Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Gooons Attack YSRCP: YS Jagan Again Request Governor
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ కొనసాగిస్తున్న దాడుల పర్వంపై వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందని సోషల్‌ మీడియా ద్వారా ఆయన స్పందించారు. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు.…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2024 గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. ఈ విషయంలో గౌరవ గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు పార్టీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారాయన.

Sakshi Editorial On NDA Parliamentary Party Meeting
విలువల జాడేది?!

వేదికలపై గంభీరోపన్యాసాలు చేయడంలో, విలువల గురించి మాట్లాడటంలో మన నాయకులకు ఎవరూ సాటిరారు. ఆ ఉపన్యాసాలకూ, ఆచరణకూ పెద్దగా పొంతనవుండదు. శుక్రవారం జరిగిన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, జేడీ(యూ) అధినేత నితీశ్‌ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఈ సంగతిని మరోసారి ధ్రువీకరించాయి. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయం ప్రాతిపదికనే తీసుకుంటామని మోదీ ప్రకటించారు. మంచిదే. గత అయిదేళ్ల పాలనలో ఏకాభిప్రాయం జాడ ఎక్కడా కనబడకపోగా చాలా నిర్ణయాలు విపక్షాన్ని సభనుంచి గెంటేశాక మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఆ నిర్ణయాలపై తీవ్ర విమర్శలూ వచ్చాయి. ప్రతిఘటన కూడా ఎదురైంది. బహుశా అందువల్లే కావొచ్చు... 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా వచ్చిన మెజారిటీ ఈసారి మాయమైంది. మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని స్థితి ఏర్పడింది. రామమందిర నిర్మాణం లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపి, దానిమాటున మూడున్నర దశాబ్దాలుగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ... తీరా ఆలయ నిర్మాణం కొనసాగుతున్న దశలో కనీస మెజారిటీకి దూరంకావటం, యూపీలో సగంపైగా సీట్లు కోల్పోవటం కేవలం యాదృచ్ఛికమని మోదీ చెప్పగలరా? చివరకు అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గాన్ని సైతం బీజేపీ కోల్పోవలసి వచ్చిందని ఆయనకు గుర్తుందో లేదో! అయోధ్య ప్రాంతంలోని 9 స్థానాల్లో 5, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతంలోని 12 స్థానాల్లో తొమ్మిదింటిని ఈసారి బీజేపీ చేజార్చుకుంది. బీజేపీ హిందుత్వ ప్రాజెక్టుకు ఈ రెండు ప్రాంతాలూ ఆయువుపట్టు. అంతేకాదు... వివిధ రాష్ట్రాల్లో బీజేపీ 2019 ఎన్నికల్లో 50 శాతంపైగా వోట్లతో 224 స్థానాలు గెల్చుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 156కి పడిపోయింది. బీజేపీ 500 కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 30... వేయి కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 100 ఉన్నాయి. ఇండియా కూటమి, మరీ ముఖ్యంగా అందులోని సమాజ్‌వాదీ పార్టీ దాదాపు అన్నిచోట్లా గణనీయంగా కోలుకుంది. తమ గెలుపును ఓటమిగా చిత్రిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఇప్పుడూ, గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకొచ్చిన మొత్తం సీట్ల సంఖ్యతో పోల్చినా ఈసారి తమకొచ్చిన స్థానాలు చాలా ఎక్కువని ఎద్దేవా చేయటం బాగానేవుంది. అయితే జరిగిందేమిటో లోతుగా విశ్లేషిస్తే సత్యం బోధపడుతుంది. మోదీ పైకేమి మాట్లాడినా నిరుపేదలూ, మధ్యతరగతి తమకు క్రమేపీ దూరం జరుగుతున్నారని బీజేపీకి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఈసారి ఆ రెండు వర్గాలకూ కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. పార్లమెంటులో ఏ అంశంపైన అయినా చర్చ జరిగినప్పుడు ఉపన్యాస పోటీలుగా భావించి మాట్లాడటంకాక ఆరోగ్యకరమైన చర్చలకు చోటీయడం ఎంతో అవసరం. ఎన్‌డీఏ సహజసిద్ధమైన కూటమని, ఇందులో అధికార యావలేదని మోదీ చెప్పటం కూడా వింతగానే ఉంది. ఇప్పుడు ఎన్‌డీఏకు మద్దతుగా నిలిచిన నితీశ్, చంద్రబాబులిద్దరూ ఊగిసలాటకు పెట్టింది పేరు. నిలకడ తక్కువ, అవకాశవాద రాజకీయం ఎక్కువ. ఏ గట్టున బాగుంటుందనుకుంటే అటు దూకే బాపతు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి ప్రయాణించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో హఠాత్తుగా కాడి పారేసి విడిగా ఎందుకు పోటీ చేశారో, అంతకు సంవత్సరం ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎందుకు అంటకాగారో ఎవరైనా చెప్పగలరా? తరచు యూటర్న్‌లు తీసుకోవటంలో నితీశ్, చంద్రబాబులకు పోటీ పెడితే ఎవరు ప్రథమ స్థానం గెల్చుకుంటారో చెప్పటం కొంత కష్టమే. ఇలాంటివారిని పక్కనబెట్టుకుని ‘ఇది సహజసిద్ధమైన కూటమి, సుపరిపాలన కోసం కలిశాం’ అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లిస్తే నమ్మడానికి దేశ ప్రజలు తెలివితక్కువవారు కాదు. మోదీని చంద్రబాబు పొగడ్తలతో ముంచడంమాట అలావుంచి 2014లోనే ‘మీరు పదిహేనేళ్లు అధికారంలో వుంటారని బాబు జోస్యం చెప్పార’ని జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి 2019లో వీరిద్దరూ ఎన్‌డీఏ నుంచి ఎందుకు బయటకొచ్చినట్టు... ఇప్పుడెందుకు కలిసినట్టు? ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచారంలో పెట్టి, చివరకు కేంద్రమే ప్రతిపాదించిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ప్రజానీకాన్ని పక్కదోవ పట్టించి బాబు లాభపడ్డారు. విలువలన్నిటినీ గాలికొదిలి ఏం చేసైనా అధికారంలోకి వచ్చితీరాలన్న పట్టుదలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అత్యంత హీనంగా దుర్భాషలాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ తదితరులు ఏం మాట్లాడినా మౌనంగా ఉండిపోవటమో, ఆలస్యంగా స్పందించటమో చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలను అనుకరిస్తూ ఏపీలో ఏం జరిగినా, బాబు తదితరులు అవాకులూ చవాకులూ మాట్లాడినా ప్రధాన ఎన్నికల అధికారి ఉలుకూ పలుకూ లేకుండా నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయారు. ఆఖరికి పోలైన వోట్లకన్నా గెలిచిన అభ్యర్థికి అధికంగా వోట్లు వచ్చిన ఉదంతాలు అక్కడక్కడ బయటపడ్డాయి. ఇలాంటి అక్రమాలతో గట్టెక్కాలనే కాళ్లావేళ్లాపడి మరీ బాబు ఎన్‌డీఏలోకి లంఘించారు.వేదికలెక్కి విలువల గురించి గంభీరోపన్యాసాలు చేసేముందు మొన్న ఎన్నికల్లో తమ ప్రవర్తన ఎలావుందో, ఏం మాట్లాడామో చూసుకోవటం వారికే మంచిది. పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగిన చందాన వేదికలెక్కి విన్యాసాలు చేస్తే జనం నవ్విపోతారని నరేంద్ర మోదీతోపాటు ఎన్‌డీఏ భాగస్వామ్యపక్ష నేతలు తెలుసుకోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ ఉన్నన్నాళ్లూ ఏం చేశారో, ఎలా మెలిగారో ప్రజలు గమనిస్తూనే ఉంటారు.

T20 World Cup 2024: ICC Picks Biggest Upsets In T20I World Cup History
పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో ఘోర పరాభవాలు

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్‌ 6) జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య యూఎస్‌ఏ సూపర్‌ ఓవర్‌లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ ఓ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన పాక్‌కు ఊహించని షాక్‌ ఇవ్వడం క్రికెట్‌ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘోర పరాభవాన్ని ఊహించని పాక్‌ ఇంకా షాక్‌లోనే ఉండిపోయింది. అన్ని విభాగాల్లో తమకంటే పటిష్టంగా ఉన్న పాక్‌పై యూఎస్‌ఏ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఐసీసీ టాప్‌-5 బిగ్గెస్ట్‌ అప్‌సెట్స్‌ (టీ20 వరల్డ్‌కప్‌) జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పాక్‌-యూఎస్‌ఏ మ్యాచే అగ్రస్థానంలో నిలువడం విశేషం. ఈ జాబితాలో మిగతా నాలుగు సంచలనాలు వరుస క్రమంలో ఇలా ఉన్నాయి.2022 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌2022 ప్రపంచకప్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన నమీబియా2016 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించిన ఆఫ్ఘనిస్తాన్‌2009 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఓడించిన నెదర్లాండ్స్‌పై పేర్కొన్న మ్యాచ్‌లను ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అతి భారీ సంచలనాలుగా పరిగణించింది.ఇదిలా ఉంటే, యూఎస్‌ఏతో నిన్న జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన పాక్‌.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటలేక చేసిన ఓ మోస్తరు స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. ఫలితంగా మ్యాచ్‌ టై అయ్యి సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో సైతం తేలిపోయిన పాక్‌.. తొలుత బౌలింగ్‌ చేసి 18 పరుగులు సమర్పించుకుంది. అనంతరం ఛేదనలోనూ చేతులెత్తేసి 13 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే అతి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు.స్కోర్‌ వివరాలు..పాక్‌ 159/7 (20)యూఎస్‌ఏ 159/3 (20)సూపర్‌ ఓవర్‌..యూఎస్‌ఏ 18/1పాక్‌ 13/1సూపర్‌ ఓవర్‌లో యూఎస్‌ఏ విజయం

modi speech after meeting president droupadi murmu over govt formation
వచ్చే ఐదేళ్లు దేశ సేవకే అంకితమవుతాం: నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్ష నేతలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి తెలిపారు. ఎన్డీయే కూటమి ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి మోదీ అందజేశారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘ 18వ లోక్‌సభ చాలా ప్రత్యేకం. ఎన్డీయేకు మూడో సారి దేశ సేవ చేసే భాగ్యం లభించింది. ఈ అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు ధన్యవాదాలు. వచ్చే ఐదేళ్లు దేశసేవకే అంకితమవుతాం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పూర్తి చేసేందుకు శ్రమిస్తాం. ఎన్డీయే నేతలు నన్ను మరోసారి పక్ష నేతగా ఎన్నుకున్నారు. ముమ్ముందు మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. ఆజాదీగా అమృత్‌ ఉత్సవాల తర్వాత ఇదే తొలి ఎన్నిక. మంత్రి మండలి జాబితా ఇవ్వాలని రాష్ట్రపతి కోరారు. ఎల్లుండి సాయంత్రం ప్రమాణస్వీకారం సౌకర్యంగా ఉంటుంది. మంత్రుల జాబితాను రాష్ట్రపతికి అందజేస్తాను’ అని మోదీ తెలిపారు.NDA will form a strong, stable and growth-oriented government. Speaking outside Rashtrapati Bhavan. https://t.co/qstllaPjna— Narendra Modi (@narendramodi) June 7, 2024 భాగస్వామ్య పక్షాల నేతలు వెంటరాగా.. మోదీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారాయన. ఆ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్మును మోదీని ఆహ్వానించారు.జేపీ నడ్డా నివాసంలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తుమంత్రివర్గ కూర్పుపై ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కసరత్తు జరుగుతోంది. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌లు.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు. బీజేపీ అగ్ర నేతలు.. అజిత్ పవార్, ఏక్‌నాథ్‌ షిండేతో చర్చలు జరిపారు.ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము

Jana Sena Attacks Pithapuram TDP Varma Latest News Updates
పిఠాపురం వర్మపై జనసేన దాడి

కాకినాడ, సాక్షి: పిఠాపురంలో జనసేన శ్రేణులు రెచ్చిపోయాయి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మపై దాడికి దిగాయి. ఈ ఘటనలో వర్మ కారు ధ్వంసం అయ్యింది. ఆయనకు గాయలు అయ్యాయా? అనేది తెలియాల్సి ఉంది. వెన్నపూడి గ్రామ సర్పంచ్‌ను టీడీపీలో చేర్చుకునేందుకు శుక్రవారం సాయంత్రం వర్మ వెళ్లారు. అయితే వర్మ రాకను వ్యతిరేకించిన జనసేన శ్రేణులు రాళ్ల దాడికి దిగాయి. ఈ దాడిలో ఆయన వాహనం ధ్వంసం అయ్యింది. పిఠాపురంలో తన సీటును త్యాగం చేసిన వర్మ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం పని చేసిన సంగతి తెలిసిందే.

