దద్దరిల్లిన దేవరపల్లి | Sakshi
Sakshi News home page

దద్దరిల్లిన దేవరపల్లి

Published Wed, Feb 7 2018 11:36 AM

students dharna against road accidents on national highway - Sakshi

గుండుగొలను–కొవ్వూరు రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు నిరసనగా దేవరపల్లిలో విద్యార్థులు మంగళవారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు, అధ్యాపకులు గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించి అనంతరం మూడు రోడ్ల కూడలిలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడకు వచ్చిన సీఐ శరత్‌రాజ్‌కుమార్‌ను విద్యార్థులు ప్రమాదాలపై ప్రశ్నించారు.

దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు నిరసనగా దేవరపల్లిలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు మంగళవారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సోమవారం సాయంత్రం దేవరపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక భూపతిరాజు విద్యాసంస్థలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న జీజే విక్టర్‌బాబు దుర్మరణం చెందడాన్ని విద్యార్థులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. విక్టర్‌బాబు మృతికి సంతాపంగా భూపతిరాజు విద్యాసంస్థలతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు రోడ్ల కూడలిలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆందోళన కొనసాగడంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

విక్టర్‌బాబు కుటుంబానికి న్యాయం చేయాలని, కలెక్టర్‌ రావాలని, గుండుగొలను–కొవ్వూరు మధ్య భారీ వాహనాలను నిషేధించా లని, రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. కొవ్వూరు రూరల్‌ సీఐ శరత్‌రాజ్‌కుమార్‌ నచ్చజెప్నేందుకు ప్రయత్నించినా ఆందోళనకారులు వినకపోవడంతో కొద్దిసేపు వీరిమధ్య వాగ్వాదం జరిగింది. న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని విద్యార్థులు భీష్మించారు. సీఐ శరత్‌రాజ్‌కుమార్, తహసీల్దార్‌ వై.రవికుమార్, ఎస్సై పి.వాసు, ఎంపీడీఓ కె.కోటేశ్వరరావు గ్రామస్తులు, విద్యాసంస్థ చైర్మన్‌ సువర్ణరాజుతో చర్చలు జరిపారు. ప్రజల డిమాండ్‌ను ఉన్నతాధికారులకు వివరించామని, భారీ వాహనాల నిలుపుదలకు చర్యలు తీసుకుం టామని హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు శాంతించారు.

రాజకీయ పార్టీల సంఘీభావం
ఆందోళనకు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, టీడీపీ నాయకులు సుంకర దుర్గారావు, కరుటూరి శ్రీనివాస్, కాంగ్రెస్‌ నాయకులు పచ్చా గోపీ, జనసేన నాయకులు మాధవరపు వెంకటేశ్వరరావు, గంగాడ నాని,  చప్పటి శివ, సొసైటీ ఉపాధ్యక్షుడు దుగ్గిన సూర్యచంద్రరావు ధర్నాలో పా ల్గొని విద్యార్థులకు సంఘీభావం తెలి పారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలం టే భయంగా ఉందని, ప్రాణాలకు గ్యా రంటీ లేదని తలారి వెంకట్రావు, సుంకర దుర్గారావు అన్నారు. ఈజీకే రోడ్డుపై ప్రమాదాలకు నిరసనగా కొవ్వూరు నుం చి ఏలూరు కలెక్టరేట్‌కు పాదయాత్ర చే యాలని జనసేన నాయకులు నిర్ణయం తీసుకున్నారు.

పోలీసుల వలయంలో దేవరపల్లి
దేవరపల్లి పోలీసుల వలయంలో ఉంది. సుమారు 100 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. గ్రామంలో పలుచోట్ల పోలీ స్‌ పికెట్లు ఏర్పాటుచేశారు. రెండు రోజు లు పికెట్లు కొనసాగుతాయని పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement