జనమే ఊపిరిగా జైత్రయాత్ర | Sakshi
Sakshi News home page

జనమే ఊపిరిగా జైత్రయాత్ర

Published Sat, Jul 8 2017 6:58 AM

జనమే ఊపిరిగా జైత్రయాత్ర - Sakshi

ఒక చారిత్రక అవసరంగా ఏర్పడిన వైఎస్సార్‌ కాంగ్రెస్, 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాక తప్పదనే మరో చారిత్రక అవసరం దిశగా పయనిస్తోందని చెప్పడంలో ఏ సందేహం లేదు. నేటి నుంచీ గుంటూ రులో జరుగనున్న పార్టీ 3వ జాతీయ ప్లీనరీ సమావేశాలు ఆ దిశగా మార్గనిర్దేశం చేయనున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతితో ఏర్పడిన రాజకీయ సంక్షోభాల సుడిగుండంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిక్కుకున్న నేపథ్యంలో 2011 మార్చి 12వ తేదీన ఇడుపుల పాయలోని వైఎస్‌ సమాధి సాక్షిగా ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఒక చారిత్రక అవసరంగా పురుడు పోసు కున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ఆరేళ్ల ఒడిదుడుకుల ప్రస్థానాన్ని దాటుకుని ఏడవ ఏడాదిలో నేడు ఓ బలీయమైన రాజకీయ శక్తిగా ముం దుకు సాగుతోంది. పార్టీ ఆవిర్భవించినపుడు వెల్లువెత్తిన జనాదరణను చూసి మొగ్గలోనే దాన్ని చిదిమి వేసేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి.

జగన్‌ ప్రభావానికి క్రమంగా క్షీణిస్తున్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి దడ మొదలై రాష్ట్రంలో తనకు సంప్రదాయిక శత్రువైన టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపింది.కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఒకటా, రెండా... జగన్‌కు వ్యతిరేకంగా లెక్కలేనన్ని కుట్రలు పన్నాయి. జగన్‌ ధాటిని రాష్ట్రంలో నిలువరించేందుకు దుష్ప్రచారాలకు, నీతి బాహ్యమైన చేష్టలకు దిగాయి. రాజకీయంగా నేరుగా ఆయనను ఎదుర్కోలేమని భావించిన ఈ రెండు పార్టీలు కలిసి కేసులు వేసి 16 నెలల పాటు అక్రమ నిర్బంధంలో జన నేత జగన్‌ను ఉంచగలిగాయి. జగన్‌ జైలుకు వెళితే, ఆయన పార్టీ పని ఇక అయిపోయినట్లేనని భావించిన వారికి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగు లేని విధంగా విజయాలు సాధించడం కలవరపాటును కలిగించింది.

ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అనేది, వైఎస్‌ రాజశేఖర రెడ్డి తన పాలన (2004–2009)లో చేసి చూపించారు. ముఖ్యంగా ఆరో గ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ లాంటివి సామాన్య ప్రజలకు ఎంతగా ఉపయోగపడ్డాయంటే... ఈ పథకాలను ప్రభుత్వాలు మారినా కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అటు తెలంగాణలో గానీ, ఇటు ఏపీలో గానీ ఆయా ప్రభుత్వాలు ఈ పథకాలను తాకడానికి కూడా సాహసించని పరిస్థితులు నెలకొన్నాయి. చితికిపోతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప జేయాలనే ఉద్దేశ్యంతో పెండింగ్‌లో ఉన్న వాటితో పాటుగా కొత్త సాగునీటి ప్రాజెక్టులను అనేకం జలయజ్ఞం పేరు తో చేపట్టారు. వైఎస్‌ అనూహ్య మరణంతో ఈ పథకాలన్నీ నీరుగారే పరిస్థితులు కనిపించాయి. దీంతో వైఎస్‌ జగన్‌ తన తండ్రి చేపట్టిన పథ కాలకు పాలకులు తూట్లు పొడుస్తున్నారని ప్రశ్నించసాగారు.

మరో వైపు తన తండ్రి మరణించిన చోటైన నల్లకాలువ వద్ద సెప్టెంబర్‌ 25న బహిరంగ సభలో... వైఎస్‌ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన వందలాది కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడం కోసం చేస్తానని చెప్పిన ఓదార్పు యాత్రకు కాంగ్రెస్‌ అధిష్టానం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూ వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రారంభమైన యాత్రలో జనం పోటెత్తడంతో చూసి కన్నుకుట్టిన శక్తులు జగన్‌ వ్యతిరేక కుట్రలకు శ్రీకారం చుట్టాయి. సోనియాగాంధీకి యాత్రపై ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పి ఆ యాత్రను ఆపించే ప్రయత్నం చేశారు. యాత్రలో రాజకీయాలేమీ లేవని, నల్లకాలువ వద్ద ఇచ్చిన హామీకి కట్టుబడి చేస్తున్నామని జగన్‌ తన తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి షర్మిలతో ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీకి నచ్చ జెప్పినా లాభం లేక పోయింది. అధిష్టానం మారిన వైఖరిని గుర్తించిన జగన్‌.. శ్రీకాకుళం లోని ఇచ్ఛాపురం నుంచి మలివిడత ఓదార్పును కొనసాగించారు.

తన తండ్రి చేపట్టిన పథకాల అమలును నిర్లక్ష్యం చేయడం, అధిష్టానం తమను నిరాదరించడం గ్రహించిన  జగన్‌ లోక్‌సభ స్థానానికి, వైఎస్‌ విజయమ్మ అసెంబ్లీ పదవికి నవంబర్‌ 25, 2010న రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. ఆ తరువాత నుంచే జగన్‌పై కేంద్రం లోని యూపీఏ ప్రభుత్వం వేధింపులను ప్రారంభించింది. రాష్ట్ర ప్రజల కోసం తన తండ్రి చేపట్టిన సంక్షేమ బాటను కొనసాగించాలంటే తానే స్వయంగా రాజకీయ పార్టీ స్థాపించాల్సిన అవసరం ఉందని భావిం చారు. 2011 మార్చి 12న కొత్త పార్టీని స్థాపించిన తరువాత (మే 13, 2011) పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తల్లీ, తనయులిద్దరూ రికార్డులన్నింటినీ తిరగరాస్తూ భారీ ఆధి క్యతలతో గెలుపొంది పార్టీకి గట్టి పునాదులు వేశారు. తొలుత తల్లీ తన యులతో ప్రారంభమైన ఆ పార్టీ, కాంగీ కుట్రలను ఛేదిస్తూనే బలీయ మైన శక్తిగా తెలుగు రాష్ట్రాల్లో వేళ్లూనుకుంది. 19 అసెంబ్లీ ఉపఎన్నికల్లో 16 స్థానా లను, నెల్లూరు ఎంపీ స్థానాన్ని గెల్చుకుని షాకిచ్చింది.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కేసులు వేసిన ఫలితంగా సీబీఐ జగన్‌ సంస్థలన్నింటిపైనా భారీ ఎత్తున దాడులు చేసి చివరకు మే 27, 2012న ఉప ఎన్నికల ప్రచారంలో ఉండిన జగన్‌ను విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేసింది. జగన్‌ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పార్టీ గౌరవాధ్య క్షులు విజయమ్మ సహకారంతో పార్టీ పటిష్టతకు జైల్లో నుంచే వ్యూహ రచన చేస్తూ వచ్చారు. 16 నెలల అనంతరం విడుదలైన జగన్‌ పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టిని సారించి సాధారణ ఎన్నికలకు సిద్ధం చేశారు. తన అక్రమ నిర్బంధానికి ముందే జగన్‌ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ వచ్చారు. అనేక పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న తీరును నిరసిస్తూ ఒత్తిడి పెంచడానికి అనేక సార్లు దీక్షలు, సత్యాగ్రహాలు చేస్తూ ఎక్కడా పార్టీ శ్రేణుల్లో ఊపు తగ్గకుండా చూసుకున్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజించడాన్ని జగన్‌ తీవ్రంగా నిరసిస్తూ జైల్లోనూ, విడుదలైన తర్వాత కూడా నిరాహారదీక్ష చేశారు. తన తల్లి విజ యమ్మతో నిరాహారదీక్ష, సోదరి షర్మిలతో పాదయాత్ర చేయించారు.

2014 ఎన్నికల్లో స్వల్పంగా 1.9 శాతం ఓట్ల తేడాతో ఓటమిపాలై నప్పటికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 67 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలు దక్కాయి. చంద్రబాబు గుప్పించిన అబద్ధపు హామీలకు ప్రజలు మోస పోవడంతో, విశేష ప్రజాదరణ ఉన్నప్పటికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. ఓటమికి కుంగి పోకుండా యువనేత సారథ్యంలో ఆ మరు క్షణం నుంచే పటిష్టమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తూ ప్రజల తరఫున బాబు నిరంకుశ పాలనను అడుగడుగునా ప్రశ్నిస్తోంది. ఈ తరుణంలో 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి, ఫిరాయింపజే శారు. కానీ చంద్రబాబు ఎత్తులు ఏ మాత్రం ఫలించలేదని గత మూడే ళ్లుగా పార్టీ శ్రేణుల, నేతల ఆత్మ విశ్వాసం ఏ మాత్రం చెక్కు చెదరలేదని ఇటీవలే ముగిసిన అసెంబ్లీ, జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు నిరూ పించాయి. ఒక చారిత్రక అవసరంగా ఏర్పడిన వైఎస్సార్‌ కాంగ్రెస్, 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాక తప్పదనే మరో చారిత్రక అవసరం దిశగా పయనిస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
(నేడు, రేపు గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వైఎస్‌ఆర్‌ ప్రాంగణంలో జరుగనున్న వైఎస్సార్‌సీపీ 3వ జాతీయ ప్లీనరీ సమావేశాల సందర్భంగా)

- ఆర్‌.ఎం.బాష, సాక్షి పొలిటికల్‌ బ్యూరో ‘ 97053 47956

Advertisement
Advertisement