సూర్యలంకలో కథా సరిత్సాగరం | Sakshi
Sakshi News home page

సూర్యలంకలో కథా సరిత్సాగరం

Published Mon, Nov 7 2016 12:54 AM

కథను విశ్లేషిస్తున్న వాడ్రేవు చినవీరభద్రుడు

నివేదిక
రోజువారీ ఉరుకుల పరుగులకు దూరంగా ఏ అడవిలోనో, ఏ చెరువు గట్టునో ఒక రెండు రోజులు కథ గురించి సావకాశంగా మాట్లాడుకోవడం ఏ రచయితకైనా కమ్మటి కల! దాదాపు రెండు దశాబ్దాలుగా, ఏడాదికి ఒకసారి, కుదరకపోతే రెండేళ్లకోసారైనా అట్లాంటి కలను నిజం చేస్తున్నారు ఖదీర్‌–సురేశ్‌ మిత్రబృందం!

తాజా కథా సమావేశం అక్టోబర్‌ 22, 23 తేదీల్లో బాపట్ల దగ్గరి సూర్యలంక బీచులో జరిగింది. సీనియర్‌ రచయిత దాదా హయత్‌ నుండి, కొత్తగా రాస్తున్న శిరీష వరకు సుమారు పాతిక మంది ఇందులో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన చిలుకూరి దేవపుత్రను స్మరించుకుంటూ మొదలైన ఈ సమావేశంలో– కథా రచనలో ఎదుర్కొనే సవాళ్లు, కొందరు విరివిగా రాయడం, కొందరు అలా రాయలేకపోవడం, విరివిగా రాసే రచయితల్లో క్వాలిటీ ఉండదనే అపోహ, కథారచనలో ప్రయోగాల అవసరం, నిడివి ఎక్కువున్న కథల ప్రచురణలోని ఇబ్బందులు, సజీవ భాషను వాడటంలోని పరిమితులు, సాహిత్యం– సినిమా నడుమ సంబంధాలు, సామాజిక, రాజకీయ అంశాలను కథలుగా మలిచేటప్పుడు ఒక రచయితకు ఆయా అంశాల తాలూకు చరిత్ర గురించీ, సిద్ధాంతాల గురించీ ఉండాల్సిన అవగాహన వంటి అనేక అంశాలు చర్చకు వచ్చాయి.

తన పైన వామపక్ష భావజాల ప్రభావం ఒకవైపూ, గాంధీయిజం ప్రభావం మరోవైపూ ఉన్నాయనీ, అందుకే తన కథల్లో వాడిన కొన్ని పదాలలో కూడా వాటి ప్రభావం కనిపిస్తుందనీ దాదా హయత్‌ అన్నారు. అంతేగాక, సోవియట్‌ రష్యా ముక్కలైన తర్వాత తాను ఒకలాంటి గందరగోళంలో పడిపోయాననీ, ఇప్పుడిప్పుడే మళ్లీ సీరియస్‌గా కథారచన చేయాలని భావిస్తున్నాననీ చెప్పారు.
భారతదేశంలోని మేధావులు, మేధావి రచయితలు, మార్క్సిజం, సోషలిజం పేర గాంధీయిజాన్ని రుద్దారనీ, అది ఒక విధంగా హిందుత్వ ఎజెండాని రుద్దటం లాంటిదేననీ జి.ఎస్‌.రామ్మోహన్‌ స్పందించారు. సమాజాన్నీ, మానవ సంబంధాలనూ అర్థం చేసుకోవడానికి మార్క్సిజం ఒక శాస్త్రంగా కొన్ని పనిముట్లను ఇస్తే, గాంధీ జీవితం ఆధారంగా ఆయన అనుయాయులు కొందరు ‘గాంధీయిజం’ను సృష్టించారనీ, అందువలన రెండింటినీ పోల్చలేమనీ ఇతర మిత్రులు అభిప్రాయపడ్డారు.

‘తను’ ప్రయోగాన్ని సీనియర్‌ కథకులు కూడా ఎలా తప్పుగా ప్రయోగిస్తున్నారో కాకుమాను శ్రీనివాసరావు ఎత్తిచూపినప్పుడూ, ‘ఎక్కడ కథ పూర్తి అయిందో, దానికి కొనసాగింపుగా నా చిత్రం ఉంటుం’దని అక్బర్‌ చెప్పినప్పుడూ మిత్రులు ఎంతో ఆసక్తిగా విన్నారు.
ఈ సాగరతీర కథా సమావేశంలో గుర్తుంచుకోదగిన రెండు విశేషాలున్నాయి. ఒకటి: ఆంధ్రప్రదేశ్‌ సర్వశిక్షా అభియాన్‌కు ముఖ్యాధికారిగా ఉన్న గుర్రాల శ్రీనివాస్‌(మణివాస్‌) తన జీవితానుభవాలను పంచుకోవడం!

మలాన్ని ఎత్తిపోసే దళిత కులం(తోటివాళ్లు) నుండి వచ్చిన తొలి ఐఏఎస్‌ శ్రీనివాస్‌! ఆయన కథను విన్నప్పుడు అర్థం అయ్యేదేమిటంటే, ఐఏఎస్‌ లాంటి ఉన్నతస్థాయికి వెళ్లినా దళితుడిని కులం వెంటాడుతూనే ఉంటుందని! చివరకు దళిత కులాలు కూడా వీళ్లని తక్కువగా చూడటం ఒక విషాదం! శ్రీనివాస్‌ తన తండ్రి పెంచలయ్య గురించి చెప్పిన సంగతులు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. విస్తృతమైన చదువరి అయిన శ్రీనివాస్‌కు తెలుగు రచయితలు తమ రచనలలో వాడే శుద్ధి చేయబడిన భాషను గురించి ఫిర్యాదులున్నాయి. ‘ఏడు తరాలు’ వంటి రచనలు తెలుగులో విరివిగా రావాలన్నది ఆయన ఆశ! అయితే, ఆయనే తన జీవితకథను ఒక నవలగా మలచాలని మిత్రులందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ఇక, రెండవ విశేషం, కథా వర్క్‌షాప్‌లా నడిచిన చినవీరభద్రుడి తరగతి! రెండు భాగాలుగా సాగిన ఈ తరగతిలో భద్రుడు తను అనువదించి తెచ్చిన రెండు కథలను మిత్రులతో చదివించారు. మొదటి కథ– అమెరికన్‌ పోస్ట్‌ మోడర్నిస్ట్‌ కథకుడు డొనాల్డ్‌ బార్తెల్మి (1931–89) రాసిన ‘ఎట్‌ ద టాల్‌స్టాయ్‌ మ్యూజియం’. ఒక ప్రక్రియగా కథారచనలో ఉండవలసిన ప్రయోగశీలత్వం గురించి ఈ కథ వివరిస్తుంది.
‘కథారచన కూడా ఒక కళే కాబట్టి, కథకి కూడా రెండు ధర్మాలున్నాయి. ఒకటి, తన కాలం నాటి విలువల్నీ, వ్యవస్థనీ నిలబెట్టడం, లేదా, రెండోది, ఆ విలువల్నీ, వ్యవస్థనీ ప్రశ్నించడం. అట్లా ప్రశ్నించే బాధ్యతని పైకెత్తుకున్న కథలు వస్తువులో మాత్రమే విప్లవాత్మకతను చూపిస్తూ, శిల్పంలో మాత్రం సంప్రదాయ విలువల్నే పాటించడం ఎంతవరకు సమంజసం? అందుకని, కథకుడు ఒక రెబెల్‌ కావాలనుకుంటే, ముందుగా గతానుగతికమైన కథాశిల్పాన్ని ధ్వంసం చేయవలసి వుంటుంది. అందుకు, కథకుడు నిత్యప్రయోగశీలిగా ఉండవలసి వుంటుంది’ అని విశ్లేషించారు భద్రుడు.

ఇక, రెండవ కథ– సమకాలీన రియలిజంకు సంబంధించి ఆయన ఉదహరించిన ఆస్ట్రేలియన్‌ రచయిత డేవిడ్‌ మలాఫ్‌ (జ.1934) రాసిన ‘ద ఓన్లీ స్పీకర్‌ ఆఫ్‌ హిజ్‌ టంగ్‌’. ఆధునిక కథ ఎడ్డార్‌ అలెన్‌ పోతో మొదలైందనుకుంటే, డార్క్‌ రొమాంటిసిజం, నాచురలిజం, రియలిజం, ఇంప్రెషనిజం, మోడర్నిజం, క్రిటికల్‌ రియలిజం, ఎక్స్‌ప్రెషనిజం, సర్రియలిజం, అబ్సర్డిజం, మాజికల్‌ రియలిజం, పోస్ట్‌ మాడర్నిజంలను దాటి మళ్లా కథాప్రపంచం రియలిజంవైపే మొగ్గు చూపిస్తున్నదని భద్రుడి పరిశీలన! అయితే, పాత రియలిజం బాహ్య ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తే, కొత్త రియలిజం అంతర్లోక ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోందని ఆయన అంటారు.
మొత్తమ్మీద, సముద్ర తీర సూర్యోదయ, సూర్యాస్తమయాల నడుమ సాగిన ఈ సూర్యలంక కథా సమావేశం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరొక కథా సమావేశానికి తిరిగి కలవాలన్న ఉత్సాహాన్ని ఇచ్చింది.

కోడూరి విజయకుమార్‌
ఫొటో: అక్కిరాజు భట్టిప్రోలు
 
 

Advertisement
Advertisement