Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Narendra Modi New Cabinet 2024: All Eyes on portfolio allocation
ఎవరికి ఏ శాఖ?.. కొనసాగుతున్న ఉత్కంఠ

న్యూఢిల్లీ, సాక్షి: కేంద్ర కేబినెట్‌లోఎవరికి ఏ శాఖ అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం మంత్రి వర్గ సమావేశం జగనుంది ఈ లోపే మంత్రలకు శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. లేదంటే భేటీలోనే మంత్రి శాఖలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయనేదానిపై ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రా నుంచి ముగ్గురికి కేబినెట్‌లో చోటు దక్కింది. కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడుకి కేబినెట్‌లో చోటు దక్కగా, పెమ్మసాని, వర్మ, బండి సంజయ్‌కు సహాయ మంత్రులుగా బెర్త్‌లు దక్కాయి.ఇదీ చదవండి: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులో మోదీ మార్క్‌!

KSR Comments On The Manner In Which Many Leaders Got A Place In The Union Cabinet
మోదీ కేబినెట్‌లో ఇదొక సర్‌ప్రైజ్‌ ప్యాక్‌!

కేంద్ర మంత్రివర్గంలో చోటు పొందడం అంటే అది ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. దేశం అంతటిని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. ముగ్గురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరు టీడీపీవారు. తెలుగుదేశం పార్టీ నాలుగు మంత్రి పదవులు ఆశించినా రెండు మాత్రమే లభించాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు చోటు లభించింది.వీరిలో అనూహ్యమైన పేరు వర్మ అని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన ఏపీలో ఒక సాధారణ నేత. భీమవరం ప్రాంతంలో బాగా తెలిసిన వ్యక్తే అయినా, ఇంత వేగంగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడు అవుతారని ఎవరూ ఊహించలేదు. రాజకీయాలలో ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో చెప్పలేమనడానికి వర్మ ఒక ఉదాహరణ అవుతారు. ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఆయన టీవీ షోలలో బీజేపీ తరపున చర్చలలో పాల్గొంటుండేవారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. తదుపరి పార్టీ రాష్ట్ర నాయకుడుగా కొనసాగుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు కుదిరిన తర్వాత బీజేపీకి కేటాయించిన నరసాపురం నుంచి ఎంపీ పదవికి పోటీచేయాలని వైఎస్సార్‌సీపీ దూరం అయిన సిట్టింగ్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు గట్టి ప్రయత్నం చేశారు. ఆయన కూటమిలోని మూడు పార్టీలలో ఏదో ఒక పక్షం సీటు ఇస్తుందని ఆశించారు. బీజేపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపలేదు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని అందువల్లే టిక్కెట్ ఇవ్వలేదని ఆ పార్టీవారు చెప్పినా, అది సాకు అని చాలా మంది భావించారు. దాంతో రఘురామ టీడీపీలో చేరి ఉండి స్థానం నుంచి పోటీచేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.వర్మ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నరసాపురంలో క్షత్రియ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఉన్న వారిలో ఈయనే ప్రముఖుడుగా తెరపైకి వచ్చారు. బహుశా వర్మ కూడా ఊహించి ఉండకపోవచ్చు. వర్మను మార్చించాలని కొంతమంది ప్రయత్నం చేయకపోలేదు. అయినప్పటికీ, పార్టీ కోసం నిలబడిన వ్యక్తిగా వర్మ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తద్వారా పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం కలిగించారు. వర్మ ఇక్కడ నుంచి గెలుస్తారా? లేదా? అనే సంశయం తొలుత ఉన్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ తన అభ్యర్ధిగా బీసీ నేతను ఎంపిక చేసుకోవడం వర్మకు కలిసి వచ్చిందని చెప్పాలి.నరసాపురంలో ఎక్కువసార్లు క్షత్రియవర్గం వారే ఎంపీలు అవుతూ వచ్చారు. ఆ సామాజికవర్గం తక్కువ సంఖ్యలోనే ఉన్నా, వారి పలుకుబడి చాలా పెద్దదిగా భావిస్తారు. అదంతా వర్మకు ప్లస్ పాయింట్ అయింది. మనిషి కూడా సౌమ్యుడుగా పేరొందారు. అన్నీ కలిసి వచ్చి వర్మ ఎంపీగా గెలుపొందడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. ఇది కలయో, నిజమో అనుకునేంతలోనే ఈ రాజకీయ పరిణామాలు జరిగిపోయాయి. రాజకీయాలలో కాకలు తీరిన సీ.ఎమ్ రమేష్, పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలను కాదని వర్మవైపు బీజేపీ మొగ్గుచూపి కేంద్రంలో స్థానం కల్పించారు. ఒకరకంగా రమేష్, పురందేశ్వరిలకు కాస్త అసంతృప్తి కలిగించే అంశమే అయినా, దాని గురించి మాట్లాడకపోవచ్చు.పురందేశ్వరి కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరి 2014, 2019లలో పోటీచేసినా గెలవలేకపోయారు. అయినా పార్టీలో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. తదుపరి ఆమెను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దాంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మాజీ సీఎం ఎన్.టి రామారావు కుమార్తెగా కూడా ఆమె అందరికి తెలిసిన నేతగా ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తు కుదర్చడంలో ఆమె గట్టి ప్రయత్నం చేశారు. అందుకు అధిష్టానం కూడా అంగీకరించింది. ఆమె రాజమండ్రి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చాలా మంది అనుకున్నారు. కారణం ఏమో కానీ ఆమెకు అవకాశం రాలేదు. స్పీకర్ లేదా, డిప్యూటి స్పీకర్ వంటి పదవి ఏదైనా వస్తుందా అని ఆమె మద్దతుదారులు ఆశిస్తున్నారు.ఇక మరో కీలకమైన నేత సీఎం రమేష్. ఆయన రాజకీయ జీవితం అంతా తెలుగుదేశంతో ముడిపడి ఉంది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత మనిషిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ పరాజయం తర్వాత వ్యూహాత్మకంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఉంటూ చంద్రబాబు ప్రయోజనాలను పరిరక్షించడంలో ముఖ్యభూమిక పోషించారని చాలామంది విశ్వసిస్తారు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకునేలా అధిష్టానాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేశారని చెబుతారు. ఆ తర్వాత ఆయన వ్యూహాత్మకంగా అనకాపల్లి స్థానాన్ని ఎంపిక చేసుకుని బీజేపీ టిక్కెట్ సాధించగలిగారు.కడప జిల్లాకు చెందినవారైనప్పటికీ, తన అంగ, అర్ధ బలంతోపాటు, అక్కడ ఉన్న టీడీపీ నేతలంతా తనకు బాగా తెలిసినవారే కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా ఆయన విజయం సాధించిన తర్వాత కచ్చితంగా ఆయనకున్న పలుకుబడి రీత్యా కేంద్ర మంత్రి పదవి పొందుతారని చాలామంది భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు పదవి ఇవ్వలేదు. తెలుగుదేశం పక్షాన కింజారపు రామ్మోహన్ నాయుడు మూడోసారి లోక్ సభకు ఎన్నికై మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా పొందారు. ఇది అరుదైన విషయమే. ముప్పై ఆరేళ్ల వయసులోనే ఈ స్థాయికి రావడం గొప్ప సంగతే.రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్రంలో యునైటెడ్ ప్రంట్ టైమ్ లో మంత్రి పదవి చేశారు. వాజ్ పేయి ప్రభుత్వ టైమ్ లో స్పీకర్ అవుతారని భావించారు. కానీ ఆ పదవి జి.ఎమ్.సి బాలయోగిని వరించింది. బాలయోగి అనూహ్య మరణం తర్వాత ఆ పదవి వస్తుందని ఆశించారు. కానీ గుజరాత్ పరిణామాల నేపథ్యంలో పదవి తీసుకోవడానికి చంద్రబాబు అంగీకరించలేదు. దాంతో ఎర్రన్నాయుడు కు మళ్లీ అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు పదవి దక్కడం విశేషం. తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు, కేంద్రంలో పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుతోపాటు ఆంగ్లం, హిందీ భాషలలో పట్టు ఉండడం ఈయనకు కలిసి వచ్చే పాయింట్ అని చెప్పాలి. యువకుడు, పార్టీకి కట్టుబడి పనిచేయడం ప్లస్ అయింది. టీడీపీ ఎంపీలలో వరసగా మూడుసార్లు ఎంపీ అయిన వ్యక్తి ఈయనే. ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. గుంటూరు నుంచి ఈసారి గల్లా జయదేవ్ పోటీచేయకపోవడంతో రామ్మోహన్ కు పోటీ లేకపోయిందని చెప్పవచ్చు. గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కూడా కేంద్రంలో పదవి రావడం విశేషం. ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఈయనకు చాన్స్ వస్తుందన్న భావన ఏర్పడింది. దానికి తగ్గట్లే టీడీపీ నాయకత్వం ఈయనకు అవకాశం కల్పించింది. ఆరువేల కోట్ల సంపద కలిగిన నేతగా ప్రచారంలో ఉన్న ఈయన కేంద్రంలో మంత్రి అయ్యారు. జనసేన నుంచి వి. బాలశౌరి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం జరిగినా ఎందుకో కాలేకపోయారు. ఆయన గతంలో వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఉండేవారు. ఈ ఎన్నికలలో జనసేన నుంచి మచిలీపట్నంలో గెలుపొందారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి తీసుకోవడానికి ప్రస్తుతం సిద్దపడలేదని, అందుకే బాలశౌరికి అవకాశం రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పదవి దక్కించుకున్నారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అంబర్ పేట నుంచి ఓటమి చెందడమే ఈయనకు వరం అయింది. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి విజయం సాధించడం, మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కడం జరిగిపోయాయి. ఆ రకంగా ఈయన రాజకీయ భవిష్యత్తు మారిపోయింది. పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి కేంద్రంలో క్యాబినెట్ హోదాకు ఎదిగిన నేత ఈయన. ప్రజలతో మమేకం అవడం ద్వారా ఆదరణ చూరగొన్నారు. మరో నేత బండి సంజయ్ కు కేంద్రంలో స్థానం లభించింది. బీసీ వర్గానికి చెందిన ఈయన రాజకీయ ప్రస్తానం కరీంనగర్ మున్సిపల్ రాజకీయాల నుంచి కావడం విశేషం.అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పొందినా, తదుపరి కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికవడం, ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావడం ఒక సంచలనం. ఫైర్ బ్రాండ్ గా అనతికాలంలోనే పేరొందిన ఈయన అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద పోరాటాలే సాగించారు. ఈయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందరిని ఆశ్చర్యపరచింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. దానిని గుర్తించిన పార్టీ నాయకత్వం పార్టీలో జాతీయ హోదా కల్పించింది. తిరిగి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది.సీనియర్ నేత డీకే అరుణ, మరో నేత ఈటల రాజేందర్ లు కూడా కేంద్రంలో పదవులు ఆశించారు. కానీ దక్కలేదు. కిషన్ రెడ్డికి పదవి ఇచ్చినందున అరుణకు అవకాశం ఉండదు. అలాగే బండి సంజయ్ కు లభించిన తర్వాత ఈటలకు చాన్స్ రాదు. కాకపోతే ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని చెప్పడానికి ఈటల రాజకీయ జీవితం కూడా ఉదాహరణే. కేసీఆర్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కున్నారు. ఒక షెల్టర్ గా ఉంటుందని భావించి బీజేపీలో చేరారు. అది ఆయనకు కలసి వచ్చింది. గత శాసనసభ ఎన్నికలలో ఓటమి చెందినా, మల్కాజిగిరి నుంచి ఎంపీ కాగలిగారు.మొత్తం మీద చూస్తే బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకే మోదీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు అందుకే పదవులు దక్కాయి. దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్, డి.కె అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు కావడం గమనార్హం. టీడీపీ నుంచి ఒక బీసీ నేతకు, బీజేపీ నుంచి మరో బీసీ నేతకు అవకాశం వచ్చింది. ముగ్గురు అగ్రవర్ణాల వారికి మంత్రి పదవులు దక్కాయి. వీరందరికి అభినందనలు చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

Manipur CM convoy attacked, one security person injured
మణిపూర్​ సీఎం కాన్వాయ్​పై దాడి

ఇంఫాల్​: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్‌పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద సోమవారం ఉదయం సాయుధ ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు.కాగా జూన్​ 6న జిరిబామ్‌కు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన ఇక్కడ పరిస్థితులను సీఎం బీరెన్​ సింగ్​ మంగళవారం సందర్శించేందుకు ప్లాన్​ చేశారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కాన్వాయ్ ఇంఫాల్ ​నుంచి జిరిబ‌మ్ జిల్లాకు వెళ్తున్న స‌మ‌యంలో దాడి జ‌రిగింది. సెక్యూరిటీ ద‌ళాల‌పై మిలిటెంట్లు ప‌లుమార్లు ఫైరింగ్ జ‌రిపారు. అయితే ఆ దాడిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు తిప్పికొట్టాయి.అయితే దాడి సమయంలో సీఎం సంఘటన ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్‌లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్‌ అవుట్‌పోస్టులు, ఫారెస్టు బీట్‌ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు.

Huge Land Grabbing Scam In Manikonda Pokalwada
ధరణిలో గోల్‌మాల్‌.. మణికొండలో భారీ భూకబ్జా!

హైదరాబాద్‌, సాక్షి: మణికొండ పోకల్‌వాడలో భారీ భూదందా వెలుగు చూసింది. ధరణిలో గోల్‌మాల్‌ చేసి వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. ధరణి నుంచి పాస్‌బుక్‌లు జారీ అయ్యాయి. ధరణి ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించి ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఐదెకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ధరణి ఉద్యోగులతో రూ.3 కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే రంగారెడ్డి ఇద్దరు కలెక్టర్ల సంతకాలతో పాస్‌బుక్‌లు జారీ చేశారు. అయితే.. బ్లాక్‌​ లిస్ట్‌లో ఉన్న ల్యాండ్‌కు పాస్‌ బుక్‌లు జారీ కావడంతో ఎమ్మార్వో ఖంగుతిన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. భూమిని తమ పేరు మీద రిజిస్టర్‌ చేసుకున్న ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

New Continent Same Result: Sachin Tendulkar Roasts Pak After Loss Vs India T20 WC
వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్‌ ట్వీట్‌ వైరల్‌

పాకిస్తాన్‌పై అజేయ చరిత్రను కొనసాగిస్తూ టీమిండియా మరోసారి ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటుకుంది. టీ20 ప్రపంచకప్‌-2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది.వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్రతద్వారా టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై ఏడుసార్లు గెలుపొంది ఈ ఘనత తన పేరిట లిఖించుకుంది.ఇక దాయాది పాక్‌పై భారత్‌ విజయంలో ఈసారి బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా.. మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.మరోవైపు పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సైతం రెండు వికెట్లతో రాణించగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టి పాకిస్తాన్‌ను ఆలౌట్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్‌ విజయం పట్ల టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ హర్షం వ్యక్తం చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా రోహిత్‌ సేనపై.. ముఖ్యంగా బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌!‘‘ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌. కొత్త ఖండం.. అయినా అదే ఫలితం. టీ20 ఫార్మాట్‌ అనేది బ్యాటర్ల గేమ్‌.. అయితే, న్యూయార్క్‌లో మాత్రం బౌలర్లు కనువిందు చేశారు.ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌! అమెరికాలో అద్భుత వాతావరణంలో అత్యద్భుతంగా మన ఆట తీరును చూపించారు. బాగా ఆడారు.. టీమిండియాదే విజయం’’ అని సచిన్‌ టెండుల్కర్‌ ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపాడు.ఈ క్రమంలో సచిన్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ తదితరులు సైతం భారత జట్టును అభినందించారు. ఇదొక ప్రత్యేకమైన విజయమని ఆటగాళ్లను కొనియాడారు.ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌👉వేదిక: నసావూ ఇంటర్నేషనల్‌ స్టేడియం, న్యూయార్క్‌👉టాస్‌: పాకిస్తాన్‌.. తొలుత బౌలింగ్‌👉టీమిండియా స్కోరు: 119 (19)👉పాకిస్తాన్‌ స్కోరు: 113/7 (20)👉ఫలితం: పాకిస్తాన్‌పై ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా(3/14).చదవండి: Ind vs Pak: బుమ్రా విషయంలో ఇలా చేస్తారా?: రోహిత్‌పై విమర్శలు View this post on Instagram A post shared by ICC (@icc)

Pushpa villain Fahadh Faasil suffers ADHD; Check symptoms and treatment
‘పుష్ప’ విలన్‌కు అరుదైన వ్యాధి... లక్షణాలు, కారణాలు తెలుసా?

మలయాళ భాషల్లో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించిన ఫహాద్‌ ఫాజిల్‌, తెలుగులో మాత్రం ‘పుష్ప’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మలయాళ బ్యూటీ, హీరోయిన్‌ నజ్రియా నజీమ్ భర్త కూడా. అయితే తాను అటెన్షన్ డిఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అసలు ఏడీహెచ్‌డీ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది, దీనికి చికిత్సా విధానాలు ఏమిటి? ఒకసారి చూద్దాం. ఏడీహెచ్‌డీ: ఆవేశం సినిమాతో సహా, వరుస హిట్‌లు అందుకుంటున్న ఫహాద్ ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఇదొక మానసిక వ్యాధి. ఏదైనా అంశంపై ఏకాగ్రత లేకపోవడం, అతిగా స్పందించడం, ఇంపల్సివ్ బిహేవియర్ (ఆలోచించకుండానే స్పందించడం) లాంటి ఇబ్బందులు ఏడీహెచ్‌డీలో కనిపిస్తాయి. దీని వల్ల వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగం లేదా చదువుపై కూడా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోతుంటుంది. కొందరికి చిన్న వయసులోనే ఇది మొదలు అవుతుంది. పెద్దయ్యే వరకూ ఇది పీడిస్తూనే ఉంటుంది.లక్షణాలు ఇది సాధారణంగా పిల్లలలో కనిపిస్తుంది. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో లక్షణాలు తీవ్రంగా ఉండొచ్చు. తీవ్ర లక్షణాలు ఉన్నవారితో పోలిస్తే ఒకమాదిరి లక్షణాలుండేవారిలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. లక్షణాల ఆధారంగా మానసిక వైద్య నిపుణులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.ఆలోచించకుండానే స్పందించడం (ఇంపల్సివ్‌నెస్) టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఇబ్బందులు ఏకాగ్రత లోపించడం, పనిపై దృష్టి పెట్టలేరు, లేదా ప్రాధాన్యత ఇవ్వలేరు.మల్టీ టాస్కింగ్‌ చేయడం కష్టం. మూడ్‌ స్వింగ్స్ క్యూలో వేచి ఉండటం లేదా ట్రాఫిక్‌లో ఉన్నా ఉద్రేకపడతారు.అతిగా ఆవేశం ఒత్తిడిని తీసుకోలేకపోవడం లాంటివి సాధారణంగా కనిపిస్తాయి.ముఖ్యంగా ఏడీహెచ్‌డీ రోగుల్లో మూడ్ డిజార్డర్స్ తీవ్రంగా ఉంటాయి. దీంతో తీవ్రమైన డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ లాంటివి ముఖ్యమైనవి. ఏడీహెచ్‌డీ వల్ల రోగుల్లో యాంక్సైటీ సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రతిదానికీ ఆందోళన పడటం, గుండె వేగం పెరగడం లాంటి సమస్యలు వీరిలో కనిపించొచ్చు. పర్సనాలిటీ డిజార్డర్లు, లెర్నింగ్ డిసేబిలిటీస్ కూడా ఏడీహెచ్‌డీ రోగుల్లో కనిపించొచ్చు.ఏడీహెచ్‌డీ కారణాలుస్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, ప్రస్తుతం దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. జన్యు కారణాలు, నాడీ సమస్యలు, పర్యావరణం లాంటి అంశాలు ఈ వ్యాధి వచ్చేందుకు ప్రభావితం చేస్తాయంటారు పరిశోధకులు. ముఖ్యంగా చిన్నప్పుడే సీసం లాంటి లోహాల ప్రభావానికి లోనైనప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుంది.నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లోనూ , గర్భంతో ఉన్నప్పుడు మహిళలు మద్యపానం, ధూమపానం లాంటివి చేసినా పిల్లల్లో ఏడీహెచ్‌డీ ముప్పు పెరగొచ్చు. ఏడీహెచ్‌డీతో బాధపడే వారు వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల ఔషధాలతోపాటు ,మానసిక థెరపీలను తీసుకోవాల్సి ఉంటుంది.

google ceo sundar pichai love proposal situation on birthday special
టెన్షన్‌ పడుతూ లవ్‌ప్రపోజ్‌ చేసిన సుందర్‌పిచాయ్‌

భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్‌ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభ చాటుతున్నారు. అందులో ప్రపంచ నం.1 సెర్చ్‌ఇంజిన్‌ కంపెనీ గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు ప్రత్యేకస్థానం ఉంది. తమిళనాడులోని మధురైలో పుట్టి టాప్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా సీఈఓగా ఎంపికవ్వడం మామూలు విషయంకాదు. ఈరోజు సుందర్‌ పిచాయ్‌(52) పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్‌ సుందరరాజన్ కాగా.. అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి తోటి ఉద్యోగులు సుందర్‌పిచాయ్‌గా పిలవడం ప్రారంభించారు. ఆయన 1972, జూన్‌ 10న తమిళనాడులోని మధురైలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి లక్ష్మి, స్టెనోగ్రాఫర్..తండ్రి రేగునాథ పిచాయ్ బ్రిటిష్ హయాంలో జనరల్‌ ఎలక్ట్రికల్ కంపెనీ(జీఈసీ)లో ఇంజినీర్‌గా పనిచేసేవారు. సుందర్‌ స్థానికంగా ఉన్న వనవాణి మెట్రిక్యులేషన్ పాఠశాలలో పదో తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో మెటలార్జికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. అనంతరం అధ్యాపకులు అక్కడే పీహెచ్‌డీ చేయాలని సలహా ఇచ్చారు. కానీ, 1993లో అమెరికా వెళ్లి సుందర్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.చదువుపూర్తయ్యాక అప్లైడ్‌మెటీరియల్స్‌ కంపెనీలో ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో పనిచేశారు. మెకిన్సే అండ్‌ కంపెనీలో మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో గూగుల్ సంస్థలో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ టూల్‌బార్ రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించారు. గూగుల్ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ మ్యాప్స్‌ వంటి ఇతర అప్లికేషన్‌ల అభివృద్ధిని పర్యవేక్షించారు.మార్చి 13, 2013న పిచాయ్ తాను పర్యవేక్షించిన గూగుల్‌ ఉత్పత్తుల జాబితాను ఆండ్రాయిడ్‌కు జోడించారు. ఆగస్టు 10, 2015లో పిచాయ్‌ గూగుల్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గూగుల్‌ ఆయన సారథ్యంలో ఇటీవల ‘జెమినీ’ అనే జనరేటివ్‌ ఏఐను ఆవిష్కరించింది. ఆయన టెక్‌ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్‌తో గౌరవించింది. 2019 డిసెంబర్‌లో గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుందర్‌ 2022 సంవత్సరానికిగానూ 226 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్‌..!టెన్షన్‌ పడిన సీఈఓ..సుందర్‌ది ప్రేమ వివాహం. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో బీటెక్‌ చూస్తున్నపుడు అంజలితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పారు. తన భార్య గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘మేం ఖరగ్‌పుర్‌ ఐఐటీలో తొలిసారి కలిశాం. చాలా బిడియస్తుడినైన నన్ను ఆమే మార్చింది. తనకు ప్రపోజ్‌ చేసేటప్పుడు నా టెన్షన్‌ ఇప్పటికీ గుర్తే. నా మనసులో మాట అంజలికి చెప్పడం కన్నా, గూగుల్‌లో ఈ స్థానాన్ని సంపాదించడమే తేలిక అనిపిస్తోందిప్పుడు. నా ప్రేమను అంగీకరించడం తన గొప్పతనం. అప్పటికి నేను ఆర్థికంగా స్థిరపడకపోయినా, నన్ను నమ్మింది. నా జీవితంలో ప్రతి కీలక సందర్భంలోనూ తనదే ముఖ్య పాత్ర. ఎన్నో ముఖ్య విషయాల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు అంజలే నా సలహాదారు. తక్షణ పరిష్కారాన్ని సూచిస్తుంది. మైక్రోసాఫ్ట్‌, యాహూ, ట్విటర్‌ వంటి సంస్థల నుంచి అవకాశాలెన్నో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయా. అప్పుడు గూగుల్‌ నుంచి వెళ్లొద్దన్న తన సూచనను పాటించడమే నన్నీ స్థాయిలో నిలబెట్టింది’ అన్నారు. సుందర్‌ దంపతులకు కావ్య పిచాయ్‌, కిరణ్‌ పిచాయ్‌ ఇద్దరు పిల్లలు.

Director Ratheesh Balakrishnan Treated Like a Maid: Costume designer Liji Preman
ఆ డైరెక్టర్‌ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు..

మలయాళ దర్శకుడు రథీశ్‌ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్‌ డిజైనర్‌ లిజి ప్రేమన్‌. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం సుమలతయుదేయమ్‌: హృదయహరియయ ప్రణయకథ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేశాను. 35రోజులు పని ఉంటుందన్నారు. అందుకుగానూ రెండున్నర లక్షలు అడిగాను. సరేనంటూ లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఎన్నో ఇబ్బందులు..ఈ సినిమా ప్రీపొడక్షన్‌ దగ్గరి నుంచి షూటింగ్‌ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్‌ రథీశ్‌కు ఇగో ఎక్కువ. నన్ను ఒక పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరిముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. తన టార్చర్‌ భరించలేక చివర్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాను. నాకు క్రెడిట్‌ ఇవ్వలేదుతీరా చూస్తే సినిమా క్రెడిట్స్‌లో నా పేరు వేయలేదు. అసిస్టెంట్‌ అని రాశారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మరో వ్యక్తికి క్రెడిట్‌ ఇచ్చారు. ఇది నన్ను అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ముట్టజెప్పలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడదనే రిలీజ్‌ అయ్యేవరకు ఆగాను. ఓటీటీలో అయినా..ఇప్పుడు న్యాయపోరాటం చేస్తాను. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్‌ చేస్తున్నాను. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగానూ డైరెక్టర్‌ నాకు సారీ చెప్పాలి. మానసిక వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అని లిజి పేర్కొంది.చదవండి: గుడిలో కమెడియన్‌ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే!

YSRCP MLA Matsyarasa Visweswara Raju On Party Change Rumour
వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులుండవు: విశ్వేశ్వర రాజు

అల్లూరి సీతారామరాజు: రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు Matsyarasa Visweswara Raju అంటున్నారు. ఆయనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.‘‘నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నా. వైఎస్‌ జగన్‌తోనే నా పయనం కొనసాగుతుంది. నాకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చింది ఆయనే. ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా, నా భార్యకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారు. ఎన్నో అవకాశాలు ఇచ్చిన వైఎస్సార్‌సీపీని వీడితే నాకు పుట్టగతులు ఉండవు. .. పార్టీ మారే ప్రసక్తే లేదు. ఊపిరి ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటా. 2029లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది’’ అని విశ్వేశ్వరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం

emmanuel Macron Dissolves Parliament Calls Snap Election On June 30
ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ రద్దు.. ఆకస్మిక ఎన్నికలకు మేక్రాన్‌

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ.. ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతిత్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన. యూరోపియన్‌ యూనియన్‌(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చవిచూస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. జూన్‌ 30న తొలి విడత, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్‌ ప్రకటించారు. అయితే.. ఈయూ ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు, మాక్రేన్‌ రెనాయిసెన్స్‌ పార్టీకి 15.2 శాతం ఓట్లు.. పైగా సగం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. అలాగే.. సోషలిస్ట్‌ పార్టీ 14.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలుస్తుందని పోల్‌ సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆయన పార్లమెంట్‌ రద్దును ప్రకటించి.. ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.‘రైట్‌ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్‌ ప్రజలపై ఉ‍న్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మేక్రాన్ అ‍న్నారు.ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ఇక.. ఈయూ ఎన్నికలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నిక విధానం. 720 మంది ప్రతినిధులు ఉండే యూరోపియన్‌ పార్లమెంట్‌ను ఎన్నుకునేందుకు 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు.. యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. వాతావరణ మార్పులు, రక్షణ, వలసలు, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు.. అదీ చైనా, అమెరికా లాంటి దేశాల దౌత్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement