హిందీ వచన రచనపై తాజా గాలి! | Sakshi
Sakshi News home page

హిందీ వచన రచనపై తాజా గాలి!

Published Sat, Feb 25 2017 1:00 AM

హిందీ వచన రచనపై తాజా గాలి!

సందర్భం
ప్రచురణా ప్రపంచంలో మౌలికత్వం, పెట్టుబడి, లాభాల మధ్య సంబంధాన్ని అనుపమ్‌ మిశ్రా ఎంతో అమాయకంగా సవాలు చేశాడు. ఆయన ‘ఆజ్‌ భీ ఖరే హై తాలాబ్‌’ను ఎంతమంది ఎన్నిసార్లు ప్రచురిం చారో! డజన్ల కొద్దీ ప్రచురణలతో అచ్చువేసిన ఈ పుస్తకం కాపీలను కొన్ని లక్షల్లో కొన్నారు, చదివారు.

ఎలాంటి శబ్దం చేయకుండా మెల్లగా ఆయన నా మనసు గదిలోకి ప్రవేశించి కూర్చుండి పోయాడు. సరిగ్గా అట్లాగే కుర్చీలేవీ కదల్చ కుండా, చడీ చప్పుడు లేకుండా మన కాలం గదిలోంచి నిష్క్రమించాడు అనుపమ్‌ మిశ్రా. ఆయన ఉన్నాడన్న భావం నెమ్మదిగా రూపు   దిద్దుకున్నట్టుగానే, ఆయనిక లేరన్న వాస్తవం కూడా గత రెండు నెలలుగా తరచూ మనసును మెలి పెడుతోంది. ఇపుడాయనను మన మధ్య నిలిపి ఉంచేదెలా అన్న ప్రశ్న నాలో మళ్లీ మళ్లీ తలెత్తుతోంది.

అనుపమ్‌ మిశ్రా గురించి నేను దఫదఫాలుగా తెలుసుకున్నాను. మొట్టమొదట ఆయన మాటల్ని విన్నాను. ఆ తర్వాత ఆయన భావాలతో పరిచయం కలిగింది. తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని స్పృశించగలిగాను. ‘ఆజ్‌ భీ ఖరే హై తాలాబ్‌’ (నేటికీ నిటారుగా నిలిచిన చెరువులు)లో ఆయన రూపవిన్యాసం మొదట నన్నాకర్షించింది. తీర్చిదిద్దినట్టుండే ఫాంటు, సందర్భోచితంగా వేసిన అందమైన బొమ్మ, మనస్సును హత్తు కునే లేఅవుట్‌. నేను మరాఠీ, బంగ్లా భాషల్లో అనేక అందమైన పుస్తకాల్ని చూశాను. కానీ హిందీ పుస్తకాల డిజైన్‌ మాత్రం వాటిలోని భాషా దారిద్య్రానికి ప్రచార ప్రకటనలాగే ఉండేది. కానీ అనుపమ్‌జీ లోని సౌందర్య స్పృహ వెనుక ఉత్తుత్త మెరుగులు లేదా రంగుల్ని ప్రదర్శించి చూపాలన్న యావ ఉండేవి కాదు. కవర్‌ మినహా మిగతాదంతా పూర్తిగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపొందిన ఆ పుస్తకం సాదాసీదాతనానికీ, సౌందర్యానికీ అద్భుతమైన నమూనా అని చెప్పొచ్చు.

ఆ తర్వాత నా చూపు పుస్తకంలోని భాష వైపు మళ్లింది. మనం ఎట్లా మాట్లాడుతామో సరిగ్గా అట్లాగే రాయాలనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తూ అనుపమ్‌ మిశ్రా రాసిన ప్రతి వ్యాసం హిందీ వచనానికి మేలైన ఉదాహరణగా నిలు   స్తుంది. సంక్లిష్ట పదజాలం, అరువు తెచ్చుకున్న సామెతలు, సమతుల్యం లోపించిన వాక్యాల భారంతో కుంగిపోతున్న హిందీ వచన రచనపై వీచిన చల్లటి తాజా గాలి అనుకోవచ్చు. ఇంగ్లిష్‌లో రాసే వాళ్లకు ‘ది ఎకా   నమిస్ట్‌’ శైలిని అలవర్చుకోండని సలహా ఇచ్చినట్టుగానే హిందీలో రాసే ప్రతి యువ రచయితకూ అనుపమ్‌ మిశ్రా రాసినవి చదవాలని నేను సిఫార్సు చేస్తాను. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఏర్పాటైన సభలో తెలిసిందేమిటంటే భాషకు సంబంధించి అనుపమ్‌జీ ఇచ్చిన సలహాలతో సోపాన్‌ జోషీ త్వరలో ఒక ‘సై్టల్‌ షీట్‌’ తయారు చేయబోతు న్నారట. ఆయన ప్రేరణతో హిందీ రచనారంగంలో ఒక ప్రత్యేక శాఖ కూడా ఏర్పాటు కావచ్చనే ఆశ నాకు కలిగింది.

ఆ తర్వాత కవర్‌ పేజీ వెనుక భాగంలో ఈ పుస్తకానికి కాపీరైట్లు ఏవీ లేవని పేర్కొన్న ప్రకటన కనిపించింది. ఎవరు కావాలనుకుంటే వాళ్లు దీన్ని అచ్చు వేసుకోవచ్చు. అయితే ఆ సమాచారం తెలిపితే రచయిత ఆనందిస్తాడు. అలా అనుపమ్‌ మిశ్రా ప్రచురణా ప్రపంచంలో మౌలి కత్వం, పెట్టుబడి, లాభాల మధ్య సంబంధాన్ని ఎంతో అమాయ కంగా సవాలు చేశాడు. ఆయనిచ్చిన ఈ పిలుపు వృ«థా ఏమీ కాలేదు. ఆయన ‘ఆజ్‌ భీ ఖరే హై తాలాబ్‌’ను ఎంతమంది ఎన్ని సార్లు ప్రచురించారో! డజన్ల కొద్దీ ప్రచురణలుగా, ముద్రణలుగా అచ్చువేసిన ఈ పుస్తకం కాపీ లను కొన్ని లక్షల్లో కొన్నారు, చదివారు. హిందీ ప్రచురణల చరిత్రలో ఒక గంభీరమైన అంశంపై చేసిన సాహిత్యేతర రచనకుగాను ఇంత ఎక్కువ సంఖ్యలో పాఠకుల ఆదరణకు నోచుకున్న పుస్తకం మరొ కటి లేదేమో!

అనుపమ్‌జీ భాష నుంచి నేను ఆయన భావాల వైపు మళ్లాను. ‘ఆజ్‌ భీ ఖరే ౖహె  తాలాబ్‌’, ఆ తర్వాత ఆయన రాసిన ‘రాజస్తాన్‌ కీ రజత్‌ బూందే’ (రాజస్తాన్‌ రజత బిందువులు), ఇంకా అనేక వ్యాసాల్లో నీటి విషయంలో సాంప్రదాయిక అవగాహనేమిటో వివరించి చెప్పారు. రాజ స్తాన్‌ వంటి నీటికి కటకటలాడే రాష్ట్రంలో ఆయన నీటిని కాపాడుకోవడం, నిల్వ చేసుకోవడం, వాడకానికి సంబంధించిన అనేక పద్ధతులను కని పెట్టారు. మన మనుగడ నిలబడాలంటే నీటిని కాపాడుకోవాల్సిందే. ఇందుకోసం ఆధునిక ఇంజనీరింగ్‌కు బదులు సాంప్రదాయిక జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నది ఆయన అవగాహన. ఈ అవగాహన నుంచి ప్రేరణ పొందిన రాజేంద్రసింగ్‌ వంటి ఎంతోమంది కార్యకర్తలు పూనుకొని పురా తన చెరువులు, కొలనులు, బావులు, జోహడ్‌ (వాన నీటిని నిల్వ చేసి ఉంచే కుంటలు)లను పునరుద్ధరించారు. మృతప్రాయంగా మారిన అనేక నదులు ఈ పుస్తకం ఫలితంగా మళ్లీ జలకళను సంతరించుకోగలిగాయి.

అయితే నీరు ఆయన రచనల్లో ఒక వస్తువు మాత్రమే. అనుపమ్‌జీ భావాలు మొత్తం సాంప్రదాయిక అవగాహనకూ, కౌశలానికీ వర్తిస్తాయి. ఆయన ఆలోచనలకు కేంద్రబిందువుగా ఉన్నది సమాజం–స్వావలంబన, శ్రమైకతత్వం, జ్ఞానోన్ముఖతలతో కూడిన సమాజం. తన కష్టసుఖాలను అర్థం చేసుకోవడానికి పరులపై ఆధారపడాల్సిన అవసరంలేని సమాజం. సాంప్రదాయిక సమాజా నికి సంబంధించిన ఈ అవగాహన కాల్పనికతగా తోచవచ్చు. కానీ ‘సాఫ్‌ మాథే కా సమాజ్‌’ (సదాలో చనతో కూడిన సమాజం) అనే ఊహ సమానత్వం, న్యాయం అనే స్వప్నాలతో పెనవేసుకున్నదే.

మిశ్రా వ్యక్తిత్వం గురించి నేను చాలా ఆల స్యంగా తెలుసుకోగలిగాను. ఆయన హిందీ మహా కవి భవానీ ప్రసాద్‌ మిశ్రా కుమారుడు. కానీ ఈ విషయం లేదా ఈ భావన ఆయన మాటల్లో ఎక్కడా ధ్వనించేది కాదు. బిడియం, మర్యాద, సత్యనిష్ఠ లతో పాటు ప్రచారానికీ, కపటత్వానికీ ఆమడ దూరంలో నిలిచే స్వభావం ఆయనది. అనుపమ్‌జీలోని సాదా సీదాతనం మనల్ని హత్తుకుంటుంది. తన పుస్తకాల్లాగే అనుపమ్‌జీ సాదాసీదా వ్యవ హారశైలిలో సాదరత, రమ్యత, మర్యాదతనం కలగలిసి ఉన్నాయి. తన పరిమితులేమిటో స్పష్టంగా గ్రహించడం, ఆ పరిమితుల లోపలే తన బాధ్యతలను స్వీకరించడం, దృఢ సంకల్పం ఆయనలో చూడొచ్చు.

డిసెంబర్‌ 19న అనుపమ్‌జీ కనుమూసిన తర్వాత ఇలాంటి నిరు పమాన వ్యక్తి జ్ఞాపకాలను ఎలా సజీవంగా నిలిపి ఉంచాలా అని పదే పదే ఆలోచిస్తున్నాను. ప్రతి చోటా అనుపమ్‌జీ పేరిట ఒక బావిని తవ్వాలి. అలా ఆ నీటి ఊటలో ఆయన సజీవంగా నిలిచిపోతాడు. లేదా భారతీయ భాషలలో సాంఘికశాస్త్రాన్ని మళ్లీ రచించడం కోసం ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలి. అలా ఆ భావజాల స్రవంతిలో ఆయన ఎల్ల ప్పుడూ సజీవంగా ఉండిపోతాడు. లేదా సాదాసీదాతనం, రమ్యత, సంకల్పంతో నిండిన ఉద్యమాన్నొకదాన్ని నిర్మించి ఆయన శక్తిని మనలోకి ఇంకించు కోవడం ద్వారా అనుపమ్‌జీని సజీవంగా నిలుపుకోవచ్చు. అనుపమ్‌జీ మొఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. బహుశా వెళ్తూ వెళ్తూ ‘తొందరే ముంది, తీరిక దొరికినప్పుడే నెమ్మదిగా ఆలోచించుకోవచ్చు’ అని అంటూ సెలవు తీసుకున్నాడేమో!
(నిరుపమాన హిందీ రచయిత అనుపమ్‌ మిశ్రాకు నివాళి)


- యోగేంద్ర యాదవ్‌

వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యుడు
మొబైల్‌ : 98688 88986 Twitter : @_YogendraYadav

Advertisement
Advertisement