Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Pawan Kalyan sensational comments in an English TV channel interview
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

సాక్షి, అమరావతి/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకట­నలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్‌ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్‌ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్‌ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్‌ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.జగన్‌ ఇచ్చిన వాగ్దానాలను  నెరవేర్చలేదు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్‌ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్‌ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్‌ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

CM YS Jagan Election Campaign Schedule At Mangalagiri
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని మంగళగిరిలో ఉన్న పాత బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటినగరం రోడ్‌ కాపు వీధి సర్కిల్‌లో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. మధ్యా­హ్నం 3 గంటలకు కడపలోని శ్రీపొట్టి శ్రీరాములు సర్కిల్‌లో జరిగే సభలో సీఎం జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

May 10th: ఏపీ ఎన్నికల సమాచారం

ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం.. 

High Court broke Chandrababu conspiracies
చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్‌

సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు దక్కాల్సిన నిధులను అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రలను హైకోర్టు పటాపంచలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకుని... కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిధుల పంపిణీని అడ్డుకునేందుకు చంద్రబాబు ముఠా కొద్దిరోజులుగా ప్రయత్నిస్తోంది. అవన్నీ ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలని, లబ్ధిదారులు కూడా పాతవారేనని అలాంటప్పుడు దానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదని ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వినతులు పంపినా... చంద్రబాబు ఒత్తిడితో ఈసీ వాటిని పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జోక్యంతో బాబు కుట్రలు భగ్నమయ్యాయి. ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్‌) చేసింది. అయితే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రం సంక్షేమ పథకాల నిధులను పంపిణీ చేయడం గానీ, బదలాయించడం గానీ చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటునిచ్చినట్లయింది. నిధుల పంపిణీకి సంబంధించి పత్రికలు, టీవీలు, రేడియో, ఇంటర్‌నెట్‌తో సహా ఏ ఇతర మాధ్యమం ద్వారా ఏ రకమైన ప్రచారం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నిధుల పంపిణీ విషయంలో ఎలాంటి ఆర్భాటాలు గానీ, సంబరాలు గానీ, రాజకీయ నాయకుల ప్రమేయం గానీ ఉండటానికి వీల్లేదని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరడానికి వీల్లేదంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ...  తదుపరి విచారణను జూన్‌ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ గురువారం రాత్రి 10.20 గంటల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల కోసం కోర్టు తలుపుతట్టిన మహిళలు, రైతులు, విద్యార్థులు... ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల కింద లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయా సంక్షేమ పథకాల లబ్దిదారులైన రైతులు, మహిళలు, విద్యార్థులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆయా పథకాల కింద నిధులను తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ కృష్ణమోహన్, నిధుల పంపిణీ ఎందుకు అత్యవసరమో వివరిస్తూ ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ వినతిపత్రంపై తగిన నిర్ణయం వెలువరించాలని ఎన్నికల సంఘాన్ని గతంలోనే ఆదేశింశారు. ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు రాగా, కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వినతిని పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే పోలింగ్‌ పూర్తయ్యే వరకు నిధుల పంపిణీని ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని చెప్పారు. ఇప్పుడు నిధులు పంపిణీ చేస్తే అది ఓటర్లను ప్రభావితం చేసినట్లే అవుతుందని తెలిపారు. అప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా.. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతరం పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆయా పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధులను ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ‘‘ఇవేమీ కొత్త పథకాలు కావు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలు. వీటి ద్వారా లబ్దిదారులకు నిధులను పంపిణీ చేయడం ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో భాగమే అవుతుంది తప్ప, ఓటర్లను ప్రభావితం చేయడం కిందకు రాదు. నిధుల పంపిణీకి అనుమతుల విషయంలో ఎన్నికల సంఘం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పసుపు కుంకుమ పథకం కింద నిధుల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఆ పథకం ఎన్నికల నియమావళి రాకముందే అమలవుతోందన్న కారణంతో నిధుల పంపిణీకి అనుమతిచ్చింది’’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పసుపు కుంకుమ కింద నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన విషయాన్ని ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా ఢిల్లీ హైకోర్టు ముందుంచిందని ఆయన వివరించారు. నిధుల పంపిణీపై ఎలాంటి ప్రచారం చేయకుండా చూడాలని అప్పటి ప్రధాన ఎన్నికల అధికారిని సైతం ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందని ఆయన కోర్టుకు తెలిపారు. మరి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన ఎన్నికల కమిషన్, ఇప్పుడు నిధుల పంపిణీని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. ‘‘ప్రస్తుతం ఏ పథకాల కింద అయితే నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో, ఆ పథకాలలన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) రావడానికి ముందే అమల్లో ఉన్నాయి. దీన్ని ఒకవైపు ఎన్నికల సంఘం అంగీకరిస్తూనే మరో వైపు నిధుల పంపిణీకి బ్రేక్‌ వేసింది’’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పసుపు కుంకుమ కింద నిధుల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు ఇచ్చిన కూడా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ కింద లబ్దిదారులకు నిధుల పంపిణీని అడ్డు​కోవాలంటూ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైందని, అయితే నిధుల పంపిణీని అడ్డుకునేందుకు హైకోర్టు నిరాకరించిందని ఆయన కోర్టుకు నివేదించారు. చంద్రబాబు హయాంలో ఓ రకంగా, ఇప్పుడు మరో రకంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందని, ఇది ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే అవుతుందని మోహన్‌రెడ్డి చెప్పారు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందని, అందుకు ప్రస్తుత నిర్ణయాలే ఉదాహరణని ఆయన తెలిపారు. నిధుల పంపిణీ బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుంది... ఈ నిధులు రాకుంటే రైతులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అంతిమంగా అది అప్పులు చేసే స్థితికి దారి తీస్తుందని ఆయన వివరించారు. నిధుల పంపిణీ మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుందని, ప్రభుత్వం ఎక్కడా కూడా నిధుల పంపిణీపై ప్రకటనలు ఇవ్వడం గానీ, ప్రచారం చేసుకోవడం గానీ చేసే అవకాశం లేదన్నారు. నిధుల పంపిణీ ద్వారా లబ్ది పొందాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. గతంలో ఎప్పుడో ప్రకటించిన ఈ పథకాలకు ఎన్నికల నియమావళి వర్తించదన్నారు. ఈ పథకాల గురించి ప్రజలందరికీ ఎప్పుడో తెలుసునని, ఈ పథకాల వల్ల ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చిందని, కాబట్టి ఇప్పుడు వాటి ద్వారా ప్రభుత్వం కొత్తగా పొందే లబ్ది గానీ, ప్రచారం గానీ ఏమీ ఉండదన్నారు. లబ్దిదారుల గుర్తింపు, నిధుల బదిలీ మొత్తం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని, ఇందులో ప్రభుత్వానిది నామమాత్రపు పాత్రేనని వివరించారు. కాబట్టి అధికార పార్టీ లబ్ది పొందుతున్న వాదన అర్థరహితమని మోహన్‌రెడ్డి తెలిపారు. నిధుల లభ్యతను బట్టి పంపిణీ చేస్తూ వస్తున్నాం... అటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల సంఘం నిలుపుదల చేసిన పథకాలేవీ కొత్తవి కావన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా అమలవుతన్నాయని, నిరి్ధష్ట సమయంలో నిధులను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతోందని చెప్పారు. ఇప్పుడు కూడా ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందే ఈ పథకాలను ప్రకటించడం, లబ్దిదారులను గుర్తించడం జరిగిందన్నారు. నిధుల పంపిణీ అవసరాన్ని వివరిస్తూ ఎన్నికల కమిషన్‌కు వివరణ కూడా ఇచ్చామన్నారు. ఎన్నికల తేదీ దగ్గరలో ఉందని ఎన్నికల సంఘం ఇప్పుడు చెబుతోందని, వాస్తవానికి తాము ఎప్పుడో ఎన్నికల సంఘాన్ని నిధుల పంపిణీ కోసం అనుమతి కోరామని, అనుమతినివ్వడంలో సంఘం జాప్యం చేసిందని తెలిపారు. నిధుల లభ్యతను బట్టి పంపిణీ ఉంటుందని, ఈ నాలుగేళ్లు అలాగే చేస్తూ వచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు ముందు భవిష్యత్తులో నగదుగా మార్చుకునే విధంగా లబ్దిదారులకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇచ్చారని, అప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మాత్రం లేని పోని రాద్దాంతం చేస్తోందన్నారు. కొత్త పథకాలకు మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని చెప్పారు. మిగిలిన వారి అవకాశాలు దెబ్బతినకుండా ఉండేందుకే... చివరగా ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, పోలింగ్‌ అయ్యేంత వరకు నిధుల పంపిణీని ఆపడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే మిగిలిన వారి అవకాశాలు (లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) దెబ్బతినకుండా ఉండేందుకే నిధుల పంపిణీని ఆపాలంటూ ఉత్తర్వులిచ్చామని తెలిపారు. ఎన్నికల నియమావళికి లోబడే ఈ ఉత్తర్వులిచ్చామని చెప్పారు. ఎన్నికల నియమావళి కొత్త పథకాలతో పాటు పాత పథకాలకు సైతం వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నిధుల పంపిణీ జరిగితే ఓటర్లను ప్రభావితం చేసినట్లే అవుతుందన్నారు. అందుకు ఆస్కారం లేకుండా చేసేందుకే నిధుల పంపిణీని నిలుపుదల చేశామన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని ఆయన కోర్టును కోరారు. ఉదయం 10.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందరి సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ రాత్రి 10.20 గంటలకు ఉత్తర్వులు వెలువరించారు. ఈ వ్యాజ్యాలకున్న అత్యవసరం నేపథ్యంలో పూర్తి ఉత్తర్వుల కాపీ స్థానంలో అడ్వాన్స్‌ ఉత్తర్వుల కాపీని విడుదల చేశారు. పూర్తి కాపీ అందుబాటులోకి వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.   

BRS Leader KCR Exclusive interview With Sakshi
మాది పేగు బంధం: ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్‌

కేసీఆర్‌ రాష్ట్ర సాధకుడు, ఒక చరిత్ర. తెలంగాణతో నాది పేగు బంధం. నాడు ఆశలు అడుగంటిన సమయంలో పట్టుమని పది మంది కూడా లేకున్నా తెలంగాణ పోరాటం మొదలుపెట్టా. అనేక కష్టనష్టాలకోర్చి రాష్ట్రాన్ని సాధించా. నా గుండె ధైర్యం ఎన్నడూ చెక్కు చెదరదు. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభూత కల్పనలు సృష్టిస్తే.. మేం చేసింది కూడా చెప్పుకోలేక పోయాం. పదేళ్లు సీఎంగా నేను ఏం మాట్లాడానో, వాళ్లేం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. తెలంగాణలో ఓడిపోకపోతే మహారాష్ట్రలో 20, 30 ఎంపీ సీట్లు వచ్చేవి. ఏడాదిలోగా గ్రామస్థాయి మొదలుకుని మొత్తం బీఆర్‌ఎస్‌ కార్యవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తాం.(కల్వల మల్లికార్జున్‌రెడ్డి) కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు గుర్తించారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి సీఎం రేవంత్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి రేవంత్‌ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు 12కుపైగా లోక్‌సభ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని, అందులో బీఆర్‌ఎస్‌ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.     తెలంగాణతో తమది పేగు బంధమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..  ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయారు కాంగ్రెస్‌ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు ఆశకు పోయి మోసపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలతో.. కాంగ్రెస్‌ను నమ్మి తినే అన్నంలో మన్నం పోసుకున్నామనే భావన జనంలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మేం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కేవలం 1.8శాతం ఓట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయాం. మాకు కొన్ని వర్గాలు దూరం అయ్యాయనేది ఈనాడు జర్నలిజం స్కూల్‌ నుంచి పుట్టిన విచిత్రమైన కథ. మాకు ఏ ఒక్క వర్గం కూడా దూరం కాలేదు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం మోదీ ఏమైనా మొనగాడా? రాహుల్‌ సిపాయా? ఎన్డీయే, ఇండియా కూట­మి ఏదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత మోదీ, ఎన్డీయే దుర్మార్గ పాలన అంతమవుతుంది. దక్షిణాదిలోని 139 సీట్లలో బీజేపీకి 9 కూడా రావు. అధికారం వచ్చే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. బలంగాఉన్న ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమికే వాళ్లు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరి మద్దతు తీసుకోవాలో అందరం కలసి నిర్ణయం తీసుకుంటాం. ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే బీఆర్‌ఎస్‌కు ఒకట్రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వస్తాయి. మోదీ మేనియా అంతా గ్యాస్‌ ఎన్డీయే ట్రాష్,. మోదీ మేనియా గ్యాస్‌ అని తేలిపోయింది. ఆయన నినాదా­లన్నీ డొల్ల, మోదీ పాలనలో ఒక్క రంగం కూడా బాగుపడలేదు. కార్పొరేట్లకు రుణమాఫీ చేశారు. ఎగవేతదారులను లండన్‌లో పెట్టి మేపుతున్నారు. మోదీ రాజకీయంగా అనేక దుర్మార్గాలు చేశారు. 700కుపైగా ఇత ర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చు కుని ప్రభుత్వాలను కూల్చివేశారు. గతంలో 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూశారు. అలాంటి పరిస్థితి రాకుండా.. మేం నైతిక పద్ధతుల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.పెట్రోల్‌ ‘చార్‌ సౌ’ దాటుతుంది కేంద్రంలో బీజేపీ, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. వారి సీట్లేమోగానీ పెట్రోల్‌ ‘చార్‌ సౌ’ దాటడం పక్కా. ప్రధాని మోదీ దుర్మార్గుడు. మత విద్వేషాలు మినహా దేశ ప్రగతి ఆయనకు పట్టదు. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే అధ్వానంగా దిగజార్చారు. మోదీ మూలంగా మతపిచ్చి వాళ్ల దేశమనే ముద్ర పడుతోంది. కవిత, కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు కూడా ప్రతిస్పందించాయి.రేవంత్‌ తప్పించుకోలేడుప్రధాని మోదీని రేవంత్‌ బడేభాయ్‌ అనడం వంటి వాటిపై కాంగ్రెస్‌లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్‌ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే.. తాము 30 మందిమి రెడీగా ఉన్నామని, కలిసి పనిచేద్దామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు బీఆర్‌ఎస్‌ నేతలతో చెప్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌ దాన్నుంచి తప్పించుకోలేడు. ఆయన అరెస్టు అయితే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని అంతా అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్‌కు సంబంధమే లేదు. ఉద్యమకారుల మీదికి తుపాకీతో వచ్చిన ఆయన తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. గుజరాత్‌తో తెలంగాణకు ఫైనల్‌ మ్యాచ్‌ అనేది బుద్ధిలేని వాదన.బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం వల్లే కవిత అరెస్టు అవినీతికి పాల్పడాల్సిన అవసరం, ఖర్మ నా కూతురుకు లేవు. ఆమె నిర్దోíÙ, అమాయకురాలు. విచారణకు సహకరించినా అరెస్టు చేశారు. ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. రాజకీయ కక్ష సాధింపులకు బలి కాబోతున్నావు, నేరం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండు అని కవితకు చెప్పా. బీజేపీ వాళ్లు దుర్మార్గాలకు పాల్పడుతారని వివరించా. నేను, కేజ్రీవాల్‌ ఇద్దరం బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడటం వల్లే ఇది జరుగుతోంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకముంది. కవిత బెయిల్‌ కోసం నేను బీజేపీతో రాజీ పడ్డాననడం అర్థ రహితం.నిఘా నుంచి సమాచారం మాత్రమే కోరాం.. ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ.. బాకా, కాకా మీడియాలో వస్తున్న వార్తలన్నీ ట్రాష్‌. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వానికి గూఢచార వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎలా సమాచార సేకరణ జరిపిందనేది మాకు అనవసరం. సీఎం, మంత్రులకు అందులో ఏం పాత్ర ఉంటుంది. ఫోన్‌ ట్యాప్‌ చేయాలని ఏ సీఎం కూడా ఆదేశించరు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిఘా వ్యవస్థల నుంచి సమాచారం మాత్రం అడుగుతాం.జగన్‌ మళ్లీ సీఎం అవుతారు వైఎస్‌ జగన్‌ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు.మోదీ ఉల్లంఘనలు కనిపించట్లేదా? ప్రధాని మోదీ ఏం మాట్లాడినా అడిగేవారు లేక ‘బారా ఖూన్‌ మాఫ్‌’ అన్నట్టుగా తయారైంది. మతం పేరిట ప్రధాని రెచ్చగొడుతున్నా చర్యలు లేవు. హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి శివ లింగం మీద నీళ్లు పోస్తూ ఓట్లు అడిగితే ఉల్లంఘన కాదా? ఎన్నికల సంఘం నాపై మాత్రం 48 గంటల నిషేధం విధించింది. అది బీజేపీ అనుబంధ సంస్థగా మారింది. ధరణి, ల్యాండ్‌ టైటిల్‌ వంటివి ఉత్తమ విధానాలు చాన్నాళ్లుగా భూములను చిక్కుల్లో పెట్టి, రైతులను రాచి రంపాన పెట్టి.. ఎవరి భూములు ఎవరివో తెలియకుండా కన్ఫ్యూజన్‌లో పెట్టి.. లక్షలు, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎవరైనా సీఎం సాహసం చేసి దానిని సరిదిద్దాలని ప్రయత్నిస్తే.. కొన్ని ప్రతీపశక్తులు ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. ధరణితో తెలంగాణలో ప్రజలకు మేలు జరిగింది. ఏపీలో సీఎం జగన్‌ కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేశారు. భూములను ఎవరూ లాక్కోకుండా ఉండేందుకే ధరణి, ల్యాండ్‌ టైటిల్‌ వంటి ఉత్తమ విధానాలు ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఉత్తమ విధానాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బద్నాం చేసే ఉన్మాదం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉన్మాదం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల్లో బాలారిష్టాలు సహజం. ఒక బ్యారేజీ పిల్లర్లలో వచ్చిన సమస్యను సాకుగా చూపి పంటలను ఎండబెట్టారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలోనూ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. తక్షణమే మరమ్మతులు చేపట్టి నీళ్లు వినియోగించుకోవాలని సూచించింది. జ్యుడీషియల్‌ కమిషన్‌కు ఇంజనీరింగ్‌ విధానాల గురించి ఏం తెలుసు? మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానించాలని 50 ఏళ్ల క్రితం అనుకున్నారు. మహానది విషయంలో ఒడిశా దుడ్డుకర్ర పట్టుకుంది. దాంతో గోదావరి నుంచి అనుసంధానం మొదలు పెడతామని మోదీ అంటున్నారు. గోదావరిలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాతే అనుసంధానం గురించి మాట్లాడాలి.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజానికే మచ్చ కేసీఆర్‌ ప్రజాస్వామ్యయుతంగా ఉండరనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి కొందరు విషం చిమ్మేవాళ్లు చేసే తప్పుడు ప్రచారం. రాధాకృష్ణ జర్నలిస్టేనా? ఆయన కక్కేది విషం. దానికి వలువలు, విలువలు లేవు. కొత్త పలుకుఅంటూ చెత్త రాస్తారు. ఆయన సొంత అభిప్రాయాలు, కోరికలను చెప్తూ.. ఎదుటి వాళ్ల మీద విషం కక్కుతుంటారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వంటివి జర్నలిజం పరువు తీసి బజారులో నిలబెట్టాయి. కాకా, బాకా ఊది గెలిపిస్తామని అనుకుంటున్న వీళ్లు.. గతంలో చంద్రబాబును ఏపీలో గెలిపించగలిగారా? రాధాకృష్ణ లాంటి వాళ్లు జర్నలిజానికి మచ్చ.పుస్తకాలు చదువుతున్నా.. పాటలు వింటున్నా సర్జరీ తర్వాత మెల్లగా కోలుకుంటున్నా. కొంత సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదువుతున్నా. కిషోర్‌కుమార్, లతా మంగేష్కర్, ముఖేశ్‌ పాటలు చాలా ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమయం దొరకదు. సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఎన్నికలు, పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టాను. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు చూస్తే.. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా..  

Special Story About AP Development And Yellow Media Fake Campaign
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 దాకా కనపడని ఎన్నో అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు ఆ తర్వాత ఒకటొకటిగా కళ్లకు కడుతున్నాయి. కరోనా లాంటి అనూహ్య ఉత్పాతం దాదాపు రెండేళ్ల కాలాన్ని మింగేసినా.. కేవలం మూడేళ్ల కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కొన్ని కొనసాగుతుండగా కొన్నింటిని పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ తెలుగుదేశం ఆ పార్టీ మద్దతుదారులు ‘అభివృద్ధి లేదు’ అనే మాటనే గోబెల్స్‌ను తలదన్నేలా ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?ఏ ప్రభుత్వం మీదనైనా పోరాటం చేయాలంటే పేదల సమస్యలనే ప్రతిపక్షాలు తలకెత్తుకోవడం సర్వసాధారణం. పేదరికం పెరిగిందనో..పేదలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందనో, పేదల బ్రతుకులు దుర్భరంగా మారాయనో..విమర్శలతో ఇరుకునపెట్టడం సహజం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఆ పనికి బదులు.. అభివృద్ధి లేదు అంటూ సరికొత్త రాగం ఆలపించడానికి కారణం.. ఈ  పాలనలో పేదలకు అన్యాయం జరిగింది అంటే నమ్మేవారు లేకపోవడం.ఇప్పుడు బడుగువర్గాల నుంచి జగన్‌ ప్రభుత్వంపై ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడం, పథకాలు అందడం లేదనో, పక్కదారి పడుతున్నాయనో, ఇబ్బందుల్లో ఉన్నామనో ఉద్యమాలు, ఆందోళనలు వారు చేపట్టకపోవడం.. అడగకుండానే అన్నీ అమర్చిపెడుతున్న వైఎస్‌ జగన్‌ పాలన నిరుపేదలకు ఎక్కడ లేని భరోసా ఇచ్చింది. దీంతో పేదల్ని వంచించే, మాటలతో రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నాలు ఫలించవని ప్రతిపక్షాలకు పూర్తిగా అర్ధమైంది. తత్ఫలితంగానే  అభివృద్ధి లేదు అంటూ ఈ ఆరున్నొక్కరాగాలు.నాడు ‘కట్టుబట్టలతో’ కల్లబొల్లి కబుర్లు తప్ప అభివృద్ధి ఏదీ..ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలించిన కాలం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ సమయంలో ఎప్పుడు చూసినా ఆయన నోటి వెంట వచ్చే కొన్ని రొడ్డకొట్టుడు వ్యాఖ్యల్లో ‘లోటుబడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మనకు ఇచ్చారు.. మనల్ని కట్టుబట్టలతో తరిమేశారు. మనకు రాజధాని లేదు. ఇప్పటికి 26 సార్లు ఢిల్లీకి వచ్చాను అయినా ఫలితం లేదు’. ఇవేగా ఆయన తాను ఇచ్చిన రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి.. వగైరా హామీల్ని ఎగవేయడం కోసమే ముందస్తుగా ఇలాంటివన్నీ పాడిందే పాట అన్నట్టు వినిపించేవారు.అలాంటి అబద్ధాలతోనే ఐదేళ్ల పాటు పనికిరాని పాలన సాగించారు. తన హయంలో దాదాపుగా 2.50లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఇచ్చిన హామీల్లో పావుశాతం కూడా అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసిందీ లేదు. కొత్త రాజధాని పేరుతో రకరకాల డ్రామాలు ఆడారే తప్ప రాజధాని కాదు కదా అక్కడ ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు.చంద్రబాబులా ఏడుపులు పెడబొబ్బలు లేవు..ఖాళీ ఖజానాకి తోడు రూ.లక్షల కోట్ల రుణభారం ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన తదుపరి ముఖ్యమంత్రికి అందించి వెళ్లారు. తొలిసారి ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలు తలకెత్తుకున్నా.. తొణకకుండా బెణకకుండా వైఎస్‌ జగన్‌ పాలనను పరుగులు పెట్టించారు. గద్దెనెక్కిన కొన్ని నెలలకే కరోనా మహమ్మారి వచ్చి మీద పడింది. అయినా ఎక్కడా అదరలేదు బెదరలేదు. ఎందరు శ్రేయోభిలాషులు చెప్పినా  కరోనా సమయంలో కూడా పథకాలను ఆపలేదు. కట్టుబట్టలతో వచ్చాం, మన పరిస్థితి బాగోలేదు అంటూ చంద్రబాబులాగా ఏ రోజూ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా మాట్లాడలేదు. చుట్టూ సమస్యల్ని ఎదుర్కుంటూనే ఇచ్చిన ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.ఓ వైపు సరికొత్త శైలి సంక్షేమ పధాన్ని అనుసరిస్తూనే మరోవైపు మూలాల నుంచి అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ పాలనా ఫలాలు ప్రతీ చోటా కళ్లకు కడుతున్నాయి. గ్రామసెక్రటేరియల్స్‌ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, వైద్య కళాశాలలు కావచ్చు, ఫిషింగ్‌ హార్బర్స్‌ కావచ్చు.. చంద్రబాబు పాలనలో కనపడని ఎన్నో అభివృద్ధి సూచికలు ఆంధ్రప్రదేశ్‌లో కళ్లకు కడుతున్నాయి.పదేపదే అదే మాట అందుకే..ఓం భూం హాం ఫట్‌ అంటే ప్రత్యక్షమైపోవడానికి పైన పేర్కొన్నవేవీ ఇంద్రజాల టక్కుటమార ఫలితాలు కావు. ఎంతో దూరదృష్టితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రజల మేలు కోసం కళ్ల ముందుకు తెచ్చిన బంగారు భవిష్యత్తు దీపికలు. అయినప్పటికీ అభివృద్ధి లేదనే పాచిపాట ఎందుకు పాడుతున్నారంటే.. పల్లెల్లో జరిగే అభివృద్ధి పనులు కావచ్చు, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు కావచ్చు.. ఇవన్నీ కళ్లారా చూసి పాలనను బేరీజు వేసుకునేంత తీరిక ఓపిక ప్రజలకు ఉండదని సో.. చంద్రబాబు అండ్‌ ఎల్లో మీడియా ప్రచార ప్రభావానికి వీరు లోనవుతారనేదే ఈ అభివృద్ధి లేదనే ప్రచారం వెనుక దాగున్న కుయుక్తి.అయితే గతంలోలాగ ఏది పడితే అది నమ్మే అవసరం, పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రజల్లో రాజకీయాలపై, నేతల పాలనా దక్షతపై  అవగాహన పెరిగింది. ప్రతీ అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు– వైఎస్‌ జగన్‌ పాలనలోని వ్యత్యాసాలను బేరీజు వేసుకునేందుకు వీలుగా వారికి ఇప్పుడు ఎన్నో రకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చంద్రబాబు నాయుడు అండ్‌ ఎల్లో మీడియా గోబెల్స్‌ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. నిజాలను నిర్ద్వంద్వంగా గెలిపించనున్నాయి.–సత్యార్థ్‌.

TCS CEO earns the least among IT firms ceos
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్‌ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు,  అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్‌ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్‌ పర్చేజ్‌ స్కీమ్‌ (ESPS) ఉండదు.2024 ఆ‍ర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు.

Akshaya Tritiya 2024: Why People Buy Gold On This Day Significance of Akshaya Tritiya
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?

భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి  అత్యంత విశిష్టత ఉంది. ఈ పండుగను ఇవాళే జరుపుకుంటాం. వైశాఖంలో వచ్చే ఈ శుక్ల పక్ష తదియకు ఎందుకంత ప్రాముఖ్యం. పైగా ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతియకు సంబంధం ఏంటీ?. ఈ రోజున ఏం చేస్తారు..?ఆ పేరు ఎలా వచ్చిందంటే..మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి.. ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి "అక్షయ తృతీయ" అని పేరు.ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచవ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని పురాణోక్తి. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుంచి కావచ్చు, యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.విశిష్టత..కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది.బంగారం కొనాల్సిందేనా..?అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు.  పురాణాల ప్రకారం, కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకడి పసిడి. బంగారాన్ని అహంకరానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈరోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే.. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు.. దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.ఈ రోజునే  పురాణల్లో జరిగిన సంఘటనలు..కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడుశ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు  పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజేకుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజేకటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదేఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయఅన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం. 

Andhra Pradesh Development in CM YS Jagan Govt
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...

ఐదేళ్లూ అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడి చంద్రబాబు సర్కార్‌ అధోగతిపాలు చేసిన రాష్ట్రాన్ని.. గత 59 నెలలుగా విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు.. సుపరిపాలనతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ, నీతి ఆయోగ్‌ నివేదికలే అందుకు నిదర్శనం.  పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాల పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు దారిద్య్రం నుంచి బయట పడుతున్నారు.రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు సర్కార్‌ హయాంలో 11.77 శాతం ఉంటే.. ఇప్పుడు 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. రాష్ట్ర తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,51,173లు ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 2022–23 నాటికి రూ.2,19,518కు పెరిగింది. కేంద్రం జీడీపీలో రాష్ట వాటా చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 4.82 శాతానికి పెరిగింది.సీఎంజగన్‌ అధికారంలోకి వచి్చనప్పటి నుంచి సులభతర వాణిజ్యం(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఎగుమతుల్లో రాష్ట్రం చంద్రబాబు హయాంలో తొమ్మిదో స్థానంలో నిలిస్తే.. సీఎం జగన్‌ హయాంలో ఐదో స్థానానికి చేరుకుంది. పరిశ్రమల స్థాపన కోసం చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు వస్తే.. సీఎం జగన్‌ హయాంలో ఏటా సగటున రూ.14,896 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎంఎస్‌ఎంఈలు చంద్రబాబు హయాంలో 1.9 లక్షలు ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో ఏడు లక్షలకు చేరుకున్నాయి.  పాపారిశ్రామికాభివృద్ధి శరవేగంగా సాగుతుండటంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. రాష్ట్రంలో పీఎఫ్‌ ఖాతాలు చంద్రబాబు హయాంలో 44.85 లక్షలు ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 2022–23 నాటికి 60.73 లక్షలకు పెరిగాయి. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉంటే.. ఇప్పుడు అది  4.2 శాతానికి తగ్గింది.రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన సీఎం జగన్‌ విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. దాంతో వ్యవసాయాభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోంది. దేశంలో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17–18 శాతం ఉంటే.. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 36 శాతం ఉంది. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్‌ సరఫరాకు ఏటా సగటున రూ.8,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఉచిత పంటల బీమా, ఆర్బీకేలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని నీతి ఆయోగ్‌ అభినందించింది.  గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశ్రామిక దిగ్గజ గ్రూపులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. అచ్యుతాపురం వద్ద జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్, అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, లారస్‌ ల్యాబ్, విజయనగరంలో శారదా మెటల్స్‌ ఉత్పత్తిని ప్రారంభించాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బలభద్రపురంలోగ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, కాకినాడలో  లూఫిస్‌ ఫార్మా, గుంటూరు జిల్లాలో ఐటీసీ స్పైసెస్‌ పార్కు, పిడుగురాళ్ల వద్ద శ్రీ సిమెంట్స్, నెల్లూరు జిల్లాలో ఇండోసోల్‌ సోలార్‌ ప్యానల్స్‌ తయారీ, క్రిభ్‌కో ఇథనాల్, గ్రీన్‌ల్యామ్‌ సొల్యూషన్స్, గోకుల్‌ ఆగ్రో ప్రారంభం అయ్యాయి. చిత్తూరులో బ్లూస్టార్, డైకిన్, హావెల్స్, యాంబర్, ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్స్, టీసీఎల్, వైఎస్సార్‌ జిల్లాలో డిక్సన్, సెంచురీ ప్లైవుడ్స్, బిర్లా గార్మెంట్స్, కర్నూలు జిల్లాలో రాంకో సిమెంట్స్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్‌ వంటి భారీ పెట్టుబడులు వచ్చాయి.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all