Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రం
21 రోజుల నిరీక్షణ.. ఉత్కంఠకు నేడే తెర

సాక్షి, అమరావతి: ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి. గత నెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్‌ ముగియడంతో ఫలితాల కోసం జూన్‌ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్‌ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురంరాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో ఈవీఎంల ద్వారా 3.33 కోట్ల మంది, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 5.15 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, వృద్ధులు అ్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా రికార్డు స్థాయలో 81.8 శాతం ఓటింగ్‌ నమోదైంది. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు కోసం 33 చోట్ల 401 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ తర్వాత కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చేటు చేసుకోవడంతో, ఓట్ల లెక్కింపు సందర్భంగా అటువంటి సంఘటలను పునరావృతం కాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 111 అసెంబ్లీ స్థానాల్లో 5 – 6 గంటల్లోనే పూర్తి కానుంది. 61 నియోజకవర్గాల్లో 6 – 8 గంటలు, మూడు నియోజకవర్గాల్లో 9 – 10 గంటల సమయం పట్టనుంది. పార్లమెంటు ఫలితాలకు సంబంధించి 13 రౌండ్లు ఉన్న రాజమండ్రి, నరసాపురం ఫలితాలు తొలుత వెల్లడి కానుండగా, 27 రౌండ్ల లెక్కింపు ఉన్న అమలాపురం ఫలితం ఆలస్యంగా రానుంది. అసెంబ్లీ విషయానికి వస్తే కేవలం అయిదు గంటలలోపే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం ఫలితాలు.. ఆలస్యంగా భీమిలి, పాణ్యం ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఒంటరిగా సిద్ధంవైఎస్సార్‌సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో జట్టు కట్టి కూటమిగా పోటీలో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం పేరుతో ముందస్తుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోగా, తెలుగుదేశం పార్టీ సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికపై సిగపట్లు పడుతూ ప్రచారంలో వెనుకబడ్డారు. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో, భారతీయ జనతాపార్టీ ఆరు పార్లమెంటు, 10 అసెంబ్లీ.. జనసేన రెండు పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాల్లో సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టగా, తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకొని తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బీజేపీ, జనసేనల్లోకి పంపి అభ్యర్థులుగా నిలబెట్టింది.ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు..ఎన్నికల సరళిని, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. లెక్కింపులో ఒక రౌండు పూర్తి కాగానే ఆ ఫలితాలను కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద మైక్‌లో వెల్లడించడంతో పాటు, మీడియా ప్రతినిధులకు కనపడే విధంగా డిస్‌ప్లే బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి రౌండు ఫలితాలను సువిధా యాప్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. నియోజకవర్గ ఫలితాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఫలితాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. https://results.­eci.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు ‘ఓటర్స్‌ హెల్ప్‌¬లైన్‌’ అనే యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు. 25,209 మంది సిబ్బంది : ముఖేష్‌ కుమార్‌ మీనారాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 2,387 మంది, 25 పార్లమెంటు స్థానాల్లో 454 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం 25,209 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి 119 మంది కేంద్ర అబ్జర్వర్లు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారన్నారు. పార్లమెంటు స్థానాలకు తొలుత 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభించి, 8.30 తర్వాత ఈవీంఎల లెక్కింపును కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో డిక్లరేషన్‌ ఫారంపై రిటర్నింగ్‌ అధికారి నియమించిన అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం ఉంటే సరిపోతుందని, దీనిపై ఇక ఎటువంటి అభ్యంతరాలను అనుమతించమని స్పష్టం చేశారు. ఈసారి అత్యధిక సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్లు నమోదు కావడంతో 25 చోట్ల నాలుగు రౌండ్లు కూడా లెక్కింపు జరగనుందన్నారు. ప్రతి 500 ఓట్లు ఒక రౌండ్‌గా లెక్కిస్తామని, ఇది సుదీర్ఘ పక్రియ కావడంతో ఒకొక్క రౌండ్‌ పూర్తి కావడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుందని చెప్పారు. అదే ఈవీఎంల లెక్కింపులో ప్రతి రౌండు సగటున 25 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో పూర్తవుతుందన్నారు. లెక్కింపు ప్రారంభమైన అయిదు గంటల్లోనే మెజార్టీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 45,000 పోలీసు సిబ్బందితో పాటు 67 కంపెనీల సాయుధ బలగాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద డ్రోన్‌ కెమెరాలతో కూడా నిఘా పెట్టామని, లోపల ఈవీఎంల తరలింపు నుంచి ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తామన్నారు. ఏజెంట్లు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని, దురుసుగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధన 54 కింద కౌంటింగ్‌ హాల్‌ నుంచి బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. రీ కౌంటింగ్‌ కోరితే దానికి గల స్పష్టమైన కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు. ఆ కారణాలతో ఆర్వో ఏకిభవిస్తేనే రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారని చెప్పారు. కౌంటింగ్‌ హాళ్లలోకి మొబైల్‌ ఫోన్లను అనుమతించరని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ తర్వాత అభ్యర్థి గెలిచినట్లు ఫారం 20 ఇవ్వడానికి కనీసం గంట– గంటన్నర పడుతుందని, అప్పటి వరకు అభ్యర్థి వేచి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలపై నిషేధం విధించామని తెలిపారు.

Telangana political parties are nervous about counting of Lok Sabha votes
లోక్‌సభ ఓట్ల లెక్కింపుపై ‘డబుల్‌’ ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ జరిగిన 22 రోజుల తర్వాత జరుగుతున్న ఓట్ల లెక్కింపు కో సం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. పోలింగ్‌ సరళి, ఎగ్జిట్‌ పోల్స్‌ను బ ట్టి.. రాష్ట్రంలో పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యే జరిగిందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మెజార్టీ సీట్లు త మకంటే తమకేనని.. డబుల్‌ డిజిట్‌ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కచ్చితంగా పది స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్‌.. పది కంటే ఎక్కువే గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎన్ని స్థానాల్లో గెలుస్తామన్న దానిపై క చ్చితమైన లెక్కలు చెప్పకపోయినా.. కనీస స్థానా ల్లో విజయం దక్కుతుందని ఆశిస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్న దానిపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. 12 సీట్లు కూడా రావొచ్చంటున్న కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉంది. కనీసం తొమ్మిది, పది స్థానాల్లో గెలుస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే మరో రెండు, మూడు సీట్లు కూడా గెలుస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌తోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి పట్టు సాధించిన వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. సికింద్రాబాద్, ఆదిలాబాద్‌ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైనా.. విజయ తీరం చేరుతామనే అంచనాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ బలహీనపడటం, బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికలు రావడంతో పెద్దగా ప్రజా వ్యతిరేకత లేకపోవడం, గ్రామీణ స్థాయిలో పార్టీకి ఉన్న పట్టు వంటివి అనుకూలిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ మేజిక్‌తో బీజేపీదే హవా అంటున్న కమలనాథులు మోదీ మేజిక్‌తో తెలంగాణలోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు గెలిచి సత్తా చాటుతామని అంటున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో వెలువడిన అంచనాలను మించి సీట్లు సాధిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు ఎంపీ సీట్లకు అదనంగా మరో ఆరేడు సీట్లు గెలుస్తామని అంటున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలే ప్రభావం చూపాయని కమలనాథులు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాలు తమకు ఉపకరించాయని.. ఈ ఎఫెక్ట్‌తో పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని అంచనా వేస్తున్నారు. ఎగ్జాక్ట్‌ పోల్స్‌ తమకే అనుకూలమంటూ బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌తో సంబంధం లేకుండా ఎగ్జాక్ట్‌ పోల్స్‌ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్‌ఎస్‌ అంటోంది. బీఆర్‌ఎస్‌ ఒకట్రెండు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నా.. బీఆర్‌ఎస్‌ మాత్రం అంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యత కనబర్చిందని.. అదే తరహాలో ఇప్పుడు ఫలితాలు ఉంటాయని అంచనా వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇప్పుడు కాంగ్రెస్‌ అనుకూల ఓటింగ్‌ జరగలేదని.. అదే సమయంలో బీజేపీ భారీగా ఏమీ పుంజుకోలేదని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకే ఎక్కువగా గండి పడిందని పేర్కొంటున్నారు. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ 17 రోజుల పాటు చేసిన బస్సుయాత్ర కూడా ప్రభావం చూపిందని.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేసినవారిలో కొంత మేర తిరిగి అనుకూలంగా మారారని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో జరిగిన ముక్కోణపు పోటీ బీఆర్‌ఎస్‌కు అక్కడక్కడా అనుకూలిస్తుందనే అంచనా వేస్తున్నారు.ఢిల్లీ పీఠం ఎవరిదో..?లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈసారి కూడా మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొనడం ఓవైపు.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫెయిలవుతాయని, ఇండియా కూటమి గెలుస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన కామెంట్స్‌ మరోవైపు ఉత్కంఠ రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం ఎలా ఉంటుంది?ఇండియా కూటమికి ఉన్న సానుకూలతలేంటి? ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది.ఆ స్థానాలపై మరింత ఆసక్తితెలంగాణలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌ తరఫున ఎంపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన దానం నాగేందర్‌ తలపడుతున్న సికింద్రాబాద్‌ ఫలితంపై అందరి ఫోకస్‌ ఉంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి.. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయ్యే చాన్స్‌ ఉందంటున్న బండి సంజయ్‌ బరిలో ఉన్న కరీంనగర్‌.. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన నేతలు పోటీ చేస్తున్న జహీరాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్‌ తదితర స్థానాల్లో ఫలితాలపైనా ఆసక్తి ఉంది.

Lok Sabha Results 2024: Narendra Modi eyes third term, INDIA hopes for 2004 repeat
Lok Sabha Results 2024: టిక్‌.. టిక్‌.. టిక్‌ మోదీ 3.0నా, ఇండియా కూటమా?

న్యూఢిల్లీ: దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానేవచ్చాయి. 80 రోజులకు పైగా ఏడు విడతల్లో సాగిన సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్‌ కొట్టి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేస్తారా? లేదంటే కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి అనూహ్యమేమైనా చేసి చూపించనుందా? సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏకగ్రీవమైన సూరత్‌ మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో విజేతలెవరో తేలనుంది. కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహా్ననికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఎన్డీఏ హ్యాట్రిక్‌ ఖాయమని శనివారం వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్త కంఠంతో పేర్కొనడం, విపక్ష కూటమి వాటిని తిరస్కరించడం తెలిసిందే. ఎన్నడూ లేని స్థాయిలో ఈ దఫా పోలింగ్‌ అనంతరం కూడా కేంద్ర ఎన్నికల సంఘంపై, ఈవీఎంలపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ను ‘మోదీ మీడియా పోల్‌’గా అభివరి్ణంచాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ముసుగులో అసలు ఫలితాలు ఎలా ఉండాలో అధికార యంత్రాంగానికి మోదీ స్పష్టమైన సంకేతాలిస్తున్నారంటూ దుయ్యబట్టాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని, దేశ ఎన్నికల ప్రక్రియను న్యూనత పరిచేందుకు విపక్షాలు మతిలేని ప్రయత్నాలు చేస్తున్నాయంటూ అధికార బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగియాన్న ఆరోపణలకు ఆధారాలుంటే ఇవ్వాలంటూ విపక్షాలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ నిలదీశారు! దాంతో పోలింగ్‌ ప్రక్రియ జూన్‌ 1నే ముగిసినా రాజకీయ వేడి మాత్రం అలాగే కొనసాగింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ కౌంటింగ్‌పైనే కేంద్రీకృతమయ్యాయి... హోరాహోరీ పోరు... ఈసారి ఎన్నికలు అత్యంత హోరాహోరీగా సాగాయి. ప్రచారం ముందెన్నడూ లేనివిధంగా ప్రధానంగా మతం, కులాల ప్రాతిపదికగా సాగింది. వరుసగా మూడో విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సర్వశక్తులూ ఒడ్డగా, పదేళ్ల మోదీ పాలనకు తెర దించడమే లక్ష్యంగా విపక్షాలు కాంగ్రెస్‌ సారథ్యంలో ఇండియా కూటమిగా బరిలో దిగాయి. బీజేపీ తరఫున మోదీ అన్నీ తానై ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ వస్తే సంపద పన్ను తదితరాల పేరిట జనం ఆస్తులు లాక్కుంటుందని ప్రతి ఎన్నికల సభలోనూ ఆరోపణలు గుప్పించారు. చివరికి హిందూ స్త్రీల మెళ్లో పుస్తెలనూ లాక్కుంటారన్నారు. విపక్షాలు కూడా గట్టిగానే ఎదురు దాడికి దిగాయి. ముస్లింలకు మతాధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీ ప్రకటనను అందిపుచ్చుకున్నాయి. రిజర్వేషన్లను మొత్తానికే ఎత్తేస్తారని, రాజ్యాంగాన్నే సమూలంగా మార్చేస్తారని ఊరూవాడా హోరెత్తించాయి. దాంతో ప్రచార పర్వం ఆసాంతం అక్షరాలా కురుక్షేత్రాన్ని తలపించింది. ఎన్డీఏకు 400 పై చిలుకు, బీజేపీకి సొంతగానే 370 స్థానాలొస్తాయని మోదీ, ఆ పార్టీ నేతలు పేర్కొనగా; ఇండియా కూటమికి 295 స్థానాలు ఖాయమని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు. లోక్‌సభలో మెజారిటీకి 272 సీట్లు అవసరం.ఆ సీట్లపై ఆసక్తి... ఈసారి పలు లోక్‌సభ స్థానాల్లో ఫలితాలపై ఎనలేని ఆసక్తి నెలకొంది. వాటిలో టాప్‌లో ఉన్నది రాహుల్‌గాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలీ అంటే అతిశయోక్తి కాదు. యూపీలో గాం«దీల కంచుకోట అమేథీలో 2019లో ఆయన తొలిసారి ఓటమి చవిచూడటం తెలిసిందే. ఈసారి మరో కంచుకోట రాయ్‌బరేలీలో నెగ్గుతారా లేదా అన్నది ఆసక్తికరం. సిట్టింగ్‌ స్థానమైన కేరళలోని వయనాడ్‌లో కూడా సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా నుంచి రాహుల్‌ గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అక్కడి ఫలితంపైనా ఉత్కంఠే నెలకొంది. మాజీ సీఎంలు భూపేశ్‌ భగెల్, చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ, ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ కూతుళ్లు మీసా భారతి, రోహిణీ ఆచార్య, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సులే గెలుస్తారో లేదో చూడాలి.

Mexico Election Results 2024: Claudia Sheinbaum elected Mexico first female president
Mexico Election Results 2024: మెక్సికోలో కొత్త చరిత్ర

మెక్సికో సిటీ: మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్‌బామ్‌ (61) ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్‌ కూడా ఆమే కానున్నారు! షేన్‌బామ్‌కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్‌ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచి్చంది. రెండు ప్రధాన పారీ్టల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్‌ గాల్వెజ్‌కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్‌ అల్వారిజ్‌ మైనేజ్‌కు 10 శాతం ఓట్లు వచి్చనట్టు ఈసీ పేర్కొంది. షేన్‌బామ్‌ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ అబ్రేడర్‌ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్‌బామ్‌ విజయంలో లోపెజ్‌ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్‌ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్‌ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్‌ పదవుల్లో మెరేనా పార్టీకి 23 ఉన్నాయి. షేన్‌బామ్‌కు సవాళ్లెన్నో... షేన్‌బామ్‌ అక్టోబర్‌ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్‌ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్‌ వార్లు, డ్రగ్‌ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్‌బామ్‌ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.లా డాక్టోరా... షేన్‌బామ్‌ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేవారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్‌ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్‌బామ్‌ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్‌గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్‌బామ్‌ తాత, అమ్మమ్మ హిట్లర్‌ హోలోకాస్ట్‌ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్‌ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్‌బామ్‌ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు.

Sajjala Ramakrishna Reddy About YSRCP Victory
సంబరాలకు సిద్ధంకండి: సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎన్నికల సంఘం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపడుతుందని.. వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని, ఉ.10.30 గంటల నుంచి సంబరాలకు సిద్ధంకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సజ్జల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఇండియా టుడే–మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ బోగస్‌ అంటూ కొట్టిపారేశారు. ఆ సంస్థ జనసేన, బీజేపీకి ఎగ్జిట్‌ పోల్స్‌లో ఇచ్చిన స్థానాలు, ఓట్ల శాతమే అందుకు నిదర్శనమన్నారు. ఆ ఎగ్జిట్‌ పోల్స్‌లో 21 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారని.. ఈ లెక్కన ఒక్కో శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థికి 61 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని.. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ వ్యూహంలో భాగంగా దక్షిణాదిలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్లు చూపించే ప్రయత్నంలో ఇది భాగమని చెప్పారు. బీజేపీ కూటమిలో టీడీపీ భాగస్వామి కాకపోయి ఉంటే.. ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా ఈ రీతిలో ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించేదే కాదన్నారు.స్కిల్‌ స్కాంలో చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అసలు చర్చే జరగలేదని.. దానివల్ల టీడీపీకి ప్రజల్లో సానుభూతి వచ్చిందని ఆ సంస్థ పేర్కొనడం విడ్డూరమన్నారు. టైమ్స్‌ నౌ, దైనిక్‌ భాస్కర్‌ సహా రాష్ట్రంలోని పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తున్నట్లు తేల్చాయని సజ్జల గుర్తుచేశారు. ఆ సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొన్న స్థానాల కంటే వైఎస్సార్‌సీపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశారు.ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల పిలుపునిచ్చారు. సంయమనంతో వ్యవహరిస్తూ.. వైఎస్సార్‌సీపీ అభ్యరి్థకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా అభ్యర్థి ఖాతాలో పడేలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. కౌంటింగ్‌ పూర్తయి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందినట్లు డిక్లరేషన్‌ తీసుకునే వరకు కౌంటింగ్‌ కేంద్రం నుంచి కదలవద్దని సజ్జల కోరారు. టీడీపీ విజ్ఞప్తి మేరకే ఆ సడలింపులుఇక పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఎన్నికల సంఘం సడలింపులను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రానా వాళ్లు చేసింది తప్పు తప్పు కాకుండా పోదన్నారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనలను సడలించడంలో ఆంతర్యమేమిటని.. పోస్టల్‌ బ్యాలెట్ల అంశంలో దేశవ్యాప్తంగా ఒక రూలూ.. రాష్ట్రంలో మరో రూలా? ఇదెక్కడి న్యాయ­మంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనలను సడలించడం విడ్డూరంగా.. అనుమానాస్పదంగా ఉందని.. అందుకే ఆ అంశంపై న్యాయపోరాటం చేశామని సజ్జల చెప్పారు.తన శక్తి ఇంత ఉందని ఒక రౌడీ ఎలాగైతే రౌడీయిజం చేసి అందరినీ భయపెడతాడో చంద్రబాబూ కూడా బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను బదిలీలు చేయిస్తూ యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయ­త్నం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు భయ­పడి కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించేందుకు అవకాశముందని.. అందుకే ఓట్ల లెక్కింపులో ఏజెంట్లను అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని.. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. గత ఎన్నికల సమ­యంలో అధికారంలో ఉన్న బాబు.. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి సీఈఓను బెదిరించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కళ్లెదుట ఘోరపరాజయం కన్పిస్తుండటంవల్లే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని.. ఓటమికి మానసికంగా సిద్ధమవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి⇒ ఉదయం 6కల్లా లెక్కింపు కేంద్రం దగ్గర ఉండాలి ⇒ కౌంటింగ్‌ ఏజెంట్లకు సజ్జల దిశానిర్దేశం ‘ఈ ఎన్నికల్లో మనం పక్కాగా గెలుస్తున్నాం.. అయినా కౌంటింగ్‌లో మన పార్టీ తరఫున ఏజెంట్లుగా ఉంటున్న మీరు అప్రమత్తంగా ఉండాలి’.. అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్‌సీపీ మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయబోతోందని.. వైఎస్‌ జగన్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని ఆయన చెప్పారు.ఏజెంట్లు ఉ.6 గంటలకల్లా కౌంటింగ్‌ హాల్‌ దగ్గర కచ్చితంగా ఉండాలని.. హాల్‌లో కౌంటింగ్‌ ప్రారంభం సమయం నుంచి ముగింపు దశ వరకు చాలా చురుగ్గా ఉండాలన్నారు. అదే సమయంలో సంయమనం పాటిస్తూ ఈవీఎం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఖచ్చితంగా కౌంట్‌ అయ్యేలా చూస్తూ, లెక్కింపు న్యాయబద్ధంగా సజావుగా సాగేలా ప్రయత్నం చేయాలన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పారీ్టకి వచ్చిన ఒక్క ఓటు కూడా పోకుండా పాజిటివ్‌గా పార్టీ అకౌంట్‌లో పడేవిధంగా జాగ్రత్త వహించాలని.. కౌంటింగ్‌ పూర్తయి డిక్లరేషన్‌ తీసుకునే వరకు కూడా అక్కడ నుంచి ఎవరూ కదలొద్దన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కౌంటింగ్‌ ఏజెంట్లతో జూమ్‌ ద్వారా సజ్జల సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విశ్రాంత ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ ప్రతినిధులు మలసాని మనోహర్‌రెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

Today Gold and Silver Price [June 3, 2024]
పసిడి ప్రియులకు శుభవార్త!.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు

జూన్ 1 నుంచి తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. ఈ రోజు (జూన్ 3) కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66100 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 440 నుంచి రూ. 480 వరకు తగ్గాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66660 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72720 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు కొంత తగ్గినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66250 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72260 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా గత నాలుగు రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక కేజీ వెండి ధర రూ. 700 తగ్గింది. కాబట్టి రూ. 93500 వద్ద ఉన్న వెండి రూ. 92800లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

India Cricketer Kedar Jadhav Announces Retirement From All Forms Of Cricket
రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌

టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కేదార్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని కొద్ది సేపటి కిందట ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కేదార్‌.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు. కేదార్‌ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్‌లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్‌ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన కేదార్‌కు వైవిధ్యభరితమైన బౌలర్‌గా గుర్తింపు ఉంది. 39 ఏళ్ల కేదార్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు ట్రాక్‌ రికార్డు ఉంది. 2010 నుంచి 2023 సీజన్‌ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్‌.. ఐపీఎల్‌ కెరీర్‌లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్న కేదార్‌కు సీఎస్‌కే తరఫున ఆడినప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. ధోని నాయకత్వంలో కేదార్‌ పలు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దేశవాలీ క్రికెట్‌లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం​ వహించే కేదార్‌.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 186 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. Thank you all For your love and support throughout my Career from 1500 hrs Consider me as retired from all forms of cricket— IamKedar (@JadhavKedar) June 3, 20242020 ఫిబ్రవరిలో (న్యూజిలాండ్‌ పర్యటనలో) జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్‌ ఆడిన కేదార్‌ 2019 వన్డే ప్రపంచకప్‌ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కేదార్‌.. తన రిటైర్మెంట్‌ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 1500 గంటల కెరీర్‌లో నాకు మద్దతు నిలిచి, నాపై ప్రేమ చూపిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్డ్‌గా పరిగణించండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Swami Paripurnanandha Key Comments On Ap Election Result
వైఎస్‌ఆర్‌సీపీదే గెలుపు: స్వామి పరిపూర్ణానంద

సాక్షి,సత్యసాయిజిల్లా: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కీలక కామెంట్స్‌ చేశారు. ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ 123 సీట్లు గెలుస్తుందని చెప్పారు.వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. హిందూపురం నియోజకవర్గంలోనూా వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగరబోతోందన్నారు. నిబద్ధత గల వ్యక్తి ఆరా మస్తాన్ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాల్లో చెప్పినట్లుగా ఏపీలో వైఎస్ఆర్‌సీపీ మరోసారి పగ్గాలు చేపడుతుందన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి, ఏపీలో సీఎంగా వైఎస్‌జగన్‌ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు.

Bangalore Rave Party Case: Actress Hema Has Been Retained By Bengaluru CCB Police
బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

సాక్షి, బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే! మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఉంది. బుకాయించినా దొరికిపోయిందిఅయితే మొదట ఆ రేవ్‌ పార్టీకి, తనకు సంబంధం లేదని బుకాయించింది. కానీ తనకు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్‌ తీసుకుందని రుజువైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.మాదకద్రవ్యాల విక్రయంకాగా బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్‌ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్‌ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్‌, మహ్మద్‌ సిద్ధిఖి, వాసు, అరుణ్‌కుమార్‌, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.చదవండి: ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్‌ గిఫ్ట్‌

CM YS Jagan Tweet On Counting Of AP Elections
పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్‌ సందేశం

తాడేపల్లి: ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(మంగళవారం) జరుగనున్న కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సందేశాన్ని పంపారు. ఈ మేరకు‘ఎక్స్‌’ వేదికగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement