ప్రతిపక్షమే వద్దనుకుంటే...! | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షమే వద్దనుకుంటే...!

Published Thu, Oct 27 2016 1:57 AM

ప్రతిపక్షమే వద్దనుకుంటే...!

సందర్భం
ఆత్మగౌరవ పాలనంటే కేవలం ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాలతోటే పాలన సాగడం కాదు. పార్టీ, ప్రభుత్వం టోకున వ్యక్తి చుట్టూ తిరగడం, ప్రతిపక్షమే వద్దనుకోవడం ప్రజాస్వామ్య మూలాలకే ప్రమాదకరం.

సుదీర్ఘపోరాటం, త్యాగాల నేపథ్యంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2014 జూన్‌ 2న కొత్త రాష్ట్రం ఏర్పడింది. 14 ఏండ్లుగా ఉద్య మంలో కొనసాగిన టీఆర్‌ ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారు. అయితే పార్టీ పెట్టిన నాడు ప్రముఖ పాత్ర వహించిన వారిలో ఎక్కువ మంది తర్వాత కనుమరుగైనారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన వారు కూడ దూరమైనారు. చివరిదాకా కేసీఆర్‌తో అంటిపెట్టుకొని ఉన్నవారికి కూడా తగిన గుర్తింపు రాలేదనే అసంతృప్తులున్నాయి.

మొత్తంమీద కేసీఆర్‌ దీర్ఘకాలిక వ్యూహంతో నడు స్తున్నట్లుంది. ఇక్కడ ఏ పార్టీ ఉండ కూడదనే దురభిప్రాయం కనబడుతు న్నది. అందుకనే తెలంగాణ ఉద్య మంలో లేని అనేక మందికి మంత్రి పదవులు, ఎంపీ, ఎమ్యెల్యే, ఎమ్మెల్సీ లాంటి ప్రధాన పదవులిచ్చారు. అంతే కాకుండా వివిధ రాజకీయ    పార్టీల గుర్తుల మీద ఎన్నికలలో గెలి చిన దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అనేకమంది ఎమ్మెల్సీలను, ముగ్గురు ఎంపీలను పార్టీలో చేర్చుకొని ఫిరా యింపులను బాగా ప్రోత్సహించారు. వారిని టీఆర్‌ఎస్‌లో కలుపుకున్నారు. పార్టీ పూర్తిగా తన కనుసన్నలలో సాగేలాగా పూర్తిస్థాయి ఆధిపత్యం సాధిం చగలిగారు. ఆయన చెప్పిందే వేదం.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు లెక్కలేదు. తెలంగాణ తెచ్చుకున్నది ఒక్క వ్యక్తికి పట్టం కట్టబెట్టడానికి కాదు. అనేక సంవత్సరాలుగా అణచి వేతకు గురయిన తెలంగాణలో సామాజిక న్యాయం, మానవాభివృద్ధి జరగాలని, అందుకే మా నీళ్ళు, మా ఉద్యోగాలు మాకే దక్కాలని, సహజ వనరులను కాపాడు కోవాలనీ, ఆత్మగౌరవ పాలన సాగాలనే డిమాండ్లే ఉద్యమ ఆకాంక్షలయ్యాయి. కానీ అందుకు పూర్తిగా భిన్న మైన పాలన సాగడంతో వివిధ రాజకీయ పార్టీలు, మేధా వులు, ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జేఏసీ లాంటి ఉద్యమ సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఆత్మగౌరవ పాలనంటే కేవలం ముఖ్యమంత్రి ఇష్టా యిష్టాల మీద పాలన సాగడమా? రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నాయకులు ప్రాతినిధ్యం చేయడానికి అర్హులు కారా? ఆఖరుకు వికలాంగులను కూడా కల వకపోతే ముఖ్యమంత్రి క్యాంపు దగ్గరనే ఆత్మహత్యకు పాల్పడే స్థితికి రావడం దేనికి సంకేతమిస్తున్నది? టీఆర్‌ఎస్‌ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కూడా అపుడపుడు మనసు నొచ్చుకుంటు న్నారు. పదవులలో ఉండాలనుకుంటే భరించాల్సిందేననే ఆవేదనలు వారిలో లేకపోలేదు. దీంతో వ్యక్తి చుట్టూ్ట పార్టీ భ్రమిస్తుందనే చర్చ సాగడం సహజం. అధికార యంత్రాంగమంతా కేసీఆర్‌ కనుసన్నలలోనే సాగుతున్న దనే భావనలు నెలకొన్నాయి. పోలీసు వ్యవస్థ పూర్తిగా టీఆర్‌ఎస్‌ ప్రతినిధులకు ప్రాముఖ్యతనిస్తున్నది. ప్రతి పక్షాలు ఉద్యమబాట పట్టడం తప్ప వేరే మార్గం లేదు.

2014 వరకు టీఆర్‌ఎస్‌ ప్రతిపక్షమే, అప్పుడు వారు పత్రికా ప్రకటనలు, విమర్శలను నెమరు వేసుకుంటే మంచిది. ప్రతిపక్షాలు విమర్శిస్తే భరించే పరిస్థితి లేక పోవడం, అసహనానికి గురి అవుతూ, తన స్థాయిమరచి దిగజారి ప్రతిపక్షాలపై విరుచుకుపడటం అప్రజాస్వామ్య మనిపించుకుంటుంది. పథకాల అమలులో లోపాలను ఎత్తిచూపితే శత్రువుల్లాగా చూస్తున్నారు. ప్రతిపక్షాలను గౌరవించని, గుర్తించని వ్యవస్థను ఏమనుకోవాలి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు విధిగా ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీకి విధి విధానా లుంటాయి. వాటిని తప్పుపట్టే అధి కారం ఎవ్వరికీ లేదు. ప్రభుత్వంలో తప్పులు దొర్లితే వేలెత్తి చూపడం, ప్రజలకు జరుగుతున్న అన్యాయా లను ప్రభుత్వం దృష్టికి తేవడం ప్రతి పక్షాల ప్రధాన బాధ్యత. ప్రతిపక్షాలకు సీట్లే రావనే ఆలో చనే అహంభావానికి అద్దం పడు తున్నది. ప్రతిపక్షాలు కేసీఆర్‌ ప్రభు త్వానికి భజన చేయాలనే ఆలోచన ఉంటే మంచిది కాదు. అలా అయితే ఇక పార్టీలెందుకు? తెలంగాణ ప్రభుత్వ ఆలోచనల మూలంగా రాజ కీయ వ్యవస్థ కుప్పకూలిపోతున్నది.

ప్రతిపక్షాలను అణచివేయాలనుకోవడమంటే ప్రజాస్వామ్య మూలసూత్రాలకు తిలోదకాలివ్వడమే అవు తుంది. చాలా కాలం తర్వాత ఆగస్టు 20న జిల్లాల పున ర్విభజన పైన సీఎం కేసీఆర్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఆయన మాట్లాడిన తీరు ప్రతిపక్షాలను ఆకట్టుకున్నది. మనం అనే భావనను వ్యక్త పరిచారు. 15 రోజులకొకసారి, రెండుసార్లు అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తానని, అందరి అభిప్రాయాల ననుసరించి జిల్లాల పునర్విభజన ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎందుకు అఖిలపక్షాన్ని పిలువ లేద న్నది ప్రశ్న. ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉండక పోతే ఏమనుకోవాలి. తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాజకీయపార్టీలతో, జేఏసీ తదితర సామాజిక సంస్థలతో మమేకమైన కేసీఆర్‌ ఈనాడు వారందరినీ దూరంగా ఉంచడంలో ఆంతర్యమేమిటి? వారంతా మీకేమైనా శత్రువులనుకుంటున్నారా? అందరూ కలిసి తెలంగాణ సమగ్రాభివృద్ధికి, సకల ప్రజల బ్రతుకులు బాగుచేయ డమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ ఉండాలి. అందుకని అందరి సలహాలు తీసుకొని ఏకాభిప్రాయానికి రండి! తెలంగాణలో దారిద్య్రరేఖకు దిగువనున్న బడుగు బలహీన వర్గాల ప్రజల బ్రతుకులలో వెలుగు నింపే లక్ష్యంగా ఆలోచనలుండటం సబబుగా ఉంటుంది.

వ్యాసకర్త చాడ వెంకటరెడ్డి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
మొబైల్‌ : 94909 52301
 

Advertisement
Advertisement