Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

T20 World Cup 2024: Team India Defeated Pakistan By 6 Runs
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడు ఆటంకాల నడుమ ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. పాక్‌ పేసర్ల ధాటికి 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో 3 వికెట్లు, మొహమ్మద్‌ ఆమిర్‌ 2, షాహిన్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 12; ఫోర్‌, సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌) రెండంకెల స్కోర్‌ చేయగా.. విరాట్‌ కోహ్లి (3 బంతుల్లో 4; ఫోర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (8 బంతుల్లో 7; ఫోర్‌), శివమ్‌ దూబే (9 బంతుల్లో 3), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 12; ఫోర్‌), రవీంద్ర జడేజా (0), అర్ష్‌దీప్‌ సింగ్‌ (13 బంతుల్లో 9; ఫోర్‌), బుమ్రా (0) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బుమ్రా (4-0-14-3), హార్దిక్‌ (4-0-24-2), సిరాజ్‌ (4-0-19-0), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-31-1), అక్షర్‌ పటేల్‌ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పాక్‌ గెలవాలంటే ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతకుముందు ఓవర్‌లో బుమ్రా మ్యాజిక్‌ చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. ఈ గెలుపుతో భారత్‌ ప్రపంచకప్‌ టోర్నీల్లో పాక్‌పై తమ రికార్డును 7-1కి మరింత మెరుగుపర్చుకుంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో మొహ​మ్మద్‌ రిజ్వాన్‌ (31) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. ఈ ఓటమితో పాక్‌ సూపర్‌ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

Narendra Modi takes oath for third time as Prime Minister of India
మోదీ అనే నేను..

న్యూఢిల్లీ: స్వతంత్ర భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన నాయకునిగా రికార్డులకెక్కారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 73 ఏళ్ల మోదీతో ప్రధానిగా ప్రమాణంచేయించారు. ఆయన దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అన్ని రంగాలకూ చెందిన అతిరథ మహారథుల సమక్షంలో కార్యక్రమం 155 నిమిషాల పాటు అత్యంత వేడుకగా జరిగింది.మోదీ సహా 72 మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా కొలువుదీరింది. 30 మందితో కేబినెట్‌ మంత్రులుగా, ఐదుగురితో స్వతంత్ర, 36 మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన ఎన్డీఏ మిత్రపక్షాలకు మంత్రివర్గంలో 11 బెర్తులతో సముచిత ప్రాధాన్యం దక్కింది. బీజేపీ నుంచి రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఎస్‌.జైశంకర్‌ వంటి అతిరథులతో పాటు మిత్రపక్షాల నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు (టీడీపీ), లలన్‌సింగ్‌ (జేడీయూ), చిరాగ్‌ పాస్వాన్‌ (ఎల్జేపీ), హెచ్‌.డి.కుమారస్వామి (జేడీఎస్‌) తదితరులు ప్రమాణస్వీకారం చేసిన ప్రముఖుల్లో ఉన్నారు.ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) చీఫ్, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమంలో పాల్గొనగా తృణమూల్‌ కాంగ్రెస్, సమాజ్‌వాదీతో పాటు పలు విపక్షాలు గైర్హాజరవడం విశేషం. 140 కోట్ల మంది భారతీయులకు మరోసారి సేవ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని కార్యక్రమం అనంతరం మోదీ పేర్కొన్నారు.‘‘నూతన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రగతి పథంలో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తా. అనుభవం, యువత కలబోతగా కొత్త మంత్రివర్గం అలరారుతోంది. ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు నిరంతరం శ్రమిస్తాం’’ అంటూ ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. నూతన మంత్రులకు శాఖల కేటాయింపు సోమవారం జరిగే అవకాశముంది. ఆరుగురు మాజీ సీఎంలు మోదీ 3.0 మంత్రివర్గం పలు విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఐదేళ్ల విరామం తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి అడుగు పెట్టారు. మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, కుమారస్వామిలకు తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. వారితో పాటు నూతన మంత్రివర్గంలో 33 మంది కొత్త ముఖాలున్నాయి. శివరాజ్, కుమారస్వామి, రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్‌లాల్‌ ఖట్టర్, సర్బానంద సోనోవాల్, జితిన్‌రాం మాంఝీ రూపంలో నూతన మంత్రివర్గంలో ఆరుగురు మాజీ సీఎంలుండటం విశేషం! 43 మందికి మూడుసార్ల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులుగా చేసిన అనుభవముంది. యూపీకి అత్యధికంగా 9 బెర్తులు కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా 9 స్థానాలు దక్కాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న కీలకమైన బిహార్‌కు ఏకంగా 8 బెర్తులు దక్కాయి! ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు కూడా ఆరు బెర్తులు లభించాయి. గుజరాత్‌కు ఐదు; మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లకు ఐదేసి; హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు మూడేసి; ఒడిశా, అసోం, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశి్చమబెంగాల్‌కు రెండేసి చొప్పున స్థానాలు దక్కాయి.అయితే యూపీకి ఒకే కేబినెట్‌ హోదా బెర్తు దక్కగా బిహార్‌కు ఏకంగా నాలుగు లభించడం విశేషం! గుజరాత్‌కు కూడా మోదీ, అమిత్‌ షా, మాండవీ, సీఆర్‌ పాటిల్‌ రూపంలో ఏకంగా నాలుగు కేబినెట్‌ హోదా బెర్తులు దక్కాయి! మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లకు మూడేసి; మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశాలకు రెండేసి కేబినెట్‌ మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ, ఏపీలతో పాటు హరియాణా, పంజాబ్‌లకు ఒక్కో కేబినెట్‌ హోదా బెర్తు దక్కాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి 13 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. 37 మందికి ఉద్వాసన మోదీ 2.0 మంత్రివర్గంలో పని చేసిన వారిలో స్మృతీ ఇరానీ, అనురాగ్‌ ఠాకూర్, నారాయణ్‌ రాణే సహా ఏకంగా 37 మందికి ఈసారి కేబినెట్లో చాన్స్‌ దొరకలేదు. వీరిలో పలువురు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2.0 మంత్రివర్గంలోని 19 మంతి కేబినెట్‌ మంత్రులతో సహా మొత్తం 34 మంది తిరిగి చోటు దక్కించుకున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన ఎల్‌ మురుగన్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా చాన్స్‌ దక్కడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కొత్త మంత్రుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు చొప్పున 12 మంది రాజ్యసభ సభ్యులున్నారు. 58 మంది లోక్‌సభ సభ్యులు కాగా రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ, జార్జి కురియన్‌ ఏ సభలోనూ సభ్యలు కారు. వారు ఆర్నెల్లలోగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవాల్సి ఉంటుంది. భాగస్వాములకు పెద్దపీట ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు నూతన మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కింది. తాజా మాజీ మంత్రివర్గంలో వాటికి ఒక్క కేబినెట్‌ హోదా, స్వతంత్ర హోదా మంత్రి పదవి కూడా లేదు. ఈసారి మాత్రం కుమారస్వామి (జేడీఎస్‌), మాంఝి (హెచ్‌ఏఎల్‌), లలన్‌సింగ్‌ (జేడీయూ), రామ్మోహన్‌ నాయుడు (టీడీపీ), చిరాగ్‌ పాస్వాన్‌ (ఎల్జేపీ–ఆర్‌వీ) రూపంలో ఏకంగా ఐదు కేబినెట్‌ హోదా బెర్తులు దక్కాయి! ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ (శివసేన), జయంత్‌ చౌదరి (ఆరెల్డీ)లకు స్వతంత్ర హోదా కూడిన పదవులు లభించాయి. 2.0 మంత్రివర్గంలో సహాయ మంత్రులైన అనుప్రియా పటేల్‌ (అప్నాదళ్‌–యూపీ), రామ్‌దాస్‌ అథవాలె (ఆర్‌పీఐఏ–మహారాష్ట్ర)లకు మళ్లీ చాన్సిచ్చారు. వారితో పాటు రామ్‌నాథ్‌ ఠాకూర్‌ (జేడీయూ), పెమ్మసాని చంద్రశేఖర్‌ (టీడీపీ)లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి. కొత్త మంత్రులు 33 మంది మోదీ 3.0 మంత్రివర్గంలో 33 కొత్త ముఖాలకు చోటు దక్కింది. మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్, కుమారస్వామి, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తదితర దిగ్గజాలతో పాటు తొలిసారి ఎంపీలుగా నెగ్గిన సురేశ్‌ గోపి తదితరుల దాకా వీరిలో ఉన్నారు. 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కేంద్ర మంత్రివర్గంలో 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. గోవా, అరుణాచల్‌ వంటి చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే నలుగురు, అంతకంటే ఎక్కువ మంది లోక్‌సభ సభ్యులున్న ప్రతి రాష్ట్రం నుంచీ కనీసం ఒక్కరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఏడుగురు మహిళలు నూతన మంత్రివర్గంలో మహిళలు 10 శాతం కంటే తక్కువే ఉన్నారు. మొత్తం ఏడుగురికి స్థానం దక్కింది. ఇదీ కులాల కూర్పు మోదీ 3.0 మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు. కా>గా ఐదుగురు మైనారిటీలున్నారు. అయితే ముస్లింలు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. ఇంకో 8 మందికి అవకాశం కేంద్ర మంత్రివర్గ గరిష్ట పరిమాణం 81 (543 మంది లోక్‌సభ సభ్యుల్లో 15 శాతం). దాంతో మరో 9 మందికి మంత్రులుగా అవకాశముంది. అయితే 2019–24 మధ్య మోదీ 2.0 మంత్రివర్గంలో 78 మంది సభ్యులే ఉన్నారు. అత్యంత పిన్న వయసు్కలు రామ్మోహన్, ఖడ్సే నూతన కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చెందిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు (టీడీపీ), మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సే (బీజేపీ) అత్యంత పిన్న వయసు్కలు. వారికి 37 ఏళ్లు. అత్యంత పెద్ద వయసు్కనిగా 79 ఏళ్ల హెచ్‌ఏఎల్‌ అధినేత జితిన్‌రాం మాంఝీ నిలిచారు. బాక్సు నేడు కేబినెట్‌ తొలి భేటీ మోదీ 3.0 మంత్రివర్గ తొలి సమావేశం సోమవారం జరగనుంది. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసంలో సాయంత్రం భేటీ ఉంటుందని సమాచారం. నూతన మంత్రివర్గ సభ్యులందరికీ బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆదివారం రాత్రి విందు ఇచ్చారు.

Nine Killed As Terrorists Open Fire At Bus Carrying Pilgrims In Jammu And Kashmir
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి

జమ్ము-కశ్మీర్‌ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూలోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించేందుకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 9మంది యాత్రికులు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతమందికి బుల్లెట్ గాయాలు అయ్యాయో ఇంకా తెలియరాలేదని రియాసి జిల్లా మేజిస్ట్రేట్ విశేష్ మహాజన్ తెలిపారుఉగ్రవాదుల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు,భద్రతా బలగాలు బాధితుల్ని రక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంలో గాయపడ్డ బాధితుల్ని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి.

Rahul Gandhi Criticises Modi Over neet row
నీట్‌ పరీక్ష ఫలితాల వివాదం : రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌- యూజీ పరీక్ష- 2024లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. విద్యార్ధుల తరుపున ఇదే అంశంపై పార్లమెంట్‌లో గళమెత్తుతామని స్పష్టం చేశారు. నీట్‌ పరీక్షల్లో లోపాల కారణంగా సుమారు 67మంది ప్రథమ ర్యాంక్‌ రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఎ‍క్స్‌ వేదికగా స్పందించారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నీట్‌ పరీక్షల కారణంగా 24 లక్షమంది విద్యార్ధులు, వారి కుటుంబాలను నాశనం చేసింది. ఒకే పరీక్షా కేంద్రంలోని 6 మంది విద్యార్థులు గరిష్ట మార్కులతో పరీక్షలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. చాలా మంది విద్యార్ధులకు టెక్నికల్‌గా సాధ్యం కాని విధంగా మార్కులు వచ్చాయి. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అయినప్పటికీ నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యిందని కేంద్రం ఒప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్‌ లీకేజీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ బలమైన ప్రణాళికను రూపొందించింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా పేపర్‌ లీకేజీలు కాకుండా ఉండేలా చట్టం చేస్తే.. పేపర్‌ లీకేజీల నుంచి విద్యార్ధులను పేపర్ లీక్ నుండి విముక్తి చేస్తామని హామీ ఇచ్చాము అని ఆయన అన్నారు.లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు నేను దేశంలోని విద్యార్థులందరికీ పార్లమెంటులో మీ వాయిస్‌గా మారుతా. మీ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను గట్టిగా లేవనెత్తుతానని హామీ ఇస్తున్నాను అని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.

 Nayanthara Vignesh Shivan Special Post on thier Marriage anniversery
నయన్‌- విఘ్నేశ్‌ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!

కోలీవుడ్‌లో మోస్ట్‌ ఫేమ్ ఉన్న ఫేమ్ ఉన్న జంటల్లో నయనతార- విఘ్నేశ్ శివన్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు జూన్ 9, 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసి పద్ధతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. తాజాగా ఇవాళ రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా నయన భర్త విఘ్నేశ్ శివన్‌ స్పెషల్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.విఘ్నేశ్ శివన్‌ తన ఇన్‌స్టాలో రాస్తూ..'పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలోకి అతి గొప్పవిషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా. నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే ఆశయం. ఆలాగే మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. నయన్ గతేడాది జవాన్‌ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన అన్నపూరణి చిత్రం విమర్శల పాలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Amitabh Bachchan to play a cameo in Fakt Purusho Maate
సీక్వెల్‌ సెట్‌లో...

గుజరాతీ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు అమితాబ్‌ బచ్చన్‌. 2022లో అమితాబ్‌ ఓ కీలక పాత్రలో నటించిన ‘ఫక్త్‌ మహిళా మాటే’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. యశ్‌ సోనీ, దీక్షా జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఫక్త్‌ మహిళా మాటే’కు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. జై బోదాస్‌ దర్శకత్వంలో ఆనంద్‌ పండిట్, వైశాల్‌ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఫక్త్‌ పురుషో మాటే’ అనే సినిమాను ఆరంభించారు. అమితాబ్, యశ్‌ సోనీ, మిత్ర గాధ్వీ, ఇషా కన్సారా, దర్శన్‌ జరీవాలా సీక్వెల్‌లో ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్‌ని పార్థ్‌ త్రివేదీతో కలిసి జై బోదాస్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.ప్రస్తుతం అమితాబ్‌తో పాటు ఈ చిత్రం ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌. ‘‘అమితాబ్‌ బచ్చన్‌గారితో ఓసారి పని చేసిన ఎవరైనా ఆయనతో మళ్లీ వర్క్‌ చేయాలనుకుంటారు. అమితాబ్‌గారి ఎనర్జీ, అంకితభావం సెట్స్‌లో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది’’ అని పేర్కొన్నారు నిర్మాత ఆనంద్‌ పండిట్‌. ఈ సంగతి ఇలా ఉంచితే... మహిళల మనసుల్లో ఏముందో తెలుసుకోగల శక్తులు ఓ కుర్రాడికి వస్తాయి. వాటితో ఆ యువకుడు ఏం చేశాడు? విడిపోతున్న ప్రేమికులను ఎలా కలిపాడు? అనే అంశాలతో ‘ఫక్త్‌ మహిళా మాటే’ చిత్రం సాగుతుంది. ఇక సీక్వెల్‌ మగవారి కోణంలో ఉంటుందని టైటిల్‌ స్పష్టం చేస్తోంది.

Elon Musk Says Thanks To Indian Origin Ashok Elluswamy
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్

గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ కంపెనీ టెస్లా ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి తెలుసు. అయితే ఆ సంస్థ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారిలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనే 'అశోక్ ఎల్లుస్వామి'. ఈయనకు మస్క్ కృతజ్ఞతలు చెబుతూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.టెక్ బిలియనీర్ అశోక్‌ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) వేదికగా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను ప్రశంసించారు. కంపెనీలో ఏఐ / ఆటోపైలెట్ విభాగాలు అభివృద్ధి చెందడం వెనుక మస్క్ పాత్ర అనన్యసామాన్యమని అన్నారు. ప్రారంభంలో ఈ టెక్నాలజీ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనను మస్క్ చెప్పినప్పుడు.. అసలు అది సాధ్యమవుతుందా అని అందరు అనుకున్నారు. కానీ మస్క్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. టీమ్‌ను ముందుకు నడిపించారు.అనుకున్న విధంగా ముందుకు వెళుతూ 2014లో ఆటోపైలట్‌ను ఓ చిన్న కంప్యూటర్‌తో స్టార్ట్ చేసాము. అది కేవలం 384 KB మెమరీ మాత్రమే కలిగి ఉంది. ఆ తరువాత లేన్ కీపింగ్, లేన్ ఛేంజింగ్, లాంగిట్యూడినల్ కంట్రోల్ ఫర్ వెహికల్స్ వంటి వాటిని అమలు చేయాలని మస్క్ ఇంజనీరింగ్ టీమ్‌కు చెప్పారు. ఇది మాకు చాలా క్రేజీగా అనిపించింది. అయినా పట్టు వదలకుండా 2015లో టెస్లా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోపైలట్ సిస్టమ్‌ను తీసుకువచ్చాము.https://t.co/yUqvdS7JOf— Ashok Elluswamy (@aelluswamy) June 9, 2024ఆటోఫైలెట్ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా.. కంపెనీలోనే చేయడం ప్రారంభించాము. కేవలం పదకొండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించాం. ఇది టెస్లా బలమైన ఏఐ బృందం సాధించిన గొప్ప విజయం. మస్క్ కేవలం బలమైన ఏఐ సాఫ్ట్‌వేర్ కోసం మాత్రమే కాకుండా, శక్తివంతమైన AI హార్డ్‌వేర్ కోసం కూడా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే న్యూరల్ నెట్‌వర్క్‌లను సమర్థవంతంగా అమలు చేయడానికి సిలికాన్‌ను తయారు చేసాము.మొత్తం మీద ఏఐలో టెస్లా విజయానికి మస్క్ కీలకమైన వ్యక్తి. ఇది ఆయనకు టెక్నాలజీ మీద ఉన్న అవగాహన, పట్టుదల వల్ల సాధ్యమైంది. గొప్ప గొప్ప టెక్నాలజీలను ఇతరులు చూడకముందే మస్క్ కనిపెడుతున్నారు. అదే టెస్లాను వాస్తవ ప్రపంచ AIలో అగ్రగామిగా నిలిపింది. రాబోయే రోజుల్లో ఫుల్లీ అటానమస్ కార్లు, హౌస్ హోల్డ్ రోబోట్స్ సర్వ సాధారణమైపోతాయని అశోక్ ఎల్లుస్వామి.. మస్క్‌ను గొప్పగా ప్రశంసించారు.థాంక్యూ అశోక్ అని ప్రారంభించి.. అశోక్ టెస్లా ఆటోపైలట్ బృందంలో చేరిన మొదటి వ్యక్తి. నేడు ఆటోపైలట్ సాఫ్ట్‌వేర్‌లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అతడు.. మా అద్భుతమైన టీమ్ లేకుండా మేము విజయాలను సాధించి ఉండేవారము కాదేమో.. అంటూ ఎల్లుస్వామి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.Thanks Ashok! Ashok was the first person to join the Tesla AI/Autopilot team and ultimately rose to lead all AI/Autopilot software. Without him and our awesome team, we would just be another car company looking for an autonomy supplier that doesn’t exist. Btw, I never… https://t.co/7eBfzu0Nci— Elon Musk (@elonmusk) June 9, 2024

Vk Pandian Quits Acitve Politics In Odisha
ఒడిశా: పాలిటిక్స్‌కు వీకే పాండియన్‌ గుడ్‌బై

భువనేశ్వర్‌: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్‌(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్‌ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్‌9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్‌ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Britain's Sark Island Prison Is The Smallest In The World
ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?

ఇది ప్రపంచంలోనే అతిచిన్న చెరసాల. ఇద్దరు ఖైదీల సామర్థ్యం మాత్రమే గల ఈ జైలు బ్రిటన్‌లోని సార్క్‌ దీవిలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య ఇంగ్లిష్‌ చానల్‌లోని చానల్‌ దీవుల ద్వీపసమూహంలో ఒకటైన సార్క్‌ దీవి విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే! ఈ దీవి జనాభా 562 మంది.ఈ దీవిలో 1856లో ఈ జైలును నిర్మించారు. చెక్కపీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం. తొలిరోజుల్లో ఈ జైలుకు విద్యుత్‌ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, రెండు గదుల మధ్య సన్నని నడవ మాత్రమే ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం.అయితే, ఈ జైలులో ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను ఈ జైలులో రెండు రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. సార్క్‌ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్‌ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవిచారణ అధికారాలను ఇచ్చింది.ఇక్కడ పట్టుబడిన ఖైదీలను రెండు రోజులకు మించి నిర్బంధించరాదని, అంతకు మించిన శిక్ష విధించాల్సిన నేరానికి పాల్పడినట్లయితే వారిని గ్రంజీ జైలుకు తరలించాలని 1583లో అప్పటి బ్రిటిష్‌ రాచరికం ఆదేశాలు జారీచేసింది. ఆనాటి ఆదేశాలే ఇక్కడ ఈనాటికీ అమలులో ఉన్నాయి. అయితే, ఈ జైలుకు తరచు ఖైదీల రాక ఉండదు. తక్కువ జనాభా గల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ.ఇవి చదవండి: 'అపార్ట్‌మెంట్‌ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!

Brahmastra on sparrow: Every living being is useful in creation
పిచ్చుక మీదనా బ్రహ్మాస్త్రం?

‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’’ అనే జాతీయం ఉంది. అతి తక్కువ బలం ఉన్నప్రాణి మీద అనవసరంగా అతి పెద్ద బలప్రయోగం చేయటం అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఎంత చిన్నప్రాణి అయినా దాని అస్తిత్వం నిరుపయోగం కాదు. విశ్వంలో, ముఖ్యంగా భూగోళంలో, ప్రధానంగా అది ఉండే ప్రాంతంలో అది పోషించవలసిన పాత్ర ఒకటి ఉండనే ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, తద్వారా పర్యావరణ సమతౌల్యత ఉంటాయి. దానికి భంగం కలిగిస్తే పర్యవసానం అనుభవించ వలసి ఉంటుంది. ఒక పిచ్చుక సంవత్సరంలో 6.5 కిలోల బియ్యం తింటుంది అని చైనాలో ఒకప్పుడు చేపట్టిన సర్వే తెలిపింది. మొత్తం పిచ్చుకలు లేకుండా చేయగలిగితే 60 వేల మందికి ఆహారం లభిస్తుంది అని కూడా తెలిపింది. ఇంకేముంది? అసలే అధిక జనాభా సమస్య ఉన్న చైనా, వీలైనంత మందికి ఆహారం అందించటానికి ఇదొక మార్గం అనుకుని పిచ్చుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది. 30 లక్షల పిచ్చుకలని చంపారు. 1958 – 61 సంవత్సరాల మధ్య చైనాలో తీవ్రమైన కరవు వచ్చింది. సుమారుగా నాలుగు కోట్ల యాభై వేల మంది చనిపోయారు. కారణం ఏమై ఉంటుంది అని విచారణ చేస్తే పిచ్చుకలు లేక పోవటం వల్ల అని తేలింది. అదెట్లా? పిచ్చుకలు ధాన్యం తినటంతోపాటు పంటలని నాశనం చేసే పురుగులని కూడా తింటాయి. చీడ పురుగులని తినే పిచ్చుకలు లేక పోవటంతో పంటలకి చీడ పట్టి, తెగులు సోకి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. అది రాను రాను పెరిగింది. ప్రజలు తిండి లేక చనిపోయారు. దీనికి పరిష్కారం పంటలని నాశనం చేసే తెగుళ్లు కలిగించే పురుగులని రసాయన పదార్థాలు వాడ నవసరం లేకుండా తినేసే పిచ్చుకలు ఉండేట్టు చేయటమే అని నిర్ధారించారు. చేసేది ఏమీ లేక పిచ్చుకలని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. రష్యా నుండి పిచ్చుకలని దిగుమతి చేసుకున్నారు. పరిస్థితి అదుపు లోకి వచ్చింది. ఇటువంటి శాస్త్రీయమైన విషయాలని మన దేశంలో ఒక ఆనవాయితీగా, ఆచారంగా చేయటం అలవాటు. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగువారు వరికంకులని కుచ్చుగా అల్లి ఇంటి ముందు వేలాడ దీసే వారు. పిచ్చుకలు వచ్చి ఒక్కొక్క వడ్లగింజని తీసుకు వెళ్లేవి. అది రైతు పురుగులని తిని చీడ పీడల నుండి పంటని రక్షించిన పిచ్చుక పట్ల చూపించే కతజ్ఞత. ఇంటి ముందు కొన్ని గింజలు చల్లటం అలవాటు. ఆ అవకాశం ఉన్నా, లేక పోయినా ప్రతి రోజు పక్షులకి, ప్రత్యేకంగా కాకికి తినబోయే ముందు ఒక ముద్ద పెట్టటం అలవాటు. కాకి పరిసరాల్లో ఉన్న చెత్తని, చిన్న చిన్న పురుగులని తిని శుభ్రం చేస్తుంది. దేవాలయాలలో కూడా బలిహరణం అన్న పేరుతో నాలుగు దిక్కుల అన్నం ఉంచటం సంప్రదాయం. ఇంటి చూరులో పిచ్చుక గూడు పెడితే పరమానందం. ఆ గూట్లో పెట్టిన గుడ్లను పిల్లి తినకుండా కాపలా కాయటం ఒక సరదా. అవి ఉండే ప్రదేశాలని మనం ఆక్రమించి, చెట్లని నరికి వాటికి ఆహారం లేకుండా చేసినందుకు ఈ మాత్రం చేయక పోతే కృతఘ్నులం అవుతాం. అలాగని పిల్లులని పూర్తిగా తరమం. పిల్లి తిరుగుతుంటే ఆ వాసనకి ఎలుకలు విజృంభించవు. సృష్టిలో ప్రయోజనం లేని జీవి ఒక్కటి కూడా లేదు. గుర్తించక పోవటం మన లోపం. జాగ్రత్తగా గమనిస్తే ఇతర జీవులని, ప్రకృతిని స్వార్థానికి వాడుకుని ఎవరికీ ఉపయోగ పడని ప్రాణి మానవుడొక్కడే నేమో అనిపిస్తుంది. కనీసం పిచ్చుక పాటి అయినా చేయవద్దా? – డా. ఎన్‌. అనంత లక్ష్మి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement