ధర్మ దీక్షాభూమికి వందనం | Sakshi
Sakshi News home page

ధర్మ దీక్షాభూమికి వందనం

Published Thu, Oct 20 2016 1:04 AM

నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో స్తూపం -ఫైల్‌ఫొటో

కొత్త కోణం
 నాగ్‌పూర్‌లో బాబాసాహెబ్ స్వీకరించిన బౌద్ధ దమ్మ సంరంభం ప్రపంచ చరిత్రలోనే అరుదైనది. ఇప్పటివరకు ఏ మతంలో కూడా అటువంటి సంఘటనలు జరగలేదు. దాదాపు ఐదులక్షల మందితో అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు. అప్పుడు ప్రచురించిన వ్యాసాల ప్రకారం, 1950 అక్టోబర్, 14వ తేదీన తెల్లవారుజామునే లక్షలాది మంది సభాస్థలికి చేరుకున్నారు. ఆ కాలంలోనే దాదాపు 30 మంది విదేశీ జర్నలిస్టులు ఆ కార్యక్రమం కవర్ చేయడానికి వచ్చారంటే ఆశ్చర్యం కలుగకమానదు.
 
 పంచవన్నెల పతాకాలతో కళకళలాడుతూ, గౌతముడి అసమాన సమానా పేక్షాయుతమైన పంచశీల పఠనంతో ఆ రోజు నాగ్‌పూర్ మార్మోగింది. బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేడ్కర్‌ల పోరాట దీక్షను స్మరిస్తూ అక్కడి ప్రతి హృదయం ప్రతిధ్వనించింది. వందలూ వేలూ కాదు లక్షలాది మంది ప్రజల ప్రత్యామ్నాయ సమాజ కాంక్షతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరం దద్ద రిల్లింది. భక్తి కాదు సుమా, సమానభావమేదో ఆ నగరాన్ని ఆవహించింది. నాగ్‌పూర్ వీధుల్లో ప్రతి విజయదశమి రోజున కనిపించే సుందర దృశ్యమిది. నలుగురు మనుషులు గుమిగూడితేనే ఖాకీ యూనిఫారాలు పహారా కాసే రోజుల్లో మచ్చుకైనా అక్కడ వారి జాడ కనిపించలేదు. ఆ జనవాహిని తనకు తానే నియమబద్ధంగా నడుచుకుంటుంది. వాలంటీర్లు వారికి సహాయపడు తుంటారు తప్ప అన్ని సమూహాల్లో కనిపించే అదిరింపులు, బెదిరింపులు మనకక్కడ కనిపించవు. దాదాపు రెండుమూడు కిలోమీటర్ల పొడవునా క్యూల కోసం బారికేడ్లు కడతారు.

రావడానికి ఒకటి, పోవడానికి ఒకటి . ఒకరిని దాటుకొని మరొకరు వెళ్లాలని ప్రయత్నించరు. తోపులాట, తొక్కిసలాట ఉండదు. ఇందులో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఒకే వరుసలో నడుస్తూంటారు. బారికేడ్ కనీసం ఐదుమీటర్ల వెడల్పుంటుంది. దొంగత నాలు చాలా అరుదు. మహిళల వేధింపులుండవు. నియమబద్ధంగా సాగి పోయే ఆ జన దృశ్యం నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న నదిని తలపిస్తుంది. రెండు జీవనదులు చెరోపక్క కదలిపోతున్న భావం కలుగుతుంది. బుద్ధం శరణం గచ్ఛామి, దమ్మం శరణం గచ్ఛామి, సంగం శరణం గచ్ఛామి అని నినదిస్తూ నాగ్‌పూర్ దీక్షాభూమి జనప్రవాహంతో నిండిపోతుంది.
 
చరిత్రలో ఆరోజు
ఇది భారతీయ చరిత్రలోనే అరుదైన అనుభవం. అది మనుషుల మధ్య ఆత్మీయతను పెంచుతుంది. వ్యవస్థ మీద విశ్వాసాన్ని ఇనుమడింపచేస్తుంది. ఇది నాగ్‌పూర్‌లో ప్రతియేడాది జరుగుతున్న దమ్మచక్ర ప్రవర్తనా దినాన జరిగే జనజాతర అపురూప దృశ్యం. ఐదున్నర లక్షల మందితో అంబేడ్కర్ దీక్షబూని సమానతా పతాకాన్ని ఎగురవేసిన రోజు అదే. భారతదేశాన్ని వేయి సంవత్సరాలకు పైగా ప్రభావితం చేసి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగా లను ప్రగతి మార్గాన పరుగులెత్తించిన బౌద్ధం ఆధునిక జవసత్వాలను అంది పుచ్చుకున్న రోజు.
 
అంటరానితనానికి వ్యతిరేకంగా సమాన హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన రెండు పోరాటాలు ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. 1927 మార్చి, 20 వ తేదీన మహద్ చెరువులో నీళ్లు తాగడానికి అంటరాని కులాల ప్రజలను సమీకరిస్తే, సనాతన హిందువులు దాడి చేసి తలలు పగులగొట్టారు. 1930 మార్చి, 2వ తేదీన నాసిక్‌లోని కాలారాం దేవాలయ ప్రవేశానికి వెళ్లిన అంబేడ్కర్‌నూ, అనుచరులనూ అడ్డుకున్నారు. దానికి నిరసనగా అక్కడికి చేరిన వారంతా సత్యాగ్రహానికి పూనుకున్నారు. ఆ ఘటన తర్వాత దేవాలయ ప్రవేశం కోసం ప్రయత్నించడం వృథా ప్రయా సగా అంబేడ్కర్ అభివర్ణించారు. ఆ తర్వాత 1930, 31లలో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో బ్రిటిష్ ప్రభుత్వం, అప్పటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ అంటరాని కులాలకు ఇచ్చిన ప్రత్యేక నియో జకవర్గాలతో పాటు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే హక్కును గాంధీజీ తన నిరాహార దీక్ష ద్వారా తిప్పికొట్టిన ఘటన కూడా అంబేడ్కర్‌కు ఈ సమాజం మీద విశ్వాసం సన్నగిల్లేలా చేసింది.

ఈ మూడు ఘటనల తర్వా తనే సరిగ్గా 1935, అక్టోబర్ 13 నాడు నాసిక్ వద్ద యోలాలో మాట్లాడుతూ, ‘‘నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మాత్రం చనిపోనని మీకు కచ్చితంగా హామీ ఇస్తున్నాను’’ అని ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడగానే ఆయన మీద ఇస్లాం, క్రైస్తవ మత పెద్దల దృష్టి పడింది. ఆయా మతాలలోకి వారు సాదరంగా ఆహ్వానించినప్పటికీ ఆయన సున్నితంగానే తిరస్కరిం చారు. 1956, అక్టోబర్ 14న బౌద్ధం తీసుకుంటున్నానని 1956, సెప్టెంబర్ 23వ తేదీన ఆయన ప్రకటించారు. 1934 అక్టోబర్ 13న చేసిన యోలా ప్రకటన నుంచి, 1956 సెప్టెంబర్ 23న చేసిన ప్రకటన దాకా అంబేడ్కర్ అన్నిరకాల ధర్మాలను, మత గ్రంథాలను అధ్యయనం చేసినట్టు ప్రకటించు కున్నారు. బౌద్ధాన్ని తీసుకోవడానికి ముందే ఆయన బుద్ధుని బోధనలను అమూలాగ్రం అర్థం చేసుకున్నారు. తన ప్రజలకు బౌద్ధాన్ని అర్థమయ్యే పద్ధ తిలో చెప్పడానికి చివరిరోజు ‘‘బుద్ధుడు-అతని బోధనలు’’ అనే గ్రంథాన్ని రచించారు.
 
బుద్ధం శరణం గచ్ఛామి
బౌద్ధాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన బౌద్ధం గురించి స్పష్టంగానే అనుచరులకు వివరించారు. ‘‘నేను  బౌద్ధానికి ఎందుకు ప్రాధా న్యం ఇస్తానంటే, ఆ మతం మూడు సిద్ధాంతాల కలయిక. మరే మతం అట్లాకాదు. తక్కిన మతాలన్నీ భగవంతుడు, ఆత్మ, మరణానంతర జీవితం గురించి చెబుతాయి. బౌద్ధం ప్రజ్ఞ గురించి ్రపబోధిస్తుంది. మూఢ నమ్మ కాలకూ, అతీతశక్తులకూ వ్యతిరేకంగా కరుణను బోధిస్తుంది. భూమి మీద ఆనందంగా బతకడానికి ప్రతి వ్యక్తికీ ఇవి అవసరం’’ అని చెబుతూనే, రాజకీయంగా కూడా బౌద్ధం సమాజానికి సరైన దిశా నిర్దేశం చేస్తుందని అంబేడ్కర్ చెప్పారు. ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే భావనలను నేను ఫ్రెంచి విప్లవం నుంచి తీసుకోలేదు. నా గురువైన బుద్ధుని బోధనల నుండి స్వీకరించాను’’ అని ప్రకటించారు కూడా.

నాగ్‌పూర్‌లోనే బౌద్ధం తీసుకోవడానికి కారణమేమిటనే విషయాన్ని కూడా ఆ మరుసటి రోజున జరిగిన బహిరంగ సభలో వివరించారు. ఆ సభలో అంబేడ్కర్ దాదాపు మూడు గంటల పాటు మరాఠీలో మాట్లాడారు. ‘‘దమ్మదీక్షను తీసుకోవ డానికి నాగ్‌పూర్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారని చాలా మంది అడుగు తున్నారు. ఇందుకు కారణం ఉన్నది. భారతదేశంలో బౌద్ధ చరిత్ర చదువు కున్న వాళ్లకు ఆర్యులకు-ఆర్యేతరులకు జరిగిన యుద్ధాల గురించి తెలుసు.

ఆ క్రమంలో ఆర్యేతరులుగా ఉన్న నాగాలను నామరూపాలు లేకుండా చేయా లని ఆర్యులు భావించారు. తీవ్రమైన ఆణచివేతకు గురైన నాగాలకు అండగా బుద్ధుడు నిలబడ్డాడు. ఆ విధంగా నాగాలు బౌద్ధ వ్యాప్తికి తోడ్పడ్డారు. నాగ్‌పూర్ ప్రాంతంలోనే నాగాలు ఎక్కువగా ఉన్నారు. అందువల్లనే పక్కన పారుతున్న నదికి నాగానది అనే పేరు వచ్చింది. ఈ గొప్ప సందర్భానికి ఈ ప్రాంతాన్నే ఎంపిక చేసుకున్నాన’’ని పేర్కొన్నారు. అంబేడ్కర్ బౌద్ధం స్వీకరించడానికి నాగ్‌పూర్ వేదికగా మారి చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది.
 
ఐదున్నర లక్షల మందితో...
 నాగ్‌పూర్‌లో బాబాసాహెబ్ స్వీకరించిన బౌద్ధ దమ్మ సంరంభం ప్రపంచ చరిత్రలోనే అరుదైనది. ఇప్పటివరకు ఏ మతంలో కూడా అటువంటి సంఘ టనలు జరగలేదు. దాదాపు ఐదులక్షల మందితో అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు. అప్పుడు ప్రచురించిన వ్యాసాల ప్రకారం, 1950 అక్టోబర్, 14వ తేదీన తెల్లవారుజామునే లక్షలాది మంది సభాస్థలికి చేరుకున్నారు. ఆ కాలంలోనే దాదాపు 30 మంది విదేశీ జర్నలిస్టులు ఆ కార్యక్రమం కవర్ చేయడానికి వచ్చారంటే ఆశ్చర్యం కలుగకమానదు.
 
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆరోజు ఉదయం తొమ్మిదిన్నరకు సభా స్థలిలో అడుగుపెట్టేటప్పటికి అయిదున్నర లక్షల మంది అక్కడ హాజర య్యారని నిర్వాహకులు ప్రక టించారు. అందరికీ పాసులు ఇచ్చి లెక్క గట్టారు. త్రిరత్న, పంచశీలతో పాటు అంబేడ్కర్ స్వయంగా రూపొందించిన 22 ప్రమాణాలను కూడా ఆ అయిదున్నర లక్షలమందితో చదివించడం చరిత్రలో ఓ మరపురాని అనుభవం. బాబాసాహెబ్ బౌద్ధం స్వీకరించిన స్థలంలో నేడు కనిపిస్తున్న బౌద్ధ స్తూపాన్ని తర్వాత నిర్మించారు.

1978లో దీనికి శంకుస్థాపన చేసి 2001, డిసెంబర్, 18వ తేదీన అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ చేత ప్రారంభించారు. షియోడాన్‌మల్ అనే ఆర్కిటెక్ట్ ఈ స్థూపానికి రూపకల్పన చేశారు. నాలుగు వేల చదరపు అడుగుల వైశాల్యంతో రెండు అంతస్తులుగా ఈ స్థూపాన్ని నిర్మించారు. వందల మంది ఒకేసారి కూర్చొని ధ్యానం, ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉన్నది. శ్రీలంక  లోని అనురాధపురం నుంచి బదంతే ఆనంద్ కౌసల్యన్ చేతుల మీదుగా తీసుకొచ్చిన బోధివృక్షం అంటును ఇక్కడ నాటారు. అది ఈరోజు మహా వృక్షమైంది.
 
మీడియా దృష్టి పడలేదెందుకు?
 ఈ స్థలాన్ని పరిరక్షించడం, అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపు తున్నాయి. ఈ సంవత్సరం కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఈ సంబరంలో పాల్గొని మరిన్ని నిధులను ప్రకటించారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రతినిధులు హాజరవడంతో పాటు, వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఆ ఒక్కరోజే కాదు, సంవత్సరం పొడవునా యాత్రికులు, పరిశోధకులు, విద్యార్థులు వస్తుంటారు.
 
కానీ, పుష్కరాలూ, కుంభమేళాలూ, జాతరలూ, ప్రముఖ మత పెద్దల సమ్మేళనాలనూ ప్రత్యక్ష ప్రసారాలు, పతాక శీర్షికల్లోకెక్కిస్తున్న మీడియా ఇంతటి చారిత్రక, వర్తమాన ప్రాధాన్యత కలిగిన ‘దమ్మ చక్రప్రవర్తనా దినం’ ఉత్సవాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదనేది సమాధానం లేని ప్రశ్న. అది నిర్లక్ష్యమా? వివక్షా? 1956లోనే విదేశీ మీడియాతోపాటు ఎంతో మంది పత్రికాప్రతినిధులు హాజరైన అనుభవం మనకున్నది. కానీ, నేడు మన పత్రికలు, చానళ్లను చూస్తే నాగ్‌పూర్ దమ్మ దీక్ష ఉత్సవాలు జరిగాయని తెలిసే అవకాశం లేదు. మరి మీడియా నిర్లక్ష్యం వెనుకనున్న ‘మత’లబే ంటో అర్థం కాదు. ఈ పరిస్థితులు ఇప్పటికైనా మారాలని కోరుకోవడం తప్పేమీ కాదు. భారతదేశం సెక్యులర్ దేశమని రాజ్యాంగంలో రాసుకున్నాం. అనేక సార్లు మాట్లాడుకున్నాం. మరి ఈ విశేషాలు ఎందుకు మన కార్యాచరణలో భాగం కాలేదో ఆలోచించుకోవాలి.

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య
మొబైల్ : 97055 66213
 
 

Advertisement
Advertisement