Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Election Campaign Schedule At Mangalagiri
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని మంగళగిరిలో ఉన్న పాత బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటినగరం రోడ్‌ కాపు వీధి సర్కిల్‌లో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. మధ్యా­హ్నం 3 గంటలకు కడపలోని శ్రీపొట్టి శ్రీరాములు సర్కిల్‌లో జరిగే సభలో సీఎం జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

Pawan Kalyan sensational comments in an English TV channel interview
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

సాక్షి, అమరావతి/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకట­నలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్‌ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్‌ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్‌ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్‌ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.జగన్‌ ఇచ్చిన వాగ్దానాలను  నెరవేర్చలేదు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్‌ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్‌ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్‌ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Video Credits: NDTV 

May 10th: ఏపీ ఎన్నికల సమాచారం

ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం.. 

High Court broke Chandrababu conspiracies
చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్‌

సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు దక్కాల్సిన నిధులను అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రలను హైకోర్టు పటాపంచలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకుని... కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిధుల పంపిణీని అడ్డుకునేందుకు చంద్రబాబు ముఠా కొద్దిరోజులుగా ప్రయత్నిస్తోంది. అవన్నీ ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలని, లబ్ధిదారులు కూడా పాతవారేనని అలాంటప్పుడు దానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదని ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వినతులు పంపినా... చంద్రబాబు ఒత్తిడితో ఈసీ వాటిని పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జోక్యంతో బాబు కుట్రలు భగ్నమయ్యాయి. ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్‌) చేసింది. అయితే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రం సంక్షేమ పథకాల నిధులను పంపిణీ చేయడం గానీ, బదలాయించడం గానీ చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటునిచ్చినట్లయింది. నిధుల పంపిణీకి సంబంధించి పత్రికలు, టీవీలు, రేడియో, ఇంటర్‌నెట్‌తో సహా ఏ ఇతర మాధ్యమం ద్వారా ఏ రకమైన ప్రచారం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నిధుల పంపిణీ విషయంలో ఎలాంటి ఆర్భాటాలు గానీ, సంబరాలు గానీ, రాజకీయ నాయకుల ప్రమేయం గానీ ఉండటానికి వీల్లేదని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరడానికి వీల్లేదంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ...  తదుపరి విచారణను జూన్‌ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ గురువారం రాత్రి 10.20 గంటల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.  నిధుల కోసం కోర్టు తలుపుతట్టిన మహిళలు, రైతులు, విద్యార్థులు... ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల కింద లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయా సంక్షేమ పథకాల లబ్దిదారులైన రైతులు, మహిళలు, విద్యార్థులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆయా పథకాల కింద నిధులను తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ కృష్ణమోహన్, నిధుల పంపిణీ ఎందుకు అత్యవసరమో వివరిస్తూ ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ వినతిపత్రంపై తగిన నిర్ణయం వెలువరించాలని ఎన్నికల సంఘాన్ని గతంలోనే ఆదేశింశారు. ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు రాగా, కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వినతిని పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే పోలింగ్‌ పూర్తయ్యే వరకు నిధుల పంపిణీని ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని చెప్పారు. ఇప్పుడు నిధులు పంపిణీ చేస్తే అది ఓటర్లను ప్రభావితం చేసినట్లే అవుతుందని తెలిపారు. అప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా.. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతరం పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆయా పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధులను ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ‘‘ఇవేమీ కొత్త పథకాలు కావు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలు. వీటి ద్వారా లబ్దిదారులకు నిధులను పంపిణీ చేయడం ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో భాగమే అవుతుంది తప్ప, ఓటర్లను ప్రభావితం చేయడం కిందకు రాదు. నిధుల పంపిణీకి అనుమతుల విషయంలో ఎన్నికల సంఘం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పసుపు కుంకుమ పథకం కింద నిధుల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఆ పథకం ఎన్నికల నియమావళి రాకముందే అమలవుతోందన్న కారణంతో నిధుల పంపిణీకి అనుమతిచ్చింది’’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పసుపు కుంకుమ కింద నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన విషయాన్ని ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా ఢిల్లీ హైకోర్టు ముందుంచిందని ఆయన వివరించారు. నిధుల పంపిణీపై ఎలాంటి ప్రచారం చేయకుండా చూడాలని అప్పటి ప్రధాన ఎన్నికల అధికారిని సైతం ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందని ఆయన కోర్టుకు తెలిపారు. మరి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన ఎన్నికల కమిషన్, ఇప్పుడు నిధుల పంపిణీని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. ‘‘ప్రస్తుతం ఏ పథకాల కింద అయితే నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో, ఆ పథకాలలన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) రావడానికి ముందే అమల్లో ఉన్నాయి. దీన్ని ఒకవైపు ఎన్నికల సంఘం అంగీకరిస్తూనే మరో వైపు నిధుల పంపిణీకి బ్రేక్‌ వేసింది’’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పసుపు కుంకుమ కింద నిధుల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు ఇచ్చిన కూడా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ కింద లబ్దిదారులకు నిధుల పంపిణీని అడ్డు​కోవాలంటూ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైందని, అయితే నిధుల పంపిణీని అడ్డుకునేందుకు హైకోర్టు నిరాకరించిందని ఆయన కోర్టుకు నివేదించారు. చంద్రబాబు హయాంలో ఓ రకంగా, ఇప్పుడు మరో రకంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందని, ఇది ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే అవుతుందని మోహన్‌రెడ్డి చెప్పారు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందని, అందుకు ప్రస్తుత నిర్ణయాలే ఉదాహరణని ఆయన తెలిపారు. నిధుల పంపిణీ బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుంది... ఈ నిధులు రాకుంటే రైతులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అంతిమంగా అది అప్పులు చేసే స్థితికి దారి తీస్తుందని ఆయన వివరించారు. నిధుల పంపిణీ మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుందని, ప్రభుత్వం ఎక్కడా కూడా నిధుల పంపిణీపై ప్రకటనలు ఇవ్వడం గానీ, ప్రచారం చేసుకోవడం గానీ చేసే అవకాశం లేదన్నారు. నిధుల పంపిణీ ద్వారా లబ్ది పొందాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. గతంలో ఎప్పుడో ప్రకటించిన ఈ పథకాలకు ఎన్నికల నియమావళి వర్తించదన్నారు. ఈ పథకాల గురించి ప్రజలందరికీ ఎప్పుడో తెలుసునని, ఈ పథకాల వల్ల ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చిందని, కాబట్టి ఇప్పుడు వాటి ద్వారా ప్రభుత్వం కొత్తగా పొందే లబ్ది గానీ, ప్రచారం గానీ ఏమీ ఉండదన్నారు. లబ్దిదారుల గుర్తింపు, నిధుల బదిలీ మొత్తం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని, ఇందులో ప్రభుత్వానిది నామమాత్రపు పాత్రేనని వివరించారు. కాబట్టి అధికార పార్టీ లబ్ది పొందుతున్న వాదన అర్థరహితమని మోహన్‌రెడ్డి తెలిపారు. నిధుల లభ్యతను బట్టి పంపిణీ చేస్తూ వస్తున్నాం... అటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల సంఘం నిలుపుదల చేసిన పథకాలేవీ కొత్తవి కావన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా అమలవుతన్నాయని, నిరి్ధష్ట సమయంలో నిధులను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతోందని చెప్పారు. ఇప్పుడు కూడా ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందే ఈ పథకాలను ప్రకటించడం, లబ్దిదారులను గుర్తించడం జరిగిందన్నారు. నిధుల పంపిణీ అవసరాన్ని వివరిస్తూ ఎన్నికల కమిషన్‌కు వివరణ కూడా ఇచ్చామన్నారు. ఎన్నికల తేదీ దగ్గరలో ఉందని ఎన్నికల సంఘం ఇప్పుడు చెబుతోందని, వాస్తవానికి తాము ఎప్పుడో ఎన్నికల సంఘాన్ని నిధుల పంపిణీ కోసం అనుమతి కోరామని, అనుమతినివ్వడంలో సంఘం జాప్యం చేసిందని తెలిపారు. నిధుల లభ్యతను బట్టి పంపిణీ ఉంటుందని, ఈ నాలుగేళ్లు అలాగే చేస్తూ వచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు ముందు భవిష్యత్తులో నగదుగా మార్చుకునే విధంగా లబ్దిదారులకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇచ్చారని, అప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మాత్రం లేని పోని రాద్దాంతం చేస్తోందన్నారు. కొత్త పథకాలకు మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని చెప్పారు. మిగిలిన వారి అవకాశాలు దెబ్బతినకుండా ఉండేందుకే... చివరగా ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, పోలింగ్‌ అయ్యేంత వరకు నిధుల పంపిణీని ఆపడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే మిగిలిన వారి అవకాశాలు (లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) దెబ్బతినకుండా ఉండేందుకే నిధుల పంపిణీని ఆపాలంటూ ఉత్తర్వులిచ్చామని తెలిపారు. ఎన్నికల నియమావళికి లోబడే ఈ ఉత్తర్వులిచ్చామని చెప్పారు. ఎన్నికల నియమావళి కొత్త పథకాలతో పాటు పాత పథకాలకు సైతం వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నిధుల పంపిణీ జరిగితే ఓటర్లను ప్రభావితం చేసినట్లే అవుతుందన్నారు. అందుకు ఆస్కారం లేకుండా చేసేందుకే నిధుల పంపిణీని నిలుపుదల చేశామన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని ఆయన కోర్టును కోరారు. ఉదయం 10.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందరి సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ రాత్రి 10.20 గంటలకు ఉత్తర్వులు వెలువరించారు. ఈ వ్యాజ్యాలకున్న అత్యవసరం నేపథ్యంలో పూర్తి ఉత్తర్వుల కాపీ స్థానంలో అడ్వాన్స్‌ ఉత్తర్వుల కాపీని విడుదల చేశారు. పూర్తి కాపీ అందుబాటులోకి వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.   

Special Story About AP Development And Yellow Media Fake Campaign
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 దాకా కనపడని ఎన్నో అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు ఆ తర్వాత ఒకటొకటిగా కళ్లకు కడుతున్నాయి. కరోనా లాంటి అనూహ్య ఉత్పాతం దాదాపు రెండేళ్ల కాలాన్ని మింగేసినా.. కేవలం మూడేళ్ల కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కొన్ని కొనసాగుతుండగా కొన్నింటిని పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ తెలుగుదేశం ఆ పార్టీ మద్దతుదారులు ‘అభివృద్ధి లేదు’ అనే మాటనే గోబెల్స్‌ను తలదన్నేలా ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?ఏ ప్రభుత్వం మీదనైనా పోరాటం చేయాలంటే పేదల సమస్యలనే ప్రతిపక్షాలు తలకెత్తుకోవడం సర్వసాధారణం. పేదరికం పెరిగిందనో..పేదలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందనో, పేదల బ్రతుకులు దుర్భరంగా మారాయనో..విమర్శలతో ఇరుకునపెట్టడం సహజం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఆ పనికి బదులు.. అభివృద్ధి లేదు అంటూ సరికొత్త రాగం ఆలపించడానికి కారణం.. ఈ  పాలనలో పేదలకు అన్యాయం జరిగింది అంటే నమ్మేవారు లేకపోవడం.ఇప్పుడు బడుగువర్గాల నుంచి జగన్‌ ప్రభుత్వంపై ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడం, పథకాలు అందడం లేదనో, పక్కదారి పడుతున్నాయనో, ఇబ్బందుల్లో ఉన్నామనో ఉద్యమాలు, ఆందోళనలు వారు చేపట్టకపోవడం.. అడగకుండానే అన్నీ అమర్చిపెడుతున్న వైఎస్‌ జగన్‌ పాలన నిరుపేదలకు ఎక్కడ లేని భరోసా ఇచ్చింది. దీంతో పేదల్ని వంచించే, మాటలతో రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నాలు ఫలించవని ప్రతిపక్షాలకు పూర్తిగా అర్ధమైంది. తత్ఫలితంగానే  అభివృద్ధి లేదు అంటూ ఈ ఆరున్నొక్కరాగాలు.నాడు ‘కట్టుబట్టలతో’ కల్లబొల్లి కబుర్లు తప్ప అభివృద్ధి ఏదీ..ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలించిన కాలం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ సమయంలో ఎప్పుడు చూసినా ఆయన నోటి వెంట వచ్చే కొన్ని రొడ్డకొట్టుడు వ్యాఖ్యల్లో ‘లోటుబడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మనకు ఇచ్చారు.. మనల్ని కట్టుబట్టలతో తరిమేశారు. మనకు రాజధాని లేదు. ఇప్పటికి 26 సార్లు ఢిల్లీకి వచ్చాను అయినా ఫలితం లేదు’. ఇవేగా ఆయన తాను ఇచ్చిన రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి.. వగైరా హామీల్ని ఎగవేయడం కోసమే ముందస్తుగా ఇలాంటివన్నీ పాడిందే పాట అన్నట్టు వినిపించేవారు.అలాంటి అబద్ధాలతోనే ఐదేళ్ల పాటు పనికిరాని పాలన సాగించారు. తన హయంలో దాదాపుగా 2.50లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఇచ్చిన హామీల్లో పావుశాతం కూడా అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసిందీ లేదు. కొత్త రాజధాని పేరుతో రకరకాల డ్రామాలు ఆడారే తప్ప రాజధాని కాదు కదా అక్కడ ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు.చంద్రబాబులా ఏడుపులు పెడబొబ్బలు లేవు..ఖాళీ ఖజానాకి తోడు రూ.లక్షల కోట్ల రుణభారం ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన తదుపరి ముఖ్యమంత్రికి అందించి వెళ్లారు. తొలిసారి ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలు తలకెత్తుకున్నా.. తొణకకుండా బెణకకుండా వైఎస్‌ జగన్‌ పాలనను పరుగులు పెట్టించారు. గద్దెనెక్కిన కొన్ని నెలలకే కరోనా మహమ్మారి వచ్చి మీద పడింది. అయినా ఎక్కడా అదరలేదు బెదరలేదు. ఎందరు శ్రేయోభిలాషులు చెప్పినా  కరోనా సమయంలో కూడా పథకాలను ఆపలేదు. కట్టుబట్టలతో వచ్చాం, మన పరిస్థితి బాగోలేదు అంటూ చంద్రబాబులాగా ఏ రోజూ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా మాట్లాడలేదు. చుట్టూ సమస్యల్ని ఎదుర్కుంటూనే ఇచ్చిన ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.ఓ వైపు సరికొత్త శైలి సంక్షేమ పధాన్ని అనుసరిస్తూనే మరోవైపు మూలాల నుంచి అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ పాలనా ఫలాలు ప్రతీ చోటా కళ్లకు కడుతున్నాయి. గ్రామసెక్రటేరియల్స్‌ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, వైద్య కళాశాలలు కావచ్చు, ఫిషింగ్‌ హార్బర్స్‌ కావచ్చు.. చంద్రబాబు పాలనలో కనపడని ఎన్నో అభివృద్ధి సూచికలు ఆంధ్రప్రదేశ్‌లో కళ్లకు కడుతున్నాయి.పదేపదే అదే మాట అందుకే..ఓం భూం హాం ఫట్‌ అంటే ప్రత్యక్షమైపోవడానికి పైన పేర్కొన్నవేవీ ఇంద్రజాల టక్కుటమార ఫలితాలు కావు. ఎంతో దూరదృష్టితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రజల మేలు కోసం కళ్ల ముందుకు తెచ్చిన బంగారు భవిష్యత్తు దీపికలు. అయినప్పటికీ అభివృద్ధి లేదనే పాచిపాట ఎందుకు పాడుతున్నారంటే.. పల్లెల్లో జరిగే అభివృద్ధి పనులు కావచ్చు, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు కావచ్చు.. ఇవన్నీ కళ్లారా చూసి పాలనను బేరీజు వేసుకునేంత తీరిక ఓపిక ప్రజలకు ఉండదని సో.. చంద్రబాబు అండ్‌ ఎల్లో మీడియా ప్రచార ప్రభావానికి వీరు లోనవుతారనేదే ఈ అభివృద్ధి లేదనే ప్రచారం వెనుక దాగున్న కుయుక్తి.అయితే గతంలోలాగ ఏది పడితే అది నమ్మే అవసరం, పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రజల్లో రాజకీయాలపై, నేతల పాలనా దక్షతపై  అవగాహన పెరిగింది. ప్రతీ అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు– వైఎస్‌ జగన్‌ పాలనలోని వ్యత్యాసాలను బేరీజు వేసుకునేందుకు వీలుగా వారికి ఇప్పుడు ఎన్నో రకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చంద్రబాబు నాయుడు అండ్‌ ఎల్లో మీడియా గోబెల్స్‌ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. నిజాలను నిర్ద్వంద్వంగా గెలిపించనున్నాయి.–సత్యార్థ్‌.

Virat Kohli Creates History, Becomes First Player In The IPL
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా

ఐపీఎల్‌-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్‌ ఓపెనర్‌​ విరాట్‌ కోహ్లి మరోసారి సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి అదరగొట్టాడు. పంజాబ్‌ బౌలర్లను విరాట్‌ ఊచకోత కోశాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న కింగ్‌ కోహ్లి.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు రజిత్ పాటిదార్‌(55), కామెరాన్ గ్రీన్(46) రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన విరాట్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌లో కోహ్లి పంజాబ్‌ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో కోహ్లి 600 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 634 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 600 పరుగులు మార్క్‌ను అందుకున్న కేఎల్‌ రాహుల్‌ రికార్డును కోహ్లి సమం చేశాడు. కోహ్లి 4 సీజన్‌లలో 600 ప్లస్‌ పరుగులు చేశాడు. రాహుల్‌ కూడా 4 సీజన్‌లలో 600 పైగా పరుగులు చేశాడు. 

Satya Movie Review And Rating In Telugu
‘సత్య’ మూవీ రివ్యూ

టైటిల్‌: సత్యనటీనటులు: హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయరచన-దర్శకత్వం: వాలీ మోహన్‌దాస్‌నిర్మాత: శివ మల్లాల(తెలుగులో)సంగీతం: సుందరమూర్తి కె.యస్‌సినిమాటోగ్రఫీ: ఐ.మరుదనాయగంఎడిటర్‌: ఆర్‌. సత్యనారాయణవిడుదల తేది: మే 10, 2024(తెలుగులో)ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలను సైతం తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ, ఇక్కడ ఒకేసారి రిలీజ్‌ చేస్తే.. మరికొన్నింటిని అక్కడ రిలీజ్‌ చేసి హిట్‌ టాక్‌ వచ్చిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చిన మరో తమిళ్‌ సినిమానే సత్య. తమిళ్‌లో ‘రంగోలి’పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్య పేరుతో విడుదల చేశాడు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్‌, శివమ్‌ మీడియా అధినేత శివ మల్లాల. అనువాదం సినిమానే అయినా.. స్టైయిట్‌ సినిమా మాదిరి ప్రమోషన్స్‌ గట్టిగా చేయడంతో ‘సత్య’పై బజ్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(మే 10) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘సత్య’ కథేంటంటే..సత్యమూర్తి అలియాస్‌ సత్య(హమరేష్‌) గాజువాకలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుంటాడు. అతని తండ్రి గాంధీ(ఆడుగలం మురుగదాస్‌) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్‌ కళాశాలలో చదివించాలనేది అతని కోరిక. అప్పు చేసి మరీ కొడుకుని ప్రైవేట్‌ కాలేజీలో జాయిన్‌ చేయిస్తాడు. సత్యకు మాత్రం అక్కడ చదువుకోవడం అస్సలు నచ్చదు.తండ్రి కోసమే ప్రైవేట్‌ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని చిన్నచూపు చూస్తూ రకరకాల వివక్షకు గురి చేస్తారు. ఓ గ్యాంగ్‌తో ప్రతి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు అదే కాలేజీలో చదువుతున్న పార్వతి అలియాస్‌ పారు(ప్రార్ధన సందీప్‌)తో సత్య ప్రేమలో పడతాడు. పారుకి కూడా సత్య అంటే ఇష్టమే కానీ.. బయటకు చెప్పదు. ఓ కారణంగా అందరి ముందు సత్యను లాగిపెట్టి కొడుతుంది. అప్పటి నుంచి సత్య ఆ కార్పొరేట్‌ కళాశాలలో ఇమడలేకపోతాడు. తన చదువు కోసం ఫ్యామిలీ పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏంటి? పార్వతితో ప్రేమలో పడిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కొడుకును కార్పొరేట్‌ కళాశాలలో చదివించేందుకు గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సత్య తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్కూల్‌, కాలేజీ లవ్‌స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సత్య మూవీ కాన్సెప్ట్‌ కూడా అదే. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఇది. అయితే ఈ ప్రేమ కథకి తండ్రి కొడుకుల ఎమోషన్‌ని యాడ్‌ చేసి ఫ్రెష్‌ ఫీలింగ్‌ని తీసుకొచ్చాడు దర్శకుడు. ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్‌లో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు.  కొడుకు కోసం పేరెంట్స్‌.. పెరెంట్స్‌ కోసం కొడుకు ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కథంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగిస్తూనే...అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు.ప్రభుత్వ కాలేజీల్లో చదివితే చెడిపోతారనే భయంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్‌ కాలేజీల్లో చేర్పించడం.. ఫీజులు  కట్టేందుకు వాళ్లు పడే బాధలు, కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు చాలా మంది కనెక్ట్‌ అవుతారు. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు మనసును తాకుతాయి. అయితే దర్శకుడు ప్రతీది డైలాగ్స్‌ రూపంలో చెప్పకుండా..విజువల్స్‌ రూపంలో చూపిస్తూ ప్రేక్షకుడే దాన్ని అర్థం చేసుకొని ఫీల్‌ అయ్యేలా చేశాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇందులో బాగా వర్కౌట్‌ అయింది. దర్శకుడికి తొలి సినిమా అయితే.. కొన్ని సన్నీవేశాలను తెరకెక్కించిన విధానం చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్ట్‌లా అనిపిస్తాడు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. ప్రభుత్వ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ కథను ప్రాంభించాడు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌.. కార్పొరేట్‌ కళాశాలలో చదివించేందుకు వారు పడే కష్టాలు.. ఇలా ఎమోషనల్‌గా కథనం సాగుతుంది. హీరో ప్రైవేట్‌ కాలేజీలో చేరిన తర్వాత లవ్‌స్టోరీ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం సరదాగా సాగిపోతుంది. కాలేజీలో జరిగే  చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తమ కాలేజీ డేస్‌ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్‌ సీన్స్‌ హృదయాలను హత్తుకుంటాయి. క్లైమాక్స్‌  ఆకట్టుకుంది. కథనం కాస్త స్లోగా సాగినా.. ఎక్కడా బోర్‌ కొట్టదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..సత్యగా హమరేష్ చాలా బాగా నటించారు. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు. పారుగా నటించిన ప్రార్థన తెరపై క్యూట్ గా కనిపించింది. హీరో తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది.  సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  డబ్బింగ్‌ విషయంలో  చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శివ మల్లాల. అచ్చమైన తెలుగు సినిమా  చూసినట్లే ఉంటుంది.

TCS CEO earns the least among IT firms ceos
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్‌ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు,  అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్‌ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్‌ పర్చేజ్‌ స్కీమ్‌ (ESPS) ఉండదు.2024 ఆ‍ర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Akshaya Tritiya 2024: Why People Buy Gold On This Day Significance of Akshaya Tritiya
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?

భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి  అత్యంత విశిష్టత ఉంది. ఈ పండుగను ఇవాళే జరుపుకుంటాం. వైశాఖంలో వచ్చే ఈ శుక్ల పక్ష తదియకు ఎందుకంత ప్రాముఖ్యం. పైగా ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతియకు సంబంధం ఏంటీ?. ఈ రోజున ఏం చేస్తారు..?ఆ పేరు ఎలా వచ్చిందంటే..మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి.. ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి "అక్షయ తృతీయ" అని పేరు.ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచవ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని పురాణోక్తి. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుంచి కావచ్చు, యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.విశిష్టత..కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది.బంగారం కొనాల్సిందేనా..?అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు.  పురాణాల ప్రకారం, కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకడి పసిడి. బంగారాన్ని అహంకరానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈరోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే.. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు.. దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.ఈ రోజునే  పురాణల్లో జరిగిన సంఘటనలు..కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడుశ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు  పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజేకుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజేకటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదేఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయఅన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం. 

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all