బస్తాల వరి పండితే, 30 బస్తాలు భూస్వామికి ఇవ్వాలి. రెండు పంటలకు దాదాపు రూ. 45,000 ఖర్చు అవుతున్నట్టు రాజేశ్‌ చెప్పారు. అన్ని ఖర్చులు పోను నికరంగా రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు మిగులుతున్నట్టు తెలుస్తున్నది.

ఏప్రిల్‌లో గ్రామంలో జరిగిన సంఘటనల వల్ల రాజేశ్‌ జీవనాధారమైన కౌలుభూమిని భూస్వామి లాక్కున్నారు. ఇద్దరు పిల్లలు, భార్యను పోషించుకోవడం అతడికి కష్టంగా మారింది. భవిష్యత్తు అంధకారంగా, అగమ్యగోచరంగా తయారయింది. దీనికి మూలం గరగపర్రు మాల, మాదిగ పేటల్లోని దళితులు తమ చైతన్యానికి ప్రతీక, తమ ప్రియతమ నాయకుడు అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకోవడమే. దీనిని ఆధిపత్య కులాలు అడ్డుకున్నాయి. ఈ వివాదమే రాజేశ్‌ వంటి 1,400 మంది దళితులను ఈరోజు ఆకలితో మలమల మాడేటట్టు చేసింది.

అంబేడ్కర్‌ విగ్రహాన్ని తమ వాడలో కాక, గ్రామ చెరువు దగ్గర ప్రతిష్టిస్తే బాగుంటుందని దళితులు భావించారు. ఆ చెరువు ఒడ్డున గాంధీ, అల్లూరి సీతారామరాజు, సర్‌ ఆర్థర్‌ కాటన్, తాండ్ర పాపారాయుడు విగ్రహాలు ఉన్నాయి. అందువల్లనే దళితులు అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించ దలిచారు. ఏప్రిల్‌ 23వ తేదీన ఆవిష్కరించుకున్నారు కూడా. కానీ ఒక్కరోజు కూడా గడవకుండానే విగ్రహాన్ని ఆధిపత్యకులాలు తీసేసి, దాచిపెట్టాయి. దళితులు ఆందోళన చేయడంతో విగ్రహాన్ని బయటకు తీసి కలెక్టర్‌ సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర పెట్టారు. ఎందుకంటే, చెరువు దగ్గర ప్రతిష్టించకుండా ఉండేందుకు ఆధిపత్య కులాలు కోర్టు నుంచి స్టే తెచ్చాయనీ, దానివల్ల పంచాయతీ ఆవరణలో పెడుతున్నామనీ కలెక్టర్‌ చెప్పారు. అయితే దళితులు తమ నిరసనను విరమించుకోలేదు. విగ్రహాన్ని దొంగిలించిన వారిని శిక్షించాలని కోరారు. దీనితో మే 5వ తేదీ నుంచి దళితులను అన్ని కార్యక్రమాల నుంచి ఆధిపత్య కులాలు వెలివేశాయి.

కౌలు భూములు లాక్కున్నారు
దళితులకు కౌలుకు ఇచ్చిన భూములను భూస్వాములు వెనక్కి తీసుకున్నారు. గ్రామంలోని 3,000 ఎకరాల వ్యవసాయ భూములలో 2400 ఎకరాలు క్షత్రియులవే. వ్యవసాయ పనులకు, ఇతర పనులకు పిలవడం ఆపేశారు. నిత్యావసర వస్తువులను అమ్మడం మానేశారు. చివరకు దళితవాడలో వైద్యం చేసే డాక్టర్‌ను బెదిరించి ఆ సేవలు కూడా నిలిపివేశారు. డెబ్భై యేళ్ల స్వతంత్ర భారతంలో కూడా గరగపర్రు దళితులు అగ్రకులాల ఆధిపత్యం కింద నలిగిపోయారు. దేశం నలుమూలలా నిశ్శబ్దంగా సాగుతున్న వివక్షలో వారూ భాగస్వాములయ్యారు.

గ్రామంలో దాదాపు 60 దళిత కుటుంబాలకు కౌలు భూమే ఆధారం. వీరందరి భూములను భూస్వాములు లాగేసుకున్నారు. గ్రామంలోని 400 దళిత కుటుంబాలలో 20 మందికి మాత్రమే భూములున్నాయి. మిగిలిన 380 కుటుంబాల వారు వ్యవసాయ కూలీలు. పనులు లేక, దళిత పేటల నుంచి వందమంది మహిళలు 20 మందికిపైగా పురుషులు గల్ఫ్‌ దేశాలకు వలసలెళ్లారు. ప్రభుత్వోద్యోగాలు చేసేవారు నలుగురికి మించిలేరు. ఉన్నత చదువులు చదువుకున్న వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. దళితుల పేదరికాన్ని ఆసరా చేసుకొనే ఆధిపత్య కులాలు పెట్రేగిపోతున్నాయి. గ్రామంలో బతకాలంటే చెప్పుల మాదిరిగా పడి ఉండాల్సిందేనన్న అహంతో బహిష్కరణకు తెగబడ్డారు.

మిగిలిన దళితేతరులు కూడా దళితులకు వ్యతిరేకంగా నిలబడి స్వభావాన్ని చాటుకున్నారు. ఇందులో ఎక్కువ కులాలకు భూమి లేకపోయినప్పటికీ, పేదరికంలో మగ్గుతున్నప్పటికీ దళితులను సమర్థించలేకపోయారు. కారంచేడు, చుండూరులలో జరిగింది కూడా ఇదే. దాడులకు ఆధిపత్య కులాలు నాయకత్వం వహించినప్పటికీ అన్ని కులాలు అందులో పాల్గొన్నాయనేది వాస్తవం. ఇది కుల వ్యవస్థ ముఖ్య లక్షణం. ఇది అంతం కూడా కాదు. కారణం– అంటరానితనం హిందూ సమాజం విద్వేషంతో విధించిన అమానుషమైన శిక్ష. అందువల్లనే అన్ని కులాలు అంటరాని కులాల పట్ల వివక్షతో మాత్రమే కాక, వ్యతిరేకతతో, విద్వేషంతో రగిలిపోతుంటాయి. కుల వివక్షను ఎదుర్కొంటున్న వెనుకబడిన కులాలు కూడా దళితుల విషయానికొచ్చేసరికి కులాధిపత్యాన్నీ, విద్వేష భావాన్నీ మాత్రమే అనుసరిస్తున్నాయి. ఈ దేశంలో కుల సమాజం కొనసాగడానికీ, దానికి మూలమైన హిందూమతం మనగలగడానికీ వెనుకబడిన కులాల మద్దతే ప్రధానమని బహుజన సమాజ్‌ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం చెప్పారు. ఇదే విషయాన్ని డాక్టర్‌ అంబేడ్కర్‌ తన విశ్లేషణలో సోదాహరణంగా వివరించారు.

ఆ ఇనుప కంచె అభేద్యం
భారత సమాజం వర్ణ వ్యవస్థతో ప్రారంభమై, తరువాత కుల వ్యవస్థగా మారింది. అంబేడ్కర్‌ అభిప్రాయం ప్రకారం భారత సమాజం వర్ణ, అవర్ణ సమాజాలుగా విడిపోయి ఉంది. వర్ణ సమాజంలో ద్విజులు, శూద్రులు అనే తేడా కూడా ఉంది. నిజానికి ద్విజులలో కూడా బ్రాహ్మణ, క్షత్రియ వర్గాల మధ్య ఎన్నో వైరుధ్యాలున్నాయి. వారి మధ్య యుద్ధాలు జరిగినట్టు చరిత్ర చెబుతున్నా, ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఆ రెండు వర్గాలు ఒక్కటయ్యాయి. ఆ తరువాత ద్విజులు, శూద్రుల మధ్య కూడా తేడాను చూడవచ్చు. అయితే వీరు ఎప్పుడైనా వర్ణ సమాజంలో భాగంగానే వ్యవహరించారు. భారతంలో సూతపుత్రుడు కర్ణుడిని రాజుని చేసి తమలో ఒకడిగా చేసుకోవడం ఇందులో భాగమే.
అవర్ణ సమాజాన్ని కూడా అంబేడ్కర్‌ మూడు భాగాలు చేశారు. వారు– మైదాన ప్రాంత ఆదివాసులు, అడవిలోని ఆదిమజాతులు, అంటరానికులాలు. ఆదిమజాతులు కూడా అంటరాని కులాలను దూరంగానే ఉంచాయి. అస్పృశ్యులుగానే చూశాయి. ఇప్పటికీ దళితులను ఆదివాసీలు సైతం అంట రానివారుగా చూడడం మనకు తెలుసు. మరోవైపు హిందూమతం ఆదిమజాతులను, ఆదివాసీలను తమలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఫలి తాన్ని కూడా పొందింది. దేవాలయాలలోనికి, హిందువుల ఇళ్లలోనికి వారు నేరుగా ప్రవేశించవచ్చు. ఎటువంటి అడ్డంకులూ ఉండవు. కానీ అంటరాని కులాలకు అటువంటి అవకాశం లేదు. అందుకే అంబేడ్కర్‌ మొత్తం హిందూ సమాజాన్ని ఒకవైపు, అంటరాని కులాలను రెండోవైపు నిలబెట్టారు. వీటి మధ్య అభేద్యమైన ఇనుపకంచె ఉందని చెప్పారు.

హిందూ సమాజానికి అంటరాని కులాలపట్ల ఇటువంటి విద్వేషం ఉండడానికి గల కారణాన్ని కూడా అంబేడ్కర్‌ తన ‘అస్పృశ్యులెవ్వరు?’ పరిశోధనా గ్రంథంలో చెప్పారు. చాలామంది సామాజిక శాస్త్రవేత్తలూ, హిందూ ధర్మక ర్తలూ చెప్పినట్టు అపరిశుభ్రత, గోమాంస భక్షణ అంటరానితనానికి కారణం కావని అంబేడ్కర్‌ వివరించారు. భారతదేశంలో సామాజిక విప్లవ కెరటంగా ఆవిర్భవించిన బౌద్ధాన్ని అనుసరిస్తూ, హిందూ దాడులను తట్టుకొని తమ ఉనికిని చాటుకుంటున్న నిజమైన బౌద్ధులను అంటరాని ముద్రతో సమాజం వెలివేసినట్టు అంబేడ్కర్‌ అభిప్రాయపడ్డారు. చరిత్రలో బౌద్ధులపై కొన్ని వందల దాడులు జరిగాయి. వేలాది మంది హతులయ్యారు. అయినా తాము బౌద్ధ ధర్మాన్నే అనుసరిస్తామని స్పష్టం చేసిన వారిని ఈ సమాజం విద్వేషంతో వెలివేసింది. ఆనాడు నాటిన విషబీజం 2,500 ఏళ్ల తరువాత కూడా దళితసమాజాన్ని వెంటాడుతూనే ఉంది. అందుకే గరగపర్రు దళితుల వెలివేత ఇప్పటికిప్పుడు జరిగిన ఘటన కాదు. తరాల నుంచి మండుతున్న కులాధిపత్య విద్వేషాగ్ని మాత్రమే.


- మల్లెపల్లి లక్ష్మయ్య

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213

Advertisement

తప్పక చదవండి

Advertisement