ప్రగతి పట్టాలపై దక్షిణ మధ్య రైల్వే | Sakshi
Sakshi News home page

ప్రగతి పట్టాలపై దక్షిణ మధ్య రైల్వే

Published Sat, Oct 1 2016 12:50 AM

ప్రగతి పట్టాలపై దక్షిణ మధ్య రైల్వే

సందర్భం
దక్షిణ మధ్య రైల్వే ఏర్పడినప్పుడు 52% మీటర్‌గేజ్ ఉండేది. 1992లో ‘ప్రాజెక్టు యూనిగేజ్’ పథకం తరువాత ఇప్పుడు 97% బ్రాడ్ గేజ్‌లోకి మారింది. 708 కి.మీ. కొత్త మార్గం ఏర్పడింది. 1966-67లో 4.7 మిలియన్ టన్నుల మేర జరిగిన సరుకు రవాణా,  2015- 16లో 108 మిలియన్ టన్నులకు చేరింది.
 
 భారత స్వాతంత్య్రోద్యమానికీ, గాంధీజీకీ, రైల్వేకూ విడదీయరాని బంధం ఉంది. విదేశీ పాలకులు వాణిజ్య, సైనిక, రాజకీయ కారణాల తోనే రైల్వేలు నిర్మించిన మాట వాస్తవం. భారతీయ ఆత్మను దర్శించడానికి గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు మహాత్మాగాంధీ రైళ్లలోనే దేశాటన చేశారు. 1966 సంవత్సరంలో, గాంధీ జయంతి అక్టోబర్ 2నే దక్షిణమధ్య రైల్వే ఆవిర్భవించింది. ఇప్పటికి యాభై ఏళ్లు గడిచాయి. అందుకే దక్షిణ మధ్య రైల్వే 2016-2017ను స్వర్ణోత్సవ సంవత్సరంగా జరుపుకుంటున్నది.
 
 భారత ఉపఖండంలో రైలు తొలికూత వినిపించి 161 సంవత్సరా లయింది. 1873లో ఇంగ్లండ్‌లో నిజాం స్టేట్ రైల్వే సంస్థ ఏర్పాటైంది. దీనిలో నిజాం సర్కారు ఐదు లక్షల పౌండ్లు తన వాటా కింద పెట్టుబడి పెట్టింది. దానితో వాడి-హైదరాబాద్‌ల మధ్య 110 మైళ్ల రైలు మార్గాన్ని రూ. 2 కోట్లతో చేపట్టారు. అక్టోబర్ 8, 1874న వాడి నుంచి హైదరాబాద్‌కు నూతన రైలు మార్గం ప్రారంభమైంది. నిజాం స్టేట్ రైల్వే పరిధిలో చితాపూర్ మొదటి స్టేష న్‌గా రికార్డు సృష్టించింది.
 
 నిజాం నవాబు సొంతంగా ఒక కంపెనీని, ‘హిజ్ హైనెస్ ది నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీ లిమిటెడ్’ ఏర్పాటు చేసి వాడి-సికింద్రాబాద్ మార్గాన్ని 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. దాని తరువాత ఈ సంస్థ హైదరాబాద్-విజయవాడ మార్గాన్ని, డోర్నకల్ నుంచి సింగరేణి బొగ్గు గనులకు మరో మార్గాన్ని దాదాపు 210 మైళ్ల మేర నిర్మించింది. తరువాత వరం గల్ నుంచి చంద్రాపూర్‌కు 160 మైళ్ల మేర మార్గం నిర్మించడంతో ఉత్తర-దక్షిణ భారత్‌ల సంగమానికి దారులు పరిచినట్టయింది. ఏప్రిల్ 1, 1930లో మొత్తం నిజాం సొంతమైంది. దానితో కంపెనీ పేరును హెచ్‌ఈ హెచ్ ది నిజామ్స్ స్టేట్ రైల్వే అని మార్చారు. కాచిగూడ స్టేషన్‌ను 1916లో నిర్మించారు. నిజాం స్టేట్ రైల్వేకు ఇది ప్రధాన కార్యాలయం.
 
 1889లో విజయవాడ స్టేషన్‌ను ప్రారంభించారు. గోవా-గుంతకల్ మార్గాన్ని విజ యవాడతో అనుసంధానిస్తూ మరో మార్గాన్ని 1890లో నిర్మించారు. 1900 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన మద్రాస్-హౌరా రైలును ప్రవేశపెట్టారు. సంస్థానాలన్నీ భారత యూనియన్‌లో విలీనం కావడంతో ఏప్రిల్ 1, 1952న నిజాం స్టేట్ రైల్వే సెంట్రల్ రైల్వేలో విలీనమయింది. మద్రాస్ రైల్వే, ది సౌత్ మరాఠా రైల్వే, ది సౌత్ ఇండియన్ రైల్వే, ది మైసూర్ రైల్వే- వీటన్నిటినీ కలిపి ఏప్రిల్ 14, 1951న సదరన్ రైల్వేగా ఏర్పాటు చేశారు. తొలి రైల్వే మంత్రి ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ భారతీయ రైల్వే వ్యవ స్థకు ఒక రూపు ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే జోన్ల విభజనకు శ్రీకారం చుట్టారు.
 
 సదరన్ రైల్వే జోన్‌లో ఉన్న హుబ్లీ, విజయవాడ డివిజన్లను; సెంట్రల్ రైల్వే జోన్‌లో ఉన్న షోలాపూర్, సికింద్రాబాద్ డివిజన్లతో ప్రత్యేకంగా దక్షిణ మధ్య రైల్వేగా ఒక కొత్త జోన్‌ను అక్టోబర్ 2, 1966న ప్రారం భించారు. తరువాత 1977లో షోలాపూర్ డివిజన్‌ను సెంట్రల్ రైల్వేకు కలిపి, సదరన్ రైల్వేకు గుంతకల్ డివిజన్‌ను దానిలో కలిపారు. సికిం ద్రాబాద్ డివిజన్ పెద్దది కావడంతో పరిపాలనా సౌలభ్యం కోసం సికిం ద్రాబాద్, హైదరాబాద్‌లుగా రెండు చేశారు. మళ్లీ 2003లో భారతీయ రైల్వేలో కొత్తగా ఏడు జోన్లు ఏర్పాటు చేసినప్పుడు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన హుబ్లీ డివిజన్ కేంద్రంగా నైరుతి రైల్వేజోన్ ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో గుంటూరు, నాందేడ్ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య ైరె ల్వే జోన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పూర్తిగానూ, మహా రాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో పాక్షికంగా; తమిళనాడులో కొద్దిగానూ విస్తరించి ఉంది. ఇప్పుడు మొత్తం 704 స్టేషన్లతో, 6028 కి.మీ.ల మేర విస్తరించి ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో-సికింద్రాబాద్, హైద రాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్-ఈ 6 డివిజన్లు ఉన్నాయి.
 
 దక్షిణ మధ్య రైల్వే ఏర్పడినప్పుడు 52% మీటర్‌గేజ్ ఉండేది. 1992లో ‘ప్రాజెక్టు యూనిగేజ్’ పథకం చేపట్టిన తరువాత ఇప్పుడు 97% బ్రాడ్ గేజ్‌లోకి మారింది. 708 కి.మీ. కొత్త మార్గం ఏర్పడింది. 1966-67లో 4.7 మిలి యన్ టన్నుల మేర జరిగిన సరుకు రవాణా,  2015- 16లో 108 మిలియన్ టన్నులకు చేరింది. ప్రయాణికుల అవసరాలకు 24 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. తొలి ఏడాది ఈ జోన్ గుండా 50.43 మిలియన్ల మంది ప్రయాణించగా, 2015-16 నాటికి  ఆ సంఖ్య 366.75 మిలియన్లకు చేరుకుంది. 1966-67లో రూ.58.25 కోట్లు ఉన్న ఆదాయం, 2015-16 నాటికి రూ. 15,163.44 కోట్లకు చేరింది.
 
 2003లో జంట నగరాలలో ఎంఎంటీఎస్ మొదటి దశ 47 కి.మీ. ప్రారంభమైంది. రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్ (యూఎమ్‌ఎల్‌సీ) వద్ద భద్రతకు సంబంధించి గడచిన నాలుగేళ్లలో 329 యూఎంఎల్‌సీ లను తొలగించడం జరిగింది. 2017 చివరికి జోన్ మొత్తం మీద ఒక్కటికూడా లేకుండా చూడాలన్నదే లక్ష్యం. 510 రైళ్లలో 430 మంది ఆర్‌పీఎఫ్ సిబ్బందిని, 307 జీఆర్‌పీ సిబ్బందిని ఎస్కార్ట్ విధులపై నియోగించాం. అన్ని ప్రధానమైన స్టేషన్లలో సీసీటీవీలు ఏర్పాటు చేశాం. ‘నిర్భయ’ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి మహిళా ప్రయాణికుల రక్షణపై దృష్టి సారించాం. ప్రయాణికులతోపాటు, దివ్యాం గులకూ ఉపయోగపడేటట్టు 15 స్టేషన్లలో 34 లిఫ్టులు, 34 ఎస్కలేటర్లను అమర్చే పనులు జరుగుతున్నాయి. దేశం మొత్తంమీద అన్ని ప్లాట్‌ఫారా లలో ఎస్కలేటర్ సౌకర్యం ఉన్న ఏకైక స్టేషన్-సికింద్రాబాద్.
 
 కంప్యూటర్లు, ఇంటర్నెట్ వ్యాప్తిలోకి వచ్చిన తరువాత 60-70% టికెట్లు ఆన్‌లైన్ ద్వారానే విక్రయిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా కాగిత రహిత టికెట్ ఇటీవలే హైదరాబాద్ సబర్బన్ ఎంఎంటీస్‌లో ప్రవేశ పెట్టారు. బుకింగ్ కౌంటర్ల వద్ద పెరిగిపోతున్న రద్దీని తగ్గించడానికి, టికెట్లను త్వరగా పొందే సౌకర్యాన్ని విస్తరింపజేయడానికి 142 స్టేషన్లలో 293 ఏటీవీఎంలను (ATVMs), 22 స్టేషన్లలో 33 సీఓటీవీఎంలను (CoTVM), యాత్రీ టిక్కెట్ సువిధ కేంద్రాలు ఏర్పాటయినాయి.
 
 రైళ్లలో అపరిశుభ్రత సమస్యను పరిష్కరించడానికి 55 రైళ్లలో ఓబిహెచ్‌ఎస్ (OBHS-On Board House keeping Services) సేవలు అమలులోకి వచ్చాయి.  
 
 స్టేషన్లలో ‘పరిశుభ్రత-పచ్చదనం’ (క్లీన్ అండ్ గ్రీన్) పథకం కింద ఇప్పటివరకు 874 బయో టాయ్‌లెట్లను అమ ర్చారు. రైళ్ల వేగాన్ని పెంచడం, సమయపాలన, భద్రత వంటి చర్యలతో భారతీయ రైల్వే సామర్థ్య నిరూపణకు ‘‘విజన్ 2020’’ అడ్డంకులు తొలగించగలదని ప్రధాని మోదీ విశ్వాసం.

2020 నాటికి భారతీయులు గర్వించదగిన రైల్వే వ్యవస్థను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభాకర్ ప్రభు చెప్పారు. భారతీయ రైల్వేలు నిర్దేశిం చుకున్న దిశలో వెళ్లడానికి అవ సరమైన ఊపునిచ్చే శక్తి ఇదే.
 (దక్షిణమధ్య రైల్వే 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా)
 వ్యాసకర్త దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
 ఈమెయిల్ : pasecygm@gmail.com

Advertisement
Advertisement