Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Election Counting On 4th June
ఇంకా రాదేం.. నాలుగో తేది!

సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక సమరంలో చివరి ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరో ఐదు రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండటంతో పోలింగ్, కౌంటింగ్‌ ప్రక్రియల్లో జాప్యం చోటు చేసుకుంది. మన రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్‌ ముగిసింది. వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. కౌంటింగ్‌ సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇటు ప్రజల దృష్టంతా ఫలితాలపైనే ఉంది. నాలుగో తేదీ ఎంత వేగంగా వస్తుందా.. ఎప్పుడెప్పుడు ఫలితాలు తెలిసిపోతాయా.. అన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. గెలుపోటములపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. టీడీపీ అభ్యర్థుల్లో మాత్రం అంతర్మథనం నెలకొంది. గెలుస్తామా? చతికిల పడతామా? అన్న ఆందోళన వెంటాడుతోంది. కౌంటింగ్‌కు కసరత్తు ఓట్ల లెక్కింపునకు అధికారులు ముమ్మర కసరత్తు నిర్వహిస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు, అధికారుల నియామకం, భద్రతా చర్యలపై జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయం మొత్తం పోలీసు పహరాలో ఉంది. కౌంటింగ్‌కు అవసరమైన టేబుళ్లు సైతం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. విహార యాత్రలకు ముగింపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విదేశీ, స్వదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారాల్లో బిజీగా గడిపిన ద్వితీయ శ్రేణి నేతలు చిల్‌ అయ్యేందుకు గోవా చెక్కేశారు. మరికొందరు విహార యాత్రలు, ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్కువ శాతం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు స్వగ్రామాల్లోనే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ఇన్నాళ్లూ ఇంటికి దూరమైన లోటును పూడ్చుకుంటున్నారు. సొంత పనులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమీపిస్తుండటంతో దేశ, విదేశాలకు వెళ్లినవారు ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములపై సన్నిహితులతో ఆరా తీస్తున్నారు. పోలింగ్‌ సరళిని బట్టి ఎన్ని వేల ఓట్లతో గెలుస్తామన్న విషయమై అంచనాలు వేసుకుంటున్నారు. ఫలితాలు వెలువడే వరకు ఆగలేక తమ విజయావకాశాలపై వివిధ మార్గాల ద్వారా ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. జ్యోతిషం, న్యూమరాలజీకి డిమాండ్‌ ఎన్నికల్లో గెలుపోటములపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థులు వివిధ మార్గాలను వెతుకుతున్నారు. కొందరు జ్యోతిషులను ఆశ్రయిస్తున్నారు. తమ జాతకం ప్రకారం విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. ఏమైనా దోషాలు ఉంటే వాటిని తొలగించుకునే ప్రక్రియలు నిర్వహిస్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం తాను గెలిచే అవకాశం ఉందా? అంకెలు అనువుగా ఉన్నాయా? లేదా? అన్న విషయమై స్పష్టత తీసుకుంటున్నారు. దీంతో జ్యోతిషులకు బాగా గిట్టుబాటు అవుతోంది.కార్యకర్తలకు దిశానిర్దేశం సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ అనంతరం విహార, ఆధ్యాతి్మక యాత్రలకు వెళ్లిన నేతలంతా సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. కౌంటింగ్‌ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై సన్నిహితులు, పార్టీ శ్రేణులతో చర్చించుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కీలకమైన ఏజెంట్లు, ఇతర ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. కౌంటింగ్‌ సరళి పరిశీలించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు అభ్యర్థులు దిశానిర్దేశం చేస్తున్నారు.సర్వేలతో సతమతం అభ్యర్థుల విజయంపై రోజుకో సర్వే మార్కెట్‌లో దర్శనమిస్తోంది. ఒక సర్వేలో ఒక అభ్యర్థి గెలుస్తారని స్పష్టం చేస్తే మరో సర్వేలో ఓటమి చెందుతున్నట్లు వెల్లడిస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అభ్యర్థుల వంతవుతోంది. మరోవైపు అభ్యర్థుల పర్సనల్‌గా సర్వే సంస్థలను ఆశ్రయించి మరీ సర్వే చేయించుకుంటున్నారు. సర్వే చేయించుకునే అభ్యరి్థకి మీదే విజయమంటూ నమ్మబలికి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. వేల మెజార్టీతో గట్టెక్కుతారని వెల్లడిస్తుండటంతో అభ్యర్థులు ఇక తమ విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. బూత్‌ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పోలైన ఓట్ల లెక్కలతో ఏ పారీ్టకి ఎన్ని ఓట్లు వస్తాయో.. స్వతంత్రుల ప్రభావం ఎవరిపై ఉంటుందో.. నోటా ఎవరి ఎవరి పాలిట శాపంగా మారనుందో వంటి అంశాలు ఆయా పారీ్టల నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పారీ్టలు ఇప్పటికే అంతర్గత సర్వేలు నిర్వహించి విజయంపై ఓ అంచనాకు వచ్చాయి.

Delhi Really Record India Highest Ever Temperature, IMD To Check Mungeshpur Readings
52.9 డిగ్రీలు.. నిజమేనా!?

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాదిలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. బుధవారం రాజస్తాన్‌లో పలుచోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటేసింది. పాకిస్తాన్‌ మీదుగా అక్కడి నుంచి వీస్తున్న తీవ్రమైన వేడి గాలులతో దేశ రాజధాని అల్లాడుతోంది. దాంతో వరుసగా రెండో రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఢిల్లీ సమీపంలోని ముంగేశ్‌పూర్‌లో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందంటూ వచి్చన వార్తలు కలకలం రేపాయి. మధ్యాహ్నం 2.30 సమయంలో అక్కడ 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ప్రాంతీయ డైరెక్టర్‌ కుల్‌దీప్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. మన దేశంలో రాజస్తాన్‌ సహా ఏ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవలేదు. అయితే 52.9 డిగ్రీలన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజజు స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత నమోదైందంటే నమ్మశక్యంగా లేదు. వాస్తవమేమిటో తెలుసుకోవాలని ఐఎండీ అధికారులకు సూచించాం. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది’’ అంటూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దాంతో నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.మహాపాత్ర తెలిపారు. ‘‘డేటాలో తప్పులు దొర్లి ఉండొచ్చు. అంతటి ఉష్ణోగ్రత నిజమే అయితే స్థానిక పరిస్థితులేవైనా కారణమై ఉండొచ్చు. ముంగేశ్‌పూర్‌ వాతావరణ కేంద్ర సెన్సర్లను స్పెషలిస్టుల బృందం నిశితంగా అధ్యయనం చేస్తోంది’’ అని వివరించారు. బుధవారం రాజస్తాన్‌లోని ఫలోదీలో 51 డిగ్రీలు, పరిసర ప్రాంతాల్లో 50.8 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో 49.1 డిగ్రీలు, పుసాలో 49, నరేలాలో 48.4 డిగ్రీలు నమోదైంది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో ప్రాంతంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ గత 79 ఏళ్లలో ఇదే అత్యధికం. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ కూడా ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. హీట్‌ వేవ్‌ నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ అయింది. ఎండలకు తోడు తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయి. దాంతో జనం బయటకు రావాలంటే వణికిపోతున్నారు. నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం దాకా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రికార్డు విద్యుత్‌ డిమాండ్‌ ఎండల ధాటికి ఢిల్లీలో విద్యుత్‌ డిమాండ్‌ చుక్కలనంటుతోంది. బుధవారం మధ్యాహ్నం 3.36 గంటలకు 8,302 మెగావాట్ల పవర్‌ డిమాండ్‌ నమోదైంది. ఇది ఢిల్లీ చరిత్రలోనే రికార్డని డిస్కం అధికారులు చెప్పారు.సాయంత్రం భారీ వర్షం ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన రెండు గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో వాయువ్యం నుండి తూర్పు దిశగా వీచే గాలుల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.

Investigation on MLC Indukuri Raghu Raju Disqualification
రఘురాజుపై అనర్హత వేటుకు రంగం సిద్ధం

ఈ చిత్రం చూశారా? టికెట్‌ పంచాయితీ ముగిసిన తర్వాత లోకేశ్‌తో గొంప కృష్ణ సహా ఎస్‌.కోట టీడీపీ నాయకులంతా ఫోజు ఇచ్చిన ఫొటో ఇది. అప్పటివరకూ అంతా తానై నడిపించిన రఘురాజు మాత్రం ఆ ఫొటోలో కనిపించకుండా దాగుండిపోయారు. ధైర్యం ఉంటే వారితో ఫొటో దిగవచ్చు కదా? అలా చేస్తే ఆయన రఘురాజు ఎందుకవుతారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి, సి.రామచంద్రయ్య, జనసేన పార్టీలోకి జంప్‌ చేసిన వంశీకృష్ణ యాదవ్‌పై శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు వేటు వేశారు. వాళ్లంతా బాహాటంగానే ఫిరాయించారు. వారికి భిన్నంగా తెరచాటు, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న రఘురాజు గుట్టు ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది. లోకేశ్‌ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న వ్యవహారం, వారితో కుమ్మకై ఎస్‌.కోటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ విప్‌ పాలవలస విక్రాంత్‌ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు తాఖీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇస్తున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారంతా శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మండల స్థాయి నాయకులు. వారి మధ్యలో కూర్చున్న వ్యక్తి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. వారు వెళ్లింది ఏదో ప్రజాప్రయోజన కార్యక్రమం కోసం కాదు సుమీ... టీడీపీ టికెట్‌ కోసం పోటీపడిన కోళ్ల లలితకుమారి, గొంప కృష్ణ మధ్య సంధి కోసం! గత మార్చి నెలలో లోకేశ్‌ను కలిసేందుకు ఆయన ఇంట్లో వేచివున్న సదరు నాయకుల చిత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదవులిచ్చిన పారీ్టకే ద్రోహం... శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌ దక్కించుకున్న కోళ్ల లలితకుమారికి వ్యతిరేకంగా గళమెత్తిన గొంప కృష్ణ నోరుమూయించిన వ్యవహారం వెనుక పెద్ద తతంగమే నడిచింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... గత మార్చి నెలాఖరులో గొంప కృష్ణను, ఆయన అనుచరులను నారా లోకేశ్‌ హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడ జరిగిన టికెట్‌ పంచాయితీకి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వెళ్లడం అప్పట్లో సంచలనమైంది. కాకపోతే ఆ భేటీ ఫొటోలేవీ అప్పట్లో బయటకు రాకపోవడంతో తాను ఇంకా వైఎస్సార్‌సీపీలోనే ఉన్నానంటూ రఘురాజు నటించారు. తెరవెనుక మాత్రం టీడీపీ మేలు కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అప్పటికే ఎస్‌.కోట మండల వైస్‌ ఎంపీపీ పదవికి రాజీనామా చేయకుండానే తన భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్‌ సుధారాజును టీడీపీలోకి పంపించారు. లోకేశ్‌తో పచ్చ కండువా వేయించారు. బడ్డువరలోని స్వగృహంలో టీడీపీ సమావేశాలన్నీ పెడుతూనే అవేవీ తనకు సంబంధం లేదని బుకాయిస్తూ వచ్చారు. భార్య, భర్త వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేమిటని, మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండవచ్చా? అంటూ సుధారాజు ఘాటు వ్యాఖ్యలు చేసినా ఆయన ఖండించలేదు. రాజకీయంగా అండదండలు అందించిన బొత్సపైనే విమర్శలు చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంత స్థాయి లేకపోయినా ఇచ్చిన మాట కోసం సామాజిక సమీకరణలనూ పక్కనబెట్టి ఎమ్మెల్సీని చేసిన వైఎస్సార్‌సీపీకే ద్రోహం చేసిన వ్యక్తి నుంచి అంతకన్నా ఏమీ ఆశించలేమని పార్టీ శ్రేణులు నివ్వెరపోయారు. ఎంత వారించినా తెగింపే... వాస్తవానికి పార్టీకి నష్టం చేసే పనులు చేయొద్దని, వారి రాజకీయాలకు ఇబ్బందేమీ ఉండదని రఘురాజు దంపతులకు వైఎస్సార్‌సీపీ అధిష్టానం నచ్చజెప్పి చేసింది. ఎంత వారించినా ‘స్థానికత’ ముసుగులో పార్టీకి ద్రోహం చేయడానికి తెగించారు. ఈ కుతంత్రంలోకి ఎస్‌ కోట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కొందరినీ లాగేందుకు విఫలయత్నం చేశారు. ఎమ్మెల్సీ మూణ్నాళ్ల ముచ్చటే... ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఒక పార్టీ తరఫున చట్టసభల్లో అడుగుపెట్టిన వ్యక్తి తర్వాత సదరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం–1985 ప్రకారం అనర్హత వేటు పడుతుంది. ఈ ప్రకారం వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టిన రఘురాజు ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలని అతనిపై ఫిర్యాదు దాఖలైంది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు నోటీసులు పంపించారు. ఈ నెల 31న రఘురాజు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. పారీ్టకి ద్రోహం చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎన్నికల కమిషన్‌ అనుమతితో రఘురాజు సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. ∙ కోళ్ల’కు కాటు తప్పదా? వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేసి టీడీపీ కోసం పనిచేస్తున్న రఘురాజు దంపతులతో తనకు మేలు జరుగుతుందని టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి భావిస్తున్నారు. కానీ లోకేశ్‌ సమక్షంలో జరిగిన పంచాయితీ గురించి తెలిస్తే ఆమె గుండె పగిలిపోవడం ఖాయమని టీడీపీ నాయకులే గుసగుసలాడుతున్నారు. తన భార్యను ఏదిఏమైనా సరే ఎమ్మెల్యే చేయాలన్నదే రఘురాజు జీవిత ఆశయమట! కడుబండి శ్రీనివాసరావును తప్పిస్తే ఆమెకే వైఎస్సార్‌సీపీ టికెట్‌ ఇప్పించాలని చేసిన ప్రయత్నాలే ఫలించలేదు. దీంతో టీడీపీని ఆశ్రయించారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ చొరవతో లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన దామచర్ల సత్యకు చేరువయ్యారు. గత ఎన్నికల్లో రఘురాజు పోటీచేసి 30 వేల పైచిలుకు ఓట్లు సాధించారని, ఆయనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని దామచర్ల సత్యనారా లోకేశ్‌కు చెప్పారట! దీంతో రఘురాజుతో కలిసి వైఎస్సార్‌సీపీపై కుట్రకు టీడీపీ నాయకులు సిద్ధమైపోయారు. ఇందుకోసం కోళ్ల లలితకుమారికి తెలియకుండానే వారిమధ్య చీకటి ఒప్పందం కుదిరింది. 2029 నాటికి నియోజకవర్గ పునరి్వభజన ద్వారా ఎస్‌.కోట రెండు నియోజకవర్గాలు అవుతుందని, వాటిలో ఒక టికెట్‌ గొంప కృష్ణకు, రెండో నియోజకవర్గంలో టికెట్‌ రఘురాజు భార్య సుబ్బలక్ష్మికి ఇస్తామని లోకేశ్‌ గట్టి హామీ ఇచ్చారట! ఇద్దరికీ రెండూ ఇచ్చేస్తే మరి కోళ్ల లలితకుమారి పరిస్థితి ఏమిటనేదీ ఆగమ్యగోచరమే. చేరదీసిన గురువుకే పంగనామాలు పెట్టడంలో సిద్ధహస్తులైనవారి వెన్నుపోటు ఆమెకు కూడా తప్పేలా లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

AP Elections 2024: May 30th Political Updates In Telugu
May 30th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 30th AP Elections 2024 News Political Updates..7:18 AM, May 30th, 2024సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం2019లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయంఅదే ఏడాది మే 30న ‘జగన్‌ అనే నేను’.. అంటూ సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారంరాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పరిపాలనఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచిన జనంగత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు7:11 AM, May 30th, 2024మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు.. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపురాత్రి 9 గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాల ప్రకటనసీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌కు ఏపీ సీఈవో మీనా వెల్లడిజాప్యం లేకుండా లెక్కింపు జరగాలి.. ఫలితాలు కచ్చితంగా ఉండాలిఓట్ల లెక్కింపుపై అభ్యర్థులు, ఏజెంట్లకు అవగాహన కల్పించండిగుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలిరాష్ట్ర అధికారులకు నితీష్‌ వ్యాస్‌ ఆదేశం 7:05 AM, May 30th, 2024ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డిఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలిప్రత్యర్ధి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తతతో ఉండాలివైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందిజూన్‌ 9న సీఎంగా జగన్‌ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు7:02 AM, May 30th, 2024‘సడలింపు’ని సరిదిద్దండికేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సడలింపులుఅటెస్టింగ్‌ అధికారుల స్పెసిమన్‌ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధంఇది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తుందంటూ ఆందోళనసడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాలని వినతి

Pune Porsche Case: Sassoon Hospital Dean Allegation Against Minister MLA
పూణె పోర్షే కేసు: ఆస్పత్రి డీన్‌ ఎక్కడ?

ముంబై: పుణే పోర్షే కారు రోడ్డు ప్రమాదంలో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడికి సంబంధించి బ్లడ్‌ శాంపిళ్ల తారుమారు విషయంలో ఓ రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్మే డాక్టర్లపై ఒత్తిడి చేశారని సాసూన్ హాస్పిటల్ డీన్‌ తెలిపారు. బుధవారం హాస్పిటల్‌ డీన్ వినాయక్‌ కాలే మీడియాతో మాట్లాడారు.‘‘మహారాష్ట్ర మెడికల్‌ ఎడ్యుకేషన్‌ మంత్రి హసన్‌ ముష్రిఫ్‌, ఎమ్మెల్యే సునీల్‌ తింగ్రే.. మెడికల్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ అజయ్‌ తవాడేను నియమించారు. వీరు అధికారపార్టీ ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన నేతలు. వారు బ్లడ్‌ శాంపిళ్లను తారుమారు చేయించటం కోసం సోరెన్సిక్‌ డాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు’’ అని డీన్‌ తెలిపారు. శాంపిళ్ల తారుమారుపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన మంగళవారం ఈ వ్యవహారంపై రోజంతా విచారణ జరిపించామని హాస్పిటల్‌ డీన్‌ వినాయక్‌ కాలే తెలిపారు. తను కూడా ఈ విషయంపై పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.హాస్పిటల్‌ డీన్‌ మీడియా సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపటం గమనార్హం. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు, సరైన నిర్ణయం తీసుకోనందుకే ఆయన్ను ప్రభుత్వం సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.ఇక.. మైనర్‌ బాలుడి బ్లడ్‌ శాంపిళ్లు తారుమారు చేయటం కోసం ఇద్దరు డాక్టర్లు అజయ్‌ తవాడే, శ్రీహరి హర్నర్‌.. మధ్యవర్తి హాస్పిటల్‌ ప్యూన్‌ ద్వారా నిందితుడి కుటుంబ సభ్యుల వద్ద రూ.3 లక్షల లంచం తీసున్నారని తెలియటంతో వారిని పుణే క్రైం బ్రాంచ్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇక.. బ్లడ్‌ శాంపిళ్ల తారుమారుపై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం దర్యాప్తుకు డాక్టర్ పల్లవి సపాలే నేతృత్వంలో ఓ కమిటి ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో గ్రాంట్‌ మెడికల్‌ కాలేజీ, జేజే గ్రూప్‌ హాస్పిటల్‌ డీన్‌లు సభ్యులుగా ఉన్నారు.ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కుమారుడికి సంబంధం ఉందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ నానా పటోల్‌ ఆరోపణలు చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఎమ్మెల్యే.. పోలీసులతో టచ్‌లోకి వెళ్లారు. బ్లడ్ శాంపిళ్లను మార్చటం కోసం డాక్టర్లు కూడా ఫోన్‌ చేశారని పటోల్‌ ఆరోపణలు చేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇక.. ప్రముఖ బిల్డర్‌ అయన మైనర్‌ తండ్రి కూడా బ్లడ్‌ శాంపిళ్లను తారుమారు చేయించాలని డాక్టర్‌ తవాడేకు 14 సార్లు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది.ఇక.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే మంగళవారం స్పందించారు. ‘ప్రమాదం జరిగినప్పటి నుంచి పుణే పోలీసు కమిషనర్‌తో నేను టచ్‌లో ఉ‍న్నా. ఈ కేసులో ఎంతటివారు ఉన్నా చర్యలు తీసుకుంటాం. చట్టం ముందు అందరూ సమానులే. ఎవ్వరినీ వదిలిపెట్టం. నేను ఇప్పటికే ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చాను’ అని తెలిపారు.

AP Election results Declaration of all constituencies by 9 pm June 4th
మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి

సాక్షి, అమరావతి: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు సాయంత్రం 4 గంటల్లోపు వస్తాయన్నారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రం 6.00 గంటల్లోపు వీటి ఫలితాలు రావొచ్చని వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు టేబుళ్లను పెంచి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాత్రి 8 – 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ బుధవారం రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కౌంటింగ్‌కు చేపట్టిన ఏర్పాట్లను సీఈవో మీనా వివరించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్‌ అమలుతో పాటు ఆ జిల్లాల్లో సీనియర్‌ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డిజీపీతో పాటు తాను కూడా పల్నాడు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపులో లోపాలు జరగకూడదు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎటువంటి లోపాలు, జాప్యం జరగడానికి వీల్లేదని, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ రాష్ట్ర అధికారులకు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21 సీ, 21ఈలను అదే రోజు ఫ్లైట్‌లో ఈసీకి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా లెక్కింపు ప్రక్రియపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల్లో కూలీల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని చెప్పారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగినందున, ఈ జిల్లా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్టేట్‌ పోలీస్‌ నోడల్‌ ఆఫీసర్, అడిషనల్‌ డీజీ ఎస్‌ బాగ్చీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేశామని, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు చేపడుతున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు నితీష్‌ వ్యాస్‌కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో హరేంధిర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు తదితరులు వారి నియోజకవర్గాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Horoscope Today: Rasi Phalalu On 30-05-2024 In Telugu
ఈ రాశివారి బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.సప్తమి ఉ.11.07 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ధనిష్ట ఉ.7.20 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: ప.2.05 నుండి 3.35 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.40 వరకు తదుపరి ప.3.00 నుండి 3.52 వరకు, అమృతఘడియలు: రా.11.04 నుండి 12.34 వరకు; రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం : 5.29, సూర్యాస్తమయం : 6.26. మేషం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.వృషభం: కొత్త పనులకు శ్రీకారం. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కీలక బాధ్యతలు.మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడులు.కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.సింహం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.కన్య: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.తుల: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.వృశ్చికం: వ్యయప్రయాసలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.ధనుస్సు: కొత్త్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు వివాదాల పరిష్కారం..మకరం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.కుంభం: బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. వాహనసౌఖ్యం. విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.మీనం: బంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.

The Indian cricket team pays special attention to fitness
కసరత్తులు షురూ!

న్యూయార్క్‌: టి20 ప్రపంచకప్‌ వేటలో అమెరికా గడ్డపై అడుగు పెట్టిన భారత క్రికెట్‌ బృందం మొదటి రోజు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. కోహ్లి ఇంకా న్యూయార్క్‌ చేరుకోలేదు. టీమిండియా స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ సోహమ్‌ దేశాయ్‌ ఈ ట్రయినింగ్‌ సెషన్‌ను పర్యవేక్షించారు. ముఖ్యంగా భారత్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన యూఎస్‌ వాతావరణానికి అలవాటు పడటంపై ఆటగాళ్లు దృష్టి సారించారు.ఐపీఎల్‌ కారణంగా మన క్రికెటర్లంతా 90 శాతంకి పైగా డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లే ఆడారు. కానీ వరల్డ్‌ కప్‌ లీగ్‌ దశలో అమెరికా వేదికపై జట్టు 25–27 డిగ్రీల వాతావరణంలో అన్నీ డే మ్యాచ్‌లే (ఉదయం గం. 10:30 నుంచి) ఆడబోతోంది. ట్రయినింగ్‌ సెషన్‌లో క్రికెటర్లు స్వల్ప జాగింగ్, రన్నింగ్‌తో పాటు కొద్దిసేపు ఫుట్‌బాల్‌ ఆడారు.‘టైమ్‌ జోన్‌కు అలవాటు పడటం అన్నింటికంటే ముఖ్యం. జట్టు సభ్యులంతా కూడా దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఒక్క చోటికి చేరారు. వారి ఫిట్‌నెస్‌ స్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిని బట్టి మున్ముందు రోజుల కోసం ప్రణాళికలు రూపొందిస్తాను’ అని దేశాయ్‌ చెప్పారు. వాతావరణం చాలా బాగుందని హార్దిక్‌ పాండ్యా అభిప్రాయపడగా... న్యూయార్క్‌లో తొలిసారి ఆడనుండటం పట్ల రవీంద్ర జడేజా ఉత్సాహంగా ఉన్నాడు. నగర శివార్లలోని నాసా కౌంటీ స్టేడియంలో జూన్‌ 1న బంగ్లాదేశ్‌తో భారత్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌ వరకైనా కోహ్లి జట్టుతో చేరతాడా లేదా అనే విషయంలో బీసీసీఐ స్పష్టతనివ్వలేదు. జూన్‌ 5న అసలు పోరులో ఐర్లాండ్‌తో భారత్‌ ఆడుతుంది. ‘నంబర్‌వన్‌’ ర్యాంక్‌తో ప్రపంచకప్‌లోకి... టి20 ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియా నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా బరిలోకి దిగనుంది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ 264 రేటింగ్‌ పాయింట్లతో తమ టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.రెండుసార్లు టి20 వరల్డ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను వెస్టిండీస్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేయడంతో ఆ జట్టు ర్యాంక్‌ మెరుగైంది. దక్షిణాఫ్రికా నాలుగు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్‌లో నిలిచింది.

Aditi Dugar: Masque Restaurant Has A Place In The World's 50 Best Restaurants List
Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్‌ వరకు!

‘రెస్టారెంట్‌ మేనేజ్‌మెంట్‌’ అంటే రెస్టారెంట్‌కు వెళ్లి ఇష్టమైన ఫుడ్‌ తిన్నంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు వేడి వేడిగా ఎదురవుతుంటాయి. చల్లని ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమిస్తేనే విజయం చేతికి అందుతుంది. ‘యాక్సిడెంటల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా తనను తాను పరిచయం చేసుకునే అదితి దుగర్‌కు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి వచ్చింది. అయితే ఆమె ‘జీరో’ దగ్గరే ఉండిపోలేదు. కాలంతోపాటు ఎన్నోపాఠాలు నేర్చుకొని ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయ ఢంకా మోగించింది. ముంబైలో అదితి నిర్వహిస్తున్న ‘మాస్క్‌’ వరల్డ్స్‌ 50 బెస్ట్‌ రెస్టారెంట్స్‌ జాబితాలో చోటు సాధించింది. మనదేశంలో నంబర్‌వన్‌ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది.కొన్ని సంవత్సరాల క్రితం...ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ‘మాస్క్‌’ పేరుతో అదితి దుగర్‌ ఫైన్‌–డైనింగ్‌ రెస్టారెంట్‌ ప్రారంభించింది. అయితే ఈ రెస్టారెంట్‌ వ్యవహారం ఆమె మామగారికి బొత్తిగా నచ్చలేదు. సంప్రదాయ నిబద్ధుడైన ఆయన రెస్టారెంట్‌లోకి అడుగు కూడా పెట్టలేదు. అలాంటి మామగారు కాస్తా ‘మాస్క్‌’ రెస్టారెంట్‌ తక్కువ సమయంలోనే బాగాపాపులర్‌ కావడం గురించి విని సంతోషించడమే కాదు రెస్టారెంట్‌కి వచ్చి భోజనం చేశాడు. తన స్నేహితులను కూడా రెస్టారెంట్‌కు తీసుకు వస్తుంటాడు.తన కోడలు గురించి ఆయన ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలను పరిచయం చేయడంతో ‘మాస్క్‌’ దూసుకుపోయింది. మోస్ట్‌ ఫార్వర్డ్‌ – థింకింగ్‌ ఫైన్‌–డైనింగ్‌ రెస్టారెంట్‌గా పేరు తెచ్చుకుంది. ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన అదితి ఎన్నో వంటకాల రుచుల గురించి పెద్దల మాటట్లో విన్నది. అలా వంటలపై తనకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. ఇద్దరు పిల్లల తల్లిగా నాలుగు సంవత్సరాలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత కేటరింగ్‌పై దృష్టి పెట్టింది.ఇంటి నుంచే మొదలుపెట్టిన కేటరింగ్‌ వెంచర్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది అదితి. ఆహా ఏమి రుచి అనిపించేలా వంటకాల్లో దిట్ట అయిన తల్లి ఎన్నో సలహాలు ఇచ్చేది. ఒకవైపు తల్లి నుంచి సలహాలు తీసుకుంటూనే మరోవైపు ΄్యాకేజింగ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకు ఎన్నో విషయాల్లో తీరిక లేకుండా గడిపేది అదితి.క్యాటరింగ్‌ అసైన్‌మెంట్స్‌లో భాగంగా అదితి ఒక బ్రిటిష్‌ హోం చెఫ్‌తో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇది తన తల్లిదండ్రులు, అత్తమామలకు ఎంతమాత్రం నచ్చలేదు. దీనికి కారణం అతడు నాన్‌–వెజ్‌ చెఫ్‌ కావడమే. అయితే ఆ సమయంలో భర్త ఆదిత్య అదితికి అండగా నిలబడ్డాడు. అత్తమామలు, తల్లిదండ్రులకు నచ్చచెప్పాడు. ఒకవేళ అదిత్య కూడా అసంతృప్తి బృందంలో ఉండి ఉంటే అదితి ప్రయాణం ముందుకు వెళ్లేది కాదు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘ఆ సమయంలో ఆదిత్య నాకు అండగా నిలబడకుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు’ అంటుంది అదితి.‘అదితి విషయంలో నేను ఎప్పుడూ నో చెప్పలేదు. ఎందుకంటే ఆమె తప్పు చేయదు అనే బలమైన నమ్మకం ఉంది. ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తుంది. ఆమె ఆలోచనల్లో పరిణతి ఉంది’ అంటాడు మెచ్చుకోలుగా ఆదిత్య. ‘కొత్తగా ఆలోచించేవాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి అడిగినవి సమకూర్చితే అద్భుతమైన ఫలితాలు చూపించగలరు’ అనే ఆదిత్య మాటను అక్షరాలా నిజం చేసింది అదితి. ఫ్యామిలీ హాలిడే ట్రిప్‌లో స్పెయిన్‌లో ఉన్న అదితికి ‘మాస్క్‌’ ఐడియా తట్టింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత తన కలకు శ్రీకారం చుట్టింది. ‘ఫలానా దేశంలో ఫలానా వంటకం అద్భుతంగా ఉంటుంది. ఆ వంటకం మీ రెస్టారెంట్‌లో అందుబాటులో ఉండే బాగుంటుంది’... ఇలాంటి సలహాలు ఎన్నో కేటరింగ్‌ క్లయింట్స్‌ నుంచి వచ్చేవి.ఎంతోమంది సలహాలు, సూచనలతో ‘మాస్క్‌’ మొదలై విజయం సాధించింది. అయితే ‘మాస్క్‌’ వేగానికి కోవిడ్‌ సంక్షోభం అడ్డుపడింది.‘కోవిడ్‌ సంక్షోభం వల్ల ఆర్థికంగా నష్టం వచ్చినప్పటికీ విలువైనపాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కోవిడ్‌ అనేది మా వ్యాపారానికి సంబంధించి స్పష్టతను ఇచ్చింది’ అంటుంది అదితి.ఒక్కసారి వెనక్కి వెళితే...‘మాస్క్‌ పేరుతో డబ్బులు వృథా చేసుకోకండి. మీకు రెస్టారెంట్‌ బిజినెస్‌లో జీరో అనుభవం ఉంది. వ్యాపారంలో మీకు నష్టం తప్ప ఏమీ మిగలదు’ అన్నారు చాలామంది. ‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. అదితి దుగర్‌ విజయం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. – అదితి దుగర్‌

Vijay Antony Did Not Wear Slippers
కొన్ని నెలలుగా చెప్పులు వేసుకోవడమే మానేశాను: విజయ్‌ ఆంటోని

బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్‌ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు ఉపయోగిస్తారు. ఇలా పొద్దున్న నిద్రలేచిన సమయం నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం. అయితే, కోలీవుడ్‌ హీరో, డైరెక్టర్‌ విజయ్‌ ఆంటోనీ చెప్పులు లేకుండా కనిపించారు. అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా చెప్పులో వేసుకోనని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చాడు.విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'తుఫాన్‌'. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ పతాకంపై కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్‌ విడుదల కార్యక్రమంలో విజయ్‌ అంటోని పలు విషయాలను పంచుకున్నాడు. వేదిక మీదు చెప్పులు లేకుండా విజయ్‌ కనిపించడంతో ఏదైనా దీక్షలో ఉన్నారా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా చెప్పాడు. 'నేను ఎలాంటి దీక్షలో లేను. సుమారు 3 నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. దీనికి ప్రత్యేకమైన కారణం లేదు. ఒకరోజు నేను చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అంతేకాకుండా మనలో కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను దీంతో చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన అన్నారు. టాలీవుడ్‌లో జాతి రత్నాలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్‌ అనుదీప్ కూడా తాను పెద్దగా చెప్పులు ఉపయోగించనని గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక నివేదకల ద్వారా వెళ్లడి అయిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement