-
Empty nest syndrome: పిల్లలు ఎగిరెళ్లాక ఒకరికి ఒకరై
చదువుల కోసమో.. ఉద్యోగాల కోసమో పెళ్లయ్యాక వేరొక చోట ఉండేందుకో పిల్లలు తల్లిదండ్రులను విడిచి వెళతారు. ఆ సమయంలో ఇల్లు ఖాళీ అవుతుంది.. బోసి పోతుంది. తల్లిదండ్రుల జీవితంలో నైరాశ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమయంలో భార్యను భర్త, భర్తను భార్య పట్టించుకోకపోతే, కొత్త జీవితం మొదలుపెట్టకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు ఏం చేయాలి? కేస్ స్టడీ 1: దీపావళి పండగ వచ్చింది. అపార్ట్మెంట్లో అందరూ టపాకాయలు కాలుస్తున్నారు. కాని మూర్తి గారు, ఆయన భార్య సరళ గారు మాత్రం కిందకు రాలేదు. సరదాకైనా నిలబడలేదు. మామూలుగా ప్రతి సంవత్సరం వాళ్లు బోలెడన్ని టపాకాయలు కాలుస్తారు. సందడి చేస్తారు. ఈసారి అస్సలు తలుపులే తీయలేదు. కారణం? ఆరు నెలల క్రితమే వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఎం.ఎస్. చేయడానికి యు.ఎస్. వెళ్లాడు. అప్పటి నుంచి వారిలో ఒక రకమైన నిర్లిప్తతను అపార్ట్మెంట్ వాసులు గమనిస్తున్నారు. చివరకు ఆ నిర్లిప్తత పండగల మీద కూడా ఆసక్తిని కోల్పోయేలా చేసింది. కేస్ స్టడీ 2: యాభై ఏళ్ల సీతాదేవికి విపరీతంగా కాలు నొప్పి వస్తోంది. భర్త జానకిరామ్ ఆమెను అన్ని హాస్పిటళ్లకు తిప్పాడు. కాల్లో ఏ సమస్యా లేదు. ఏదైనా ఆందోళన వల్ల వస్తున్న సైకలాజికల్ నొప్పేమోనని డాక్టర్లు అంటున్నారు. సీతాదేవి, జానకిరామ్‌లకు కూతురు, కొడుకు. మొదట కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. కొడుకు చదువుకుంటానని స్వీడన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెకు తెలియని ఆందోళన. ఒంటరితనం. దిగులు. భర్త ఏదైనా కాలక్షేపం కోసం బయటకు వెళ్లినా ఆమెకు దిగులు ముంచుకొస్తోంది. పిల్లలు లేని ఇల్లు ఆమెకు ఎంతకాలానికీ అలవాటు కావడం లేదు. ‘నెస్ట్’ అంటే గూడు. పిల్లలు లేని గూడు ఎంత లేదన్నా బోసి పోతుంది. తల్లిదండ్రులు... వారు లేని వెలితితో ఇంట్లో మిగులుతారు. ఆ సమయంలో వారిలో అనేక రకాలైన మానసిక సంచలనాలు వస్తాయి. అటువంటి సందర్భాన్ని మానసిక నిపుణులు ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో పిల్లలను విడి గదుల్లో ఉంచి పెంచడం అలవాటు. 18 ఏళ్లు రాగానే వారు దూరమవుతారనే మానసిక సంసిద్ధతతో ఉంటారు. భారతీయులు మాత్రం పిల్లలను తమ వద్దే పడుకోబెట్టుకుంటారు. వారికి ఎంత వయసొచ్చినా వారు తమతో లేదా వారి వెంట తాము ఉండాలనుకుంటారు. అలాంటిది చదువు, ఉద్యోగాలు, పెళ్లి చేసుకొని విడి కాపురం పెట్టడాలు లేదా వేరే చోట స్థిరపడటాలు జరిగినప్పుడు ఒక ఖాళీతనం వారిని ఇబ్బంది పెడుతుంది. దానికి అడ్జస్ట్ కావడానికి టైమ్ పడుతుంది. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు కాస్తా భార్యాభర్తలుగా మారి ఒకరికి ఒకరై కనిపెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ ప్రతికూలతలు: ⇒ పిల్లల గురించి ఆందోళన... వారితో మానసిక ఎడబాటు వస్తుందేమోనన్న భయం ⇒ ఒంటరితనం ఫీల్ కావడం ⇒ సంతోషంగా ఉండలేకపోవడం ⇒ కలత నిద్ర ⇒ జీవితానికి అర్థమేమిటి అనే సందేహం ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అనుకూలతలు: ⇒ బోలెడంత ఖాళీ టైమ్ రావడం ⇒ బాధ్యతలు లేని స్వేచ్ఛ ⇒ స్వీయ ఇష్టాలు నెరవేర్చుకునే వీలు ⇒ కొత్తగా ఏదైనా చేద్దాం అనే ఉత్సాహం అయితే తమ మానసిక సామర్థ్యాన్ని బట్టి అనుకూలతలను తీసుకోవాలా ప్రతికూలతలతో కుంగిపోవాలా అనేది తేల్చుకుని ప్రతికూలతలను జయించి ముందుకు సాగాలి. కొత్త జీవితం: అన్నింటి కంటే మించి అంతవరకూ తల్లిదండ్రులుగా ఎక్కువ మసలినవారు పిల్లలు స్థిరపడ్డాక మళ్లీ భార్యాభర్తలుగా మారతారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఎక్కువ సేపు గడిపే వీలు చిక్కుతుంది. దాంతో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకోవచ్చు. కాని సాధారణంగా ఒకరిని మరొకరు భూతద్ధంలో చూస్తూ పాత నష్టాలనూ, తొక్కిపెట్టిన పాత ఫిర్యాదులనూ బయటకు తీస్తే జీవితం దారుణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమయంలోనే భార్యను భర్త, భర్తను భార్య ఎక్కువగా అర్థం చేసుకోవాలి... స్నేహంగా ఉండాలి... పరస్పరం కలిసి యాత్రలు, విహారాలు, బంధుమిత్రులను కలవడం, ఏదైనా హాబీని అలవర్చుకోవడం, వాకింగ్ గ్రూపుల్లో చేరడం, ఇష్టమైన సినిమాలు చూడటం, జీవితంలో గడిచిన మంచి విషయాలు గుర్తుకు చేసుకోవడం, ఒకప్పుడు ఇవ్వలేని సమయాన్ని ఇప్పుడు ఇవ్వడం చేయాలి. ఈ సమయంలో పరస్పర భద్రత కూడా ముఖ్యమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థికపరమైన సౌలభ్యం ఉంటే అందాక తీరని ముచ్చట్లను తీర్చుకోవడం కూడా మంచి వ్యాపకమే. జీవితంలో పిల్ల లకు ఇవ్వదగ్గ ప్రేమంతా ఇచ్చాం... ఇప్పుడు పరస్పరం ప్రేమను పంచుకుందాం అనే భావన అత్యంత ముఖ్యమైనది ఈ ‘ఎంప్టీ నెస్ట్’ కాలంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెంగ ఉండదు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అలాంటి తల్లిదండ్రుల గొంతులో తప్పక సంతోషాన్ని వింటారు. ఆ సంతోషమే పిల్లలకు గొప్ప కానుక. -
సార్... దిస్ అబ్బాయి బీట్ మీ... బట్ ఐయామ్ నాట్ తిరిగి బీట్!
అస్సాంలోని పచిమ్ నగామ్ గ్రామంలోని ‘న్యూ లైఫ్ హైస్కూల్’లో పిల్లలు ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడాలనే నిబంధన ఉంది. ఒకరోజు ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు. క్లాస్ టీచర్ వారిని పిలిపించి ‘టెల్ మీ, వాట్ హ్యాపెన్డ్?’ అని అడిగారు. ‘ఇతడు నా మెడ పట్టుకున్నాడు’ అని ఒకరు చెప్పాలనుకున్నారు. ‘ఇతడు నా తలపై పంచ్ ఇచ్చాడు’ అని మరొకరు చెప్పాలనుకున్నారు. అట్టి విషయాన్ని పూర్తిగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో చెప్పలేక సైన్ లాంగ్వేజ్‌ను కూడా అప్పు తెచ్చుకొని కాస్తో కూస్తో ఇంగ్లిష్‌లో ఆ పిల్లలు చెబుతున్న మాటలు నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తాయి. -
యవ్వనానికి ఆక్సిజన్ గది
అమృతం తాగితే జరామరణాలు ఉండవని అంటారు. అయితే, కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందటానికి అమృతమే తాగాల్సిన పనిలేదు. ఈ గదిలో రోజుకు ఓ గంట పడుకుంటే చాలు. కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ‘హెచ్‌బీఓటీ (హైపర్బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ)’ నేడు తక్కువ ధరల్లోనే దొరకనుంది. దీనికోసం అమెరికాకు చెందిన హెచ్ఓబీఓ2 అనే సంస్థ ప్రత్యేకమైన ఓ మెటల్ చాంబర్‌ను రూపొందించింది. సాధారణంగా మన వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్, ఇతర వాయువులు ఉంటాయి. అదే ఈ చాంబర్లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. ఇక ఇందులోని ప్రత్యేకమైన కొల్లాజెన్ ఫైబర్స్, లైటింగ్ సిస్టమ్ ముడతలను తొలగించి, చర్మాన్ని కాంతిమంతగానూ, మృదువుగా చేస్తుంది. కావాల్సిన వారు వీరి అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అద్దెకు కూడా తీసుకోవచ్చు. నెలకు రూ.80 వేల నుంచి, రూ. లక్ష తీసుకుంటారు. ఒక్క రోజుకు కూడా అద్దెకు ఇస్తారు. అయితే, ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. -
అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. ఇప్పుడు భర్త బాటలోనే నిహారిక కూడా ఇప్పటికే అతన్ని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయగా ఇప్పుడు చైతన్యతో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. దీంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటినుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక తాజాగా ఆ పని పూర్తిచేసింది.దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో పలువురు నిహారికకు కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. -
మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది
‘పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి జరుగుతుంది’ అని సామెత. అంటే పిచ్చి కుదరదు... పెళ్లి జరగదు అని అర్థం. కాని ఆ సామెతను తప్పు చేశారు ఇద్దరు ప్రేమికులు. మానసిక అస్వస్థతతో చెన్నై పిచ్చాసుపత్రిలో విడివిడిగా చేరిన ఈ ఇరువురుకి అక్కడ పరిచయమైంది. వ్యాధి నయం కావడంతో పెళ్లి నిర్ణయానికి వచ్చారు. 200 ఏళ్ల చరిత్రగల ఆ ఆస్పత్రిలో ఈ ఘటన మొదటిసారి. మానసిక అస్వస్థత కూడా జ్వరం, కామెర్లులా నయం కాదగ్గదే. గమనించి వైద్యం చేయిస్తే పూర్వ జీవితం గడపొచ్చు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి ఆశలు వదులుకునే మానసిక అస్వస్థులకు గొప్ప శుభవార్త. శుభమస్తు వార్త. మానసిక అస్వస్థత వస్తే ఈ సమాజంలో ఎన్నో అపోహలు, భయాలు, ఆందోళనలు, హేళనలు ఆపై బహిష్కరణలు. ‘పిచ్చివారు’ అని ముద్ర వేసి వారికి వైద్యం చేయించాలనే ఆలోచన కూడా చేయరు. అదే జ్వరం వస్తే జ్వరం అని చూపిస్తారు. కాని మనసు చలిస్తే ఏదో దెయ్యం పట్టిందని వదిలేస్తారు. మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు, సేవా సంస్థలు ఎంతో ప్రచారం చేస్తున్నా వైద్యం అందాల్సిన వారు, వైద్యం చేయించాల్సిన వారు కూడా అవగాహన లోపంతో వున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే ‘నాకేమైనా పిచ్చా’ అని ఎదురు తిరుగుతారు పేషెంట్లు. ‘పిచ్చి’ ముద్ర వేస్తారని. ‘పిచ్చికి మందు లేదు’ అని వదిలేస్తారు బంధువులు. ఇద్దరూ ఓర్పు వహిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్’ (ఐ.ఎం.హెచ్.) బ్రిటిష్ కాలం నాటిది. దేశంలోనే రెండవ అతి పెద్ద మానసిక చికిత్సాలయం. అందులో కొంత కాలం కిందట వైద్యం కోసం చేరారు మహేంద్ర (42), దీప (38). కుటుంబాలు వారిని చేర్పించి చేతులు దులుపుకున్నాయి. కాని వారు బాగయ్యారు. కొత్త జీవితం గడపాలనుకున్నారు. కాని బయటకు వెళితే ‘నయమై వచ్చినా’ అమ్మో పిచ్చోళ్లు అనే వివక్షతో చూస్తారు జనం. ఆ భయంతో మళ్లీ హాస్పిటల్‌కు వచ్చేశారు. దాంతో హాస్పిటల్ వారే వారికి లోపల ఉద్యోగాలు కల్పించారు. మహేంద్ర డేకేర్ సెంటర్లో పని చేస్తుంటే దీప కేంటిన్లో పని చేస్తోంది. మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సంగతి అడ్మినిస్ట్రేషన్‌కు తెలియగానే హడలిపోయారు. ఎందుకంటే ఇలాంటిది ఇంతకు మునుపు ఎరగరు. ఇదేమైనా ఇష్యూ అవుతుందా అనుకున్నారు. కాని హాస్పిటల్ డైరెక్టర్ అయిన డాక్టర్ పూర్ణ దగ్గరకు వచ్చిన దీప ‘నేను అతనితో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానమ్మా’ అని చెప్పే సరికి ఆమెకు ఆ స్త్రీ హృదయం అర్థమైంది. అంతే. హాస్పిటల్లో పని చేసే అందరూ తలా ఒక చేయి వేసి వారి పెళ్లికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. తాళిబొట్టు ఆ ఏరియా ఎం.ఎల్.ఏ. ఏర్పాటు చేశాడు. అంతేనా హెల్త్ మినిస్టర్ శేఖర్ బాబు, ఎం.పి. దయానిధి మారన్ ఏ బందోబస్తు లేకుండా సగటు బంధువుల్లా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే జీవితం ముగిసినట్టు కాదు. స్వల్ప కాలం ఇబ్బంది పడ్డా నయమయ్యి కొత్త జీవితం గడపవచ్చు. అందుకు ఉచిత వైద్యం దొరుకుతుంది. కనుక ఆరోగ్యాన్ని గమనించి సమస్య వస్తే జయించండి. కొత్త జీవితాన్ని కళకళలాడించండి. ఎవరికి తెలుసు... ఇప్పుడు కష్టం వచ్చినా భవిష్యత్తు ఎన్ని సంతోషాలను దాచిపెట్టి ఉందో!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement