గాయత్రీ మంత్రం 24 అక్షరాలే! | Sakshi
Sakshi News home page

గాయత్రీ మంత్రం 24 అక్షరాలే!

Published Sun, Dec 25 2016 11:48 PM

గాయత్రీ మంత్రం 24 అక్షరాలే!

విమర్శ
ఓం భూర్భువః స్వః తత్‌ సవితుర్వరేణ్యమ్‌ భర్గో దేవస్య ధీ మహి
ధియో యోనః ప్రచోదయాత్‌
ఇది మనకు తెలిసిన గాయత్రీ మంత్రం. ఈ గాయత్రీ మంత్రాన్ని మనం చాలా సార్లు చదివే ఉంటాం. చాలా సార్లు వినే ఉంటాం. కొన్ని సార్లయినా అనే ఉంటాం. చాలా కాలంగా గాయత్రీ మంత్రం ఈ రూపంలో మనలో చలామణిలో ఉంది. కాలక్రమంలో కొన్ని విషయాలలో కొన్ని తప్పులు దొర్లడం మనం చూసిందే. అలా గాయత్రీ మంత్రం విషయంలోనూ ఒక పొరపాటు జరిగింది.
గాయత్రీ ఛందస్సు ఇరవై నాలుగు అక్షరాలు కలది. అంటే గాయత్రీ మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలే ఉండాలి. ఇది శాస్త్రం. నిజానికి గాయత్రీ మంత్రం ఇరవై నాలుగు అక్షరాలదే. ప్రస్తుతం చలామణిలో ఉన్న గాయత్రీ మంత్రంలో మాత్రం మనకు ఇరవై ఎనిమిది అక్షరాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో ఎక్కడో ఈ మంత్రం ఆకృతి మారింది.

భూః , భువః ,స్వః, అన్నవి వ్యాహృతులు. ముందు ఈ వ్యాహృతులను పలికాక నిజమైన మంత్రాన్ని పలికే పద్ధతి ఉండేది. ‘మంత్రాణామ్‌ ప్రణవశ్శిరః’ కదా? ఓం కారంతో గాయత్రీ మంత్రం – ఓం తత్‌ సవితుర్వరేణ్యమ్‌   – ఎనిమిది అక్షరాలు
భర్గో దేవస్య ధీ మహి         – ఎనిమిది అక్షరాలు
ధియో యోనః ప్రచోదయాత్‌  –  ఎనిమిది అక్షరాలు  వెరసి ఇరవై నాలుగు అక్షరాలు.
ఓం కారాన్ని వ్యాహృతులైన భూః, భువః, స్వః లకు ముందు చేర్చి మంత్రోచ్చారణ చెయ్యడం పొరపాటున ఎప్పుడో ఎక్కడో మొదలయి ఉంటుంది. అందువల్ల గాయత్రీ మంత్రంలో ప్రస్తుతం మనకు ఇరవై ఎనిమిది అక్షరాలు కనిపిస్తున్నాయి.

ఋషి ప్రోక్త గాయత్రీ మంత్రం:
‘‘ఓం తత్‌ సవితుర్వరేణ్యమ్‌ భర్గో దేవస్య ధీ మహి  ధియో యోనః ప్రచోదయాత్‌.’’
నాకు దొరికిన ఈ పురాతన భాస్కర యంత్రంలో కూడా ఈ ఇరవై నాలుగు అక్షరాల గాయత్రీ మంత్రమే కనిపిస్తోంది. ఇదే సరైన గాయత్రీ మంత్రం. మరో విషయం, ఇవాళ మనకు పలు దేవతల గాయత్రీలు కనిపిస్తున్నాయి. అవి ఇరవై అక్షరాల ఆకృతిలో లేవు. అంటే వాటికి శాస్త్రీయ ప్రాతిపదిక లేదనేది నిర్వివాదాంశం.
ఇప్పటికైన మనం సరైన అవగాహనతో ఋషి ప్రోక్త గాయత్రీ మంత్రాన్ని అనుసంధానం చేసుకుందాం.

వ్యాసకర్త : రోచిష్మాన్‌ 094440 12279

Advertisement

తప్పక చదవండి

Advertisement