గర్భశోకం | Sakshi
Sakshi News home page

గర్భశోకం

Published Thu, Jan 4 2018 12:20 PM

price for Hysterectomies in district - Sakshi

విజయనగరం టౌన్‌: గర్భసంచి ఇస్తే లక్షల రూపాయాలు ఇస్తామని ఆశ చూపి బాధితులను బుట్టలో వేసుకునే విష సంస్కృతి జిల్లాకు పాకింది. ఒక్కో మహిళకు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి టెస్ట్‌ల పేరిట ముందస్తుగా కొంత సొమ్ము తీసుకుని ఓ ముఠా పరారైంది. కొన్నాళ్లుగా ఎంతో సీక్రెట్‌గా జరుగుతున్న ఈ తంతును స్థానికుల సమాచారంతో పోలీసులు ఛేదించారు. ఇందులో ప్రధానసూత్రధారిగా భావిస్తున్న జ్యోతి అనే మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. పోలీసులు ఇద్దరు బాధితులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

అసలు జరిగే పనేనా..?
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు అయిపోయిన తర్వాత కూడా మహిళల వద్ద నుంచి గర్భసంచి తీసుకుని వేరే మహిళకు అమర్చి సంతాన  ప్రాప్తి కల్పిస్తామని ముఠా సభ్యులు చెబుతున్న వాదన. అయితే ఈ విధానం సరైనది కాదని వైద్యులు చెబుతున్నారు. యూట్ర స్‌ మార్పిడి చాలా క్లిస్టతరమైనదని.. ఎక్కడో ఒకచోట  సక్సెస్‌ సాధించి ఉండవచ్చు గాని విజయావకాశాలు బాగా తక్కువని తెలిపారు.  

కి‘లేడీ’పై  కేసు నమోదు
 గర్భసంచి ఇస్తే రూ. 8 లక్షలు ఇస్తామని ఆశ జూపి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్‌ ఎస్సై వి. అశోక్‌కుమార్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో కమ్మవీధి, బూడివీధి, తదితర ప్రాంతాలకు చెందిన పలువురు మహిళలను విశాఖ జిల్లా భీమిలి పట్నానికి చెందిన ఆదిలక్ష్మి అలియాస్‌ జ్యోతి అనే మహిళ మచ్చిక చేసుకుని గర్భసంచి ఇస్తే రూ. 8 లక్షలు ఇస్తానని నమ్మబలికింది. దీంతో కానూరి రాజేశ్వరి, బుజ్జి అనే మహిళ ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి  రిజిస్ట్రేషన్‌ పేరుతో  రూ.750లు, ఆధార్‌ కార్డు, మూడు ఫొటోలు నిందితురాలు తీసుకుంది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వారిని కలిసి పరీక్షల పేరుతో రూ. 50 వేల నుంచి 80 వేల రూపాయల వరకు తీసుకుంది. ఈ క్రమంలో మరికొంతమంది బాధితులు రూప, భూదేవి, రమ, సంతోషి, రాజీ, తదితరులు డబ్బులు సమర్పించుకున్నారు. అయితే జ్యోతి పరారుకావడంతో బాధితల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

దేశంలో లేదు..
 యూట్రస్‌ (గర్భసంచి) మార్పిడి సౌకర్యం మనదేశంలోనే లేదు. ఇతర దేశాల్లో చేసినట్లు కూడా కచ్ఛితంగా తెలియదు.  కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (ట్యూబెక్టీమీ) జరిగిన తర్వాత గర్భం రావడం అసాధ్యం.  
– డాక్టర్‌ రాజ్యలక్ష్మి, గైనికాలజిస్టు, కేంద్రాస్పత్రి

Advertisement
Advertisement