కొత్త సినిమా విడుదల ఎప్పుడో? | Sakshi
Sakshi News home page

కొత్త సినిమా విడుదల ఎప్పుడో?

Published Wed, Jan 6 2016 3:16 PM

కొత్త సినిమా విడుదల ఎప్పుడో?

 డేట్‌లైన్ హైదరాబాద్
 పతాక సన్నివేశం తరువాత ఎప్పటిలాగే శుభం కార్డు పడింది. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్న ప్రశ్న మిగిలే ఉంది. ప్రస్తుతానికైతే ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయటపడడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కొంతకాలం పాటు అపూర్వ సహోదరుల మాదిరిగానే కొనసాగుతారు.
 
 ‘ఆగర్భ శత్రువులు-అపూర్వ సోదరులు’ అనే చలనచిత్రాన్ని 2015 సంవత్సరంలో మనం రెండు భాగాలుగా చూశాం. ఇక ఈ ఏడాది ఎలాంటి సినిమాలు చూపించబోతున్నారో మన నాయకులు? కొత్త సంవత్సరం ప్రవేశించింది ఇప్పుడే కదా! తినబోతూ రుచులు అడగడం ఎందుకు? అయితే 2016లో కూడా మనం తప్పనిసరిగా కొన్ని సినిమాలు చూస్తాం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అయితే కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఒక సినిమా చూపించేశారు. మొన్న ప్రకాశం జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ ఆయన చూపించిన సినిమాకు, ‘బాబుగారి గది’ అని పేరు పెడితే బాగానే ఉంటుంది. ఈ మధ్యనే ‘రాజుగారి గది’ అన్న పేరుతో ఒక బడ్జెట్ సినిమా విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా కథ ఏమిటంటే, ఆ రాజుగారి గదిలో అన్నీ దయ్యాలూ, భూతాలూ ఉన్నట్టు భ్రమ కలుగు తుందట.

ఆయన వైఖరి చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఇలాంటి భ్రమలే కలుగుతున్నాయేమోననిపిస్తుంది. ఆయననూ, ఆయన ప్రభుత్వాన్నీ ఎవరు విమర్శించినా, నిరసించినా సరే, అందులో చంద్ర బాబుకు వైఎస్‌ఆర్‌సీపీయే కనిపిస్తున్నదట. ఆయన రాజ్యంలో ఎవరూ నిరసన తెలిపే సాహసం చేయకూడదు. అసలు నిరసనకారులంతా ఆయన కంటికి టైస్టుల మాదిరిగా కనిపిస్తున్నారు. నిరసన తెలియచేస్తారని ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో, వారందరినీ బాబుగారి పర్యటన సంద ర్భంగా పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు కర్తవ్యాన్ని పూర్తి చేశారు. జర్నలిస్టులకూ సమస్యలు ఉంటాయి, వారు కూడా నిరసన తెలియచేయగలరన్న ఊహ తట్టకపోవడం వల్ల పోలీసులు విలేకరుల జోలికి పోలేదు. తీరా ప్రెస్ గ్యాలరీలో కూర్చున్న విలేకరులు తమ బొడ్లో దాచి పెట్టిన నినాదాల కాగితాలు తీసి ప్రదర్శించడంతో చంద్రబాబుగారికి ఎక్కడ లేని ఆగ్రహం పెల్లుబికింది.

విలేకరులు బొడ్లో నుంచి తీసినవి కాగితాలే, కత్తులు కావు. అయినా వాళ్లు కూడా ఆయనకు టైస్టుల్లాగే కనిపించారు. అంతేకాదు, ఆ జర్నలిస్టులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం కూడా వైఎస్‌ఆర్‌సీపీ నడుపుతున్న సంఘంలా కనిపించింది. అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎవరు నిరసన తెలియచేసినా కూడా ఆ నిరసనకారులంతా వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులుగా, లేదా ఆ పార్టీ అనుబంధ సంస్థల సభ్యులుగానో చంద్రబాబు కంటికి కనిపిస్తున్నారు.
 
తొలిభాగంలో...
తాము మనుగడ సాగిస్తున్నది ప్రజాస్వామిక వ్యవస్థ అన్న సంగతిని చంద్ర బాబు మరచిపోతున్నారు. ‘ఏదన్నా అడుక్కోవాలంటే ఓ పక్కకొచ్చి నిలబడండి! వెళ్లేటప్పుడు చూస్తాను. అంతేకానీ నిరసన తెలియచేస్తే మీ సంగతి తేలుస్తా!’ అని బెదిరిస్తారాయన. నిరసనకారులంతా మన పాలకులకు అడు క్కునేవాళ్ల మాదిరిగా కనిపించడం ప్రజాస్వామ్యానికి చేటు. జర్నలిస్టులకు సంబంధించి ఇలాంటి బెదిరింపులు ఇంకొక చోట కూడా వినిపించిన సంగతి గుర్తుకు రావడం లేదా!? ఔను, చంద్రబాబుకు అపూర్వ సోదరుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా అధికారంలోకి రాగానే తెలంగాణ జర్నలిస్టుల నిరసనను అణచివేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంతకంటే తీవ్ర స్వరంతో హెచ్చరికలు సంధించారు.

ఈయన మీ సంగతి తేల్చేస్తానన్నారు. ఆయన మెడలు విరిచి అవతల పారేస్తానన్నారు. ఈ రెండు వ్యక్తీకరణలకీ పెద్ద తేడా లేదు. ఆరు దశాబ్దాల సమరశీల పోరాటాల చరిత్ర కలిగిన జర్నలిస్ట్ ఉద్యమానికి రాజకీయ ముద్రలు వేసే ప్రయత్నం చేస్తు న్నారు. బాబుగారు గది నుంచి బయటకు వస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అసలు సినిమా ‘ఆగర్భ శత్రువులు-అపూర్వ సోదరులు’ విషయానికి వస్తే; ముందే చెప్పుకున్నట్టు ఇది రెండు భాగాలుగా సాగింది. ఫిరాయింపు రాజకీయాలు, ఎంఎల్‌సీ ఎన్నికలు, ఓటుకు కోట్లు వ్యవహారం, శాసనసభ్యుడే జైలుకు వెళ్లడం, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రే అవినీతిని ప్రోత్సహిస్తూ ఫోన్‌లో మాట్లాడి పబ్లిగ్గా దొరికిపోవడం, నువ్వు జైలుకు పోతావంటే, నువ్వు నాశనమైపోతావని ముఖ్యమంత్రులిద్దరూ రోడ్డెక్కి బాహాటంగా తిట్టుకోవడం మొదటి భాగంలో చూశాం.

ఇంకా, కొన్ని రోజుల పాటు సాగిన ఉద్రిక్త వాతావరణంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చంద్రశేఖరరావు బహిరంగ వేదికల మీదే గర్జించగా, నీ అంతు చూస్తాను, నాకూ ఏసీబీ ఉంది. పోలీసులూ ఉన్నారు అంటూ చంద్రబాబు విజయవాడ వీధులలో హుంకరిం చారు. ముఖ్యమంత్రులమన్న సంగతి సరే, అసలు నాగరికులమన్న స్పృ హను కూడా వారు కోల్పోయారు. వీరి కోపతాపాలకు అనుగుణంగా అటూ ఇటూ మంత్రులు, ఎంఎల్‌ఏలు, పార్టీల నాయకులు ఒకరినొకరు నోరారా తిట్టుకోవడం వంటి ఘట్టాలు కూడా ఈ భాగంలోనే తిలకించాం.
 సినిమా ఏ మలుపు తిరుగుతుందోనని అనుకుంటూ విశ్రాంతి సమ యంలో చాయ్ తాగి థియేటర్‌లోకి వచ్చిన ప్రేక్షకులు దిమ్మెరపోయారు. రెండోభాగంలో ఆ ఇద్దరూ అపూర్వ సోదరులైపోయారు. ఆలింగనాలు, పుష్పగుచ్ఛాలు, పిండివంటలతో  భోజనాలు, దుశ్శాలువలతో మర్యాదలు, వాటిని కొనసాగింపుగా ఆహ్వానాలు- ఇదీ వరస.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి  చంద్రబాబు స్వయంగా విచ్చేస్తే, తాను నిర్వహించిన అయుత చండీయానికి రమ్మని చంద్రబాబును పిలవడానికి చంద్రశేఖరరావు విజయవాడ వెళ్లారు. ఈ ఆహ్వానాల కార్యక్రమం కోసం వారు ఉపయోగించిన హెలికాప్టర్ తదితర సౌకర్యాలకు అయిన ఖర్చంతా రెండు రాష్ట్రాల ప్రజలదే. అట్టహాసంగా జరిగిన అమరావతి శంకుస్థాపనకు చంద్రశేఖరరావు హాజరు కాగా, అయుత చండీయాగానికి దీక్షా వస్త్రాలు ధరించి మరీ చంద్రబాబు హాజరయ్యారు.
 
ప్రభుత్వాధినేత యాగం చేస్తే ఎలా?

అమరావతి శంకుస్థాపన గురించీ, చండీయాగం గురించి ఇక్కడ కొంచెం స్పష్టంగా మాట్లాడాలి. స్పష్టంగా అనడం ఎందుకంటే, వాటి గురించి బాహా టంగా విమర్శించడానికి చాలామంది జంకుతున్నారు. కొంతమంది తమలో తాము గొణుక్కుంటూ ఉంటే, కొందరు తమకెందుకులే అని మౌనం దాల్చారు. అమరావతి వ్యవహారంలో కొద్దిపాటి నిరసన అయినా వ్యక్తమైం ది. ఆ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీ. అది బలమైన ప్రతిపక్షం. వైఎస్‌ఆర్‌సీపీ, ఇతర పార్టీలు కూడా శంకుస్థాపన ఆర్భాటాన్నే కాకుండా, ఇతర అంశాల గురించి కూడా గళం ఎత్తాయి. కొన్ని కోట్ల ప్రజాధనం ఎందు కు వృథా చేయాలని విమర్శించాయి.

అయుత చండీయాగం విషయంలో అలా కాదు. సొంత సొమ్ముతో నిర్వహిస్తున్నానని చంద్రశేఖరరావు ప్రకటిం చారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ మూఢ నమ్మకాలను పారద్రోలి ప్రజలలో శాస్త్రీయ అవగాహన పెంచవలసిన కాలంలో ప్రభుత్వాధి నేతలు యాగాలు చేయడం ఏమిటని ఒక్కరూ ప్రశ్నించకపోవడం విచార కరం. పూర్వం రాజులు ఈ యాగాలు చేశారు. అవన్నీ రాజ్య విస్తరణ కాంక్షతో చేసినవే తప్ప, ప్రజల క్షేమం కోసం చేసినవి మాత్రం కాదు.
 
తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అయుత చండీయాగం చేస్తానని మొక్కుకు న్నట్టు చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇంకేముంది! అందరి నోళ్లూ మూతప డ్డాయి. అక్కడ అమరావతి నిర్మాణం విషయంలో విమర్శలు ఎక్కుపెట్టిన వారిని రాజధానికే వ్యతిరేకులని ఏ విధంగా ముద్ర వేస్తున్నారో, తెలంగా ణలో కూడా అయుత చండీయాగాన్ని విమర్శిస్తే తెలంగాణకే వ్యతిరేకులన్న ముద్ర పడవచ్చుననే వాతావరణం కల్పించారు. యాగాలు మత సంబంధమై నవి. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. వాటిని చులకన చేయవలసిన అవ సరం లేదు. కానీ అవి వ్యక్తులకూ, వారి ఇళ్లకూ పరిమితం కావాలి. అంతే తప్ప, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాధినేతలు యాగాలు చేయడం సరికాదు. వ్యక్తిగత హోదాలో సీఎం ఈ యాగాన్ని నిర్వహించారనే అనుకుంటే, ప్రజా స్వామ్యంలోని నాలుగు అంగాలకు చెందిన పెద్దలు కూడా పాల్గొనడం ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి దోహదం చేయగలుగుతుంది?
 
పతాక సన్నివేశంలో...
 ఇక సినిమా పతాక సన్నివేశం తరువాత ఎప్పటిలాగే శుభం కార్డు పడింది. కానీ తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య ఈ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్న ప్రశ్న మిగిలే ఉంది. ప్రస్తుతానికైతే ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయట పడడం కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి తెలం గాణ సీఎం కొంతకాలం పాటు అపూర్వ సహోదరుల మాదిరిగానే కొనసాగు తారు. తెలంగాణ రాష్ట్రానికి మకుటం హైదరాబాద్. అక్కడ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎప్పుడూ గెలవలేదు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా గెలవలేకపోతే ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతుంది. గెలవాలంటే హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రుల ఓట్లు కావాలి. జీహెచ్‌ఎంసీ ఎన్ని కలు పూర్తి కాగానే ఈ సంవత్సరంలోనే ఈ ముఖ్యమంత్రులు ఇద్దరూ రాజకీయ వెండితెర మీద మరో కొత్త సినిమా చూపించినా ఆశ్చర్యపోనక్కరలేదు.   

(వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రెటరీ జనరల్, datelinehyderabad@gmail.com )
 

Advertisement

తప్పక చదవండి

Advertisement