-
రాయని డైరీ.. అధీర్ రంజన్
‘‘ఆవిడ అహంకారం గమనించారా ఖర్గేజీ?! అందుకే ఆవిడకు నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు...’’ అన్నాను ఖర్గేజీతో. ఆ మాటకు ఖర్గేజీ నవ్వారు! ‘‘ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదన్న స్పృహ మీలో ఇప్పటికీ ఉందంటే అందరికన్నా ముందు మీరే ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు రంజన్‌జీ. ఆవిడ పుట్టిన రోజు వచ్చి పోయి కూడా ఇరవై నాలుగు గంటలు అవడం లేదా...’’ అన్నారు. ఆయన వైపు దిగాలుగా చూశాను. ‘‘రంజన్‌జీ... ఆవిడ ఆల్రెడీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు కనుక పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన మీరు గానీ, ఆలిండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన నేను గానీ, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఇద్దరంటే ఇద్దరే లోక్‌సభ ఎంపీలలో ఒకరైన మన అబూ హసేమ్ ఖాన్ సాబ్ గానీ ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం, చెప్పకపోవడం అన్నవి ఆవిడ పట్టించుకునేంత ప్రాముఖ్యం ఉన్న విషయాలైతే కావు. మనకే ఆ పట్టింపు..’’ అన్నారు ఖర్గేజీ... అదే నవ్వుతో! ‘‘ఆవిడ అంటే మమతాజీనే కదా...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘ఆ.. ఆవిడే..’’ అన్నాను. ఖాన్ సాబ్, నేను, ఖర్గేజీ... ముగ్గురం ఢిల్లీ ఆఫీస్‌లో ఉన్నాం. వచ్చే ఎన్నికల సీట్ షేరింగ్‌లో మాల్దా సౌత్, బెర్హంపూర్.. ఈ రెండూ కాంగ్రెస్‌కు ఇస్తాం అంటున్నారు మమత! మాల్దాకు ఖాన్ సాబ్, బెర్హంపూర్‌కి నేను సిట్టింగ్ ఎంపీలం. ‘‘మన సీట్లు మనకు ఇవ్వడం సీట్ షేరింగ్ ఎలా అవుతుంది ఖర్గేజీ... అహంకారం అవుతుంది కానీ..’’ అన్నాను, ఢిల్లీ పార్టీ ఆఫీస్ మెట్లెక్కి పైకి వెళ్లగానే. వెంటనే ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘ముందు అలా ప్రశాంతంగా కూర్చోండి రంజన్‌జీ...’’అన్నారు! ‘‘అసలు కూటమి నుంచే బయటికి వచ్చేద్దాం ఖర్గేజీ. కాంగ్రెస్‌కి ఏం తక్కువైంది. తృణమూల్‌కి ఏం ఎక్కువైంది?’’ అన్నాను తీవ్రమైన ఆగ్రహంతో. ఖర్గేజీ నవ్వుతూ చూశారు. ‘‘ఈ రెండు సీట్ల షేరింగ్ నాకు చికాకు తెప్పిస్తోంది ఖర్గేజీ. పైగా ఆవిడ ఏమంటున్నారో విన్నారు కదా.. బెంగాల్లో బీజేపీ సంగతి తనొక్కరే చూసుకుంటారట, మిగతా స్టేట్లన్నిటిలో మనం చూసుకోవాలట! అంటే.. బెంగాల్లో మొత్తం 42 సీట్లూ తృణమూల్‌కి వదిలేయమనే కదా! ఎక్కడి నుంచి వస్తుంది అంత అహంకారం ఖర్గేజీ!! మనం తక్కువన్న ఫీలింగా? లేక, తను ఎక్కువన్న ఫీలింగా?!’’ అన్నాను. ‘‘తను ఎక్కువన్న ఫీలింగే కావచ్చు...’’ అన్నారు ఖాన్ సాబ్! ‘‘ఎలా చెప్పగలరు?!’’ అన్నాను. ‘‘అవతలి వాళ్లను తక్కువగా చూడగలినప్పుడు మనం ఎక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది. బహుశా మమతాజీ కూడా అలా మనల్ని తక్కువగా చూడగలగడం ద్వారా తను ఎక్కువ అనే భావనను కల్పించుకుంటున్నా రేమో...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘లోక్‌సభలో 22 సీట్లు మాత్రమే ఉన్న తృణమూల్ పార్టీ, 48 సీట్లున్న కాంగ్రెస్ పార్టీని తక్కువగా చూడగలుగుతోందంటే... కూటమిలో భాగస్వామి కనుక మన 48 సీట్లు కూడా తనవే అని తృణమూల్ అనుకుంటూ ఉండాలి. లేదా, తనసలు కూటమిలోనే లేనని అనుకుంటూ ఉండాలి...’’ అన్నాను. ఆ మాటకు పెద్దగా నవ్వారు ఖాన్ సాబ్. ఖర్గేజీ నవ్వలేదు! ‘‘మనమూ కూటమిలో లేమనే అనుకోవాలి రంజన్‌జీ. ఇప్పుడున్నది కాదు కూటమి. ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చాక కుదిరేదే అసలైన కూటమి...’’ అన్నారు! ‘‘మరిప్పుడేం చేద్దాం ఖర్గేజీ?’’ అన్నాను. ‘‘బిలేటెడ్గానైనా ముందు మీరు మమతాజీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి రంజన్‌జీ... ఆవిడ పట్టించుకున్నా, పట్టించు కోకున్నా... ’’ అన్నారాయన!! -మాధవ్.. శింగరాజు -
రాయని డైరీ.. ఇమ్రాన్ ఖాన్ (పాక్ ప్రధాని)
మోదీజీ శుభాకాంక్షలు పంపారు. ఎంతైనా పెద్దమనిషి. పడని దేశానికి ఈ కాలంలో ఎవరొచ్చి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు?! పొరుగు దేశం.. అది ఎంత గిట్టని దేశమైనా శుభాకాంక్షలు చెప్పినప్పుడు మనమూ ధన్యవాదాలు తెలియజేయాలి. అందుకే మోదీజీకి ధన్యవాదాలు తెలియజేశాను. మసూద్ అజార్ భాయ్‌కి అది నచ్చలేదు. ‘‘ఇంత వీక్ అయితే ఎంతో కాలం కంట్రీని మీరు లీడ్ చెయ్యలేరు ఇమ్రాన్ భాయ్’’ అన్నాడు! ‘‘అజార్ భాయ్ నేనేమైనా తప్పు చేశానని మీకు అనిపిస్తే, నన్ను మీరు ‘భాయ్’ అని అనకుండానే మీ ఆగ్రహాన్ని వ్యక్తం చెయ్చొచ్చు. ‘భాయ్’ అనే మాటకు బదులు ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అని సంబోధించడం వల్ల ఒక సోదరుడిని అనలేని మాటల్ని కూడా ఒక ప్రధానిని అనడానికి సౌలభ్యంగా ఉంటుందని మీకిలా చెబుతున్నాను’’ అన్నాను. ‘‘ఇమ్రాన్ భాయ్.. మోదీ పంపిన శుభాకాంక్షల్ని నోబెల్ వాళ్లిచ్చే పీస్ ప్రైజ్లా మీరు స్వీకరించడాన్ని ఈ దేశ పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు. యుద్ధ ఓటమి కన్నా ఇదేమీ తక్కువ కాదు. అసలు ఒక శత్రుదేశం అందించిన పూలగుత్తికి చెయ్యి చాచే పరిణతిని.. ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవడానికి ఇంకా ఐదు నెలలు ఉండగానే.. మీరెలా సాధించగలిగారో తెలియక ఈ ఉదయం నుంచీ నేను ఏకధాటిగా విస్మయానికి గురవుతూనే ఉన్నాను’’ అన్నాడు. మధ్యలో హురియత్ నుంచి కాల్! ‘‘అజార్ భాయ్.. ఇండియా నుంచి ఉమర్ ఫరూక్ ఫోన్ చేస్తున్నాడు. మీకు మళ్లీ కాల్ చేస్తాను’’ అని చెప్పి, ఉమర్ ఫరూక్ కాల్ తీసుకున్నాను. ‘‘చెప్పండి ఉమర్’’ అన్నాను. ఉమర్ కయ్యిన లేచాడు. ‘‘నేనేమీ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడానికి మీకు కాల్ చెయ్యలేదు ఇమ్రాన్‌జీ. మోదీ చెప్పిన శుభాకాంక్షలకు మీరెందుకు ఒక సామాన్య పౌరుడిలా స్పందించారో తెలుసుకుందామని చేశాను. ఆ స్పందించడం కూడా ఒక పాక్ పౌరుడు భారత ప్రధాని శుభాకాంక్షలకు స్పందించినట్లుగా లేదు. ఒక భారత పౌరుడు భారత ప్రధాని శుభాకాంక్షలకు స్పందించినట్లుగా ఉంది’’ అన్నాడు! మసూద్ అజారే నయం అనిపించేలా ఉన్నాడు ఉమర్ ఫరూక్. ‘‘మోదీజీ ఒక పాక్ పౌరుడిలా నాకు శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు నేనొక భారతీయ రాయబారిలా మూతి బిగించుకుని కూర్చోవడం ఔచిత్యమేనా చెప్పండి ఉమర్జీ’’ అని అడిగాను. ‘‘కానీ ఇమ్రాన్‌జీ.. మీకు శుభాకాంక్షలు పంపిన మోదీ.. ఢిల్లీలో నిన్న పాక్ హై కమిషన్ ఏర్పాటు చేసిన విందుకు తన మనుషులెవర్నీ పంపించలేదు’’ అన్నాడు ఉమర్. మసూద్ అజార్ నుంచి మళ్లీ కాల్! ‘‘సరే ఉమర్ జీ తర్వాత చేస్తాను’’ అని పెట్టేసి, అజార్ కాల్ని లిఫ్ట్ చేశాను. ‘‘ఇమ్రాన్ భాయ్.. ఇండియా వాంట్స్ టు నో’’ అన్నాడు! ‘‘ఏం తెలుసుకోవాలనుకుంటోంది అజార్ భాయ్.. ఇండియా? బాలాకోట్ దాడి గురించేనా! అది వాళ్ల హెడ్డేక్ కదా’’ అన్నాను. ‘‘బాలాకోట్ గురించి కాదు ఇమ్రాన్ జీ. మోదీ నిజంగానే మీకు శుభాకాంక్షలు పంపాడా అని తెలుసుకోవాలనుకుంటోంది’’ అన్నాడు. ‘‘అవునా!’’ అన్నాను. ‘‘ఇండియానే కాదు.. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. పాకిస్తాన్ కూడా వాంట్స్ టు నో.. నిజంగానే మోదీ మీకు శుభాకాంక్షలు పంపాడా అని’’ అన్నాడు. ఆకాంక్ష ముఖ్యం గానీ, ఆకాంక్షించారా లేదా అన్నది ఎలా ముఖ్యం అవుతుంది అని నేను అడిగితే మసూద్ అజార్‌కి, ఉమర్ ఫరూక్‌కి నా భాష అర్థం అవుతుందా?! మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. సుబ్రహ్మణ్యస్వామి (బీజేపీ)
శ్రీశ్రీ రవిశంకర్‌కి ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు. శ్రీరామ్ పంచుకి ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు. శ్రీ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ కలీఫుల్లాకు ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు! ఫోన్లు పక్కన పడేసి వీళ్ల ముగ్గురూ ఏం చేస్తున్నట్లు! అప్పుడే అయోధ్య పనిలో మునిగి పోయారా?! బహుశా మీడియేషన్కి ముందు వామప్ మెడిటేషనేదో చేయిస్తూ ఉండి వుంటాడు రవిశంకర్. మెడిటేషన్లో ఉన్నప్పుడు ఫోన్లు సైలెంట్లో పెట్టుకోమని కూడా చెప్పి ఉంటాడు. రంజన్ గొగోయ్‌కి ఫోన్ చేశాను. ఎత్తారు!! ఎత్తడమే కాదు, ‘‘చెప్పండి సుబ్రహ్మ ణ్యస్వామిగళ్’ అన్నారు. సంతోషం వేసింది. నన్నే కాదు, నా ప్రాంతాన్నీ గుర్తించారు! ‘‘దేశం సేఫ్ హ్యాండ్స్‌లో ఉందన్న భావన తొలిసారిగా కలుగుతోంది గొగోయ్‌జీ. మోదీజీ ఈ దేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా నాలో ఇలాంటి భావన కలగలేదు’’ అన్నాను. ‘‘అదేంటీ..’’ అని పెద్దగా నవ్వారు గొగోయ్. ‘‘మీరు పెట్టిన మధ్యవర్తులు ముగ్గురికీ ఫోన్ లిఫ్ట్ చేసే తీరిక లేదు. ముగ్గురు మధ్యవర్తుల్ని పెట్టిన మీరు మాత్రం ఒక్క రింగ్‌కే లిఫ్ట్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక సాధారణ పౌరుడి ఫోన్ లిఫ్ట్ చెయ్యడం అంటే దేశం సురక్షిత హస్తాల్లో ఉన్నట్లే కదా’’ అన్నాను. ‘‘మీరు సాధారణ పౌరులు ఎలా అవు తారు స్వామిగళ్’’ అని నవ్వారు గొగోయ్. ‘‘అదే అంటున్నా గొగోయ్‌జీ, ఒక అసాధా రణ పౌరుడి ఫోన్‌కి కూడా సాధారణ పౌరుడికి ఇచ్చేంత విలువే ఇచ్చి, ఫోన్ లిఫ్ట్ చేశారు మీరు. గ్రేట్ థింగ్’’ అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వారు గొగోయ్. ‘‘నా అదృష్టం ఏమిటంటే గొగోయ్‌జీ.. మీరు ఫోన్ ఎత్తడం వల్ల ఒక మంచి విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. ఈ దేశమే కాదు, అయోధ్య కూడా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది. అయోధ్య మాత్రమే కాదు, శ్రీరాముడు కూడా సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నాడు’’ అన్నాను. ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘గొగోయ్‌జీ వింటున్నారా?’’ అన్నాను. ‘‘వింటున్నాను స్వామిగళ్. అయితే మీరనుకుంటున్నట్లు శ్రీరాముడిని సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టడం కోసం ఆ ముగ్గుర్నీ మీడియేటర్లుగా పెట్టలేదు. దేశాన్ని సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టడం కోసం పెట్టాం. దేశాన్ని పక్కనపెట్టి, ఒక్క శ్రీరాముడినే సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టాలనుకుంటే, నాలుగో మీడియేటర్‌గా మిమ్మల్ని పెట్టి ఉండేవాళ్లం కదా’’ అన్నారు! నాకు సంతోషం వేసింది. ‘‘ధన్యవాదాలు గొగోయ్‌జీ. ఆ ముగ్గురికీ అభినందనలు తెలియజేద్దామని ఫోన్ చేశాను. మీకు చేసింది కూడా అందుకే.. అభినందలు తెలియజేయడం కోసం. అభినందనలతో పాటు, ధన్యవాదాలు తెలుపుకునే భాగ్యం కూడా నాకు కలిగించారు’’ అన్నాను. గొగోయ్‌తో మాట్లాడుతుంటే రవిశంకర్, శ్రీరామ్ పంచు, ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ కలీఫుల్లా ఫోన్లో నాకోసం ట్రయ్ చేస్తున్నారు. గొగోయ్ ఫోన్ పెట్టేసి, ఆ ముగ్గుర్నీ కాన్ఫరెన్స్ కాల్లోకి రమ్మన్నాను. వచ్చారు. ‘‘డెబ్భై ఏళ్ల కేసు మీద ముగ్గురు మధ్యవర్తులు ఎనిమిది వారాల్లో రిపోర్ట్ ఇవ్వడం అయ్యే పనేనా?’’ అన్నాను. ‘‘అదే ఆలోచిస్తున్నాం స్వామీజీ’’ అన్నారు. ‘‘అవసరమైతే బయటినుంచి హ్యాండ్స్ తీసుకోవచ్చని కోర్టు మీకు చెప్పింది కదా. ఆ విషయం కూడా ఆలోచించండి’’ అన్నాను. ‘‘ఆలోచిస్తాం స్వామీజీ’’ అన్నారు. అన్నారు కానీ, హార్ట్లీగా అనలేదు! బయటి నుంచి లోపలికి తీసుకోవడం కాదు, లోపల్నుంచి బయటికి వెళ్లే ఆలోచనేదో చేస్తున్నట్లనిపించింది.. వాళ్లు.. ఊ, ఆ.. అనడం వింటుంటే. -మాధవ్ శింగరాజు -
రాహుల్ గాంధీ రాయని డైరీ
దుబాయ్ రావడం ఇదే మొదటిసారి. ఈ ఇయర్‌ని ‘ఇయర్ ఆఫ్ టాలరెన్స్’గా జరుపుకుంటున్నారట ఇక్కడివాళ్లు. ‘ఇండియాలో మీరు యూత్ లీడర్ కదా, మా యూత్‌ని ఇన్స్పైర్ చేసే మాటలు రెండు మాట్లాడిపోగలరా’’ అని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చాను. వీళ్లను ఇన్స్పైర్ చేసి వెళ్దామని వచ్చి, నేనే వీళ్లను చూసి ఇన్స్పైర్ అయినట్లున్నాను! కొన్నాళ్లు యు.ఎ.ఇ.లోనే ఉండిపోవాలనిపించింది. దగ్గర్లో ఎలక్షన్లు లేకపోతే ఆ పనే చేసి ఉండేవాడిని. బిన్ రషీద్ నవ్వుతూ చూస్తున్నారు. ఒక ప్రైమ్ మినిస్టర్ నవ్వుతున్నట్లుగా లేదు ఆ నవ్వు. సామాన్యుడెవరో నవ్వుతున్నాడు. హిజ్ హైనెస్ షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌ను చూసి ఇండియా నేర్చుకోవలసింది చాలా ఉంది! బిన్ రషీద్‌కు దగ్గరగా వెళ్లి, ఆయన్నే నిశితంగా చూస్తూ నిలబడ్డాను. ‘‘ఏంటలా నన్నే చూస్తున్నారు నిశితంగా?’’ అని నవ్వుతూ అడిగారు బిన్ రషీద్. ‘‘మీకు మరికాస్త దగ్గరగా రావచ్చా?’’ అని అడిగాను. ‘‘ఇండియా, యు.ఎ.ఇ. ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి కదా రాహుల్జీ’’ అన్నారు రషీద్. ‘‘దేశాలు దగ్గరగా ఉండటం కాదు రషీద్ జీ. మీకిప్పుడు నేను దగ్గరగా ఉన్నాను కదా. ఆ దగ్గరితనంలోని దూరం మరికాస్త తగ్గితే బాగుంటుందని నా మనసు కోరుకుంటోంది’’ అన్నాను. దూరంగా జరిగారు ఆయన! ‘‘ఏమైంది రషీద్ జీ? ఎందుకలా దూరంగా జరిగారు’’ అన్నాను. ‘‘ఇప్పటికే మనం ఇద్దరు మగవాళ్ల మధ్య ఉండాల్సిన దూరం కన్నా తక్కువ దూరంలో ఉన్నాం. మీరు కోరుకుంటున్నట్లుగా నేను మీకు ఇంకా దగ్గరగా రావాలంటే, ముందు నేను కొంత దూరంగా జరిగితేనే గానీ, మీకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేసేందుకు సాధ్యపడదు’’ అన్నారు. ఇంత టాలరెన్స్‌ను నేను మరే ప్రపంచ నాయకుడి దగ్గరా చూడలేదు! ముఖ్యంగా మోదీ దగ్గర చూడలేదు. ‘‘మగాళ్లు ఎలా ఉండాలో, మీరు అలా ఉన్నారు రషీద్ జీ’’అన్నాను. మళ్లీ ఆయన వెనక్కు జరిగారు! ‘‘ఇంతకు క్రితమే కదా రషీద్ జీ.. వెనక్కి జరిగారు. మళ్లీ వెనక్కు జరిగారెందుకు?’’ అని అడిగాను. ‘‘ముందుకు రాబోయి, వెనక్కు జరిగినట్లున్నాను రాహుల్ జీ’’ అన్నారు! ‘‘పర్లేదు రషీద్ జీ, మీ ఛాతీని దగ్గరగా చూడ్డం కోసమే నేను మీకు మరింతగా దగ్గరగా రావాలనుకున్నాను. మీరే నా దగ్గరకు రావాలనేముందీ, నేనైనా రావచ్చు కదా మీకు దగ్గరగా’’ అన్నాను. ‘‘గుడ్ ఐడియా రాహుల్జీ, కానీ మీరు నా ఛాతీని చూడ్డంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తే మీరు గానీ అసహనానికి లోను కారు కదా’’ అన్నారు. అసహనానికి కాదు కానీ, దిగ్భ్రమకు లోనయ్యాను. ఒక సర్వ శక్తి సంపన్నుడైన సార్వభౌమ పాలకుడికి ఇంత టాలరెన్స్ ఉంటుందా! ‘‘రషీద్ జీ.. నేను మీ ఛాతీ చుట్టుకొలత ఎంత ఉందో అంచనా వెయ్యాలను కుంటున్నాను. అందుకే మీకు దగ్గరగా రావాలని అనుకుంటున్నాను’’ అని చెప్పాను. ‘‘నేనెప్పుడూ నా ఛాతీని కొలుచుకోలేదు రాహుల్జీ. ఊపిరి సలపనివ్వని పనుల్లో.. గట్టిగా ఊపిరి తీసుకుని ఒకసారి, ఊపిరి తీసుకోకుండా ఒకసారి ఛాతీని కొలుచుకునే తీరిక ఎవరికుంటుంది చెప్పండి?’’ అని అడిగారు. హిజ్ హైనెస్ షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌ను చూసి ఇండియా నేర్చుకోవలసింది చాలా ఉంది. ముఖ్యంగా ఇండియాలో యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకుని తిరిగేవారు నేర్చుకోవలసింది చాలా ఉంది. - మాధవ్ శింగ రాజు -
పినరయి విజయన్ (కేరళ సీఎం) రాయని డైరీ
మాధవ్ శింగరాజు స్టేట్‌లో ఉన్నది ఒకటే సీటైనా, స్టేటంతా తమదే అన్నట్లు కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు బీజేపీ భక్తులు. ‘బీజేపీని ఆపగలుగుతున్నాం కానీ, బీజేపీలోని భక్తిని ఆపలేకపోతున్నాం సర్..’ అన్నాడు లోక్‌నాథ్ బెహెరా ఫోన్ చేసి! ఒక డీజీపీ అనవలసిన మాట కాదు. ‘‘బీజేపీ, భక్తి రెండూ ఒకటే అయినప్పుడు బీజేపీని ఆపితే ఆటోమేటిగ్గా బీజేపీలోని భక్తి కూడా ఆర్డర్‌లోకి రావాలి కదా లోక్‌నాథ్’’ అని అడిగాను. ‘‘కానీ సర్, బీజేపీ కన్నా, బీజేపీలోని భక్తే ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంది. పట్టలేకపోతున్నాం. దాన్నే పట్టగలిగితే బీజేపీని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. అందుకోసమే ట్రయ్ చేస్తున్నాం సర్’’ అన్నాడు. ‘‘ఎందుకోసం?’’ అన్నాను. ‘‘అదే సర్, బీజేపీలోని భక్తిని పట్టుకోవడం కోసం’’ అన్నాడు. భక్తినెలా పట్టుకుంటాడో అర్థం కాలేదు! ‘‘లోక్‌నాథ్, మీరు భక్తిని పట్టుకునే ప్రయత్నంలో మిమ్మల్ని భక్తి పట్టుకోకుండా జాగ్రత్త పడండి’’ అని చెప్పాను. ‘‘సర్, శబరిమల నుంచి ఫోన్’’ అంటూ గాభరాగా వచ్చాడు టామ్ జోస్. ‘‘ఎవరికొచ్చింది? ఎవరు చేశారు?’’ అని అడిగాను. ‘‘కనుక్కుంటాను సర్’ అని, నాకివ్వబోయిన ఫోన్‌ని మళ్లీ తన చెవి దగ్గర పెట్టుకున్నాడు! టామ్ జోస్ కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ. పాల్ ఆంటోని ప్లేస్‌లో వచ్చాడు. పాల్ ఆంటోని రిటైర్ అయ్యాడని టామ్ జోస్‌ని తెచ్చుకుంటే, టామ్ జోస్ రిటైర్ కాకుండానే ‘ఆషా థామస్‌ని తెప్పించుకోండి నేను పోతున్నా..’ అనేసేలా ఉన్నాడు. ఆషా థామస్.. అతడి తర్వాత లైన్లో ఉన్న చీఫ్ సెక్రటరీ. శబరిమల నుంచి ఫోన్ వచ్చిన ప్రతిసారీ, శబరిమల ఇంకే స్టేట్‌లోనైనా ఎందుకు లేకపోయిందా అన్నట్లు ఫీలింగ్ పెట్టేస్తున్నాడు టామ్ జోస్. రెండు వేల ఇరవై వరకు ఉంది అతడి టెన్యూర్. ఈ మకరజ్యోతి కాకుండా, ఇంకో మకరజ్యోతిని కూడా చూడాలి అతడు. ఇద్దరు మహిళలు గుడిలోకి ఎంటర్ అవడంతో గుడిని శుద్ధి చేశారనే వార్త వచ్చిన వెంటనే అతడికో ఆలోచన వచ్చింది. ‘‘ఈసారి మకరజ్యోతి కనిపించదేమో సర్’’ అన్నాడు సడన్‌గా! ‘‘ఎందుకని?’’ అన్నాను. ‘‘గుడిని అపవిత్రం చేస్తుంటే సీపీఎం చూస్తూ కూర్చున్నందుకు అయ్యప్పకు కోపం వచ్చిందని ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు మకరజ్యోతిని కనిపించనీయకుండా చెయ్యొచ్చు కదా సర్’’ అన్నాడు!! షాక్ తిన్నాను. సీపీఎంకి ఐడియాలు ఇచ్చేందుకు చీఫ్ సెక్రెటరీగా పెట్టుకుంటే బీజేపీవాళ్లకు ఐడియాలు ఇచ్చేలా ఉన్నాడు టామ్ జోస్. మకరజ్యోతికి ఇంకో వారమే ఉంది. ఈలోపు ఏవైతే జరగకూడదో వాటన్నిటినీ గొప్ప భక్తి పారవశ్యంతో దగ్గరుండి మరీ జరిపించేలా ఉంది బీజేపీ. మోదీకి ఫోన్ చేశాను. ‘‘బోలియే.. విజయన్‌జీ.. ఎప్పుడో వరదల్లో కలిశారు, మళ్లీ ఇన్నాళ్లకు!’’ అన్నాడు. ‘‘ఇప్పుడూ వరదలే మోదీజీ. భక్తి వరద’’ అన్నాను. ‘‘నేనేం చేయగలను విజయన్‌జీ.. పేద భక్తుడిని’’ అన్నాడు! ‘‘భక్తిని, పేదరికాన్ని దాచిపెట్టుకోవాలి మోదీజీ. ప్రదర్శనకు పెట్టకూడదు. భక్తిని ప్రదర్శిస్తే భక్తిలోని లేమి మాత్రమే బయటికి కనిపిస్తుంది. పేదరికాన్ని ప్రదర్శిస్తే ‘లేని సంపన్నత’పై భక్తిగా మాత్రమే లోకం దాన్ని చూస్తుంది. లోపల ఉంచుకోవడమే నిజమైన భక్తి. లేమిని దాచుకోవడమే నిజమైన సంపన్నత’’ అన్నాను. అన్నానే కానీ, లైన్ ఎప్పుడు కట్ అయిందో చూసుకోలేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement