బాల్యవివాహాల నిరోధక చట్టం ఇలా.. | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాల నిరోధక చట్టం ఇలా..

Published Wed, Jan 24 2018 12:31 PM

special story on child marriages - Sakshi

పశ్చిమగోదావరి, నిడమర్రు : ఆర్థిక అసమానతలు.. నిరక్షరాస్యత.. బాలికలను జాగ్రత్తగా పెంచలేమన్న అభద్రతా భావం.. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న బెంగ.. జిల్లాలో బాల్య వివాహాలు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. చట్టాలు ఎన్ని చేసినా ఈ వివాహాలు ఆగడంలేదు. అధికారుల దృష్టికి 10 శాతం మాత్రమే వస్తుండగా.. 90 శాతం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. జిల్లా శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ (ఐసీపీఎస్‌) అధికారులు ఆపిన వివాహాలు అతి తక్కువగానే ఉన్నాయి. గత మూడేళ్లుగా జిల్లాలో 227 బాల్య వివాహాలు మాత్రమే అపినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరి లెక్కలోకి రాని వివాహాలు అనేకం ఉంటున్నాయి. ఈ బాల్య వివాహాలను నిరోధించే చట్టం బ్రిటీష్‌ కాలం 1929 నుంచి అమలులో ఉంది. ఈ చట్టంలో అనేక మార్పులు చేసిన కేంద్రం బాల్య వివాహల నిరోధక చట్టం–2006ను రూపొందించింది. వివాహానికి వయసును బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లుగా ఈ చట్టంలో నిర్ధారించారు. మరి ఈ చట్టం ఏమి చెబుతుందో తెలుసుకుందాం.

నేరస్తుల విచారణలో..
18 ఏళ్ళ వయస్సు పైబడిన వ్యక్తి బాలికను వివాహం చేసుకున్నట్టయితే అటువంటి వ్యక్తి శిక్షార్హుడని చట్టం పేర్కొంటోంది. బాల్య వివాహం నిర్వహించడం, ప్రోత్సహించడం వంటి పనులు చేస్తున్న వారిలో తల్లిదండ్రులు, సంరక్షకులు, ఇతర వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే ఈ చట్టంలో శిక్షార్హులుగా నిర్దేశించారు. ఈ తరహా నేరాలకు పాల్పడినవారిలో మహిళలుంటే మాత్రం వారికి జైలుశిక్ష విధించరాదని, జరిమానా రూపంలో శిక్ష విధించాలని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు.

బాల్య వివాహం–నేరం–శిక్ష
బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు, చేసే వారు కఠిన కారాగార శిక్షకు అర్హులు. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
బాల్య వివాహం జరిపి తర్వాత ఆ మైనరు బాలికను అక్రమ రవాణా చేయడానికి/ఆమెను దాచేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరం.
బాల్య వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
చట్టాన్ని ఉల్లంఘించి, మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను ఉల్లంఘించి బాల్య వివాహాన్ని ఏ మత సంప్రదాయాలలో జరిపినా ఆ వివాహం చెల్లదు.
ఈ చట్టం కింద నమోదయ్యే కేసులో వారెంట్‌ లేదా మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాన్ని ఆపవచ్చు.
ఈ చట్టం కింద నేరస్తులకు శిక్షతో కూడిన లేదా బెయిలుకు వీలులేని శిక్ష విధిస్తారు.

ఈ చట్టం కింద శిక్షార్హులయ్యే వ్యక్తులు
ఇరు పక్షాల తల్లిదండ్రులు / సంరక్షకులు
పురోహితులు
ఇరుపక్షాల ఇరుగు పొరుగువారు
అటువంటి వివాహాలు కుదర్చడానికి బాధ్యత వహించే పెళ్లి సంఘాలు/వ్యక్తులు
ఈ వివాహానికి హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు
18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న పెళ్లికొడుకు

సమాచారం అందించేవారి వివరాలు గోప్యంగా..
జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే జిల్లా కలెక్టర్, పోలీస్‌ ఉన్నతాధికారులు(ఫోన్‌ నంబర్‌ 100), మహిళా శిశుసంక్షేమ శాఖ పథకం సంచాలకులు, ఐసీపీఎస్, చైల్డ్‌లైన్‌(ఫోన్‌ నంబర్‌ 1098), తహసీల్దార్, సీడీపీవో, గ్రామస్థాయిలో అయితే వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శులకు వెంటనే తెలియజేయవచ్చు. అవసరమైతే సామాజిక సేవా కార్యకర్తలకు కూడా సమాచారం ఇవ్వవచ్చు. సమాచారం అందించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతారు.

బాల్య వివాహం వల్ల వచ్చే సమస్యలు
అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకముందే, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండకముందే వివాహం చేయడం వారి ఆరోగ్యానికి అంత క్షేమకరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
 ప్రధానంగా స్త్రీలు త్వరగా రక్తహీనతకు గురికావడం, అనారోగ్య శిశువులు జన్మించడం, అవయవ ఎదుగుదల లేకపోవడం, శిశు మరణాలు ఎక్కువగా జరగడం
త్వరగా గర్భం దాల్చడంవల్ల వారు త్వరగా బలహీనంగా మారతారు. ఆమెకు పుట్టే బిడ్డకు జన్యుపరమైన సమస్యలతోపాటు, పోషకలోపాలతో జన్మించడం.
అధిక సంఖ్యలో గర్భస్రావాలు, మాతృ శిశు మరణాలు జరుగుతున్నట్టు వివిధ సర్వేలు చెపుతున్నాయి.
దంపతుల మధ్య అవగాహన లోపంతో కుటుంబంలో కలహాలు రావడం, త్వరగా విడిపోయే అవకాశం.
మానసిక సరిపక్వత లేక చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు ప్రయత్నించడం.
కుటుంబ హింసకు, లైంగిక హింసకు ఇంకా  పలు సమస్యలు బారిన పడే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement