మేడారం భక్తులకు కాంటెస్ట్‌ | Sakshi
Sakshi News home page

మేడారం భక్తులకు కాంటెస్ట్‌

Published Wed, Jan 31 2018 1:14 PM

selfie contest in medaram jatara - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: మేడారం జాతరలో ఎక్కడ చూసినా భక్తులు సెల్ఫీలు దిగుతూ కనిపిస్తున్నారు.. ఏంటి ఈ సెల్ఫీ పిచ్చి అనుకుంటున్నారా.. ప్రభుత్వం ఈసారి మేడారం జాతర కాంటెస్ట్‌–2018 పేరుతో సెల్ఫీ, ఫొటో, షార్ట్‌ఫిల్మ్‌ పోటీలను నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌కు మేడారంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మేడారం జాతరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం ఈ కాంటెస్ట్‌ను భక్తుల ముందుకు తీసుకొచ్చింది.

విజేతలకు నగదు బహుమతులు..
పోటీల్లో గెలుపొందిన వారికి మొత్తం రూ.4.25 లక్షల నగదు బహుమతులను అందించనున్నారు. సెల్ఫీ మొద టి బహుమతి రూ.25 వేల నగదు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు, బెస్ట్‌ ఫొటోగ్రఫీ విభాగంలో మొదటి బహుమతి రూ.75 వే లు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25 వేలు, షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో మొదటి బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు అందించనున్నారు.

ప్రచారం కోసమే..
జాతర విశేషాలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కర్ణన్‌ ఇటీవల స్థానిక యువతతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. కొత్తకొత్త ఆలోచనలతో యువకులు షార్ట్‌ ఫిల్మ్‌లను రూపొందిస్తున్నారు. ఈ పోటీల ద్వారా జాతర ప్రచారం విశ్వ వ్యాప్తమవుతుందనే ప్రభుత్వం భావిస్తోంది.

12,561 మంది లైక్‌లు..
ప్రస్తుతం సోషల్‌ మీడియాపై అందరూ దృష్టి పెట్టారు. దీంతో ప్రభుత్వం అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ లైక్‌ పేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 12,561 మంది ఫేస్‌బుక్‌ లైక్‌ పేజీకి లైక్‌ కొట్టారు. సెల్ఫీలు, ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌ల కాంటెస్ట్‌ కోసం అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ లైక్‌ పేజీలో పోస్ట్‌ చేయాలని పేర్కొన్నారు. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గద్దెల వద్ద, గంట కొడుతూ, ఎదురుకోళ్లను ఇస్తూ ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెల్ఫీలు దిగి పోస్ట్‌ చేస్తున్నారు. జంపన్నవాగులో స్నానం చేస్తున్నవి,  ఎడ్ల బండ్లలో జాతరకు వస్తున్న ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.
ఫిబ్రవరి 5వ వరకు పోటీలు
ఇటీవల హైదరాబాద్‌లో వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి లోకల్‌ ట్రైన్‌ దగ్గర సెల్ఫీ దిగి ప్రమాదం బారిన పడడంతో ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ప్రయాణిస్తూ, గుట్టలు ఎక్కుతూ, విద్యుత్‌ తీగల దగ్గర, జంతువుల దగ్గర, ట్రెక్కింగ్‌ చేస్తున్నప్పుడు సెల్ఫీలు దిగొవద్దని సూచించారు. ఫిబ్రవరి 5 వరకు ఫేస్‌బుక్‌ ద్వారా ఫొటోగ్రఫీ, సెల్ఫీ, షార్ట్‌ ఫిల్మ్‌లను అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

జాతరకు ప్రచారం వస్తుంది..
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్బంగా సెల్ఫీలకు  బహుమతులు పెట్టడం చాలా బాగుంది. అన్ని వయస్సుల వారు సెల్ఫీలు ఎక్కువగా దిగుతున్నారు. సెల్ఫీతోపాటు ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్‌ కాంటెస్ట్‌లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మా ఫ్రెండ్స్‌తో దిగిన ఫొటోను అప్‌లోడ్‌ చేశాం. చాలా మంది లైక్‌లు సైతం కొట్టారు. దీంతో జాతరకు చాలా ప్రచారం కూడా వస్తుంది. 
–మడిపెల్లి సుశీల్, వరంగల్‌ 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement