డిజిటల్‌ కరెన్సీ మోజులో మోదీ | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ కరెన్సీ మోజులో మోదీ

Published Tue, Nov 15 2016 12:23 AM

డిజిటల్‌ కరెన్సీ మోజులో మోదీ - Sakshi

రెండో మాట
ఎదగకముందే ‘జాంబవంతుడి అంగలతో ముందుకు దూకాలనే ఆశతో ఉన్న కరెన్సీ పునాదులకు ఎసరు పెట్టుకోకూడదు. చెలామణీలోని కరెన్సీ విలువ నిలకడగా లేదు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్టుగా కొత్తగా తలపెట్టిన ప్రయోగంతో నగదు (క్యాష్‌) లావాదేవీలను డిజిటల్‌ (ఎలక్ట్రానిక్‌) మాధ్యమం ద్వారా బట్వాడా చేయటం మంచిదని మోదీ భావించారు. దేశ లావాదేవీలను టెక్నాలజీ మాధ్యమంలో నిర్వహించాలని ఆ వైపుగా పదే పదే సూచించడంలోని అర్థం అదేనని గ్రహించాలి.

‘ఎన్నికల్లో ధారాళంగా ప్రవహించే కరెన్సీ నోట్లను అదుపు చేసే ప్రయత్నం వేరు విషయం. ఒకవేళ ఇది పాకిస్తాన్‌పై మెరుపుదాడే అయితే మన ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతిస్తారనుకుందాం. కానీ ఇది నల్లధనంపైన మెరు పుదాడి పేరిట దేశప్రజల పైననే ప్రభుత్వం తలపెట్టిన ప్రత్యక్ష దాడి. అందుకే దేశ ప్రజా బాహుళ్యం మనసులు గాయపడ్డాయి. నల్లధనంపైన ఉద్యమ రూపంలో దాడిని బాబా రామ్‌దేవ్‌ ద్వారా నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నించి ఉండాల్సింది. కానీ తన న్యాయబద్ధమైన సంపాదన, ఆదాయం చెల్లుబాటు కావని ప్రభుత్వం ఆకస్మికంగా ప్రకటించడం ద్వారా సామాన్యుడి విశ్వాసం దెబ్బతినిపోయింది. అతనిలో తిరిగి విశ్వాసాన్ని పాదు కొల్పడం కష్టం.’
– ది హిందూ, బిజినెస్‌ లైన్‌ (పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయాన్ని పార్టీ అధికారికంగా సమర్థించినందుకు నిరసనగా ఒక బీజేపీ సీనియర్‌ నాయకుడు చేసిన వ్యాఖ్య, 10–11–16)

ప్రధాని నరేంద్ర మోదీలో ఇంతకు ముందు వరకు కనిపించిన గాంభీర్యం అకస్మాత్తుగా ఈ నెల 13న జరిగిన గోవా బహిరంగ సభలో డుల్లిపోవడానికీ, ఆగ్రహ ప్రకటనగా మారడానికీ కారణం ఏమిటో ఎవరూ చెప్పక్కరలేదు. అందులోని మర్మాన్ని పాలక పక్షానికే చెందిన సీనియర్‌ నేత నోటి నుంచి వెలువడిన నిశిత విమర్శ ద్వారానే గ్రహించవచ్చు. వచ్చే రెండుమూడు మాసాలలోనే నాలుగైదు రాష్ట్రాల శాసనసభలకు  ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లను దృష్టిలో పెట్టుకుని అక్కడ బీజేపీని అధికార పీఠం మీద అధిష్టింపచేయడానికి ఒక చిట్కాగానే మోదీ రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు ప్రయోగాన్ని ముందుకు తెచ్చారన్న భావం ప్రజా నీకంలో మొదలైంది. విదేశాలకు చేరిన అపార నల్లధన రాశులను వెలికి తీస్తామని 2014 ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారు. అయితే అధి కారంలోకి వచ్చిన తరువాత మాత్రం మౌనం దాల్చారు. ప్రజలూ, ప్రతి పక్షాల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తట్టుకోలేక చివరికి జస్టిస్‌ ఎంబీ షా (రిటైర్డ్‌) ఆధ్వర్యంలో కమిషన్‌ను నియమించారు. ఈ తతంగంతో కూడా నల్లధనం వెలికిరాలేదు. ఇన్నేళ్లుగా స్విస్‌ బ్యాంకులలో పోగుపడి ఉన్న లక్షల కోట్ల రూపాయల నల్లధన రాశులలో ఒక్క శాతం కూడా వెనక్కి రాలేదు. వికీలీక్స్, పనామా పేపర్స్‌ పరిశోధక సంస్థలు వెల్లడించిన నల్లధన రాశులు కూడా దేశానికి తిరిగొచ్చిన ఉదాహరణలు లేవు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు మాటామంతీ లేకుండా గడిపేసింది. అంటే యూపీఏ పాలన తరహాలోనే ఎన్డీఏ హయాంలోను దొంగనోట్లు, నల్లధనం నిరాఘాటంగా చెలామణీ అవుతూ దేశ ఆర్థిక వ్యవస్థనూ, సామాన్య జనాన్నీ కల్లోల పరుస్తూనే ఉన్నాయి. నోట్లు ముమ్మరం కావడం ద్వారా ద్రవ్యోల్బణం పెరిగి, రూపాయి విలువ దిగజారడం కూడా ప్రజలకు చిరకాలంగా అనుభవంలో ఉన్న విష యమే. నిజానికి ఇది సామాన్యుడు గ్రహించలేని రాజకీయ, ఆర్థిక పరమార్థం.

విశ్వసనీయత మీద దెబ్బ
ఈ పరిణామాన్నీ, దాని ప్రభావాన్నీ అర్థం చేసుకున్న ఇద్దరు–భారత ప్రభుత్వ ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌ మయారామ్, ప్రపంచ బ్యాంక్‌ మాజీ ఆర్థికవేత్త కౌశిక్‌ బసు చేసిన హెచ్చరికలను ఈ సందర్భంలో గమనించాలి. ‘రూ. 500, రూ. 1,000 నోట్లను అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వం చెలామణీ నుంచి రద్దు చేసింది. దీనివల్ల రూపాయి విలువ విశ్వసనీయతను నాశనం చేసి, దీర్ఘకాలంలో పసిడి నిల్వలను భారీ స్థాయిలో దిగుమతి చేసుకోవడానికి దారితీస్తుం’దని మయారామ్‌ హెచ్చరించారు. కౌశిక్‌ బసు అయితే, ‘పెద్ద నోట్లను రద్దు చేయడం ఆరోగ్యకర ఆర్థిక విధానం కాదనీ, ఈ రద్దు వల్ల ప్రయోజనం కంటే, ఉభయ భ్రష్టత్వానికి దగ్గర దారి చూపుతుందనీ’ వ్యాఖ్యానించారు. అసలు రూపాయికి ఉన్న విశ్వసనీయతకు ఏదీ పునాది? కరెన్సీ ఒక కాగితం ముక్క. రూ. 1,000 నోటు తయారు కావ డానికి అయ్యే ఖర్చు రూ. 5. కానీ దానికి రూ. 1,000 విలువ వచ్చిందంటే దాని మీద రిజర్వు బ్యాంకు గవర్నర్‌ సంతకం చేస్తారు. అంటే ఆర్‌బీఐ గవర్నర్‌ ఆ విలువకు హామీ పడుతున్నారని అర్థం. ఇంకా చెప్పాలంటే కరెన్సీ అంటే దేశ సర్వసత్తాక సార్వభౌమాధికారానికి చిహ్నం. కాబట్టి, అలాంటి నోటుకు ఉన్న ప్రతిపత్తిని ప్రశ్నించడం అంటే, దాని విశ్వసనీయతను ప్రశ్నిం చడమే. కనుక పాలకులు చెదరగొట్టిన కరెన్సీ విశ్వసనీయతను తిరిగి పొంద డానికి ప్రజలకు మళ్లీ చాలాకాలం పడుతుందని నిపుణులైన ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఒకసారి ప్రజల విశ్వాసం సడలిపోతే మొత్తం ఆర్థిక వ్యవ స్థపైనే దాని ప్రభావం ఉంటుంది. ‘ఒకవేళ కొత్త నోటు చెలామణిలో పెట్టినా, మళ్లీ వచ్చే ఏడాది పాత నోట్లు చెలామణిలోంచి తప్పించరని నమ్మక మేమిటని ప్రజలు ప్రశ్నిస్తారు’ అని కూడా నిపుణులు అంటున్నారు. కనుకనే మోదీ (బీజేపీ) తొందరపాటు విధానాలపై పెద్ద స్థాయిలో విసుగూ వ్యాకుల పాటు వ్యక్తం కావడానికి కారణం.

ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు
‘దొంగలుపడ్డ ఆర్నెల్లకు’ మేల్కొన్న చందంగా రెండున్నర సంవత్సరాల పాలన తర్వాత ‘ వాళ్లు నన్ను బతకనివ్వరు, అయినా భయపడను’ అని మోదీ కొత్తగా ‘జబ్బ’ ఎందుకు చరుచుకోవలసి వస్తోందో తెలియదు. పైగా ఇండో–పాక్‌ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వద్ద ఉడి, పంజాబ్‌లోని పఠాన్‌ కోట వద్ద ఉభయదేశాల మధ్య ‘మెరుపు దాడుల’వెను వెంటనే దేశీయ కరెన్సీ నోట్లపైన, నల్లధనంపైన ‘శస్త్ర చికిత్స’ జరగడం యాదృచ్ఛిక ఘటనలు కావు. 1946 నుంచి మాత్రమే కాదు, 1978లో మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఏర్పడిన జనతా సర్కార్‌ పాలనలోను, (అందులో నేటి బీజేపీ భాగస్వామి) 1978లో ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఏలుబడి దాకా పాలక వర్గాల ఎన్నికల స్వార్థ ప్రయోజనాల ఫలితంగా భారీ కరెన్సీ నోట్లకు ‘సర్జరీ’లు జరుగుతూనే వచ్చాయి. కాని  ఇప్పటి మాదిరిగా (మోదీ పాలనలో)ఏనాడూ సామాన్య ప్రజల నిత్య జీవితావసరాలకు, నిత్య బ్యాంకింగ్‌ లావాదేవీలకు విఘాతం కలగలేదు. జనతా సంకీర్ణ ప్రభుత్వం అంతకు ముందున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కక్ష సాధింపులో భాగంగా భారీ నోట్ల సర్జరీకి పూనుకున్నప్పుడు నాటి ఆర్‌బీఐ గవర్నర్‌ ఐజీ పటేల్‌ భారీ నోట్ల చెలామణిని వ్యతిరేకించారు. ఇటీవల కాలంలో మోదీ ప్రభుత్వానికీ, రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌గా రాజీ నామా చేసిన రాజన్‌కూ పడక, తమ మాటకు బద్ధులై ఉండే విశ్వాస పాత్రులైన వ్యక్తుల్ని ప్రధాన కార్యదర్శులుగా, ముఖ్య కార్యదర్శులుగా నియమించుకున్నట్లే బీజేపీ పాలకులు ఆర్‌బీఐ బ్యూరోక్రాట్లను నియమిం చారు. వికీలీక్స్, పనామా పేపర్స్‌ వెల్లడించినట్టు, విదేశాల్లో దాచుకున్న కోట్లాది రూపాయల ధనంతో పాటు స్విస్‌ ఖాతాలకెక్కిన నల్లధనపు గుప్త సామ్రాజ్య రాజకీయుల (బీజేపీ సహా) పేర్లు కూడా వెల్లడి కావడంతో ప్రజలకు మన ప్రజాస్వామ్యం ‘డొల్లతనం’ బాహాటంగానే వెల్లడైంది. స్విస్‌ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతదేశపు 2,000 మంది కుబేరుల నల్లధనం 1.3 ట్రిలియన్‌ డాలర్లు – అంటే రూ. 358,679,863,300,000. గుజరాత్‌ నుంచి గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, యూపీ, బిహార్‌ల దాకా విస్తరిల్లిన బడా కార్పొరేట్లు, అంబానీ, ఆదానీలు.. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న బడా ప్రజా ప్రతినిధులు, వారి బినామీల దాకా వారిలో ఉన్నారు. స్విస్‌ బ్యాంకు లెక్కల ప్రకారం భారతదేశపు బినామీ/కుబేర వర్గాల నల్లధనం మరొక మాటలో చెప్పాలంటే 24 లక్షల కోట్లు. భారతదేశపు దారిద్య్రం పూర్తిగా తొలగాలన్నా లేదా మోదీ ఆశిస్తున్నట్టు ఇతరుల కళ్లు కుట్టేంతగా వర్ధమాన దశ నుంచి ప్రవర్ధమాన దిశగా పరిపూర్ణ ‘అభివృద్ధి’ భారతదేశపు పునర్ని ర్మాణం పరిపూర్ణ దశకు చేరాలన్నా – ఈ మొత్తం ఎక్కాదక్కా ఇంకా మిలిగి పోయే ఉంటుంది.

డిజిటల్‌ కరెన్సీయే లక్ష్యమా?
కాగా, ఎదగకముందే ‘జాంబవంతుడి అంగలతో ముందుకు దూకే పేరుతో ఉన్న కరెన్సీ పునాదులకు ఎసరు పెట్టుకోకూడదు. చెలామణీలోని కరెన్సీ విలువ నిలకడగా లేదు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్టుగా కొత్తగా తలపెట్టిన ప్రయోగంతో నగదు (క్యాష్‌) లావాదేవీలను డిజిటల్‌ (ఎలక్ట్రానిక్‌) మాధ్యమం ద్వారా బట్వాడా చేయటం మంచిదని మోదీ భావించారు.  దేశ లావాదేవీలను టెక్నాలజీ మాధ్యమంలో నిర్వహించాలని ఆ వైపుగా పదే పదే సూచించడంలోని అర్థం అదేనని గ్రహించాలి. కానీ ఎలక్ట్రానిక్‌ మాధ్యమాన్ని నగదు బదిలీలకు వినియోగించడం ద్వారా ఎన్ని కుంభకోణాలకు ఆహ్వానం పలకవచ్చో అమెరికా, యూరప్‌ దేశాల్లో నేరాలు రుజువు చేశాయని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త డేవిడ్‌ క్రోటన్‌ వెల్లడిం చాడు(‘వెన్‌ కార్పొరేట్స్‌ రూల్‌ ది వరల్డ్‌’). ‘లాభంలేనిదే వ్యాపారి వరదన పోడన్న’ట్టుగా ఈ టెక్నాలజీ విశ్వరూపం ‘మైక్రోసాఫ్ట్‌’ దిగ్గజం బిల్‌గేట్స్‌ వంటి వారి అడ్డూ అదుపూ లేని కలలు నెరవేర్చుకోడానికి ఉద్దేశించినదే తప్ప, లాభాల వేటలో సాధారణ వాస్తవ పరిస్థితులకు ఆ కలలు పనికిరావని డిజి టల్‌ టెక్నాలజీ– సమాచార యుగపు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి డిజిటల్‌ (ఎలక్ట్రానిక్‌) టెక్నాలజీ చౌకగానే లభ్యం కావచ్చు. కానీ టెక్నాలజీని పెంచుకోవాలన్నా, విస్తరించాలన్నా తగినన్ని ఆదాయ వనరులను పెంచుకో వాలన్నా అవకాశాలు తక్కువనీ, ముఖ్యంగా భారీ రుణాలు తీసుకుంటూ, ఖరీదైన కరెన్సీ అందుబాటులోలేని వర్ధమాన దేశాలకు ద్రవ్య వనరులు పెంచుకునే అవకాశాలు లేనిచోట్ల టెక్నాలజీ విస్తరణ మరీ కష్టం కావచ్చుననీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనుకనే, టెక్నాలజీ ద్వారా సమాచారం బట్వాడా చేసే పద్ధతులు వచ్చిన తరువాత దేశాల ఆర్థిక వ్యవస్థలకు పునాది అయిన మాన్యుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలు కూడా కునారిల్లిపోయాయని నిపు ణుల భావన. అందువల్ల ఎలక్ట్రానిక్‌ మాధ్యమం ద్వారా కరెన్సీ లావాదేవీలు జరపడానికి ఉత్సాహపడుతున్న మోదీ ఒక్కసారి వెనుదిరిగి ఆలోచించు కోవటం శ్రేయస్కరం కాదా?!
http://img.sakshi.net/images/cms/2015-07/41437415774_Unknown.jpg
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement
Advertisement