ఆస్తులూ-సెంటిమెంట్లూ | Sakshi
Sakshi News home page

ఆస్తులూ-సెంటిమెంట్లూ

Published Sat, Oct 22 2016 1:04 AM

ఆస్తులూ-సెంటిమెంట్లూ

అక్షర తూణీరం
ఆ రోజుల్లో ఫియట్ కారంటే గొప్ప. పీఎస్ చారి అని మా ఆఫీసు పెద్ద సారువాడుండే వాడు. చాలా రూల్స్ మనిషి. ఈయన పెద్ద వట్టివేళ్ల తడి కండీ అని పనులమీద వచ్చి వెళ్లేవారు వ్యాఖ్యానించేవారు. గీరు నామంతో, ఖద్దరు కట్టుతో చారి చాలా నిరాడంబరంగా కనిపించేవారు. ఎప్పుడూ తడుపుతూ ఉంటే గానీ వట్టివేళ్ల తడిక సుఖంగా పనిచెయ్యదు, చారి కూడా అదే బాపతని ఒకాయన వివరించాక మర్మం నాకు బోధపడింది. ఇట్లాంటి వారికి గొప్ప చిక్కు ఏంటంటే, గడ్డితిని సంపా యిస్తారు గాని సుఖంగా ఏ భోగమూ అనుభవించలేరు. సర్వీస్ ఉండగా భయం. దిగిపోయాక్కూడా భయమే. ఎవడైనా ఓ ఆకాశరామన్న ఉత్తరం రాస్తాడేమోనని. ఉన్నట్టుండి చారి ఫియట్ కారులో ఆఫీసుకు వచ్చాడు. అంతా నివ్వెరపోయారు. ఎవరూ విస్తుపూర్వక ప్రశ్నలు సంధించకముందే, చారి ఫియట్ వృత్తాంతాన్ని వివ రించాడు.

డీలర్ దగ్గర ఖాళీగా పడి ఉందిట. టైర్లు, సీట్లు ఎలుకలవల్ల హరించాయిట. ఉద్యమ వేళ అద్దాలు వడ గళ్లుగా నేలపై రాలాయిట. డీలర్‌ని అడిగితే, మీరు అడి గారని చెబుతున్నా నాలుగువేలిచ్చి తీసికెళ్తారా అని అడిగాట్ట! ఫియట్ కారు ఆయన జీవితాశయమని లోగడే చారి పలుమార్లు చెప్పారు. సరేనని తెగించి వాయిదాల పద్ధతిలో తీసుకున్నాట్ట. సీట్లు మిసెస్ చారి కుట్టిందిట. కొడుకు పాత టైర్లు సేకరించి, స్వయంగా ఫియట్‌కి రంగులు, హంగులు కూర్చాడట. మొత్తం ఐదువేల ఆరువందల పన్నెండు రూపాయలు అయిం దని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు చారి.
 
చారి చెప్పిన తీరులో ఒక నిజాయితీ ధ్వనించింది. అయినా నమ్మశక్యం కాలేదు. మొన్న మన ప్రియతమ నేత స్థిర చరాస్తులు ప్రకటించగానే నాటి మా చారి గుర్తొచ్చారు. విశాలంగా, సర్వ సదుపాయాలతో ఇల్లు కట్టుకోవడం సంతోషమేగానీ మరీ మూడుకోట్లు అప్పు చేయడమేమిటని మావూరి రచ్చబండ జాలిపడింది. దాదాపు అర్ధ శతాబ్ది రాజకీయ జీవితం, పెళ్లినాటికే మంత్రిపదవి, ఆ తర్వాత సరేసరి. అందరికీ తెలిసిందే. ప్రజల కోసం జీవితం ధారపోస్తున్న నాయకుడు, పైగా వయసు మీద పడింది కూడా. ‘ఇప్పుడు రుణభారం పెట్టుకోవడమా పాపం’ అంటూ ఒకరిద్దరు పెద్ద మను షులు బాధపడ్డారు. ఏముంది మనమంతా తలా పావలా వేసుకున్నా బిల్డింగ్ లేచిపోతుందని ఒకాయన లెక్క తేల్చాడు.
 
ఉన్నట్టుండి మావూరి సర్పంచ్‌కి ఆవేశం వచ్చింది. నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నానుగందా. నే కూడా నా ఆస్తులు డిక్లేర్ చేస్తున్నా రాసుకోండ్రా అంటూ లేచి నిలబడ్డాడు. పాత పెంకుటింటితో మొదలుపెట్టి, చింకి చాపలు, విరిగిన ఎడ్లబండి, తుప్పట్టిన బోరింగు గొట్టాలు, ఒట్టిపోయిన గేదె దూడతో సహా చెప్పు కుంటూ వెళ్లాడు. రచ్చబండ మీది నలుగురూ వాటి వాటి ధరలు నిర్ణయించి చెబుతుంటే, ఓ కుర్రాడు అంకెలు కూడుకున్నాడు. పదివేల చిల్లరకు వచ్చింది మొత్తం. సర్పంచ్ ఒక్కసారి తేలుకుట్టినట్టు అరిచాడు. మా మాంగారు అలకల్లో ఇచ్చిన సైకిల్రోయ్ అనగానే, వేసుకో పన్నెండు రూపాయలన్నారు పెద్దలు. సర్పంచ్ ససేమిరా అన్నాడు. ఆ సైకిల్లో బోలెడు సెంటిమెంట్లు న్నాయి. కనీసం ఒక లక్షన్నా పడాల్సిందే అంటూ వాదించాడు. మొత్తానికి మా సర్పంచ్ ఆస్తుల ప్రకటనైతే అయి పోయింది.

శ్రీరమణ

Advertisement

తప్పక చదవండి

Advertisement