 Chilkur Balaji Temple head priest Angry With Google
గూగుల్‌పై చిల్కూరు పూజారి రంగరాజన్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్‌ సెర్చింజన్‌ గూగుల్‌పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్‌లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్‌లో చిల్కూరు టెంపుల్‌ అని టైప్‌ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్‌ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్‌ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్‌ ఉంది. వీసా బాలాజీ టెంపుల్‌గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు.

Prabhas Kalki 2898AD Bujji Showing In Mumbai Juhu Beach Goes Viral
బీచ్‌లో బుజ్జి సందడి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌!

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ ఫ్యాన్స్‌ మోస్ట్ అవేటేడ్ చిత్రం 'కల్కి 2898ఏడీ'. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్, కమల్‌హాసన్‌, దిశా పటానీ లాంటి స్టార్స్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలోని కారు బుజ్జి లుక్‌ను రివీల్‌ చేశారు. దీని కోసం హైదరాబాద్‌లో భారీస్థాయిలో ఈవెంట్‌ నిర్వహించారు. ఈవెంట్‌లో ప్రభాస్‌ కారును నడుపుతూ సందడి చేశారు.అయితే బుజ్జి ఇండియా మొత్తం టూర్ చేస్తోంది. ప్రధాన నగరాలను అన్నింటినీ చుట్టి వస్తోంది. తాజాగా ముంబయిలోని జుహు బీచ్‌లో బుజ్జి సందడి చేసింది. దీంతో అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు క్యూ కట్టారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జిని ముంబయికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.కాగా.. కల్కి ట్రైలర్‌ను ఈనెల 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే దీన్ని కూడా ముంబయిలోనే భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని దాదాపు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కల్కి జూన్‌ 27న థియేటర్లలో సందడి చేయనుంది. Bujji at JUHU Beach ⛱️, MUMBAI.#Prabhas #Bujji #Bhairava #Kalki2898AD pic.twitter.com/grY8Pegd7e— Prabhas Fan (@ivdsai) June 7, 2024

Payal rajput Rakshana Movie Review And Rating
Rakshana Review: పాయల్‌ రాజ్‌పుత్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ మూవీ ఎలా ఉంది?

టైటిల్‌: రక్షణనటీనటులు: పాయ‌ల్ రాజ్‌పుత్‌, రోష‌న్‌, మాన‌స్‌, రాజీవ్ క‌న‌కాల‌, వినోద్ బాల‌, శివ‌న్నారాయ‌ణ త‌దిత‌రులునిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్దర్శక-నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్సంగీతం: మహతి సాగర్సినిమాటోగ్రఫీ: అనిల్ బండారిఎడిటర్: గ్యారి బి హెచ్విడుదల తేది: జూన్‌ 7, 2024ఆర్‌ఎక్స్‌ 100, ‘మంగళవారం’సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది పాయల్‌ రాజ్‌పుత్‌. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘రక్షణ’. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. మంచి అంచనాలతో నేడు(జూన్‌ 7)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కిరణ్‌(పాయల్‌ రాజ్‌పుత్‌) ఓ పవర్‌ఫుల్‌ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్‌ చేసిన కిరణ్‌.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్‌ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్‌(మానస్‌)ని కిరణ్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్‌పై అరుణ్‌ పగపెంచుకుంటాడు. ఓ వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసి అందులో కిరణ్‌ ఫోటోలను పోస్ట్‌ చేసి..ఆమె మొబైల్‌ నంబర్‌ని పబ్లిక్‌లో పెడతాడు. దీంతో కిరణ్‌కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి. ఇది అరుణ్‌ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్‌.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్‌ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్‌ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో కిరణ్‌ సస్పెండ్‌కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్‌ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్‌ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్‌ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్‌కి ఆ సైకో కిల్లర్‌కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్‌ని లూజర్‌ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్‌ని కిరణ్‌ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది? ఈ కథలో రోష‌న్‌ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. నగరంలో వరుస హత్యలు జరగడం.. ఆ హత్యల వెనుక ఓ కిల్లర్‌ ఉండడం.. అతన్ని పట్టుకునేందుకు హీరో/హీరోయిన్‌ రంగంలోని దిగడం..తన తెలివితేటలన్నీ ఉపయోగించి చివరకు ఆ సైకో కిల్లర్‌ని అంతమొందించడం.. సైకో థ్రిల్లర్‌, క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలన్నీ ఇంచుమించు ఒకే మూసలో సాగుతాయి. దీంటో హత్యలు జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్‌ గేమ్‌, హీరో/హీరోయిన్‌ ఎంత తెలివితా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిస‌డ‌ల‌ని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘రక్షణ’ విషయంలో ఇది కొంతవరకే సఫలం అయింది. సైకో కిల్లర్‌.. అతని నేపథ్యం ఉత్కంఠభరితంగా ఉన్నా.. కథానాయికా చేసే ఇన్వెస్టిగేషన్‌ ఆసక్తికరంగా ఉండదు. ఉమెన్‌ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకునే సీన్‌తో పాయల్‌ పాత్రను పరిచయం చేశాడు. ఆ తర్వాత వెంటనే తన ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి.. స్నేహితురాలి హత్యను చూపించి..అసలు కథను ప్రారంభించారు. సైకో కిల్లర్‌ ఎవరనేది చివరి వరకు చూపించకుండా కథపై ఆసక్తిని పెంచాడు. ఆ తర్వాత వెంటనే అర్జున్‌ పాత్రని చూపించి.. ప్రేక్షకుల మైండ్‌ డైవర్ట్‌ చేశాడు. ఫస్టాఫ్‌ అంతా అర్జున్‌, కిరణ్‌ల చుట్టే తిరుగుతుంది. అర్జున్‌ పట్టుకునేందుకు కిరణ్‌ చేసే ప్రయత్నం మెప్పించదు. ఇంటర్వెల్‌ సీన్‌ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్‌ ఎవరనేది తెలిసిన తర్వాత..అసలు అతను ఎందుకలా చేస్తున్నాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఆ సైకో కిల్లర్‌ ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఆకట్టుకోవడంతో పాటు పెరెంట్స్‌ని ఆలోచింపజేస్తుంది. సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న లింగ వివక్షపై కూడా దర్శకుడు ఓ మంచి సందేశాన్ని అందించాడు. క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు తెరపై గ్లామర్‌గా కనిపించిన పాయల్‌.. ఈ చిత్రంలో డిఫరెంట్‌ రోల్‌ ప్లే చేసింది. ఏసీపీ కిరణ్‌ పాత్రలో ఒదిగిపోయింది. హీరో స్థాయిలో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించింది. తెరపై సరికొత్త పాయల్‌ని చూస్తారు. బిగ్‌బాస్‌ ఫేం మానస్‌ తొలిసారి నెగెటివ్‌ పాత్రలో నటించాడు. అమ్మాయిలను ఏడిపించే శాడిస్ట్‌ అరుణ్‌ పాత్రకి మానస్‌ పూర్తి న్యాయం చేశాడు. రామ్‌ పాత్రకి రోషన్‌ బాగా సెట్‌ అయ్యాడు. రాజీవ్‌ కనకాల, శివన్నారాయణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. మహతి సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల టెన్షన్‌ పెట్టాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు, నిర్మాత ఒక్కరే కావడంతో సినిమాకు ఏ స్థాయిలో ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలను ఇష్టపడేవారికి ‘రక్షణ’ నచ్చుతుంది.

Ksr Comments On The Major Political Parties In The Past Parliamentary Elections In Telangana
ఇకపై.. తెలంగాణలో ఆ పార్టీలే కీలక పాత్ర పోషించనున్నాయా?

తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సగం మోదం, సగం ఖేదం దక్కింది. కాంగ్రెస్ పార్టీకి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు వస్తాయని ఆ పార్టీ అంచనా వేసినా, ఎనిమిదితోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. గతంలో నాలుగు సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఎనిమిదికి పెరగడం విశేషం. ఈ పార్టీకి శాసనసభలో కూడా ఎనిమిది మందే ఎమ్మెల్యేలు ఉన్నారు. కచ్చితంగా బీజేపీకి ఇది మేలి మలుపువంటిదే.2028 శాసనసభ ఎన్నికలలో గట్టిగా పోటీ పడడానికి ఈ ఫలితం ఉపకరిస్తుంది. బీఆర్‌ఎస్‌కు పార్లమెంటు ఎన్నికలు పూర్తి నిరాశ మిగిల్చాయి. పార్టీకి భవిష్యత్తు మీద ఆశ ఉన్నా, జనంలో పట్టు సాధించడానికి చాలా శ్రమపడవలసి ఉంటుంది. కాంగ్రెస్ సంగతి చూస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జరిగిన తొలి ముఖ్యమైన ఎన్నికలు. ఇందులో పదికి పైగా సీట్లు వచ్చి ఉంటే ఆయనకు పార్టీలో మంచి పేరు వచ్చేది. కానీ ఎనిమిది సీట్లే వచ్చాయి. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే బీజేపీకి కూడా అన్ని సీట్లే వచ్చాయి కనుక. ఒకవేళ బీజేపీకి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా కాంగ్రెస్‌కు చికాకుగా ఉండేది. అంతవరకు కాంగ్రెస్‌కు, రేవంత్‌కు మోదం కలిగించే అంశమే.అయినా ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే కాంగ్రెస్‌కు ఇది కొంత ఇబ్బంది కలిగించే ఫలితంగానే చూడాలి. అరవైనాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్లే. కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఎనిమిది సీట్లు అన్న వ్యాఖ్య సహజంగానే వస్తుంది. రేవంత్‌కు ఎక్కడ సమస్య వస్తుందంటే ఆయన ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ అసెంబ్లీ సీటు ఉన్న మహబూబ్‌నగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నేత డీకే అరుణ విజయం సాధించడం. ఆమెను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు. అయినా ఓడించలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓటమి చెందారు. కొందరు కాంగ్రెస్ నేతలే సహకరించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివల్ల నైతిక ప్రభావం రేవంత్‌పై కొంత ఉటుంది.అలాగే గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ నేత ఈటెల రాజేందర్ గెలిచారు. ఇది కూడా ఆయనకు అసంతృప్తి కలిగించేదే. ఎందుకంటే ఈ రెండు సీట్లను కాంగ్రెస్‌లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అదే టైమ్‌లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతంలోని నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాలలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలిచింది. అంటే రేవంత్ కన్నా స్థానికంగా తామే బలవంతులమన్న సంకేతాన్ని వీరు ఇచ్చారు. మాజీ మంత్రి కే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఏకంగా రికార్డు స్థాయిలో 5.80 లక్షల ఓట్ల ఆధిక్యతతో నవిజయం సాధించడం ఒక సంచలనం. నల్గొండ కాంగ్రెస్‌కు గట్టి స్థావరమే అయినా, ఈ స్థాయిలో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.భువనగిరిలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకు సన్నిహితుడుగా పేరొందారు. సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పక్షాన మరోసారి గెలిచి తన సత్తా చాటారు. ఈ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్‌ఎస్‌ గెలిచినా, ఈ ఎన్నికలలో కిషన్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. మల్కాజిగిరిలో లోకసభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు బీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తుంటే బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన ఈటెల రాజేందర్‌కు అదృష్టం కలిసి వచ్చింది. బీఆర్‌ఎస్‌ బలం అంతా బీజేపీకి ట్రాన్స్‌ఫర్ అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే బీఆర్‌ఎస్‌ నేతలు తమకు ఏదైనా అవసరం వస్తే షెల్టర్‌గా ఉపయోగపడుతుందన్న భావనతో బీజేపీకి పరోక్షంగా సహకరించి ఉండాలి. లేదా ప్రజలలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల కన్నా బీజేపీ బెటర్ అన్న భావన ఏర్పడి ఉండాలి. కాంగ్రెస్‌కు మహబూబ్‌నగర్‌తో పాటు మల్కాజిగిరి సీటులో ఓటమి ఎదురవడం పార్టీలో చర్చ అవుతుంది. ఇప్పటికిప్పుడు రేవంత్‌ను ఎవరూ ఏమి అననప్పటికి, కాలం గడిచే కొద్ది జరిగే పరిణామాలలో కాంగ్రెస్ నేతలే దెప్పి పొడిచే అవకాశం ఉంటుంది. అందువల్ల బీఆర్‌ఎస్‌ తనను బలి చేసుకుని బీజేపీకి సాయపడిందని రేవంత్ వ్యాఖ్యానించారు.2019 ఎన్నికలలో నాలుగు సీట్లే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎనిమిది తెచ్చుకుందని ఆయన చెప్పవచ్చు కానీ కేవలం మాట వరసకు సమర్ధించుకోవడమే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉందన్న సంగతి మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం మైనస్‌గా ఉంది. దాని ప్రభావం కొన్ని ఏరియాలలో ఉంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిచిన సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల వంటి పార్లమెంటు సీట్లలో చోట్ల బీజేపీ పాగా వేసింది. ఈ స్థానాలలో కాంగ్రెస్ పట్టు సాధించలేకపోయింది. ఇది ఆ పార్టీకి బలహీనతగానే ఉంటుంది. కాంగ్రెస్ ఈ స్థానాలలో నిలబెట్టిన ఫిరాయింపుదారులంతా ఓటమిపాలయ్యారు.సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేయగా, బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా చేవెళ్ల నుంచి, మరో బీఆర్‌ఎస్‌ నేత పీ మహేందర్ రెడ్డి భార్య సునీత మల్కాజిగిరి నుంచి పోటీచేసి పరాజయం చెందారు. వరంగల్ లో మాత్రం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డి ఊహించిన రీతిలో ఘనంగా గెలిచారు. మరో మాజీ మంత్రి బలరాం నాయక్ మహబూబబాద్‌లో విజయం సాధించారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే జి వివేక్ కుమారుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలులో సీనియర్ నేత మల్లు రవి గెలుపొందారు. ఈ ఫలితాలు వచ్చే శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయానికి సూచిక అని కిషన్ రెడ్డి అన్నప్పటికీ అది అంత తేలికకాదు.ప్రస్తుతం 38 అసెంబ్లీ సీట్లు ఉన్న బీఆర్‌ఎస్ ఈ పార్లమెంటు ఎన్నికలలో ఆశలు వదలుకుంది. అందువల్లే వారు అసలు గెలవలేకపోయారు. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్‌ ఏ రకంగా ప్రజలను ప్రభావితం చేయగలుగుతారన్న దానిపై కూడా బీజేపీ విజయావకాశాలు ఉంటాయి. బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో క్యాడర్ లేదు. ఈ నాలుగేళ్లలో ఎంతవరకు పెంచుకుంటారో చెప్పలేం. కానీ ఇప్పుడైతే ఒక వేవ్ మాదిరి మెదక్ తదితర చోట్ల గెలిచారు. మెదక్‌లో బీజేపీ నేత రఘునందనరావు విజయం సాధించారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి, ఎంపీ అయ్యారు. కేసీఆర్‌, హరీష్‌రావు ప్రాతినిద్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఈ ఎంపీ సీటు పరిధిలోనే ఉన్నప్పటికీ బీజేపీ గెలవడం వారికి కాస్త అప్రతిష్టే అని చెప్పక తప్పదు.ఇంతవరకు బీఆర్‌ఎస్‌ ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తోంది. కరీంనగర్‌లో బండి సంజయ్, నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్‌లు మరోసారి గెలవడం ద్వారా బీజేపీ పట్టు నిలబెట్టుకున్నట్లయింది. ఎప్పటి నుంచో ఎంపీ కావాలని ఆశపడుతున్న కాంగ్రెస్ నేత టీ జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీ జీ నగేష్ గెలుపు సాధించారు. మహబూబ్‌నగర్‌లో గెలిచిన డీకే అరుణ సీనియర్ నేతగా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరి టిక్కెట్ సంపాదించారు. ఆ పార్టీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కాదని ఈమెకు సీటు ఇచ్చింది. ఇక చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గెలుపొంది గతంలో కోల్పోయిన పట్టును తిరిగి పొందారు. ఈయనది ఒకరకంగా వ్యక్తిగత విజయంగా చెప్పుకోవచ్చు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి హైదరాబాద్ నుంచి గెలిచి తన సత్తా చాటుకున్నారు.ఈ మొత్తం ప్రక్రియలో బాగా దెబ్బతిన్న పార్టీగా బీఆర్‌ఎస్‌ నిలిచింది. లోక్ సభలో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేసీఆర్‌ బస్ యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సభలకు జనం బాగానే వచ్చారు. అయినా ఒక్క సీటు కూడా రాకపోవడం వారికి బాధాకరమైన విషయమే. కాకపోతే ఇదేమీ ఊహించని విషయం కాదు. ఇప్పుడు వారు పార్టీ పునర్మిర్మాణంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి తిరిగి పార్టీని పెంపొందిస్తేనే వచ్చే శాసనసభ ఎన్నికలలో నెగ్గే అవకాశం ఉంటుంది.బీజేపీ ఇంకా పుంజుకుంటే బీఆర్‌ఎస్‌కు గడ్డు కాలమే అవుతుంది. ఈ లోగా బీజేపీ లేదా కాంగ్రెస్‌తో పొత్తులోకి వెళితే అప్పుడు రాజకీయాలు మరోరకంగా ఉంటాయి. దానిపై అప్పుడే ఒక కంక్లూజన్‌కు రాలేము. కాంగ్రెస్, బీజేపీలకు చెరి సమానంగా సీట్లు రావడం ద్వారా ఈ రెండుపార్టీలే భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలలో మెయిన్ ప్లేయర్లుగా ఉంటాయా అనే చర్చ జరగవచ్చు. కానీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను అంత తొందరగా తీసివేయలేం.ఫీనిక్స్ పక్షి మాదిరి మళ్లీ పైకి లేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయడం బాగానే ఉంది కానీ, అందుకు చాలా వ్యూహాలు అమలు చేయవలసి ఉంటుంది. మళ్లీ జనంలో బీఆర్‌ఎస్‌పై విశ్వాసం పెంచుకోగలగాలి. కాంగ్రెస్, బీజేపీలకన్నా తామే బెటర్ అని ప్రజలలో నమ్మకం కలిగించగలగాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ తన వాగ్దానాలలో మరికొన్నిటిని అయినా అమలు చేసి ప్రజలలో పరపతి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టడానికి బీజేపీ కాచుకు కూర్చుని ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Ex Minister Botsa Reacts On AP Teachers Transfers Allegations
టీచర్ల బదిలీలు ఆపేయాలని నేనే విజ్ఞప్తి చేశా: బొత్స

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీల అంశంలో తనపై వస్తున్న ఆరోపణలను మరోసారి ఖండించారు మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. కొత్త ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఆ బదిలీలను నిలిపివేయాలని అధికారులకు తానే విజ్ఞప్తి చేశానని స్పష్టత ఇచ్చారాయన.టీచర్ల బదిలీ అంశంపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్న ఆయన.. శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘ఉపాధ్యాయుల బదిలీలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు అవాస్తవం. నాపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ప్రచురితమైన వార్తల్లో నిజం లేదు. ఇదంతా అభూత కల్పనలతో నా వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు... ఎన్నికలకు ముందు నుంచీ కూడా ఇవే ఆరోపణలతో అనేక సార్లు వార్తలు ప్రచురించారు. అప్పుడు కూడా నేను ఖండించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులు, వివిధ వ్యక్తిగత సమస్యల రీత్యా బదిలీలు కోరుకుంటూ ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. వాటిని పూర్తి పారదర్శకంగా పరిశీలించి క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తరువాతనే అప్పట్లో నిర్ణయం తీసుకున్నాం.అయితే.. ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపేయాల్సిందిగా సంబంధిత అధికారులను నేనే స్వయంగా కోరాను. కొత్త ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలపై తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. బదిలీల కోసం అర్జీచేసుకున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అనేది కొత్త ప్రభుత్వం ఇష్టం.అంతేగానీ.. బదిలీలకోసం లంచాలు తీసుకున్నారంటూ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అగత్యం, అవసరం రెండూ మాకు లేవు.. అని బొత్స స్పష్టం చేశారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement