‘సింధు’ సంధికి గండి? | Sakshi
Sakshi News home page

‘సింధు’ సంధికి గండి?

Published Tue, Oct 4 2016 2:03 AM

‘సింధు’ సంధికి గండి?

1960లో అమెరికాయే సింధు నదీజలాల పంపిణీ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు ద్వారా మధ్యవర్తిత్వం నెరపింది. అదే అమెరికా ఇప్పుడు భూభాగాలు, అంతర్జాతీయ జలాల సమస్యలను(సింధు జలాల పంపిణీ) మీరూ మీరూ పరిష్కరించుకోవాలని నంగనాచిలా కోరుతున్నది. ఇంకా కశ్మీర్ సమస్య మీద మధ్యవర్తిత్వాలు నిర్వహించి వివాదం చల్లారి పోకుండా కూడా జాగ్రత్త పడింది. ప్రధాని మోదీ నీరు, నెత్తురు కలసి ప్రవహించలేవని చెబుతున్నారు. కానీ ఉపఖండ వాసులంతా రక్తసంబంధీకులేనని మరచిపోరాదు.
 
 ‘పగ సాధింపు చర్యలు కట్టిపెడితే నిన్నటి శత్రువు నేడు మిత్రుడవుతాడు’ మహాత్మా గాంధీ  ‘చూడబోతే ఇండియా, పాకిస్తాన్‌లు యుద్ధ మనస్తత్వంతో ముందుకు సాగుతున్నట్టుంది. ఈ సన్నద్ధత యుద్ధాన్ని ఎదుర్కొనడానికి జరిపే సన్నద్ధత అన్న భావంతో కాదు. అలా అని ఒకవేళ యుద్ధమే వస్తే సిద్ధంగా ఉన్నామన్న భావనతోనూ కాదు. కానీ నిజంగా మన రెండు దేశాలు యుద్ధాన్ని కోరుకుంటున్నాయా అన్నట్టుగా యుద్ధ మనస్తత్వం ఏదో ఆవహించినట్టు తోస్తోంది. ఈ సందర్భంగా రష్యన్ మహా రచయిత లియో టాల్‌స్టాయ్ మాటలని మనం రాజ్యాంగం పంచుకుంటోంది. ఆయన ప్రసిద్ధ రచన ‘యుద్ధము- శాంతి’. మన రాజ్యాంగంలోని యూనియన్ బాధ్యతలను నిర్దేశించే ‘ఎంట్రీ-15’ అనే అంశం ఉంది. దీనర్థం- కేవలం యూనియన్ ప్రభుత్వమే యుద్ధాన్ని ఎప్పుడు ప్రకటించాలో, శాంతిని తిరిగి ఎప్పుడు నెలకొల్పాలో నిర్ణయించే శక్తి అని’.
 గోపాలకృష్ణ గాంధీ (బెంగాల్ మాజీ గవర్నర్, చరిత్రకారుడు)

ఈ హెచ్చరిక చేస్తూనే గోపాలకృష్ణ గాంధీ యూనియన్ జాబితాలో ‘యుద్ధము-శాంతి’ అనేది ఒక ఎంట్రీగా నమోదై ఉండవచ్చుగానీ; మనం మరొక యుద్ధాన్ని కూడా ఎదుర్కొనవలసిన అవసరం ఉందనీ- అదే యుద్ధ పిపాసకూ, యుద్ధాన్ని ప్రేరేపించే మనస్తత్వానికీ కూడా వ్యతిరేకంగా పోరాడవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ యుద్ధ పిపాస వల్ల ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకే కాకుండా, చాలా ఇతర అంశాలకు గండిపడింది. ఉపఖండ విభజన ఫలితంగా వేర్వేరు దేశాలుగా అవతరించిన ఈ రెండు భూభాగాల మధ్య సాధారణ సంబంధాలకూ, వాణిజ్య సంబంధాలకూ ఆరు దశాబ్దాలుగా పడిన అగాధం పూడే అవకాశం రావడం లేదు. ఈ విష పరిణామం ఎక్కడికి దారితీసింది? సాగుకూ, తాగేందుకూ అందవలసిన నదీజలాల పంపిణీని స్తంభింప చేసే స్థితికి తీసుకువెళుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ ఎలా ఛిన్నాభిన్నమైందో భారత్, పాక్‌ల మధ్య కూడా సింధు నదీజలాల పంపిణీ వ్యవస్థ ప్రమాదంలో పడింది.
 
 ఆంగ్లో- అమెరికన్ కుట్ర
 దేశ విభజన ఫలితం మన రెండు దేశాలకే కాదు, నిజానికి ఉపఖండానికే కాదు, ఆసియా ఖండానికే ప్రమాదకరంగా పరిణమించింది. ఈ పరిణామానికి కేంద్ర బిందువు కశ్మీర్ సమస్య అని అంతా గ్రహించాలి. సింధు నదీజలాల పంపిణీ మీద రెండు దేశాల మధ్య 1960లో కుదిరిన ఒప్పందాన్ని అమలు పరచడం ఉభయ దేశాల ప్రజా బాహుళ్యాల విశాల ప్రయోజనాలకు ఎంతో ప్రధానమని గుర్తించాలి. దేశాల మధ్య కుమ్ములాటలకు, ప్రాబల్యం కోసం ఏర్పడే స్పర్థలకు అతీతంగా ఈ అంశాన్ని గుర్తించాలి.
 
 కశ్మీర్ సమస్య రావణకాష్టంలా మండుతూ ఇప్పటికీ చల్లారకుండా ఉండడానికి దారితీసిన కారణాలలో ఒకటి- ఇరు దేశాల పాలకులను స్వతంత్రశక్తులుగా ఎదగకుండా, వారు తమ చేతులు దాటిపోకుండా నొక్కి ఉంచడంలో ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదశక్తుల ఎత్తుగడలు చాలావరకు సఫలం కావడమే. ఇంకా చెప్పాలంటే, విభజనకు బీజాలు వేయడం, తద్వారా భారత్, పాక్‌ల మీద తమ పట్టు సడలకుండా ఆంగ్లో-అమెరికన్లు పన్నిన వ్యూహ రచనలో భాగమే కశ్మీర్ సమస్య. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం అమెరికా పన్నిన వ్యూహంలో ‘గుర్తు తెలియని ఉగ్రవాదుల’ వేట (ఈ విషయం మీద ఈ రోజుకీ అమెరికాలో భిన్నస్వరాలు ఉన్నాయి)లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరంభించిన ఉద్యమంలో ఏ దేశం, ఏ పాలకుడు భాగస్వాములు కాకుండా మిగిలారో వారిని కూడా టైస్టులుగా పరిగణిస్తామని అమెరికా పరంపరగా ప్రకటనలు జారీ చేసింది. ఆ మిష మీదే అఫ్గానిస్తాన్, ఇరాక్‌ల మీద భీకరమైన మెరుపుదాడులు చేసి, లక్షల సంఖ్యలో సాధారణ ప్రజలను చంపిన వైనాన్ని ప్రపంచం వీక్షించింది. ఆ తరువాత ఆ రెండు దేశాలను అమెరికా తన స్థావరాలుగా మార్చుకుంది. మొదట సైనిక శిబిరాలతో నింపేసింది. వీటిని మొదట తొలగిస్తానని ముహూర్తం పెట్టి, తరువాత సాధ్యం కాదని మొండికేసింది.
 
 కాబట్టి కశ్మీర్‌లో అమెరికా అడుగుపెట్టడానికి కూతవేటు దూరమే మిగిలింది. అసలు కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి ఆవరణలోకి ఈడ్చుకువెళ్లినవాళ్లు భారత్-పాక్ నేతలే. అక్కడ నుంచి ఉపసంహరించుకోవడానికి రెండుదేశాలు జరిపిన యత్నాలు అత్యంత పేలవమైనవి. ఇవి జగమెరిగిన సత్యాలు. కానీ, సమితి పరిధి నుంచి ఫిర్యాదులు ఉపసంహరించుకునే దాకా భారత్, పాక్ సంబంధాలు కశ్మీర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయన్న సంగతి విస్మరించరాదు.
 
 ఇక మన రెండుదేశాల పాలనా వ్యవస్థలకు ఆయుధ వ్యాపారులుగా మారిన ఆంగ్లో-అమెరికన్లు, రష్యన్లు, చైనీయులు భారీ స్థాయిలో అటూ ఇటూ ఆయుధాలు అందిస్తూనే ఉంటారు. ఆసియా దేశాల మధ్య మైత్రీ సంబంధాలు చెడగొట్టే తీరులోనే ఆయుధ వ్యాపారులు వ్యవహరిస్తారు. మన బంగారం మంచిదైతే అన్న సామెత చందంగా నెపాన్ని ఎదుటివారి మీద నెట్టడం అసాధ్యం. విదేశీ పెట్టుబడులపైన, విదేశీ ఆయుధ సంపత్తిపైన ఆధారపడి ఉన్నంతకాలం ఈ బెడద తప్పదు.
 
 సింధు జలాల ఒప్పందం-నేపథ్యం
 1960లో అమెరికాయే సింధు నదీజలాల పంపిణీ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు ద్వారా మధ్యవర్తిత్వం నెరపింది. అదే అమెరికా ఇప్పుడు భూభాగాలు, అంతర్జాతీయ జలాల సమస్యలను(సింధు జలాల పంపిణీ) మీరూ మీరూ పరిష్కరించుకోవాలని నంగనాచిలా కోరుతున్నది. ఈ అమెరికాయే కశ్మీర్ సమస్య మీద మధ్యవర్తిత్వాలు నిర్వహించి వివాదం చల్లారిపోకుండా నిన్న, నేడు కూడా జాగ్రత్త పడింది. ప్రథమ ప్రధాని నెహ్రూ, నాటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఇరువురూ సామరస్య ధోరణితోనే నాడు సింధు నదీజాలాల పంపిణీ సంధి మీద సంతకాలు చేశారు. కానీ ఇరుదేశాల సరిహద్దులు శాశ్వత ప్రాతిపదికన ఖరారు కాకుండా ‘వాస్తవాధీన సరిహద్దు’గా మాత్రమే మిగిలి ఉన్నంతకాలం పరస్పర ఉల్లంఘనలూ, ఉద్రేకాలూ సమసిపోవని రుజువు చేస్తూ తాజాగా సింధు నదీజలాల పంపిణీ వ్యవస్థ మీద ఉద్రేకాలు, ఉగ్రవాదాలు ప్రబలుతున్నాయి. ఉభయత్రా పెరిగిన ఈ ఉద్రిక్తతలు ఉభయ దేశాల ప్రజలకూ, శాంతికీ కూడా విఘాతమే. కాబట్టి కశ్మీర్ సమస్య మూలంగా ఏర్పడిన అస్పష్ట సరిహద్దులు, తాత్కాలిక వాస్తవాధీన రేఖ చెరిగిపోయి సామరస్య పూర్వకంగా శాశ్వత పరిష్కారం కుదిరేదాకా 57 ఏళ్లుగా ఉన్న సింధు నదీజాలాల పంపిణీ ఒప్పందానికి పాలకులు తూట్లు పొడవడం సరికాదు. ప్రజలకు అన్యాయం చేయడం మంచిదికాదు.
 
నీరూ, నెత్తురూ...
బియాస్, సట్లెజ్, సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నదీజల వ్యవస్థను రెండు దేశాల మధ్య సహృద్భావం దృష్ట్యా పరస్పర ప్రయోజనాలు దెబ్బతినకుండా గరిష్ట స్థాయిలో వాడుకోవాలని ఒప్పందం ఆదేశించింది. ఏదో వియన్నా కన్వెన్షన్ 64వ అధికరణ ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ఏ దేశమైనా ఉపసంహరించుకోవచ్చునని, భట్టిప్రోలు పంచాయతీ లాంటి అవకాశం ఉందని చెప్పి ఉభయ దేశాల పాలకులు తలచరాదు. సింధు వ్యవస్థలో తూర్పున ఉన్న నదులను మనమూ, పశ్చిమాన ఉన్న నదీజలాల వ్యవస్థను పాకిస్తాన్ పూర్తిగా వినియోగించుకోవచ్చునని సింధు సంధి చెప్పింది. మనదేశం వాడుకోగలిగిన 20 శాతం వాటాను సాగు,తాగు, రవాణా, విద్యుదుత్పాదన ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఆ వాటాలో మనం వినియోగించుకుంటున్నది నాలుగు శాతమే.
 
 రావి, బియాస్, సట్లెజ్ వాటి ఉపనదులు కలసి తూర్పు నదులుగానూ, సింధు, జీలం, చీనాబ్ వాటి ఉప నదులు కలిపి పశ్చిమ నదులుగానూ ఏర్పడగా 1960 నాటి ఒప్పందం కింద తూర్పు నదుల నీటి వనరులను మనం పూర్తిగా వాడుకోవచ్చు. సగటున ఏడాదికి ఈ తూర్పు నదులలో 3 కోట్ల, 30 లక్షల ఎకరా అడుగుల నీరు (అమెరికా కొలమానాల ప్రకారం 3,26,000 గ్యాలెన్ల నీటిని ఒక ఎకరా అడుగు నీరుగా లెక్కిస్తారు) ప్రవహిస్తుంది. పశ్చిమ నదులలో సగటున ఏడాదికి 13 కోట్ల 50 లక్షల ఎకరా అడుగుల జలరాశి ప్రవహిస్తూ ఉంటుంది. మన దేశంలో ఈ పశ్చిమ నదులలో నిల్వ ఉంచదగినంత జలరాశి లేదు. కాబట్టి పారే నీటిని ఆపలేకపోతున్నామని  నిపుణుల అంచనా. ఇక నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి: మరుసాదర్ (చీనాబ్‌కు ఉపనది, కిస్త్‌నార్ జిల్లా), ఉదమ్‌పూర్‌లో జీలం నది మీద సవాల్‌కోట, చీనాబ్ మీద బుర్‌స్వార్ డ్యామ్‌లు, జల విద్యుదుత్పత్తి కోసం డ్యాములు. వీటిని మనం నిర్మించుకోగలిగితే నీటిని అవసరాలకు నిల్వ చేసుకోగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ నదుల జలవిద్యుత్ ఉత్పాదన శక్తి 18,653 మెగావాట్లట.
 
మనం జీలం నది మీద తుల్‌బుల్ బ్యారేజీ, కిషన్‌గంగ మీద జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రయత్నిస్తే పాక్‌కు అభ్యంతరం. ఇలా చిన్న చిన్న విభేదాలు మినహా 56 ఏళ్లుగా సింధు నదీజలాల పంపిణీ సంధి ప్రకారం శాంతియుతంగా సాగుతూ ఉంటే ఇప్పుడు రాజకీయులు వేలుపెట్టి చెడగొట్టే కుట్రను ప్రజలు సహించరాదు. ప్రధాని నరేంద్రమోదీ ఒక పక్క భవిష్యత్తులో జరిగేవి నీటి యుద్ధాలే అంటూ, నీరు, నెత్తురు కలసి ప్రవహించలేవని కూడా చెబుతున్నారు. కానీ ఉపఖండ వాసులంతా రక్తసంబంధీకులేనని మరచిపోరాదు.
 - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు
 abkprasad2006@yahoo.co.in

Advertisement
Advertisement