కష్టకాలంలో మానవీయ స్పర్శ | Sakshi
Sakshi News home page

కష్టకాలంలో మానవీయ స్పర్శ

Published Tue, Apr 26 2016 12:36 AM

లెస్‌బోస్‌లో శరణార్థులతో పోప్ ఫ్రాన్సిస్

బైలైన్

శరణార్థుల విషయంలో యూరప్ మడిగట్టుకుని ఉండలేదని, ఉదాసీనంగా లేదా శత్రుపూరితంగా వ్యవహరించజాలదని పోప్ అన్నారు. ఆయన మత విశ్వాసం ఇతరులను కలుపుకుని పోయేది. మనుషుల బాధల పట్ల ఆయనకున్న పట్టింపు మత విశ్వాసాల సరిహద్దు గోడలను అధిగమించినది.
 
అసలు చెప్పుకోవాల్సిన కథనాలే అతి తరచుగా వార్తల్లో పడి కొట్టుకుపోతుంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు సాగే సుదీర్ఘ సమాచార కవాతులో వార్తలు సైతం కళ్ల ముందు కదలాడుతూ పోయే శీర్షికలుగా మారిపోతాయి. వాటి ప్రాముఖ్యతను కొలిచే పాటి తీరిక, శ్రద్ధ ఎవరికి ఉంటుంది? ఏప్రిల్ 16న ఒక ప్రాముఖ్యత గల ఘటన జరిగింది. ఆ కథనం పూర్తిగా కాకపోయినా, చాలా వరకు దాన్ని చేరవేసే క్రమంలో కొట్టుకుపోయింది. రోమన్ కేథలిక్కుల మత పెద్దయైన హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్, యుద్ధ విధ్వంసానికి గురైన సిరియా వంటి ముస్లిం దేశాల శరణార్థులను కలుసు కున్నారు. నేడు మరుపున పడిపోయిన ఒకప్పటి సుప్రసిద్ధ గ్రీకు ద్వీపం లెస్‌బోస్‌లో ఈ కలయిక జరిగింది.
 
యూరప్ అంచున ఉన్న గ్రీస్, రెండు శతాబ్దాల స్వతంత్ర అస్తిత్వం తర్వాత... మళ్లీ ఆ ఖండపు ముఖ ద్వారంగా మారింది. అయి తే, యూరోపియన్లు మాత్రం గ్రీస్, యూరప్‌కు రక్షణను కల్పించే అడ్డుగోడగా నిలవా లనే కోరుకున్నారు. ఒకప్పు డు, అట్టోమన్-తురుష్క సేనలు గ్రీస్‌ను స్థావరంగా చేసుకుని బాల్కన్ దేశాల లోకి చొరబడుతూ, అక్కడి నుంచి శక్తివంతమైన యూరోపియన్ రాజ్యాలపైకి దృష్టిని సారిస్తూ ఉండేవి. నేడు యుద్ధ బీభత్సానికి గురైన ముస్లిం దేశాల ప్రజలు టర్కీని ఆనుకుని ఉన్న లెస్‌బోస్‌ను జర్మనీ, స్కాండినేవియాలకు, సుదూరంలోని బ్రిటన్‌కు చేర్చే హార్బర్‌గా మార్చారు.

16, 17 శతాబ్దాలలోని యూరోపియన్ దర్బారులు అట్టోమన్ సామ్రాజ్య శక్తి యురేసియా, మధ్యధరా ఆఫ్రికా ప్రాంతాలకు విస్తరించడం గురించి సహేతుకంగానే ఆందోళ న చెందుతుండేవి. పాశ్చాత్య నాటకకర్తలే ఆనాటి జనరంజ క ప్రసార మాధ్యమాల శాసకులు. వారు తురుష్కులను యూరప్ నాగరికతను, సంపదను, సౌందర్యాన్ని కాలరాచి వేయడానికి వేచి చూస్తున్న రాక్షసులుగా చిత్రించారు. ఉదారవాద మేధావి షేక్‌స్పియర్ ఇందుకు మినహాయింపు. ఈసారి యూరప్‌లో భయాన్ని రేకెత్తించినది అరబ్బుల వంపు తిరిగిన ఖడ్గాల దండయాత్ర కాదు, వచ్చిపడే జనాభా దండు. ఈ సారి గుంపులు గుంపులుగా వచ్చి పడ్డవారు వేగాశ్వ పదఘట్టనల సంరంభంతో రాలేదు.  దుర్బలమైన పడవల్లో శరణార్థులై వచ్చారు. అలా వచ్చే సాధారణ ప్రజలు, పౌరులుగా మారగలుగుతారు. కాబట్టి నేటి ప్రజాస్వామ్య యుగంలో వారు సైతం సైనికులంత గానూ ఆందోళనను రేకెత్తిస్తున్నారు.
 
యూరోపియన్ ప్రభుత్వాలు తొలుత ఈ శరణార్థుల వెల్లువను చూసి బెంబేలెత్తిపోయాయి. మానవీయ స్పందన లకు, పెరుగుతున్న ప్రజాగ్రహానికి మధ్యన అవి ఇరుక్కు పోయి మ్రాన్పడిపోయినట్టనిపించింది. టర్కీతో తీవ్ర దౌత్య కృషి, సరిహద్దు రక్షణ చర్యలను పటిష్టం చేయడం కలసి వాటికి కొంత ఉపశమనాన్ని కలుగజేశాయి. అయితే ఎవరికీ చెందని భారీ శరణార్థుల జనాభా సరిహద్దుల మధ్యన చిక్కుకు పోయి మిగిలింది. తమ మాతృ భూమికి తిరిగి వెళ్లడమనే ఆలోచనకే వారు భయకంపితులౌతున్నారు.
 
అలాంటి ఆపత్కాలంలో పోప్ ఫ్రాన్సిస్ లెస్బోస్‌లోని ఒక శరణార్థుల శిబిరాన్ని స్వయంగా సందర్శించారు. ఇది, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత మానవ మహా విపత్తని ఆయన అన్నారు. పోప్ మాటలను ఆచితూచి జాగ్రత్తగా వాడటమే కాదు, ఎంతో ఆలోచన చేసిన తర్వాత నే కార్యాచరణకు దిగారు. లండన్ నుంచి వెలువడే ‘సండే టైమ్స్’ పత్రికలో వెలువడ్డ క్రిస్టియన్ లాంబ్ కథనం ప్రకారం... పోప్ శరణార్థులకు మద్దతును వాగ్దానం చేసి వారి సౌఖ్యం కోసం ప్రార్థన చేశారు. డజను మంది ముస్లిం శరణార్థులను వాటికన్ నగరంలోకి స్వీకరించారు. (ఆ 12 మంది డమాస్కస్‌కు, ఐఎస్‌ఐఎస్ అదుపులో ఉన్న డయర్ ఎజ్జార్ పట్టణానికి చెందినవారు). దీన్ని మీరు సంకేతాత్మక మైనదిగా కొట్టి పారేయవచ్చు. కానీ, అది సామాన్యుల హృదయాల్లో మారు మోగే శక్తివంతమైన ప్రేమాస్పద చర్య. లాంబ్ కథనానికి జోడించిన అందమైన ఫొటోలో ఒక పిల్లాడు నవ్వుతున్న ఆ మతాధిపతి చేతిని ముద్దాడుతుం డగా.. అతని తల్లి ఉద్వేగంతో కన్నీటిని బిగబడుతూ కనిపి స్తుంది. చెప్పాల్సిన అవసరం ఉన్న దయనీయ కథనాలు ఎన్నో ఉన్న మాట నిజమే. కానీ, ఆశ కూడా ఒక కథనమే.
 
నిజమే, పోప్ ముస్లింలకు స్నేహ హస్తాన్ని చాస్తున్నా రు. ఇంతకు ముందు కూడా ఆయన ఈ పని చేశారు, ఇక ముందూ చేస్తారు. ఆయన మత విశ్వాసం ఇతరులను కలుపుకుని పోయేది. మనుషుల బాధల పట్ల ఆయనకున్న పట్టింపు మత విశ్వాసాల సరిహద్దు గోడలను అధిగమించి నది. నూర్ ఇస్సా, హస్సన్ అనే ఇంజనీర్ల జంట వారి రెండేళ్ల కొడుకు వంటి  కుటుంబాల విషయంలో యూరప్ మడిగట్టుకుని ఉండలేదని, ఉదాసీనంగా లేదా శత్రుపూరి తంగా వ్యవహరించజాలదని కూడా ఆయన చెబుతున్నారు. ఆ ముగ్గురి కుటుంబం ఇకపై డమాస్కస్‌లో కాక వాటికన్ లోనే జీవిస్తుంది. ఐదేళ్ల క్రితం లేదా రెండు, మూడేళ్ల క్రితం సైతం వారు తమ మనుగడలో అలాంటి మలుపు వస్తుం దని ఊహించలేదు. వారెన్నడూ సిరియా వదిలి పోవాలని అనుకోనేలేదు.

అత్యంత నిర్దాక్షిణ్యమైన యుద్ధం కారణంగా తీవ్ర విధ్వంసానికి భయంకరమైన ఒంటరితనానికి గురై ఉన్నవారిని వారి దేశం నుంచి తరిమేశారు.  అయినా వారు అదృష్టవంతులు. అంతకంటే భిన్నమైన జీవితం కోసం అన్వేషణలో వారిలాంటి వేలాది మంది ప్రాణాలను కోల్పో యారు. యూరప్ ఈ విషాదాన్ని అర్థం చేసుకోలేదని  అనడం సమంజసం కాదు. చాలా ప్రభుత్వాలు తాము చేయగలిగినదంతా చేశాయి. ఈ విషయంలో చేసిన కృషికి గానూ జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మర్కెల్ వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించాల్సి రావచ్చునేమోగానీ, చరిత్రలో ఆమె ఎన్నటికీ గుర్తుండిపోతారు. కానీ, ఇంకా ఆ  నరకంలో తేలుతున్న వారిని ప్రపంచం మరచిపోలేదు.
 
ప్రపంచంలోనే అత్యంత సుప్రసిద్ధ మతానికి పెద్ద అయిన పోప్ మనం వినడానికి సిద్ధంగా లేని ఒక విషయా న్ని కూడా చెప్పారు. మానవత్వానికి అర్థం తెలుసుకోకపోతే మానవులు ఇక మానవులే కారు. నేటి మన నేతల పట్ల సంశయాత్మక దృష్టితో చూడటం ఫ్యాషన్‌గా మారింది. తర చుగా అందుకు సమంజసమైన కారణాలను సైతం చూపు తుంటారు. మతం, సంశయాత్మకతకు వ్యతిరేకంగా హామీని కల్పించే బీమా కాదు. భగవదాంశ సంభూతునిగా భావించే మత పెద్దే ఆ భగవంతునిలో విశ్వాసాన్ని ప్రదర్శించడాన్ని చూసినప్పుడు... మనం ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవడం, ఆయన దృక్పథాన్ని ప్రశంసించడం తప్పదు.
వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ (సీనియర్ సంపాదకులు)
పార్లమెంటు సభ్యులు,
బీజేపీ అధికార ప్రతినిధి    
 
  
 
 

Advertisement
Advertisement